పుణ్యవతి (నవల) - 17 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 17

Share This

 పుణ్యవతి (నవల) - 17

రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)



@@@#@@#@
(రంగనాధంగారి అంత్యక్రియలను జగన్నాధం గారి అనుమతితో పుణ్య అన్నయ్య శేఖర్ చేస్తాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని సృజన ఆత్మహత్య ప్రయత్నాన్ని పుణ్యవతి అడ్డుకుంటుంది. తరువాత....)
@@@@@@@@@

"పుణ్యా! నన్ను క్షమిస్తావు కదూ!" పుణ్య ఒళ్ళోంచి లేచి కూర్చుని వెక్కుతూ అంది సృజన.

"ఏం తప్పు చేశావని?" అంటూ పుణ్య ఆమె తడి చెంపలను తుడిచింది.

"నా చావుకి అడ్డుపడుతున్నావన్న పిచ్చిలో నిన్ను చంపాలని. . ."

పుణ్య ఆమె మాటలకు అడ్డుపడింది. "పిచ్చి అని నువ్వే అంటున్నావుగా! నువ్వే కాదు, ఆ స్థితిలో ఎవరున్నా అలాగే చేస్తారు."

"నా పెళ్ళి చేయాలని నాన్న ఎంతో తపనపడ్డారు. అక్కయ్య నాన్నకి అవమానం జరిగిందని తాను ఆత్మహత్య చేసుకొంది. కానీ నేనూ? చిన్నప్పటినుంచి అమ్మ లేని లోటు తెలియకుండా పెంచిన నాన్నను చివరి క్షణాల్లో బాధపెట్టి చంపానే! ఆరోజు రాత్రంతా ఏదో కలవరపాటులో ఉన్న నాన్నను నానా మాటలు అన్నానే! ఇంట్లో ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండనీయవని చాలా అన్నానే! బయటనుంచి వచ్చిన నాన్న ఆ రాత్రి పూలమొక్కల దగ్గరే తిరుగుతుంటే, నోటికొచ్చినట్లు మాట్లాడాను. నన్ను మరి విసిగించకూడదని ఆ పూలమొక్కల్లోనే నాన్న శాశ్వతనిద్ర పోయాడే!" అంటూ భోరుమంది.

"ఎవరి చావు ఎలా వ్రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దేవుడు చావుకి కూడా ఒక కారణం సృష్టించి పెడతాడు. నాన్న క్రిందటి నెల నీకు వచ్చిన సంబంధం అవుతుందని ఎంతో ఆశపడ్డాడు. అది కాలేదన్న బాధతో చనిపోయాడు. వాళ్ళు మీ సంబంధం వద్దని ఉత్తరం వ్రాసారు. నువ్వు చదివితే బాధపడతావని దాన్ని నేను చింపేసాను. దాన్ని నాన్న మనసుకి పట్టించుకుని పోయాడు. అలాగని మన సంబంధం వద్దని ఉత్తరం వ్రాసిన వాళ్ళపై హత్యానేరం మోపగలమా? మనకిష్టమైన వాళ్ళు పోగానే బ్రతుకే అంధకారంగా కనిపిస్తుంది. దాన్నే శ్మశాన వైరాగ్యమంటారు. ఇది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో ఆడాళ్ళని శ్మశానానికి రానియ్యరు. అలా రానిస్తే, శవం కాలుతుండగా తట్టుకోలేని బాధతో ఆడవాళ్ళు ఆ చితిలో దూకేయవచ్చు. నాన్న పోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి ఆ ఉత్తరం చూపించినప్పుడే తనకేదయినా అయితే, నువ్వేమీ అఘాయిత్యం చేసుకోకుండా ఆపుతానని నా దగ్గర మాట తీసుకున్నాడే! అప్పుడు 'ఏమిటీ పిచ్చి ' అనుకున్నాను. తన చావుని నువ్వు తట్టుకోలేవని నాన్న ఆ రోజే ఊహించాడన్నమాట! నువ్విలాంటి పిచ్చిపని చేయకూడదని ఆయన కోరుకున్నాడు. నిన్నంతగా అభిమానించిన నాన్న చివరి కోరిక తీర్చటం నీ బాధ్యత కాదంటావా? అందుకే జీవితంలో నీకే కష్టం వచ్చినా, ఎలాంటి అఘాయిత్యం చేయనని నాకు మాటివ్వాలి. నీ మీద ఎన్నో ఆశలతో తన తల్లితో మాట్లాడాలని వెళ్ళిన రవిని హతాశుణ్ణి చేయకూడదు. అతన్ని పెళ్ళాడి, నీ కడుపున పుట్టాలని తాపత్రయపడే నాన్నకి చోటివ్వాలి."

