సాహితీ ప్రవాహం ఆంధ్రరత్న - రచన - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ - అచ్చంగా తెలుగు

సాహితీ ప్రవాహం ఆంధ్రరత్న - రచన - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

Share This
సాహితీ ప్రవాహం ఆంధ్రరత్న
రచన - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్



కం . గోపాలుని మురళీధ్వని
గోపికలందిగిచినట్లు గుణనిధి తెనుగుం
గోపాలుని వణిరవ
మా ప్రజలన్ నిలువరించి నాకర్షించెన్ - తుమ్మల సీతారామమూర్తి చౌదరి
జాతీయ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్నదని ఎందరికి తెలుసు..?
ఢిల్లి నుంచి విజయవాడకు జాతీయ కాంగ్రెస్ కార్యాలయం తరలించేంతటి సాహసి అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి దుగ్గిరాలయ్య అని ఎందరు కాంగ్రెస్ నాయకులకు మంత్రులకు తెలుసు?
సహాయ నిరాకరణోద్యమంలో తొలి ప్రయోగ శాల చీరాల-పేరాల (ఉద్యమం) అని ఆ ప్రయోగ కర్త దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని ఎందరికి ఎరుక?
ఇన్ని తెలిసినా ఆయన గొప్ప సాహితీవేత్తగా, ఆశుకవిగా, హాస్యరస జల్లులు, ఆగ్ర్రహ జ్వాలలూ తన కవిత్వం తో కురిపించే ధీరోదాత్తుడని ఎవరైనా చెబుతున్నారా?
భాషల పై అజమాయిషీ, ప్రాంతాలపై అవగాహన రాజకీయ పరిజ్ఞానం, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, సంగీత సాహిత్యం, భక్తి,ధైర్యం... మేను అంతా రంగరించబడిన అజరామరుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అంతటి సాహితీ దురంధరుడికి రావల్సినంత ప్రచారం రాలేదని ఖచ్చితంగా చెప్పాలి.
చీరాల రామదాసుగా (సి.ఆర్.దాసు) తనకు తాను చెప్పుకునేంతటి శ్రీరామ భక్తుడు.. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య... ఆయన రామభక్తి.. ఆయన శ్లోకంలో..
శ్రీ విభుడు శ్రీరామచంద్రుడు
భూవిభుడు కోదండ రాముడు
భువిని వెలసెను రామనగరిని
కవిజనాశ్రయుడై !!
శ్రీవరుడు సుగుణాభిరాముడు
భవుడు శ్రీకోదండరాముడు
ఆదిని భారము(బాప మపురి
బవనసూనుని గూడి వెలసెను
కవనగాన వినోద వాక్సుమ
సవన మర్పింతున్ !!
అంటూ రామనగరులోని ఆలయ ప్రతిష్ట సమయంలో ఆశువుగా చెప్పారు గోపాలకృష్ణయ్య.. అంతటితో ఆగకుండా..
సీ. శ్రీగిరిజాపతి స్మితముఖాంభోరుహ
సారస్యమధుపాన సమయములను,
వర కుచేలాది భూసుర భక్త సంత్రాణ
సంరంభ సాదృశ్య సమయములను
నవయుగోదయ వేళ భవనమంచితవస్తు
సంతానము సృజించు సమయములను
తే.గీ. ప్రళయతాండవ ముద్దండలీల వెలయ
రాజరాజేశ్వరీ మనోరాజ్యమేలు
సమయముల నాదు బల్కుల జాడవినుమురామ
రామనగరీవరాంగ శ్రీరామలింగ !! అంటారు.
దుగ్గిరాలవారి భాషాపరిజ్ఞానం అమోఘమనే చెప్పాలి. సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్ల భాషలతో పాటు.. అక్కడక్కడా ఉర్దూ మెరుపులు కూడా గోపాలకృష్ణుని పదఝరిలో పారాడతాయి.
''దుగ్గిరాల వారి సంస్కృతాంధ్ర భాషల సంపద అల్లసాని వారిని అందుకొన్నది, వారి కవిత్వ ధోరణి.. తెనాలి వారి సరళిని స్ఫురింపజేస్తోంది, ఆంగ్లభాషలో ఆయన వాక్పటిమ జన్నన్ శైలిని ధిక్కరిస్తోంది'' అని దుగ్గిరాల ప్రాణమిత్రుడు.. నడింపల్లి నరసింహారావు ఒక సంధర్భంలో వ్యాఖ్యానించారు.
