సంధ్యా సమయం
మానసా రెడ్డి
సంధ్యా సమయం,
నది ఒడ్డున కూర్చొని చూస్తుంటే,
ఒక తెల్లటి కొంగ,
ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరింది.
అది ఎగిరింది,
ఆనందం కోసమే అయి ఉండాలి.
నది వెంట దూసుకొచ్చి,
మసకబారుతున్న నీటి ముఖంపై
చినుకుల్ని చిందిస్తూ,
నీటిమీద జారిన రాయిలా
ఒక్క క్షణం మెరిసి,
మళ్లీ ముందుకు సాగిపోయింది.
కనిపించకపోయినా,
దాని రెక్కల ప్రయాణం
నీటిలో పడ్డ చప్పుళ్లుగా
దూరం… దూరం…
చీకటిలో కలిసిపోతూనే ఉంది.
తిరిగి వచ్చింది.
అదే దారిలో,
తన నీడంత మసకగా,
చెట్ల గుంపు అవతల
హఠాత్తుగా ప్రత్యక్షమై.
మళ్లీ ఆ చప్పుళ్లు…
వింటూ ఉండగా
అవి కూడా
నా వినికిడి సరిహద్దులు దాటి
నిశ్శబ్దంలో కలిసిపోయాయి.
అప్పటికే చీకటి.
ఎక్కడో ఒక చోట
ఆ రాత్రి
తనకి చోటిచ్చి ఉండాలి.
తనకి చేరవలసిన చోటైనా,
లేదా తన ఆనందమే
దారి చూపించి తీసుకెళ్లిన
ఏదో తెలియని చోటైనా.
***




No comments:
Post a Comment