తెలుగింటి వాగ్గేయకారులు  
  భావరాజు పద్మిని 


దైవత్వ అనుభూతిని అతి సులభంగా కలుగజేసే దివ్యమైన వరం సంగీతం. మాటరాని పసిపాపడైనా, పశువులైనా చదువుకోని  పామరులైనా, సంగీతం విని అలౌకిక అనుభూతికి లోనవుతూ ఉంటారు. అందుకే  'శిశుర్వేత్తి పశుర్వేత్తి ...' అన్నారు. భారతీయ సంగీతానికి మూలం సామవేదం. ఎందరో గొప్ప తెలుగు వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. పాట దేవుని సన్నిధికి తిన్నని బాట అని భాగవతులు విశ్వసిస్తారు. తమ వాక్కును గేయ రూపంలో వెలిబుచ్చేవారిని వాగ్గేయకారులుఅన్నారు. అంటే వారు వాక్కుల రూపంలో చెబుతున్నా అది గేయ రూపంగా ఉంటుంది.  ఓంకార నాదానుసంధానమైన గానాన్ని ఉపాసించి వాక్కును గేయాన్ని భక్తి రసామృత ధారలుగా పోసి పరమాత్మ పాదాలను కడిగిన పుణ్యజీవులు వాగ్గేయకారులు. ఒక్కరూ ఇద్దరూ కాక వందల సంఖ్యలో వాగ్గేయకారులు  ప్రభవించి, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్మికతతో, భావజాలంతో తమ వాక్కులను గేయాల రూపంలో వెలిబుచ్చారు.తాళ్ళపాక అన్నమాచార్య, క్షేత్రయ్య, త్యాగయ్య, నారాయణ తీర్థులు, రామదాసు వంటి ఎందరో వాగ్గేయకారులు తమ ఇష్టదైవాలను తమ వాగ్రూప గేయాలతో కీర్తించి తరించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి. అలతి అలతి పదాలతో తమ భావాలను పేర్కొంటూ పండిత పామర జనులను విజ్ఞానవంతులుగా మార్చే మహోత్తమ పుణ్యపురుషులు వాగ్గేయకారులు. వీరి అమూల్యమైన రచనలను గురించి ముచ్చటించుకుందాం. ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు, కర్ణాటక సంగీత జగద్గురువు... సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యడు త్యాగయ్య. సంగీత సాహిత్యాలను గంగా యమునలుగా మలచుకుని అంతర్వాహినైన సరస్వతిగా భక్తిని జోడించి తేట తెలుగు మాటలతో జనరంజకమైన కీర్తనలు రచించి... తెలుగు నాట చిరంజీవిగా నిలిపిన సంగీత భక్తి కీర్తనల వాగ్గేయకారులు శ్రీ త్యాగయ్య అంటూ సంగీత రసజ్ఞులు, పండితులు చెబుతారు.  సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ''నమో నమో రాఘవాయ '' అనే కీర్తనను దేశి తోడి రాగం లో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అవన్నీ లభ్యములు కావు. త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు. ఒకసారి తిరుపతిలో దర్శనానికి సమయం అయిపోయిందని అర్చకులు తెర వేస్తే, ''తెర తీయగరాదా..తిరుపతి వేంకట రమణ మత్సరమను తెర తీయగ రాదా'' అని కీర్తనను ఆలపిస్తే తెర దానంతట అదే తొలిగిపోయి స్వామి దర్శనం లభించింది త్యాగరాజ స్వామి వారికి. ఇలాంటివే ఎన్నో మహిమలను వారి జీవిత కాలంలో దర్శింపచేసారు త్యాగరాజ స్వామి. తెర తీయగరాదా లోని: తిరుపతివెంకటరమణ!మచ్చరమను పరమపురుష ! ధర్మాదిమోక్షముల పారద్రోలుచున్నది నాలోని ఇరవొందగ భుజియించు సమయమున ఈగ తగులు రీతి యున్నది హరిధ్యానము సేయు వేళ చిత్తము అంత్యజు వాడకుబోయిన ట్లున్నది మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది అచ్చమైన దీపసన్నిధి మరు గడ్డ బడి చెఱచిన ట్లున్నది వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది వేగమె నీ మతము ననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను భావము :  ఓ తిరుపతి వెంకటరమణా ! నాలో ఉండే మాత్సర్యమనే తెర - నీ దర్శనానికి ఆటంకం కలిగిస్తుంది. దీన్ని తొలగించు. ఓ పరమపురుషా! ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను స్వానుభవానికి రానీకుండా నాలోని ఈ మాత్సర్యమనే తెర - దూరం చేస్తుంది. స్వామీ! స్థిమితంగా భోజనం చేసే సమయంలో నోటిలో ఈగ అడ్డం వచ్చినట్లూ, స్థిర చిత్తంతో శ్రీహరిని ధ్యానించే వేళలో మనస్సు అనాచార అసభ్య స్థలాలకు వెళ్ళినట్లూ, నీటిలోని చేప ఆకలితో ఆహారంగా అనుకొని గాలానికి తగులుకొన్నట్లూ, స్వచ్చమైన దీపకాంతిలో ఏదో మరుగు ఏర్పడి, కాంతిని చెరచినట్లూ, లేళ్ళు తమను పట్టుకోవడానికి వల పన్నిన గోయి అని తెలియక అందులో పడినట్లూ, ఏ జన్మలోనిదో అయిన మదమాత్సర్యాల తెర నీ దర్శనభాగ్యానికి అడ్డుగా నిల్చి ఉంది. దయతో ఈ తెరను తొలగించి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించవా ? 'తేనెలపై తేట తిన్నని చెరుకుపానకముల నేరుపరచిన మేలుచక్కెరలు తీపుచల్లదెమ్మెరలు చిక్కని కప్రంబు జీవరత్నములు కల యమృతంపు మీగడ మీది తావులు' చిలుకుతూ కవులెల్ల చేయెత్తి మ్రొక్కగా అన్నమయ్య రచనలు చేసాడు. పద కవితా పితామహుడు అన్నమాచార్యుడు పలికిందల్లా పాటే! కవిత్వంలో, సంగీతంలో, రాశిలో, వాసిలో, భక్తిలో, రక్తిలో ఉపజ్ఞ లోకజ్ఞతల్లో అన్నమయ్యను మించినవారు లేరు. వేంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలను. 12 శతకాలను రచించడమే కాక, సంకీర్తనా లక్షణములు, వేంకటాచల మహాత్మ్యం వంటి గ్రంధాలను కూడా రచించారు అన్నమయ్య. కడలుడిపి నీరాడగా: కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ యెక్కడిది దాహ మణగిన వెనక తత్వమెరిగెదనన్న దాహమేలణగు తా తత్వమే మెరుగు దేహంబు గలయన్ని దినములకును పదార్ధ మోహమేలణగు తా ముదమేల కలుగు ముందరెరిగిన వెనక మొదలు మరిచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు అందముగ తిరువేంకటాద్రీశు మన్ననల కందువెరిగిన మేలు కలనైన లేదు అద్భుతమైన తాత్త్విక సందేశ సంకీర్తన! సముద్రతీరానికి వెళ్ళి, అలలు ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దామనుకుంటే అలలు ఎప్పటికీ ఆగవు కదా! అలాగే మన జీవితంలో కోరికలు నశించిన తర్వాత తత్త్వం తెలుసుకుందామనుకుంటే అది ఎన్నటికీ జరగని పని! కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో, ఆత్మసంయమనంతో కోరికలు నియంత్రించుకుని తత్త్వసారాన్ని ఒంటపట్టించుకోవాలంటున్నాడు అన్నమయ్య! అలాగే, 60 ఏళ్ళు వచ్చాక, జీవిత తత్త్వాన్ని పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకుంటామంటే సరికాదు, మనకి జ్ఞానం వచ్చినప్పటి నుండి ఈ ప్రక్రియ మొదలవ్వాలి,నిరంతరం కొనసాగుతూ ఉండాలి. తేనెకన్నా మధురంగా, వానకన్నా చల్లగా, గాలికన్నా స్వేచ్చగా పాట పాడి, పాడినదంతా పచ్చి బంగారంగా మలచి మనకు అందించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. భక్తుడు తన మనసును నాయకిగా చేసి, ఆ భగవంతుడిని నాయకునిగా వర్ణించి, తద్వారా తన భావాన్ని భగవద్దత్తం చెయ్యడాన్ని 'మధురభక్తి' అంటారు. కృష్ణా జిల్లాలోని ‘మొవ్వ' అనే గ్రామంలో జన్మించినట్లు చెబుతారు. బాల్యంలోనే సంగీతసాహిత్య నాట్యాభినయ అలంకార శాస్త్రాలు అభ్యసించునప్పుడు తన సహపాటి అయిన దేవదాసిని ప్రేమించి, వారిద్దరి సంభాషణలను 'పదాలు' గా రచించాడు. శృంగార రస ప్రధానంగా క్షేత్రయ్య రచించిన పదాలు నాలుగువేల వరకూ ఉన్నాయి. ఇవి 'మువ్వ గోపాల' ముద్రను కలిగిఉంటాయి. ఆనంద భైరవి రాగం - ఆదితాళం పల్లవి:శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే కోపాలా? మువ్వ గోపాలా? అనుపల్లవి:ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స ల్లాపాలా? మువ్వ గోపాలా? చరణాలు:పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత తీపేలా? మువ్వ గోపాలా? చూపుల నన్యుల దేరి-చూడని నాతో క లాపాలా? మువ్వ గోపాలా? నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే నా పాలా? మువ్వ గోపాలా? బాలకృష్ణుని లీలావినోదాలను, నామకీర్తిని కీర్తనలుగా, స్ఫూర్తిమంతంగా అందించినవాడు నారాయణ తీర్థులు. సంస్కృతాంధ్ర భాషా పండితుడు, నృత్యవేదాంత శాస్త్రాల్లో ప్రవీణుడు, శ్రీకృష్ణ భక్తుడు నారాయణ తీర్థులు. భాగవతంలోని దశమస్కందమందలి శ్రీకృష్ణ గాధను సంస్కృతములో పన్నెండు సర్గలుగా రచించారు. ఈ గ్రంధాన్నే 'శ్రీ కృష్ణ లీలా తరంగిణి' అని అంటారు. ఈ పాటలను 'తరంగాలు' అంటారు.  తరంగం అంటే అల అని అర్థం. సముద్రస్నానికి వెళ్ళిన వాడు అలలలో ఎలా మునిగితేలతాడో అలాగే ఈ తరంగాలతో ఆడిపాడే వారు కూడా ఆనందాంబుధిలో ఓలలాడుతుంటారుతెలుగులో 'పారిజాతాపహరణం ' వంటి యక్ష గానాలను, మరికొన్ని వేదాంత గ్రంధాలను కూడా వీరు రచించినట్లు తెలుస్తున్నది. తరంగము: హిందోళరాగం, అదితాళంప :-- కృష్ణం కలయసఖి సుందరం  - బాల అను :-- కృష్ణం గతవిషయ తృష్ణం - జగత్ర్ప్హభ | విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల || 1. నృత్యం తమిహ ముహూరత్యంతమ పరిమిత భృత్యానుకూల మఖిల సత్యం సదా - బాల  || కృ || 2. ధీరం భవజలధి పారం సకలవేద సారం సమ స్తయోగి తారం - సదా - బాల  || కృ || 3. శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరిఖేల సంగం - సదా - బాల  || కృ || 4. రామేణ జగదభి రామేణ బలభద్ర రామేణ సమవాప్త కామేన - సదా - బాల  ||కృ || 5. రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం - సదా - బాల  || కృ || 6. దామోదరామఖిల నామాకరంఘన శ్యామాకృతి మసుర  భీమం - సదా - బాల  || కృ || 7. అర్ధం శీధీలికృత నర్ధం శ్రీనారాయణ తీర్ధం పరమపురుషార్ధం - సదా - బాల   || కృ || శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా... ఎంతోరుచిరా... మరి ఎంతో రుచిరా... అని కీర్తించిన ధన్యజీవి రామదాసు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. రామదాసు భజన కీర్తనలు గ్రామగ్రామాన ప్రాచుర్యాన్ని పొందాయి. సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని చరిత్ర. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది. పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర కందర్పజనక నాయందు రంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో మాస్యమై యాశ్రిత్ర వదాన్యమై సుజనసన్మోదమై వెలుగు మూర్ధన్య రామప్రభో నిత్యమైసత్యమైనిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో సేద్యమై మీకధల్భావ్యమై సజ్జన శ్రావ్యమైయుండునోదివ్య రామప్రభో గట్టిగానన్ను నీవు పట్టుగా విహితమౌ పట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో నవవిధ భక్తి మార్గాల్లో ‘గానం ‘ అనేది ఒకటి. ఇలా రాగ, తాళ, సాహిత్యాల మేళవింపుతో పరమాత్మను నుతించి మెప్పించిన ఈ ధన్యజీవుల కీర్తనలు పాడుకుందాం, తరిద్దాం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top