పుణ్యవతి మాటలకు సిగ్గుతో ఆమె ఒళ్ళో తలదాచుకొంది సృజన.
@@@

ఊరినుంచి వచ్చిన రవికి ఆ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా కనిపించి విస్తుపోయాడు. తన ఇంటి తాళం తీసి తల్లిని లోపల కూర్చుండమని చెప్పి, తను సృజన ఇంటివైపెళ్ళాడు. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. వీధిలోకి వెళ్ళి పక్కింటివాళ్ళను విచారించాడు. "రంగనాధంగారు పోయారు. సృజన ప్రస్తుతం వాళ్ళ బాబాయిగారింట్లో ఉంది" అని చెప్పారు. వెంటనే రవి తన తల్లిని తీసుకొని పుణ్యవతి ఇంటికి వెళ్ళాడు. ఆమెనుంచి విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు. సాయంత్రం పుణ్యవతి వాళ్ళను జగన్నాధం ఇంటికి తీసుకెళ్ళింది. గుమ్మంలో రవిని చూడగానే సృజన తట్టుకోలేక అతన్ని చుట్టి ఏడ్చేసింది. ప్రక్కనున్న పెద్దలంతా ఇద్దరినీ కొద్ది క్షణాలు ఏకాంతంగా వదిలిపెట్టారు. తన మనసులోని బాధ తగ్గాక, చేసిన పనికి సృజన సిగ్గుపడింది.

"అన్నయ్యా! మా సృజికి కొంచెం దుడుకుతనం ఎక్కువ. ఎలా వేగుతావో ఏమిటో? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన చెవులు వాడి అంటారు. నిజమే! బాల్యస్నేహితురాలినైన నా కన్నా, సృజీకి రవి అన్నయ్యే ఎక్కువైపోయాడు" అంటూ పుణ్యవతి ఆమెను ఆటపట్టించింది.
@@@@@

పార్కులో తలవంచి గడ్డి పీకుతున్న పుణ్యను చూసి ఆనందరావు నవ్వాడు.

"దేనికి నవ్వుతున్నారు?" ఆమె అడిగింది.

"మరేమీ లేదు. నువ్వు చేస్తున్న సంఘసేవ చూసి నవ్వొచ్చింది" చెప్పాడతను.

"మరేమి చేయను. మీరు మౌనంగా కూర్చుంటే నాకేమీ తోచటం లేదు. అందుకే మున్సిపాలిటీవాళ్ళకి ఖర్చు తప్పించటానికి ఉచితంగా ఈ గడ్డి పీకి పెడుతున్నా!" నవ్వుతూ చెప్పింది.

"నువ్వు మా యింటి కోడలివైతే మా నాన్నగారికి బోల్డంత ఆదా అన్నమాట!" అతని మాటలకు ఆమె బుంగమూతి పెట్టింది.

"అయితే మీరు నన్ను పెళ్ళాడేది మీ పెరట్లో గడ్డి పీకించటానికి అన్నమాట!"

"నువ్వు బుంగమూతి పెడితే చూద్దామని అన్నాలే! నిన్నిలా చూస్తూంటే మన పరిచయమైన రోజు గుర్తు వస్తోంది."

