స్వయంసిద్ధ
(చిన్న కథ)
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర
వంటింట్లో పని చేసుకుంటోంది ప్రీతి.
"వాన పడేట్లుగా ఉంది ఆరేసిన బట్టలు తీసుకురా!తడిసి పోతాయి!"
హాల్లో టి.వి. చూస్తున్న భానుమతి కేక పెట్టింది.
చేస్తున్న పని ఆపి పెరట్లోకి పరిగెత్తింది ప్రీతి.
బట్టల్ని సోఫాలో పడేసి వంటింట్లోకి వెళ్లి చూస్తే కూర కొద్దిగా మాడినట్లు అనిపించి గబగబా స్టవ్వును కట్టేసింది.
"ఏదో మాడు వాసన వస్తోంది!"మళ్ళీ కేక పెట్టింది భానుమతి.
"కూర కొంచెం...."
"ప్రతి రోజూ ఏదో ఒకటి పాడు చెయ్యటమే!వాడికి సరైన తిండి వండిందెప్పుడు? పెట్టిండెప్పుడు?"
పొద్దున లేచిన దగ్గర్నుంచి టి.వి చూస్తూ కోడల్ని సాధించుకుంటూ ఉంటుంది భానుమతి.
గబగబా ఇంటి పని పూర్తి చేసి గదిలోకి వచ్చి కాన్వాస్ మీద బొమ్మలు వేసుకోసాగింది ప్రీతి.
ప్రీతికి ఉమేష్ తో పెళ్లయి రెండేళ్లు అయింది. ప్రీతి డిగ్రీ చేసింది. పక్కన పెయింటింగ్ కూడా నేర్చుకుంటోంది.
ఉమేష్ ది ఎలక్ట్రికల్ బిజినెస్.
మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు ఉమేష్.
అప్పటికి చిత్రం పూర్తి చేసింది ప్రీతి.
"పూర్తి కావటానికి రెండు రోజులు పట్టింది ఎలా ఉంది చిత్రం?" అడిగింది భర్తను.
"చాలా బాగుంది!"అని మెచ్చుకొన్నాడతడు.
"జపాన్ లో ఇంటర్నేషనల్ పెయింటింగ్ పోటీలు జరుగుతున్నాయి.పంపించనా? "
ఊ... పంపించు!బాగుంది!"
భార్యలో ఉన్న టాలెంట్ చూసి ఉమేష్ చాలా గర్వపడుతుంటాడు.
"నేను రాత్రికి వచ్చాక జాగ్రత్తగా ప్యాక్ చేస్తాను!"
అంటూ భార్యను దగ్గరకు తీసుకొన్నాడతడు.
హాల్లో కూర్చున్న భానుమతికి చికాగ్గా అనిపించింది.
మాడి పోయిన కూరలు పెట్టినా కొడుకు కోడల్ని ఏమీ అనడు. మొద్దు రాచ్చిప్పలాగా పెట్టింది తిని వెళ్తాడు.
"ఈ పిల్లకు వంట రాదురా!పుట్టింటి వాళ్ళు ఏమీ నేర్పించకుండా నా నెత్తిన పడేశారు."అంటూ కొడుకుకు చెప్పినా
"మెల్లగా నేర్చుకొంటుందిలేమ్మా!"అంటాడే తప్ప భార్యను విసుక్కోడు.
"జడ్డి వెధవ!"అనుకుంటుంది భానుమతి.
కోడలు చిత్రాలు గీసి ఎక్కడికో పంపిస్తుంటుందని తెలుసు.తన జీవితంలో ఇలాంటివి చూసింది లేదు. అధికారం చెలాయించే మొగుడు. ఉమ్మడి కుటుంబంలో ఎంత చాకిరీ చేసినా సాధించే అత్తగారు ఆడబడుచులు. పెళ్లయ్యాక తన గురించి పట్టించుకోని పుట్టింటి వాళ్ళు..... తనకు దక్కని సంతోషాన్ని, సుఖాన్ని కోడలు అనుభవిస్తోందని ఏదో తెలియని కసి!కొడుకుని కొంగున కట్టుకుందని మనసులో కోపం.
ప్రీతిని సాధించుకు తినటమే పనిగా పెట్టుకొంది భానుమతి.
ఉమేష్ షాపుకు వెళ్ళాడు.పెయింటింగ్ సామాన్లు తెచ్చుకోవటానికి ప్రీతి బజారుకు వెళ్ళింది.
గదిలోకి వచ్చింది భానుమతి.
కాన్వాస్ మీద చిత్రం.పోటీకి పంపించాల్సిన చిత్రం.
అక్కడే పెట్టి ఉన్న రంగు సీసాలు కనిపించాయి.
కాస్త రంగు తీసుకొని చిత్రం మీద చిలకరించింది.
ఆమె మనసు కాస్త శాంతించింది.
హాల్లో ఉన్న బట్టల్ని తీసుకొచ్చి బెడ్ రూములో మంచం మీద పరిచింది.
కాన్వాస్ మీద చిత్రం వికారంగా కనిపించిందామెకు.
కాసేపటికి బజారు నుండి వచ్చింది ప్రీతి.
హాల్లో టి.వి చూస్తున్న అత్తగారికి కాఫీ కలిపిచ్చి
"రాత్రికి ఏం చేయను?" అని అడిగింది.
"ఏదో ఒకటి చెయ్యి!ఏది చేసినా పాడు చెయ్యకుండా చెయ్యి!నీ కసలే తొందర!"
ప్రీతి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళింది.
చిత్రం మీద రంగు మరకలు.
ఆలాగే మంచం మీద కూలబడింది.
ఇప్పుడెలా? పోటీకి పంపించాల్సిన గడువు వారం రోజులే ఉంది.
మళ్ళీ ఇంత బాగా గీయాలంటే రెండు మూడు రోజులు పడుతుంది. ఇంట్లో నాలుగో మనిషి లేదుగా!అత్తగారే ఈ పని చేసిందని తెలుస్తోంది.
పెళ్లయిన దగ్గర్నుంచి అత్తగారు ఎంత సాధించినా పెద్దగా పట్టించుకొనేది కాదు. ఆమె లక్ష్యం మంచి చిత్రాలు గీయటం. అంతే!ఉమేష్ కూడా భార్యను ప్రోత్సహిస్తుంటాడు. అది చాలు!
ఆవిడేదో వాగినంత మాత్రాన ఒరిగేదేమీ లేదనుకునేది ప్రీతి. ఇప్పుడు సాధించటమే కాకుండా కోడలి మీద తన కున్న కక్షను చేతలతో చూపించటానికి ఇది ప్రారంభం అన్నమాట!
ఆలోచిస్తూ కూర్చుంది ప్రీతి.
కాసేపటికి బయటకు వచ్చింది.అత్తగారి వేలి చివర వెలిసిన రంగు కనిపిస్తోంది.
ఏం చెయ్యాలి? ఉమేషుకు ఫోన్ చేసింది.అత్తగారు చేసిన నిర్వాకాన్ని చెప్పింది.
"త్వరగా వస్తాను!నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చొ!అంతగా అయితే మంచి పుస్తకం తీసికొని చదువుకో!అమ్మతో నువ్వేమీ మాట్లాడకు!మెల్లగా నేనే చెప్తాను!"అన్నాడు.
కాసేపు గదిలో కూర్చుని ప్రశాంతంగా ఆలోచించసాగింది ప్రీతి.
కోడలు ఏడుస్తుందనుకుంది భానుమతి.
ఆ పిల్ల కంట్లో నీళ్లు చూడాలని కోరిక.
మామూలుగా వంటింట్లోకి వచ్చి వంట చేసుకోసాగింది ప్రీతి.
భానుమతి కూడా ఏమీ మాట్లాడలేదు.
ఉమేష్ వచ్చాడు.
"నేను మౌనంగా ఉంటే ఇంకా ఎక్కువవుతుంది. ఏం చేద్దాం?"
"నేను ఏదో ఒక పరిష్కారాన్ని చూస్తాను!ముందు చిత్రాన్ని మళ్ళీ వెయ్యి!"అని బోర్డు మీద కాన్వాసును పెట్టాడు ఉమేష్.
ఆ రాత్రి గదిలో నుంచి బయటకు రాలేదు ప్రీతి.