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, శ్రీనివాస అయ్యంగార్ వంటి మిత్రుల సహకారంతో 'సాధన' అనే వారపత్రికను బెజవాడ నుంచి ప్రారంబించి, 26-12-1924 న బెల్గాం లో జరిగిన అఖిల భారత సమావేశాలలో గాంధీజీ చే విడుదల చేయించారు.
స్కాట్లాండ్ లో బార్-ఎట్-లా చేసిన దుగ్గిరాల.. తన గురువు ఆనంద్ క్యాంటిష్ కుమారస్వామి తో కలిసి నందికేశ్వర విరచితమైన 'అభినయ దర్పణం' ను 'MIRROR OF GLESTURES' గా అనువదించారు. అ సమయంలో దుగ్గిరాల వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే..! (ఆంగికం భువనం యస్య అంటూ ఇప్పటికీ నాటక సమాజాలు పాడే శ్లోకం ఈ అభినయ దర్పణం లోనిదే..!)
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారి చే అరెస్టు కాబడి తిరుచునాపల్లి జైలు లో కారాగారవాసం పూర్తయి 12.10.1922 న బయటకు వచ్చి, కావేరీ నదీ తీరంలోని శ్రీ రంగనాధస్వామి వారిని దర్శంచుకున్న గోపాలకృష్ణయ్య ఆలపించిన శ్లోకాలు పండిత రాజకృత గంగాలహరి శ్లోకాల స్టాయిలో ఉన్నాయని సాహితీ వేత్తల అభిప్రాయం. 'ఆంధ్రోహం' అంటూ తెలుగు భాష,ప్రాంతీయతల మమకారం తో తమిళదేవుని ప్రస్తుతించినా.. ఆ రంగనాధుని కోరినదంతా.. సమకాలీన పరిస్థితులలో దేశంలో స్వతంత్య్ర పోరాటం చేస్తున్న వారి గురించి, స్వామి వారి గుణగణాలతో మాత్రమే ఆ శ్లోకాలన్నీ సాగుతాయి. తనగురించి వీసమంతయినా భగవంతుని కోరుకోని నిస్వార్ధ భక్తికి నిదర్శనం దుగ్గిరాల జీవితం. వారి ఆశు ప్రతిభలో మచ్చుతునకను మీరూ ఆస్వాదించండి.
దుగ్గిరాల వారి రంగనాధ స్తుతి
కదా వా కావేరీ విమల సలిల ప్రాజ్ఞ్యుడట
చ్చుభాజ్గం శ్రీరంజ్గం, తమిళ హృదయ ధ్వాంతదళనం
తనోత్యాతిద్థ్యం, మే నిజసదసి బందచ్యుతియుతే
ముహూర్తేత్యా క్రోశన్నిమిష్యామి దివసాన్
తా. హే రంగనాథప్రభో! మా తమిళ సోదరులకు సన్నిహితుడవై వారి యజ్ఞాద్వాంతమును హరించు విమలసలిల కావేరీ చలదూర్మికా నటనమున, నీనాడిచ్చ బంధ విముక్తుడనై యరుదెంచిన నాకు స్వాగతాధిక్యము లొసంగుచున్నది. నీ దివ్య సాన్నిద్యమున నీ దివసము నొక నిముషముగా గడపగలను.
హాస్య చలోక్తులు, అనేక భాషల పదాలను పద్య బంధనం కావించడంలో 'ఆంధ్రరత్న' తనకు తానే సాటి అనిపించుకున్నారు. 'రామనగరీ నరేంద్ర శ్రీ రామచంద్ర' అనే మకుటంతో అనేక పద్యాలను వ్రాసిన దుగ్గిరాల పాండిత్యం ఒక ప్రత్యేక శైలి లో సాగిందనే చెప్పాలి.
సీ. గాంధి దేవుని రాక కంచు ఢక్కల గాక
కరతాల శబ్దాల దరువు బోరె,
దేశభంధుని దశల్దివసాలతో దీర్చే
రాజగోపాలాచారి బూజుపట్టె.
కొండెక్కటప్పన్న ఉండి లేకుండెను
భాయిపటేళ్ళు నిర్భాగ్యులైరి.
