ఒకటైపోదామా ఊహల వాహినిలో -36 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో -36

Share This

                                                  ఒకటైపోదామా ఊహల వాహినిలో -36 

                                                                       (ఆఖరి భాగం)

కొత్తపల్లి ఉదయబాబు 




ఈ ప్రపంచంలో కాలం ఎవరికోసం ఆగదు. కాలం మారిపోయింది అని చెబుతారు కానీ... నిజానికి మారినది మనుషుల మనస్తత్వాలు. విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆ విజ్ఞానాలను మంచి కన్నా చెడుకి, సమాజ శ్రేయస్సు కన్నా, వ్యక్తి స్వార్థానికి వాడుకుంటున్న సమయంలో  మనిషి తన తెలివితేటలకు వికృత్వం అనేటువంటి ఒక ఎరువును వేసి, తార తరాలుగా శాస్త్ర పద్ధతిలో జరిగే విధానాన్ని అశాస్త్రీయ పద్ధతులద్వారా సాధిస్తే ఎలా ఉంటుంది అని పరిశోధన చేస్తూ దాన్ని కొత్త ఆవిష్కరణగా  ప్రచారం చేసుకుని తిమ్మిని  బమ్మిని,   బమ్మిని తిమ్మిని చేస్తున్న రోజులు ఇవి. 

ఆ కాలగమనంలో  హరితకు ఏడవ నెల వచ్చింది.

తనకు ఉన్నంతవరకు సీమంతం ఘనంగా చేద్దామని శకుంతల నిర్ణయించుకుంది.

 బబిత, సరితలను రమ్మని ఆహ్వానించింది.

తన పని చేస్తున్న ఆఫీసులో లేడీస్ స్టాఫ్ ని ఆహ్వానించింది. గవర్రాజు లేని సమయంలో

శకుంతలను, విరాజ్ ఇంటికి తీసుకెళ్లగా, విశాలాక్షిని ఆహ్వానించింది.

 

సీమంతం రోజు రానే వచ్చింది.

ఇంటి హాల్లోనే పూలతో చక్కగా అలంకరణ చేయించాడు  విరాజ్.

11 రకాల స్వీట్లు తెప్పించాడు. విశాలాక్షి హరితకు పట్టుచీర పూలజడ అలంకరణ అంతా ముందుగా పంపించింది. బ్యూటీషియన్స్ వచ్చి ఆమె చక్కగా అలంకరించారు. వీడియో గ్రాఫర్ అక్కడ జరుగుతున్న ప్రతి క్షణాన్ని వీడియోలో చిత్రీకరించాడు.

ఏడవ నెల ఒళ్ళు చేయడంతో హరిత నిండు శోభతో  కళకళలాడిపోతోంది.

శకుంతల విరాజ్ ని అడిగింది.

" ఇంత ఆర్పాటం అవసరమా బాబు? "

" ఇది ఆర్భాటం కాదండి. నా భార్యని సాధ్యమైనంత అందంగా, ఆనందంగా చూడాలన్నది  నా కోరిక. " అన్నాడు విరాజ్.

బబిత , సరిత, హరీష్ లు ముగ్గురు ఫంక్షన్ కి వచ్చారు.

 

సరిగ్గా ముహూర్త సమయానికి విశాలాక్షి వచ్చి కోడల్ని ఆశీర్వదించింది.

" మాకు తెలియకుండా హరితకు పెళ్లి ఎప్పుడు చేసేసావు శకుంతలా? " అడిగారు కొందరు.

 

"పెళ్ళి కర్ణాటకలోని మురుడేశ్వర్ లో చేస్తానని మొక్కుకున్నానండి. ఆ కారణం చేత మురుడేశ్వర స్వామి ఆశీస్సులతో, అనుకోని పరిస్థితుల్లో మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేయాల్సి వచ్చిందండి-"అని చెప్పింది శకుంతల.

