జాతకం - అచ్చంగా తెలుగు

 జాతకం

                     -కొడాలి సీతారామా రావు



చిదంబరానికి  మహా చిరాకుగా వుంది వారం రోజుల నుంచీ.ఆ చిరాకు తన భార్య వల్ల.తన అమ్మానాన్న,అత్తగారు మావగారి మీద. చివరిగా ఐనా అసలు ఖోపం తమ జాతకాలు చూసి, ‘కుదిరాయి’ పెళ్ళి చేయొచ్చని వాళ్ళకి చెప్పిన జ్యోతిష్యుడి మీద.

   చిదంబరం బి టెక్ చివరిలో వున్నప్పుడే పూనా లోని ఎలక్ట్రికల్  చిప్స్ తయారు చేసే కంపెనీలో ఇంజనీరుగా ఎంపికయ్యాడు.

   పూనా నుంచి ఇరవై కి.మీ.ల దూరంలో వుందా ఫాక్టరీ. పూనాలో  కొన్ని అపార్టు మెంట్స్ తీసుకుని అధికారులకి,సూపర్వైజర్లకి వసతి కల్పించారు.అందులోనే ఓ అపార్టు మెంటులోనే కిచెన్ ఏర్పాటు చేసారు.అది ఈ సభ్యులే ఏడాదికో ఇద్దరు నిర్వహిస్తారు.వస్తువులు తేవటం,సభ్యుల నించీ డబ్బులు వసూలు చేయటం చేస్తారు.అపార్టు మెంట్ రెంట్ కంపెనీయే జీతాల లోంచీ తీసుకుంటుంది.

   ఉదయం  ఏడున్నర కల్లా బస్సు వస్తుంది ఫాక్టరీకి.ఉదయం టీ,టిఫిన్ అందిస్తారు.మథ్యాన్నం భోజనం కంపెనీకి పంపుతారు.

   చిదంబరం ఉద్యోగంలో చేరినప్పటి నించీ అతని తల్లిదండ్రులు అతన్ని పెళ్ళి చేసుకోమనీ,ఎవరినైనా ప్రేమించి వుంటే ఆమెతోనే పెళ్ళి జరిపిస్తామని చెప్పసాగారు.ఇప్పుడే చేసుకోనని చెప్తున్నా వినటం లేదు.పైగా వెంటనే సంబంధాలు కుదరవు.చాలా తతంగం వుంది.మీ ఇద్దరూ ఫొటోలు చూసుకోవాలి,జాతకాలు చూడాలి,ఇద్దరూ మాట్లాడుకున్నాక తాంబూలాలు, తరువాత పెళ్ళి.ఇదంతా ఒక రోజులోనో నెలలోనో  జరిగేది కాదు.కనుక నీ వివరాలు, ఫొటో మెట్రిమోనీలో పెట్టు.మేమూ చూస్తుంటాం.నువ్వూ చూడు.అలా ప్రయత్నం ప్రారంభిద్దాం.

   అలా చిదంబరానికి సంబంధాలు చూడటం ప్రారంభించారు. కొన్ని వాళ్ళకి నచ్చకపోవటమో, కొన్ని వీళ్ళకి నచ్చకపోవటమో, నచ్చాయనుకుంటే సిద్ధాంతిగారు ఏవో కారణాలు చెప్పి కుదరదంటం.

   అలా కొన్ని నెలలు గడిచాక ఈ సంబంధం నచ్చింది. సిద్దాంతిగారు కూడా బాగుంది,కాకపోతే చిన్నచిన్న అభిప్రాయ బేధాలు వస్తుంటాయి అన్నారు.వియ్యంకులిద్దరూ ఏ మొగుడూ పెళ్ళాలకయినా అవి తప్పవు. కనుక మనం సంబంధం ఖాయం చేసుకుందాం అనుకున్నారు.

    అలా రెండు నెలల తరువాత చిదంబరం పెళ్ళి అయింది. ఆమె కూడా అంతకు ముందు చెన్నైలో చేసేది. బదిలీ అడిగితే ఇచ్చారు.అలా పూనాలో కాపురం పెట్టారు.

   అప్పటినించీ చిదంబరానికి కష్టాలు మొదలయ్యాయి.ఆమె ఇతని మాట లెక్క చెయ్యదు. ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టు మాట్లాడుతుంది మొదటి రోజు నించీ.

   ఖర్చుదారి  అని అర్ధం అయిపోయింది.వాళ్ళింటినించీ రెండు ఫర్లాంగులు నడిస్తే ఆమె కంపెనీ కేబ్ వస్తుంది.నడవదు ఆ కాస్త దూరం కూడా.ఇంటి నుంచీ ఎంత ఛార్జి చేసినా కేబ్ బుక్ చేస్తుంది రోజు.వచ్చేటప్పుడూ అంతే.అదేమంటే అంత మంది మధ్య నాకు ఊపిరాడినట్టు వుండదు అంటుంది.