లాలలజపతిరాయ్ కోలు పోయెను శ్రద్ధ
చండి సరోజిని పండిపోయె
ఆలీలు గోలీల గేళీ సవాల్ మాని
ఖాళీగ ధాలీల పాలబడిరి.
జమ్నులాలూశెట్టి తుమ్నవీము బట్టె
ఖద్దరు ఖాన్ సాబు సర్దుచుండె.
తే.గీ. మొదటి తాకిడి కింతటి మోసమయ్యె
ఖ్యాతి కొక్కడు నిల్చె మా మోతి లాలు
ముందు గతిలెట్టు లౌనొ ఖామందు వీవు
రామనగరీ నరేంద్ర!శ్రీ రామచంద్ర!
అంటూ గాంధి రాక కూడా సాదాసీదా గానే ఉందంటూ ఎద్దేవాచేసేస్తాడు దుగ్గిరాలయ్య (ఆ కాలంలో దుగ్గిరాలను ఇలా కూడా పిలిచేవారు). గాంధీ సభలకు జనం కూడా రావటంలేదనేది వారి ఎత్తిపొడుపు. మోతీలాలే దిక్కంటూ.. కాంగ్రేస్ నాయకులను నాన్-కోఆపరేషన్ సభ్యులంటూ ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఈ పద్యంలో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ లుఎన్నికలలో పోటీ చేద్దామనంటే.. గాంధీ టీం లోని 'వల్లభాయ్ పటేల్, విఠల్ భాయ్ పటేల్ (భాయ్ పటేళ్ళు), షౌకత్ అలీ,మహమ్మదాలి (అలీలు), జమన్ లాల్ బజాజ్ (జమ్నులాలు), అబ్ధుల్ గఫార్ ఖాన్ (ఖాన్ సాబు), లాలాలజపతిరాయ్, సరోజనీ నాయుడు (చంఢీ లాంటి సరోజినీ 'తెల్ల జుట్టు కలిగి ఉంటారు.. అందుకేనేమో ఆమెను వ్యంగంగా పండిపోయె సంభోదనగా అర్ధమౌతోంది.)... అని అందరినీ దూషిస్తూ.. ఖ్యాతికొక్కడు నిలిచె మా మోతీలాలని గర్వంగా ప్రకటించారు... అంతకు ముందు గాంధీజీకి పరమ భక్తుడైన దుగ్గిరాల.
ఇక తనకు ప్రీతి పాత్రమైన నాయకుల పై దుగ్గిరాల చిన్నెలు అన్నీ ఇన్నీకావు. పొగిడినా.. దూషించినా అందులోని హాస్యం తొణికిసలాడతుందనేందుకు వారి మిత్రుడైన కాశీనాధుని పై వ్రాసిన ఈ పద్యం చూడండి.
సీ. ఆంధ్రపత్రిక తోడ నమృతాంజనంబిచ్చి
తలనొప్పిబాపెడు ధన్యుడెవడు?
లక్షలాది డబ్బు దీక్షతో సమకూర్చి
భిక్షకోటిని గాచు దక్ష్కుడెవడు?
ప్రతి కాంఫ్రెన్సునూ గతి నీవె యని వేడ
ప్రెసిడెంటు గా నేలు రసికుడెవడు?
మితవాది హితుడౌచు నతివాది గతుడౌచు
నందు నిందును జేరు..డెవడు?
తేగీ. అట్టి కాశినాథుని నాగ యహ్వయందు
పుట్ట్కుండిన నాంధ్రంబు పుట్టి మునిగి
గిట్టకుండునె యేనాడొ యట్టె నీల్గి
రమనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!!
అంటూ.. ఆంధ్రపత్రిక పెట్టి.. అది చదవటం వల్ల నుండి కలిగే శిరోభారం నుంచి ఉపశమనం పొందేందుకు అమృతాంజనంను ఇచ్చే గొప్ప వ్యాపారవేత్త శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు. అని గోపాలుని చమక్కు.. ఆ దేశోద్ధారకుడు ప్రెసిడెంటుగా లేని కార్యక్రమము ఉండదనేది కవి హృదయము. అలాంటి దాత లేకున్న ఆంధ్ర పరిస్థితి ఎట్లుండునో కదా యని తాత్పర్యము.
