పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -21
దినవహి సత్యవతి
20 వ సర్గ
రాముడిని పంపుటకు దశరథుని నిరాకరణ, విశ్వామిత్రుని ఆగ్రహం...
316.
రాముని తనతో పంపుమని విశ్వామిత్రుడడిగెను,
దశరథుడు ముని కోరిక విని నిశ్చేష్టుడయ్యెను,
రాముడు రాజీవనేత్రుడు కమలలోచనుడనెను,
పదహారు సంవత్సరాలు నిండని బాలుడనెను,
రాక్షసులతో యుద్ధము చేయు యోగ్యతరాలేదనె, సత్య!
317.
తన వద్ద, పూర్తి అక్షౌహిణి, సైన్యమున్నదనెను,
దానికి నియామకుడూ, అధ్యక్షుడు తానేయనెను,
సైనికులు, శూరులూ, విక్రమవంతులూయనెను,
అస్త్రప్రయోగమునందు మిగుల సమర్థులనెను,
దైత్యులతో యుద్ధం చేయు యోగ్యులనె దశరథుడు, సత్య!
318.
సైన్యంతో కూడి, తాను, రాక్షసులతో పోరుదుననె,
ధనుర్థారియై తాను యాగ రక్షణ గావింతుననె,
ప్రాణములున్నంతవరకూ యుద్ధము చేసెదననె,
యాగం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చేసెదననె,
యాగ సమాప్తికి తోడ్పడుదుననె దశరథుడు, సత్య!
319.
రాముడు, బాలుడు, పూర్తి విద్యలు నేర్వలేదనె,
శత్రువుల బలాబలాలు గుర్తింపజాలడనె,
అస్త్రబలమునింకనూ సంపాదించలేదనె,
రామునికింకనూ యుద్ధములో నేర్పులేదనె,
కావున రాముని పంపలేనని దశరథుడనె, సత్య!
320.
రాక్షసులు కపటయుద్ధం చేయువారలనెను,
వారితో యుద్ధం చేయుటకు రాముడు తగడనెను,
రాముని విడచి క్షణమైన జీవింపలేననెను,
రాముని గొనిపోవద్దని విశ్వామిత్రుని కోరెను,
సైన్యసమేతుడై, తానే, వచ్చెదననె దశరథుడు, సత్య!
321.
తనకిప్పుడు వయస్సు మీరిపోవుచున్నదనె,
ఎంతయో శ్రమపడి రాముని, బిడ్డగ, కంటిననె,
తన జ్యేష్ఠసుతుడు ధర్మ విషయప్రధానుడనె,
నలుగురు సుతులన్న తనకు గొప్ప ప్రేమయనె,
రాముడన్న తనకత్యంత ప్రీతియనె దశరథుడు, సత్య!
322.
రాక్షసుల గూర్చి తెలుపుమని మహర్షినడిగెను,
వారి పరాక్రమము గురించియూ తెలియగోరెను,
వారినెవరు రక్షించుచున్నారో తెలుపుమనెను,
కపటయుద్ధం చేయువారిపై ప్రతిక్రియ యెట్లనెను,
దుష్ఠులతో మెలుగుటెట్లని దశరథుడు ప్రశ్నించె, సత్య!
323.
రావణుడు, పౌలస్త్య వంశజ, రాక్షసరాజుయనె,
అతడు మహాబలవంతుడు, వీర్యవంతుడుయనె,
బ్రహ్మనుండెన్నియో వరములు పొందియున్నాడనె,
రాక్షసమూకతో జేరి దౌష్ట్యాలు చేయుచున్నాడనె,
ముల్లోకాలనూ మిక్కిలి పీడించుచున్నాడనె, మహర్షి, సత్య!
324.
రావణుడు, విశ్రవసుడను ముని కుమారుడనె,
సాక్షాత్తూ కుబేరునికి యతడు సోదరుడగుననె,
అతడు స్వయంగా యజ్ఞభంగం కావించడనె,
మారీచసుబాహులనతడే ప్రేరేపించినాడనె,
వారే యజ్ఞభంగము చేయుచున్నారనె, మహర్షి సత్య!
325.
తాను రావణునెదిరింపలేనని దశరథుడనె,
సర్వధర్మాలూ తెలిసినవాడు విశ్వామిత్రుడనె,
తన చిన్నికుమారునిపై అనుగ్రహం చూపమనె,
అల్పభాగ్యుడైన తనయందనుగ్రహం చూపుమనె,
గురువు కౌశికుడే తమ దైవమనె దశరథుడు, సత్య!
326.
దేవాదులైనా రావణుయెదుట నిలువజాలరనె,
నరులకు రావణునితో పోరాడ శక్తిచాలదనె,
అతడు వీర్యవంతులనూ నిర్వీర్యుల చేయుననె,
తామెవ్వరూ యుద్ధంలోనతనికి సరితూగమనె,
ఎట్లైనా రావణునోడింపలేమని దశరథుడనె, సత్య!
327.
దేవతా సముడైన రాముడింకనూ బాలుడనె,
యుద్ధముతో పరిచయమింకనూ లేనివాడనె,
పున్నామనరకంనుంచి తననుద్ధరించువాడనె,
ఏదేమైనా రాముడిని మహర్షితో పంపజాలననె,
మారీచసుబాహులు ఘోరాసురులనె, దశరథుడు, సత్య!
328.
మారీచసుబాహులు పరాక్రమవంతులనె,
యుద్ధమునందు మంచి నేర్పుకలవారనె,
వారు యుద్ధములో యమునివంటి వారనె,
మిత్రపక్షములేకమైనా వారినెదిరింపలేమనె,
తామొక్కరితోనే పోరాడగలమనె, దశరథుడు, సత్య!
329.
రాముడిని, మహర్షితో, పంపలేననె దశరథుడు,
బాధతోనేదియో అసందర్భ ప్రేలాపన చేసినాడు,
అది విని మిక్కిలి కోపావిష్టుడయ్యె విశ్వామిత్రుడు,
నేతితో తడిసిన హోమాగ్నివలె కాన్పించినాడు,
అగ్నివలె ప్రజ్వరిల్లినాడు విశ్వామిత్రమహర్షి, సత్య!
*****




No comments:
Post a Comment