అతని మాటలకు ఆమె గతాన్ని నెమరువేసుకుంది. "ఆరోజు నేను బస్సు కోసం నిలబడి ఉన్నాను. మీరొచ్చారు. ఇద్దరం బస్సు కోసం చాలాసేపు నిలబడ్డాం. ఎంతకూ బస్సు రాక మీరు చిరాకు పడుతున్నారు. ఉన్నట్లుండి టైం చూద్దామని చేతిని చూసుకొన్నారు. అప్పుడుగాని వాచీ పెట్టుకు రాలేదని అయ్యగారు గమనించలేదు. ఆ చిరాకులో మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేసింది. నేను మిమ్మల్ని గమనిస్తున్నానని గ్రహించి, కోపాన్ని తగ్గించుకొని నన్ను టైమడిగారు" పుణ్యవతి మాటలకు అడ్డుపడ్డాడతను.

"దానికి నువ్వు 'ప్చ్!' అని చిత్రంగా పెదవి విరుస్తూ నీ చేతిని చూపించావు. ఆ చేతికి కూడా వాచీ లేదని గ్రహించి ఇద్దరం నవ్వుకున్నాం. అలా మొదలైన పరిచయం రెండేళ్ళుగా పెరిగి, ప్రస్తుతం మాటలు కరువై, చివరికి యిలా గడ్డి పీక్కునే వరకూ వచ్చింది" ఆనందరావు మాటలకు ఇద్దరూ నవ్వుకొన్నారు.

"ఆ! మీకు నా స్నేహితురాలు సృజన తెలుసుకదూ!" అతన్ని అడిగిందామె.

"ఈమధ్యనే వాళ్ళ నాన్నగారు పోయారన్నావు. ఆ అమ్మాయేనా?"

"ఆ! తనే! పది రోజుల్లో ఆమె ఒక ఇంటిది కాబోతోంది."

"ఆల్రెడీ ఆమెకో ఇల్లు ఉందిగా!" అయోమయంగా అడిగాడు ఆనందరావు.

"ఇదే! ప్రయివేటు స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియాల్లో చదివితే ఇలాగే తయారవుతారు. కనీసం తెలుగుభాషలో పలుకుబడులు కూడా తెలియవు" చిరుకోపంతో అందామె.

"నాకు తెలియకపోతే, తెలిసేలా నువ్వు చెప్పొచ్చుగా!" బ్రతిమాలే ధోరణిలో అన్నాడతను.

"ఓ ఇంటిది కాబోతోందంటే ఇల్లు కొనుక్కుంటోందని కాదు. పెళ్ళి చేసుకుంటోందని అర్థం."

"అది కూడా కొనుక్కోవటమేగా! ఇంటిని ధర పెట్టి కొంటారు. భర్తను కట్నం పెట్టి కొంటారు."

"దానిది ప్రేమ వివాహం దొరగారూ! కట్నం ప్రసక్తే లేదు. రవి అని . . . నా అన్నయ్య శేఖరానికి స్నేహితుడు, నాకు దేవుడిచ్చిన అన్నయ్య . . .తను చేసుకుంటున్నాడు. ఇద్దరికీ పరిచయమైన పది నెలల్లోనే వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు" చెప్పింది పుణ్య.

"అంటే మన పెళ్ళి ఆలశ్యమైందని గుర్తుచేయటమేగా! రెండు నెలలాగు. అటో, ఇటో తేల్చేస్తా!" అనందరావు మాటలకు కోపంగా చూసిందామె.

"తేల్చవలసింది ఇటు కాదు, అటు" ఆమె మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. వెళ్తానంటూ పుణ్య లేచింది.

"కాలేజీ వంకతో రోజూ కలిసే నువ్వు ఈ మధ్య కలవటమే లేదు. ఈరోజు కలుసుకున్నామనుకుంటే త్వరగా వెళ్ళిపోతానంటున్నావు. ఇదేం బాగు లేదు" అన్నాడు ఆనందరావు.

" అన్నయ్య ఎం.బి.ఎ. చేస్తున్నాడన్నాగా! ప్రస్తుతం వాడి పరీక్షలవుతున్నాయి. వాడింటికి వచ్చేసరికి నేను లేకపోతే కేకలేస్తాడు. అందుకే ఈరోజుకి వదిలెయ్యి. రేపు మళ్ళీ ఇదే టైముకి కలుస్తా."