   వీకెండ్ ఖచ్చితంగా బయట భోంచేయాల్సిందే రెండు పూటలా.అలా వెళ్ళినప్పుడు కొత్త సినిమా వస్తే చూడాల్సిందే.తనకిష్టం లేదంటే తనొక్కతే చూసి వస్తాను వెళ్ళి పొమ్మంటుంది.అలా ఒక్కదాన్ని వదలలేక తను భరించేవాడు.

    ప్రతి రోజూ కూడా రాత్రి పూట వాళ్ళ ఇంటి దగ్గర దొరికే పుల్కాలు తెచ్చేస్తుంది. పగలు ఇద్దరూ కేంటీన్ లోనే. ఇంటికి ఎవరన్నా వచ్చినా అంతే. అనవసరపు ఖర్చు కదా తగ్గించుదామంటే వినదు.పైగా మరీ పిసినారి అంటుంది.

   అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా సార్లు బట్టలో ఏదో ఒకటి కొంటుంది తప్పకుండా.తను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి చిదంబరం క్రెడిట్ కార్డే  వాడుతుంది. పోనీలే తన భార్యేగా అనుకున్నా ఒకోసారి ఆ కార్డు పరిమితి దాటి పోతుంది.వారించినా వినదు.పైగా  పరిమితి పెంచచ్చుగా అంటుంది.

   దీనికన్నా దారుణం తన సహోద్యోగుల ముందు,బంధువుల ముందు కూడా తనని చులకన చేసి మాట్లాడుతుంది.తన మీద ఏ చిన్న జోక్ వేసినా తక్షణం మొహం మారిపోతుంది.రెండు రోజులైనా మాట్లాడదు.చివరికి తనే  ఎంతో బతిమాలితే కానీ మామూలు స్థితికి రాదు.

    రోజూ అనుకుంటాడు ఈ కాపురం చెయ్యలేను అని.నిజానికి తన వల్ల చిదంబరానికి మానసిక వ్యధ తప్ప శాంతీ లేదు,సుఖమూ లేదు.అలా నాలుగేళ్ళు గడిపేసాడు.

   చిదంబరం కోపం నశాళానికి అంటింది.ఏమైనా తాడో పేడో తేల్చుకోవాలని అత్తగారింటికి వెళ్ళాడు.తన భార్య వల్ల తను పడే కష్టాలు చెప్పి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోమని చెప్పాడు.

    మామగారు అల్లుడిని బయటకి తీసుకెళ్ళి చెప్పాడు.’ మా అమ్మాయి తప్పేం లేదయ్యా.మా ఆవిడ పోలిక వచ్చింది. మా ఆవిడ గురించి నేను కూడా ఇప్పుడు నువ్వు అనుకొంటున్నట్లే అనుకునేవాడిని.మార్చాలని చూసా. ప్చ్, అవలా.నేనే సర్దుకుపోయా.ఐనా పెళ్ళయ్యాక మరి కలిసి వుండాలిసిందే.’ అన్నాడు.

   అక్కడి నుంచి తన తల్లిదండ్రుల దగ్గరకి వెళితే ఒకళ్ళో ఇద్దరో పుడితే మారిపోతారు ఆడపిల్లలు.అప్పటినించీ ప్రతి రూపాయి పిల్లల కోసమే దాస్తారని చెప్పారు.

   అక్కడి నించీ తిన్నగా తమ బంధం బాగుంటుందని చెప్పిన సిధ్ధాంతిగారి దగ్గరకి వెళ్ళి నిలదీశాడు.

   ఆయన తాపీగా నవ్వుతూ చెప్పాడు ‘ ఏ వధూవరుల జాతకాలూ నూటికి నూరు శాతం కలవవు.ఏవో కొన్ని పాయింట్లు కలుస్తే పెళ్ళి చేయొచ్చని చెపుతాం. మా అమ్మాయికైనా అంతే.మరీ అననుకూలంగానో,దోషంగా వుంటేనో తప్ప. అంతెందుకు మా ఆవిడతోనూ నాకు ఇబ్బందులూ,గొడవలూ వున్నాయి.సర్దుకుపోవాలి మరి. పెళ్ళంటే నూరేళ్ళ బంధం.ఏడుజన్మల బంధం....’ అంటూ  ఇంకా ఏదో  చెప్తుంటే చిదంబరం జేబులో చేతులు పెట్టుకుని అలా నడిచి వెళ్ళిపోయాడు.@

No comments:

Post a Comment

Pages