 

  "బిడ్డ పుట్టాక మూడో నెలలో తప్పనిసరిగా అక్కని తీసుకుని మీరు మా ఊరు రావాలి బావగారు" అంది సరిత.

 

మరో రెండు రోజులు ఉండి వూరిలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చూసి బబిత, సరిత, హరీష్ వెళ్ళిపోయారు.

 

కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయినందుకు విరాజ్ ఎంతగానో సంతోషపడ్డాడు.

 

******

 

కార్తీక శుద్ధ విదియ శుభ దినాన హరిత బొద్దుగా ఉన్న మగ పిల్లవాడిని ప్రసవించింది.

విరాజ్, విశాలాక్షి ల ఆనందానికి అంతే లేదు.

" బాబు అచ్చు నీ పోలికే హరితా ... ఇంత మంచి ప్రేమ ఫలాన్ని ఇచ్చిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను హరిత?" అన్నాడు వీర్రాజు హరిత నుదిటి  మీద ముద్దు పెట్టుకుంటూ.

 

" తప్పనిసరిగా నా కోరిక తీరుస్తారా?" అడిగింది హరిత.

" మన పరిచయం అయ్యాక నాకు ఇది కావాలి అని నువ్వు కోరే మొట్టమొదటి కోరిక ఇది. ఎంత అసాధ్యమైనా సరే తీర్చే పూచీ  నాది " అన్నాడు హరిత చేతిలో చేయి వేస్తూ విరాజ్.

 

" మీ నాన్నగారి ముందు నేను తప్పు చేశాను అని  తలదించుకోకుండా  మీరు భరోసాగా ఉండండి. నాకు అదొక్కటే చాలు విరాజ్. " అంది అతను చేయి తన చెంపకానించుకుని కళ్ళు మూసుకుంటూ.

 

" పిచ్చిదానా! అదా నీ అనుమానం. ఒక తండ్రి ధనమదంతో  సాంప్రదాయపు సంకెళ్ళని నాశనం చేసే ప్రయత్నం చేస్తే... దాని ఫలితం ఇలాగే ఉంటుంది అని ఈతరం వృద్ధులకు తెలియచెప్పాల్సిన బాధ్యత మన యువతరానిది. ఆ విషయాన్ని మా నాన్నగారికి తెలియ చెప్పి నా ఇంటి గృహలక్ష్మిని నా బిడ్డను సగర్వంగా మన ఇంటికి తీసుకువెళతాను. సరేనా? " అని చెప్పాడు విరాజ్.

 

" ఈ జన్మలో మీ వంటి ప్రేమ మూర్తిని భర్తగా పొందడం నా అదృష్టం విరాజ్. " అంది హరిత.

 

11వ రోజున పురిటి స్నానం పూర్తయింది.

 

విరాజ్ ప్రణాళిక ప్రకారం కార్తీక బహుళ విదియనాడు ఉదయం 8 గంటలకు  గవర్రాజు ఇంటికి చేరారు శకుంతల, హరిత... బాబుతో సహా.

 

గవర్రాజు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు.

గుమ్మం ముందు బాబుతో సహా నిలబడ్డారు హరిత, శకుంతల.

 

శకుంతల కాలింగ్ బెల్ కొట్టింది.విరాజ్ తన గదిలోంచి వేగంగా బయటికి వచ్చాడు.

గవర్రాజు పేపర్ మడతపెట్టి టీపాయ్ మీద ఉంచి  ఎవరా అని చూశాడు.

 

" నమస్తే సార్... లోపలికి రావచ్చా " అడిగింది శకుంతల.

 

" మీరు లోపలికి రండి ఆంటీ. సోఫాలో కూర్చోండి. అమ్మని పిలుస్తాను " అని శకుంతలని దగ్గరుండి తీసుకువెళ్లి  కూర్చోమని  సోఫా చూపించాడు.

 

ఆవిడ కూర్చున్నాక  " అమ్మా... నీ మనవడు వచ్చాడు." అని ఒక్కసారిగా  అరిచాడు.