ప్రీతికి భోజనాన్ని గదిలోకే తీసుకొని వెళ్ళాడు ఉమేష్.
రెండో రోజు పొద్దున్నే తల్లికి కాఫీ కలిపి తీసుకొచ్చాడతడు.
"దానికేమైంది? "అడిగింది భానుమతి.
"చిత్రం పాడయ్యింది.మళ్ళీ గీయటానికి రెండు రోజులు పడుతుంది. తను అందరి లాంటిది కాదమ్మా! అద్భుతమైన ప్రతిభావంతురాలు.... నువ్వు ప్రీతిని ప్రోత్సహించక పోయినా ఫర్వాలేదు. ఆమెలోని కళను అణగగొట్టొద్దు!...ఆమె వెనక నిలబడ్డావనుకో దేవతలాగా నిన్ను పూజించుకొంటాము!కాదు.. కూడదు అనుకుంటూ నువ్వు చూసే సీరియల్స్ లో లాగా ఉన్నావనుకో..."ఆగాడు ఉమేష్.
మెల్లగా వంటింట్లోకి వెళ్లిపోయాడు.
మాటరానట్లుగా శిలలాగా బిగుసుకొని కూర్చుంది భానుమతి.
ఎప్పుడూ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడని కొడుకు.ఈ రోజు ఇలా తనను.... తన విలువ తగ్గిపోయినట్లని పించిందామెకు.
ఆ రోజు వంట చేశాడు ఉమేష్.
పప్పు కాస్త మాడింది. కూర సరిగ్గా ఉడకలేదు. చారు మరీ అధ్వాన్నం!ఉప్పు కషాయంలాగా ఉంది.కొడుకు చేసిన వంట. వంకలు పెట్టలేదు భానుమతి.
షాపుకు వెళ్ళాడు ఉమేష్.
సాయంత్రం తనే వంట చేసింది భానుమతి.
రెండో రోజు అదే వరస!ఇంట్లో పని కాస్త కాస్త చేసుకుంటూ కోడలు గదిలోనుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది.ఉమేష్ వంట చేసి పెట్టినా పై పని చేసుకొనే సరికి నీరసం వస్తోంది భానుమతికి.
మూడో రోజుకు చిత్రాన్ని పోటీకి పంపించింది ప్రీతి.
మరో వారం రోజులకు ఆమె చిత్రాన్ని పోటీకి పరిశీలిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
ఊపిరి పీల్చుకొన్నారు భార్యాభర్త లిద్దరు.
మామూలు రొటీన్ లో పడ్డారు ముగ్గురు.
ఈ సంఘటన తర్వాత కోడలిని సాధించాలంటే జంకుతోంది భానుమతి.
ఒక నెల తర్వాత చిత్రాల పోటీ ఫలితాలు వచ్చాయి.
ప్రీతి వేసిన చిత్రానికి తృతీయ బహుమతి వచ్చింది. ఆ వార్త పేపర్ లో కూడా వచ్చింది.
వాట్సప్ ద్వారా ఆ కాలనీలో ఉండే వాళ్లకు విషయం తెలిసింది.
ఒక రోజు సాయంత్రం పూట ఇంటి ప్రక్కనే ఉన్న గుడికి వెళ్ళింది భానుమతి.
"మీ కోడలు బొమ్మలు గీస్తుందటగా!మొన్న వాట్సప్పులో చూశాము!"అంటూ తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే ఉక్కిరి బిక్కిరయిందామె.ఆమెలో కొద్దిగా మార్పు వచ్చింది.
పనిగట్టుకొని ప్రీతిని సాధించటం మానుకోవటమే కాకుండా ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తోంది.
రోజులు గడుస్తున్న కొద్దీ ప్రీతి ప్రతిభ విస్తరిస్తోంది.
నేడు డబ్బుతో పాటు పేరు కూడా సంపాదిస్తోంది.
ఈనాటి ఆడపిల్లలు స్వయం సిద్దలు. వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.
భానుమతి లాంటి అత్తగార్లు నిజాన్ని గ్రహించి కాలంతో బాటు మారుతూ సర్దుకుంటున్నారు.
మార్పు మంచిదే కదా!
(సమాప్తం )




No comments:
Post a Comment