అమ్మే కావాలి
-కొడాలి సీతారామా రావు
‘అమ్మే కావాలి’ అని ఏడుస్తోంది మూడేళ్ళ పాప తిరుమలలో గాలిగోపురం ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో.చుట్టూ చాలా మంది భక్తులు తిరుగుతున్నారు ఎవరి హడావుడిలో వారు.దర్శనం కోసమో,ఇతర సేవలకోసమో వెళ్ళే వారు కొందరైతే,ప్రయాణానికి సమయం అయిపోతుందేమోనని కొందరు హడావుడిగా తిరుగుతున్నారు.ఆ పాపని తల్లిదండ్రులకి అప్పగించాలని వున్నా ఎవరూ ఆ పని చేయలేకపోతున్నారు.
ఆ సమయంలో ఆ పాప దగ్గరకి ఓ బాలుడు వచ్చాడు.అతని చేతిలో రెండు చిన్న సీసాలు వున్నాయి.అందులో ఒక దానిలో తెలుపు,మరో దానిలో ఎరుపు రంగు ద్రావకాలు వున్నాయి. వాటిలో రెండు పుల్లలు వున్నాయి.అతను భక్తులకి నామాలు పెడతాడు.అతని నుదుటి మీద నామాలు వున్నాయి.అతని భుజం మీద తువ్వాలు వుంది.నామం చెదిరితే తుడిచేందుకు.అతను చిన్న పంచ కట్టులో వున
అతను పాప దగ్గరకి వచ్చాడు.పాపతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు.పాప వినకుండా ఏడుస్తూనే వుంది ’అమ్మే కావాలి’ అని.
అతను ఆమె భుజం మీద చేయి వేసి ‘అమ్మని చూపిస్తా’ అనగానే పాప ఏడుపు ఆపి అతని వంక నిజమా అన్నట్టు చూసింది.అతను నిజమన్నట్టు తలూపుతూ ‘ఒట్టు’ అన్నాడు తల మీద చేయి పెట్టుకుని.
‘నీ పేరేంటి’ అడిగాడు.’సీదేవి’. ‘మీ అమ్మగారి పేరు’ ‘యశోద’.మీ నాన్నగారి పేరు’ ‘దశరథ్’ ‘ఏ వూరు నించీ వచ్చారు’ లేలూరు’ ‘ఓ మా వూరు దగ్గరే’
‘సరే నీకు నామం పెడతాను.’ ‘ఊహు.నాకు అమ్మే కావాలి.’ ‘తీసుకువెళతా.చక్కగా ఈ నామం పెట్టుకో’ అని బుజ్జగించి నామం పెట్టి ‘ఈ లడ్డూ తిను’అని చిన్న లడ్డూ పాప కుడి చేతిలో పెట్టాడు.పాప చెయ్యి వెనక్కి తీసుకుని ‘నాకు అమ్మే కావాలి’ ‘సరే పద’ అని పాప చెయ్యి పట్టుకుని ఉత్తర వీథిలోని ప్రకటనల గది దగ్గరకి తీసుకువెళుతూ దారిలో పాపకి గుడి గురించీ,కోనేరు గురించీ, రథాల గురించీ చూపిస్తూ తీసుకెళ్లాడు.
అక్కడి కానిస్టేబులుకి పాప వివరాలు చెప్పి మైకులో ప్రకటన చేసాక పాపని ఓ పక్కన గోడ దగ్గిర కూచోపెట్టి,మంచి నీళ్ళు ఇచ్చి, చేతిలో లడ్డూ పెట్టి తింటుంటే అమ్మా నాన్న వచ్చేస్తారు అని చెప్పి తను గుమ్మం దగ్గర నిలబడ్డాడు.
సరిగా అప్పటికి పావుగంట క్రితం పాప తలిదండ్రులు లడ్డూలు తీసుకుని ఓ గట్టు మీద కూచుని పాపకి పెట్టి తాము తింటూ కబుర్లలో పడ్డారు.పాప వాళ్ళ చుట్టూ తిరుగుతూ పాడుకుంటూ ఆడుకుంటోంది.వాళ్ళు మాటల్లో పడి పాపని గమనించలా.కాసేపటికి చూసుకుంటే పాప కనపడలా.భయం వేసింది.గుండెలు అదురుతుండగా పాప కోసం వెతికారు.ఎక్కడా కనపడలేదు.
భయంతో స్వామికి మొక్కుకున్నారు ‘స్వామీ పాప కనపడేలా చూడు.నా తలనీలాలిస్తా’ అని అతనంటే ఆమె ‘స్వామీ పాప కనపడేలా చూడు స్వామీ .ఇప్పుడే తలనీలాలిస్తా,నిలువుదోపిడీ ఇస్తా.’అని తల్లి మొక్కుకుంది.
వారి మనసులు పరి పరి విధాల పోతున్నాయి.ఈ మధ్య పిల్లలని ఎత్తుకుపోతున్నారని వింటున్నారు.పాపని వారి బారిన పడకుండా కాపాడమని వేడుకుంటున్నారు.
ఇంతలో పాప గురించిన ప్రకటన విన్నారు.వెంటనే ఆ ప్రకటన కార్యాలయం దగ్గరకి వచ్చి లోపలికి వెళ్ళబోతున్నారు.వాళ్ళని చూసిన పాప బావురుమని ఏడుస్తూ అమ్మని వాటేసుకుంది.తల్లికీ ఆగని దుఃఖం.ఇద్దరు ఒకరి చేతులలో ఒకరు.భర్త కూడా వారి ఇద్దరి మీదా చేతులు వేసి నుంచున్నాడు.
కానిస్టేబుల్ వారి దగ్గరకి వచ్చి ఓదార్చాడు.అప్పుడా తల్లి అడిగింది ‘బాబు మా పాపని మాకు అప్పగించారు.మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు.
‘కొండ మీద ఏ భక్తుడికీ ఎటువంటి ఆపద రానీడమ్మా స్వామి.ఆయనే మానవ రూపంలో సాయపడతాడు.అలా చాలా సంఘటనలు ఇక్కడ రోజూ చూస్తూనే వుంటాం.మీ కృతజ్ఞత ఆయనకే చెందుతుంది.జాగ్రత్తమ్మా.పాపని చేయి వదలకండి’ చెప్పాడు కానిస్టేబుల్.
వారు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ తమ మొక్కులు తీర్చుకోటానికి బయలుదేరారు.




No comments:
Post a Comment