విశాలాక్షి లోపల నుంచి వచ్చి హరితని, ఆమె చేతుల్లో బాబుని చూసింది.

 

విరాజ్ ని శకుంతలని మార్చి మార్చి చూస్తూ

" ఏంట్రా వీరూ ... ఏమిటిదంతా... " అడిగాడు గవర్రాజు.

 

" మీరు ప్రశాంతంగా కూర్చుంటే  అన్ని వివరాలు మీకు బోధపడేలా చెప్తాను. కాదు అంటే చెప్పండి.. నా భార్యని బిడ్డని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను.జీవితంలో మళ్లీ మీకు కనిపించను. " అన్నాడు విరాజ్

 

గవర్రాజు గాజు బొమ్మలా కూర్చున్నాడు.

 

ఇంతలో విశాలాక్షి ఎర్ర నీళ్లు తీసుకువచ్చి హరితకు బాబుకు దిష్టి తీసి స్వయంగా బయట పారబోసి వచ్చింది.

 

బాబుని ఎత్తుకుని, హరితను ఒక చేయిని పట్టుకుని గవర్రాజు పక్కన కూర్చుని బాబుని తన చేతులతో ఎత్తుకుని భర్తకు చూపిస్తూ " మీ మనవడండి. " అంది విశాలాక్షి.

 

"హరితా...రా! నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేద్దాం!" అన్నాడు విరాజ్ తండ్రికి అక్షితలు అందిస్తూ.

గవర్రాజుకు ఉక్రోషం ఆగడంలేదు. తాను చెప్పిన సంబంధం  చేసుకోపోతే మానే. కనీసం తండ్రి అనే గౌరవం లేకుండా, జరిగిన విషయం ఏమిటో  చెప్పకుండా  ఇలా ఆశీర్వదించమనడం అతనికి నచ్చలేదు.

విశాలాక్షి హరితకు బాబుని అందించింది.

బాబుని పట్టుకుని ఆ దంపతులు మోకాళ్ళమీద కూర్చుని  గవర్రాజు  కాళ్ళకి నమస్కరించారు.

తప్పదన్నట్లు అక్షితలు వేసి మాడిన ముఖంతో కూర్చున్న గవర్రాజు

" భేష్ .ష్ణువ్వూ వాళ్లతో కలిసిపోయావన్నమాట. బాగుందే... చాలా బాగుంది. నీ కొడుకు ఓ పక్కన నా భార్య ...నా భార్య... అంటున్నాడు. అంటే నాకు తెలియకుండా పెళ్లి కూడా జరిగిపోయిందన్నమాట.  పెళ్లి కాకుండా బిడ్డని కనమన్నాను నేను. ఇంక వాడు ఆ అగ్రిమెంట్ ఎందుకు రాయించినట్టు? " అన్నాడు భార్యను ఉద్దేశించి.

 

" నేను పిల్లలతో కలవక ఏం చేస్తానండి. మీరు అసలు అలాంటి అగ్రిమెంట్ చేసినట్టు నాకు తెలియదు.  పిల్లాడు కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ చెబుతుంటే  నా గుండె తరుక్కుపోయింది. అసలు మీ తెలివితేటలు ఏమైపోయాయండి?.. మీరెంత కోటీశ్వరుడైతే మాత్రం...మన భారతీయ సంప్రదాయంలో నిజమైన ప్రేమికురాలు ఎవరైనా  మూడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకోకుండా బిడ్డని కనడానికి ఒప్పుకుంటుందా? అలాంటి పరీక్ష ఎక్కడైనా విన్నామా చెప్పండి... మీకు ఒక ఆడపిల్ల ఉండి  ఉంటే అలాంటి ఆలోచనే మీకు వచ్చేది కాదు.

 

ఆ పెద్దవాడు  ఎలాగూ దేశాలు పట్టిపోయాడు. మనల్ని కనిపెట్టుకొని ఉన్న ఒక్క కొడుకుకి లేనిపోని నియమాలు అంటగట్టి, పెళ్లి వయసు వచ్చిన వాడిని మూడేళ్లుగా బాధపెట్టి .. మీరు సాధించింది ఏమిటి? తండ్రిగా మీ ఎంతో గౌరవం ఇచ్చి మీకు కుడి భుజంలా అన్ని పనులు చేసి పెట్టి,

మీ వ్యాపారాన్ని ఇంకా పెంచాలని మీరు రెండో కొట్టు పెడితే, దాని అభివృద్ధి కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడో బిడ్డ...అలాటి   వాడినా మీరు మాటలంటున్నది?

అగ్రిమెంట్ సంగతి నాకు ముందే తెలిసుంటే ఆనాడే దాన్ని చింపి పోగులు పెట్టి, పిల్లవాడికి వాడి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసి ఉండేదాన్ని."

 

" అవునే. నేను అగ్రిమెంట్ చేయబట్టి వాడు మూడేళ్ల నుంచి ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడు. లేకపోతే ఈపాటికే వాడి వెనకున్న ఈ డబ్బు కోసం చెత్త నాటకాలాడి ఈ ఆస్తినంతటిని  గద్దలా తన్నుకుపోయే ఆడ స్నేహితులు వాడికి చాలామందే ఉన్నారు. మనిషి బతకడానికి ఈ లోకంలో కావాల్సింది డబ్బే  "

 

"చాల్లెండి మీ డబ్బు పిచ్చి మాటలు. ఏ పూటకా పూట గంజితాగి హాయిగా పడుకునే రిక్షావాడు దగ్గర డబ్బు ఉందనే బ్రతుకుతున్నాడా? ఎంత డబ్బు సంపాదిస్తే మనిషికి సంతృప్తి? డబ్బుంటేనే మనిషి సుఖపడతాడు అనుకోవడం మీ అవివేకం."

 

" సరే నాది అవివేకమే అనుకుందాం. నా పాయింట్ ఒక్కటే. పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లని బిడ్డని కనమన్నాను. పెళ్లి చేసుకోకుండా బిడ్డను కన్న ఆడదాన్ని సమాజం ఒప్పుకోదు. ఆ విధంగా అమ్మాయిని నా కోడలుగా నేను ఒప్పుకోను.

 

ఒకవేళ ఆ అమ్మాయిని వాడిని పెళ్లి చేసుకున్నాకా బిడ్డని కంటే మా అగ్రిమెంట్ ని వాడు ఉల్లంఘించినట్టే. అప్పుడు తండ్రిగా నాకు వాడు గౌరవం ఇవ్వనట్టే. ఆ విధంగానూ ఆ అమ్మాయిని కోడలిగా ఒప్పుకోను. అర్థమైందా? " అన్నాడు  గవర్రాజు.

 

"   మీ పెద్దకొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడని, తెగేదాకా లాక్కుని పెద్దాడిని వదిలేసుకున్నారు... కాదు వాడే మిమ్మల్ని వదిలేసాడు. ఇప్పుడు లక్ష్మీదేవిలాంటి కోడలు మీ గుమ్మంలో అడుగుపెట్టి, మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో  మనవడుతో ఆడుకునేలా పండంటి మనవడిని మీ చేతుల్లో  పెడుతుంటే... మీకు బాధగా ఉందా? " అడిగింది విశాలాక్షి.

 

"ఇదిగో. ఇందాక నీ కొడుకు 'నన్ను నా భార్యని ఆశీర్వదించండి' అన్నాడు.. అంటే వాడు పెళ్లి చేసుకున్నట్టే గా. ఏది పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యం?" గవర్రాజు మాటలకు  అడ్డువస్తూ అడిగింది శకుంతల.

" సార్! నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడొచ్చా? "

" మనం ఇంత చెప్పినా ఆయన అర్థం చేసుకుకోనప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పేయండి ఆంటీ. ఆయన వినకపోతే మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మీరు ఏం చేసినా సాంప్రదాయబద్ధంగా చేశారు. మానవత్వపు విలువలని నిలబెట్టేలా చేశారు. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పండి."

 

ఆ మాటలకి గవర్రాజు  ఆమెచెప్పేది వినడం ఇష్టం లేనట్టే ముఖం పెట్టి ప్రతీ అక్షరమూ శ్రద్ధగా వినసాగాడు.

 

''సార్ . నేను చెప్పినది  శాంతంగా వినండి. పెద్దమనసుతో ఆలోచించండి.

 

మీరు చెప్పిన నియమాన్ని విరాజ్ బాబు హరితకు చెప్పిన వెంటనే మేమిద్దరం చాలా ఆశ్చర్యపోయాం. మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి కాకుండా బిడ్డను కనాలంటే ...అది అసలు సమాజం హర్షించే విషయమేనా అని తీవ్రంగా ఆలోచించాము. అందుకే విరాజ్ బాబుని 'మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను.'

 

తండ్రిగా అనుక్షణం అతను మిమ్మల్ని, మీ మాటలనే లెక్కలోకి తీసుకున్నాడు. మీకు అతనికి మీ స్థాయికి తగ్గ సంబంధం చెయ్యాలని నిర్ణయించుకునే మమ్మల్ని వదిలించుకునేందుకు ఈ నియమం పెట్టారు అని నాకు అర్ధమైంది. 'మీ అభిప్రాయం ఏమిటి బాబు? హరితమీద?' అని విరాజ్ ని అడిగాను. అతని సమాధానం విన్నాక అతనిది నిర్మలమైన ప్రేమ అని గ్రహించాను. అటువంటి ఉత్తముని ప్రేమకు పాత్రురాలైన నా కూతుర్ని  మనసులో  దీవించాను. ఇంతకన్నా గొప్ప సంబంధం నేను జీవితంలో తేలేను.

 

ఈ వూరిలో వివాహం చేస్తే తమరు ఎలాగైనా తెలుసుకుని ఆపేపెప్రయాత్నం చేస్తారని నాకు అర్ధమైంది. అందుకే నా చెల్లెలు ఉన్న మరోరాష్టంలోని మురుడేశ్వర్ లో చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అయితే కావాలనే నేను హరితకు మేము మురుడేశ్వర్ వెళ్తున్నట్టు విరాజ్ కి చెప్పవద్దని మాట తీసుకున్నాను. ఈ కాలం పిల్లలు తెలివితేటల్లో మనని మించినవాళ్లు . విరాజ్ కు మా రిజెర్వేషన్ టికెట్లను ఒక కాపీ అదనంగా తీసి అతనికి అందేలా చేసింది.

 

హరిత అతనికి నోటితో చెప్పకపోయినా ఎలాగైనా సమాచారాన్ని అందిస్తుందని నేను ఊహించాను. ప్రేమికుల గొప్పదనం అదే. వెంటనే విరాజ్ మీకు చెప్పకుండా ఫ్లైట్ లో మురుడేశ్వర్ వచ్చేసాడు.

 

అప్పటికే నా చెల్లెలి చేత వీరి పెళ్ళికి మురుహూర్తం పెట్టించాను. పెళ్లి సాయంత్రం అనగా విరాజ్ ని మా చెల్లెలి ఇంటికి ''పూజకు '' రమ్మని ఆహ్వానించాను.అతనికి అనుమానం రాకుండా 'మా తమ్ముడు కూడా ఆ పూజ చేయించుకుంటున్నాడు .మీరు కూడాఆ పూజ చేసుకుంటే మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది'  అని చెప్పాను. విరాజ్ నా  మాట నమ్మాడు.

 

పంతులుగారు ఇచ్చిన బట్టలు కట్టుకుని పూజలో కూర్చున్నాడు.చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. ఆచమనం చేసేటప్పుడు విరాజ్ కు పంతులుగారు  నేను ఇమ్మన్న జలం మూడుసార్లు తాగేలా చేసారు.