పుణ్య చెప్పగానే సరేనంటూ అతను లేచాడు. ఇద్దరూ పార్కులోంచి బయటకొచ్చాక, అతను బండి స్టార్ట్ చేసాడు. బైక్ ఎక్కబోతున్న పుణ్య రోడ్డుకి అవతల నుంచి తననే గమనిస్తున్న రవిని చూసి తటపటాయించింది.

"వెళ్దామన్నావుగా! ఎక్కు" ఆనందరావు మాట విని అతని వెనకాల ఎక్కి కూర్చుందామె. తన ముందు నుంచి ఆమె బైక్‌పై వెళ్తుంటే, 'వయసు ప్రభావం' అంటూ రవి తనలో నవ్వుకున్నాడు.
@@@@

"అలవి మీరిన ప్రేమ తాంబూలమాయె - అలరు పూచే లేమ తా మూలమాయె!
ఈ కొమ్మకే పూవు ఇంపార పూయునో? ఈ లేమకే పేరు లోకాన తెచ్చునో?

బాల్యాన బంగారు కలలన్ని - బొమ్మల కొలువుగా తీర్చిన జాణరా!
ప్రాయాన ఆశల సుధలెన్నో మోములో తొణికిన శృంగారవీణరా!
ఆ వీణ ఏ శ్రుతిని రవళించి మ్రోగునో? ఈ జాణ ఏ కృతికి జవనింప రేగునో?"

కూనిరాగం తీస్తూ వీధిగదిని సర్దుతున్న పుణ్యకు గుమ్మంలో అడుగుల చప్పుడు వినిపించి అటు చూసింది. గుమ్మంలో రవి కనిపించగానే భయంతో బిగిసిపోయింది.

"ఏమిటమ్మా అలా కొత్త వ్యక్తిని చూసినట్లు చూస్తావ్!. . .నేనూ. . .నీ రవి అన్నయ్యని" నవ్వుతూ చెప్పాడతను.

"ఏమీ లేదు. పెళ్ళి పనుల్లో బిజీగా ఉండవలసిన వాడివి . . .అకస్మాత్తుగా కనిపించేసరికి. . ." మెల్లిగా నసిగిందామె.

"నా పనుల్లో బిజీ అయిపోయిన నేను, బజారులో నిన్ను చూడగానే శేఖరాన్ని ఒక విషయం అడగాలని వచ్చాను" నవ్వుతూ చెప్పాడతను.

"ఏ విషయం?" పుణ్య కంగారుపడింది. ఇంతలోనే వీధిలోనుంచి శేఖర్ రావటంతో ఆమె లోపలకు వెళ్ళిపోయింది.

"శుభాకాంక్షలురా! రంగనాధంగారి అమ్మాయిని పెళ్ళాడుతున్నావట. పుణ్య చెప్పింది, సృజన చాలా మంచి అమ్మాయి. మంచి కుటుంబం. ఈకాలం పిల్లల్లా మాటకు మాట చెప్పే రకం కాదు" అంటున్న మిత్రుడికి ధన్యవాదాలు చెప్పాడు రవి. ఈలోపున వంటింట్లోంచి మంచినీళ్ళ గ్లాసుతో పుణ్యవతి వచ్చింది.

"అది సరె! నీ పరీక్షల సంగతి ఏమిటి?" మంచినీళ్ళు తాగుతున్న శేఖర్‌ని అడిగాడతను.

"ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి. కష్టానికి ఫలం దక్కేలానే ఉంది" బదులిచ్చాడు శేఖర్. అతనిచ్చిన గ్లాసు తీసుకొని పుణ్యవతి లోనికెళ్ళబోయింది.

"పుణ్యా! ఒక్క నిమిషం ఆగమ్మా!" రవి పిలుపుతో ఆమె గుండె ఝల్లుమంది. గంట క్రితం తనను పార్కు దగ్గర ఆనందరావుతో చూసిన విషయం అన్నయ్యతో చెబితే గొడవ ఖాయమనుకొందామె.

అన్నయ్య విషయం తెలిసి కూడా రవి ఆ విషయం అడుగుతాడా? ఏం జరిగినా తను తప్పించుకోలేదు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages