భయ నివారణోపాయః - అచ్చంగా తెలుగు
భయ నివారణోపాయః 
సి.హెచ్.ప్రతాప్
 




ఆధునిక ప్రపంచంలో మానవ మేధస్సును, ప్రశాంతతను తీవ్రంగా వేధిస్తున్న మానసిక రుగ్మత భయం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి ప్రతి ఒక్కరి మనసులో ఒక తెలియని ఆందోళనను, అభద్రతా భావాన్ని నింపుతోంది. భయం అనేది అచేతన మనస్సులో నిగూఢంగా దాగి ఉండి, అనుకూల సమయం దొరికినప్పుడు బయటకు వచ్చి మనుషులను నిశ్చేష్టులను చేస్తుంది. జీవితాన్ని కోల్పోతామనే ఆందోళన, ఆస్తి నష్టం, ఆత్మీయుల ఎడబాటు, సమాజంలో గౌరవానికి భంగం కలగడం వంటి రకరకాల కారణాలు ఈ భయానికి మూలాలు అవుతున్నాయి. వీటన్నిటికంటే అత్యంత భయంకరమైనది, నిరంతరం వెంటాడేది మరణ భయం. భౌతిక సంపదలు, శారీరక సంబంధాలు అన్నీ ఒకేసారి కనుమరుగవుతాయనే ఆలోచనే మరణం కంటే ఎక్కువ వేదనను మిగులుస్తుంది. ఆధునిక కాలంలో పెరిగిపోతున్న అనిశ్చితి వల్ల ఈ ప్రాణాంతక భయం మానవుడిని మరింతగా కుంగదీస్తోంది.

శాస్త్ర సాంకేతిక రంగాలు మానవాళికి అపారమైన భోగభాగ్యాలను, సౌకర్యాలను అందించినప్పటికీ, మరోవైపు ప్రాణ రక్షణపై అనేక ప్రశ్నలను మిగిల్చాయి. ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని దుస్థితి నెలకొంది. సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, యాంత్రిక జీవన విధానం, క్షణాల్లో సంభవించే ప్రమాదాలు మరణాన్ని మరింత దగ్గరగా తెస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలను విధిరాతగా భావించి సరిపెట్టుకున్నా, తోటి మనుషుల స్వార్థం, క్రూరత్వం వల్ల కలిగే విపత్తులు నమ్మకాన్ని హరించి వేస్తూ తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.

ఈ మానసిక రుగ్మతకు వైద్య శాస్త్రంలో నేటికీ ఖచ్చితమైన ఔషధం లభించలేదు. దీనిని ఆత్మకు సంబంధించిన అనారోగ్యంగా గుర్తించి ఆధ్యాత్మిక  మార్గంలోనే పరిష్కరించుకోవాలి. భయాన్ని వీడాలంటే ముందుగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. హృదయంలో ఆందోళనను నింపుకుంటే విజయాన్ని సాధించలేము. అది మానసిక శక్తిని హరించి, చేయదగిన పనులను కూడా చేయనివ్వదు. పిల్లిని చూసి భయంతో కళ్ళు మూసుకునే పావురం ఏ విధంగా ప్రమాదం నుండి తప్పించుకోలేదో, మన నిస్సహాయత కూడా మనల్ని రక్షించలేదు. అందువల్ల ప్రతికూల పరిస్థితులను ప్రశాంతతతో, స్థిరచిత్తంతో ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి.

జీవితంలో ఎదురయ్యే ఆపదలను చూసే కోణాన్ని మార్చుకోవాలి. కష్టాలు, సవాళ్లు అనేవి మనలోని అంతర్గత శక్తులను నిద్రలేపే పరీక్షలు. పరీక్షలను ఎదుర్కొని నిలబడినప్పుడే మానసిక ఎదుగుదల సాధ్యమవుతుంది. భయానికి అసలు కారణం శరీరాన్ని, శాశ్వతమైన ఆత్మను ఒకటిగా భావించడమే. భగవద్గీత బోధించిన పరమ సత్యం ప్రకారం ఆత్మ అమరమైనది. శరీరం కేవలం ఆత్మ ధరించే తాత్కాలిక వస్త్రం మాత్రమే. మరణం అనేది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ఆశ్రయించే సహజమైన మార్పు. నిరంతర సాధన ద్వారా ఈ సత్యాన్ని గ్రహిస్తే మరణ భయం పూర్తిగా తొలగిపోతుంది.

మన వర్తమాన భయాలకు గత కర్మల ప్రభావం కూడా ఒక కారణం. భయం ఎప్పువు భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్లే కలుగుతుంది, కానీ దాని వేర్లు గతంలో చేసిన పనులలో ఉంటాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మన పూర్వ కర్మల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తాము. కొంతమంది చిన్న విషయాలకే తీవ్రంగా కలవరపడటానికి వారి సుప్తచేతనలోని పాత ముద్రలే కారణం. విభిన్న రకాల ఫోబియాలు కూడా ఈ మానసిక బలహీనత నుంచే పుడతాయి. ఈ ఆందోళన మన ప్రస్తుత సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి, భవిష్యత్తు వైపు సాగవలసిన అడుగులను అడ్డుకుంటుంది.

మన ఇతిహాసాలు, పురాణాలు ధైర్యం యొక్క గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. హనుమంతుడు, అంగదుడు వంటి వీరుల గాథలు, దుర్గాదేవి సింహవాహినియై దుష్టులను సంహరించిన వృత్తాంతాలు మనలో శౌర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. లోక కళ్యాణం కోసం, సత్య రక్షణ కోసం నిలబడిన మహనీయులు మరణ భయాన్ని సైతం లెక్కచేయక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. వారు చూపిన ధీరత్వమే మనకు మార్గదర్శకం కావాలి.

భయాన్ని జయించడానికి ఆత్మజ్ఞానం, స్థిరమైన సాధన, ధర్మబద్ధమైన కర్మలు అత్యంత ఆవశ్యకమైన సాధనాలు. ఈ సద్గుణాలను అలవర్చుకున్నప్పుడే మానవుడు అంతర్గత శత్రువైన ఆందోళనల నుండి శాశ్వతంగా విముక్తి పొంది, స్వేచ్ఛగా, ప్రశాంతంగా, అచంచలమైన ధీరత్వంతో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాడు. 

***

No comments:

Post a Comment

Pages