ఇక తనకు ప్రీతి పాత్రమైన ప్రకాశం పంతులును
సీ; అరవవాగ్యాపార మచ్చుదానొత్తుచు
మలయాళభగవతి గొలుచునెవడు
ఆంధ్రకాంగ్రెసు స్భాధ్యక్షత జేబూని
భాతావనినేల గోరునెవడు
లోకసంగ్రహదీక్ష బ్రాకి పైకెక్కి తా
'స్వరాజ్య' మందంగ గోరునెవడు.
తే.గీ. కాలభైరవ భీకరోగ్రానల ప్ర
కాశమూర్తియై గ్రాలు బ్రకాశమూర్తి
కలుగదేశానికింకేమి గల్గుకొదువ
రామనగరీనరేంద్ర! శ్రీరామచంద్ర!! అని ప్రస్తుతిస్తారు.
తనతో బందరు జాతీయ కళాశాలలో పనిచేసిన మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి (ఈ పద్యం కొద్దిగే లభించింది.. గమనించగలరు. ఏవరి వద్దనైనా ఉంటే పోస్ట్ చేయగలరు)
సీ. అమెరికా ఖండాని కద్వైతమును దెల్పి
తత్త్వ శాస్త్ర చరిత్రదగ లిఖించి
వంగ విద్యాలయ రంగమందు నటించి
బొక్కుఫిలాసఫీ ప్రొఫెసరు వయి
ఆక్స్ఫర్డు నందలి యువధూతలకు నెల్ల
వేదాంతమును గొంత వేడ్కదెల్పి
అంటూ తన మిత్రులకు తన సాహిత్యంలో పెద్దపీట వేసారు.
ఇలాంటి ప్రక్రియలో మేటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. తనతో పాటు తనకు తెలిసిన నాయకులనీ కలిపి విమర్శించడంలోనూ దుగ్గిరాల సాటి వేరెవరూ రారు. అలాంటి హాస్యం ఓలలాడించే ఈ పద్యం గోపాలకృష్ణయ్య హాస్య చతురతకు తార్కాణంగా నిలుస్తుంది.. చదవండి..!
సీ. కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరి ప్రకాశ మింగిలీసు పిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగ జముడు
పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న
ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
బులుసు సాంబడు వట్టి పుట్టుకుంక
అయ్యదేవర వాడు, పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డా.సుబ్రహ్మణ్యం మాక్టింగ్ ఫులుష్టాపు
దువ్వురి సుబ్బమ్మ దృష్టి బొమ్మ
తీ.గీ. అనుచు బల్కుచు నుండిరీ ఆంధ్ర జనులు
నాయకత్వంబు నడచిన నాట నుండి,
తపము లేనిది యెన్నరే, నెపమునెల్ల
రామనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!
కొండెంకటప్పయ్య గారికి బట్టతల.. (గుండుసున్న), పట్టాభి సీతారామయ్య గారిని తుట్టెపురుగంటూ దుయ్యపట్టారు. ఇంగ్లీషంటే ప్రాణప్రదంగా చూస్తూ 'స్వరాజ్య' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించిన ప్రకాశం ను ఇంగ్లీషు పిశాచి అని అంటారు దుగ్గిరాల. కాశీనాధుని నాగేశ్వరరావును నాగజెముడు మొక్కలా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మొలుస్తారని ఎద్దేవా.. లావుగా వుండే ఉన్నవను, కళ్ళజోడుండే.. గొల్లపూడి సీతారామయ్యను, విమర్శిస్తూ.. తనను కొక్కిరాయిగా చెప్పుకొచ్చాడు దుగిరాల. హాస్యాస్పదంగా ఎదుటి వారిని విమర్శంచడం దుగ్గిరాల వారికి నేర్పుగా తోస్తుంది... అదే విషయాన్ని ఈ పద్యం ధ్రువపరుస్తోంది.
ఇక దుగ్గిరాల చాటువులకు కొదవేలేదు.. గ్రంధస్థం అయినంత వరకూ మనకు కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. మహాబలేశ్వరంలో సమావేశం సమయంలో గోపాలకృష్ణుని తేజోవిలాసము దేదీప్యమానమవుతున్నాయ్.. దీంతో బందరుకు చెందిన కొందరు నాయకులు ఆయనను 'సుంకరకొండాయ్' అని విమర్శంచినట్లు ఆయన దృష్టికి వచ్చింది. అదే సభలో
కం. బింకాలు బలుకు బందరు
కుంకల ఘీంకారమెల్ల గీడ్వడజేయన్
శంకరుడె మహానందిని
''సుంకరకొండ''గ వెలసె చోద్యము గాదే! అంటూ చిందులేశాడు.
సుంకరకొండాయ్ శివునిగా.. స్తుతిస్తూ.. పరోక్షంగా తనను తాను శివునిగా కీర్తించుకున్నాడు దుగ్గిరాల.
ఒకానొక సందర్భంలో
''లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యెన్'' అనే పద్యానికి పేరడీగా
బ్రిటీషు వారి పాలనలో
LAW ఒక్కింతయులేదు అంటూ ఛర్నాకోలాతో ఛెళ్ళుమనిపించారు దుగ్గిరాల.
మద్రాసు సౌందర్యమహల్ లో ది. 04.10.1022 న చేసిన ప్రసంగంలో ఆంగ్లేయులను నియంతలంటూ చెప్పిన పేరడీ.. అద్భుతం అనక మానరు. ఇదిగో చదవండి..
'నయాచే' రిపారం ' న వా' స్టీలు ఫృఏముం'
న 'కౌన్సిల్' న త ' ప్రీవికౌన్సిల్' పదంవా
స్వరాజ్యార్తి హంతాంగ్ల రాజ్యే నియంతా
ఫరంగీ,ఫిరంగీ,దృగంగీ కరోతు!!''
అంటూ బ్రిటీష్ కుంకలను దునుమాడారు. ఇద్ దీంతో సభలో కరతాళధ్వనులు మిమ్న్నంటాయి
అంతటి సాహితీవేత్త కు నీరాజనాలందించడంలో సాహితీ లోకం కూడా తప్పటడుగేసిందని ఖచ్చితంగా చెప్పాలి.. దుగ్గిరాల వారు చీరాల-పేరాల ఉద్యమం నీరు గారి పోవటం.. క్షయ వ్యాధి సోకి తాను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామనుకున్న చోటే.. తన ముప్పై తొమ్మిదవ ఏట, అతిపిన్న వయస్సులో మృత్యువాత పడ్డారు. చివరి క్షణాలలో గుంటూరుజిల్లా మంగళగిరిలో క్షయ వ్యాధికి మందులు తీసుకుంటూ.. పానకాలస్వామిగా పిలువబడే.. మంగళగిరి నరసింహస్వామి ని దర్శించుకోలేక చీరాల రామనగరుకు తిరిగివెళుతూ.. స్తుతించడం.. ఆయన సాహితీ శేముషికి నిదర్శనం. ఆ నరసింహ స్తుతిలో మచ్చుకు రెండు పద్యాలు
ఉ. ఎండల కోర్వలేక యిటు లింటికివచ్చితి నంతెకాని నీ
యండను వీడలేదు భవదం ఘ్రీ యుగంబు సదామదీయ హృ
న్మండలి నిల్పినాడ ననుమానము వీడవె నాదు జాడ్యమున్
జెండవె మంగళాద్రి నరసింహ ! సుధాలయ! పానకాలయా!!
ఉ. ఎండల కోర్వలేక యిటు లింటికివచ్చితి మంగళాద్రికిన్
రెండసాటి రామనగరీక్షితి యంచును దొల్లి త్రేతకా
లావుండవు రామచంద్ర విమలాకృతితో నటు నీవెకావెమా
కండనిల్చి ప్రోతువు శుభాద్రి నృసింహయ! పానకాలయా.!!
అతిపిన్న వయస్సులోనే మృత్యువు క్షయవ్యాధి రూపంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ను కబళించింది. తన వాక్పటిమతోనే గాక వాగ్గేయకారునిగా, విద్యావేత్తగా, ఉద్యమ నిర్మాతగా, రాజకీయ దురంధరునిగా దేశం యావత్తు గోపాలకృష్ణయ్యకు ఋణపడి ఉంది. 'భారతరత్న' లెందరున్నా 'ఆంధ్రరత్న' మాత్రం ఒక్కడే..!
ఓం తత్సత్
రచన
కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
జర్నలిస్ట్
వైకుంఠపురం
చీరాల, ప్రకాశంజిల్లా
98484 28978
(ఈ వ్యాసానికి మానాన్న గారైన కరణం సుబ్బారావు గారి పరిశోధనాత్మక కవనం 'మన ఆంధ్రరత్న' ఆధారం).

No comments:

Post a Comment

Pages