 

దాంతో విరాజ్ కు మత్తు ఆవరించింది. ఆ స్థితిలో విరాజ్ చేతి నాకుమార్తె  మెడలో మూడు ముళ్ళు నేనే స్వయంగా అతని చేతులు పట్టుకుని వేయించాను. ఆ సాక్ష్యాలు మీకు చూపిస్తాను.

 

మూడేళ్ళుగా ప్రేమించిన ఒక ఆడపిల్ల జీవితాన్ని అయోమయం చేయాలనుకున్న మీలాంటి డబ్బున్న వాళ్ళనుండి తల్లిపక్షిలా నా బిడ్డను  నా రెక్కల్లో పొదువుకుని  నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను.

 

ఆ మరునాటి సాయంత్రమే  శోభన ముహూర్తం ప్రకారం  మా తమ్ముడికి పెళ్లి చూపులు అని అబద్ధం ఆడి హరితను విరాజికి అప్పగించి ఇంటికి వెళ్ళిపోయాను. 

 

వయసులో ఉంది మూడేళ్ళుగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు ఒక గదిలో ఎవరూ లేని ఏకాంతం లభించిందంటే వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా మనం ఊహించవచ్చు. నేను అనుకున్నట్టుగా ఆ భార్యాభర్తలు ఇద్దరి అనురాగ ఫలమే మీ మనవడు.

 

విరాజ్ కు నేను చేసిన తప్పులన్నీ అతనుఫ్లైట్ ఎక్కబోయే ముందే చెప్పేసాను.

 

వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను నా కూతురు, అల్లుడు క్షేమం కోరి రెండు అబద్ధాలు ఆది ఈ పెళ్లి చేయించాను.

 

మగదిక్కులేని  సంసారంలో ఓకే పేదపిల్ల పెళ్లి పధ్ధతి ప్రకారం చేయడానికి ఒక తల్లి ఎంత క్షోభ పడుతుందో,  ఎంత తాపత్రయపడుతుందో అంతగానూ కష్టపడ్డాను. నా కష్టాన్ని అర్ధం చేసుకున్న నా కూతురుకి తానూ కోరుకున్న భర్తను ఇవ్వగలిగాను. అంతగా నా కూతురు నాకు సహకరించింది.

 

నాది మీ దృష్టిలో తప్పు కావచ్చు. పెళ్ళికాకుండా ఓకే ఆడపిల్ల మాత్త్రం తల్లి అవడం నా దృష్టి లో భయంకరమైన అపరాధం. ఆ అపరాధం వేలెత్తి చూపుతుందని చూపుతుందనే కుంతీదేవి కర్ణుడిని నదిలో వదిలేసినా కధ   ద్వాపర యుగంలోనే జరిగింది.

 

నీతి నియమాలు, మానం అభిమానం గాలికి వదిలేసి ఇదే ఈనాటి ఆధునికత , దేవుడు మనిషి జీవితం ఇచ్చింది  పుట్టిన క్షణం నుంచి చచ్చే క్షణం వరకు కష్టం లేకుండా పెరగాలి...అనుక్షణం సుఖాన్ని వెతుక్కోవాలి...సుఖపడిపోవాలి..అనుభవించేయాలి..సుఖంగానే ఏ రోగాలు లేకుండా చచ్చిపోవాలి.ఇదే ఈనాటి సమాజంలో కొనసాగుతున్న జీవిన విధానం. అందుకు వల్ల  ఖర్మాన వాళ్ళే పోతారు.

 

నాకు కావలసింది నా బిడ్డ జీవితం. ఈ కనీస స్వార్ధం లేకపోతే తల్లి అయిన ఏ ఆడదానికి జన్మ సార్ధకతే ఉండదు  అని నా అభిప్రాయం.

 

ఇక మీరడిగిన సాక్ష్యాలు ఇవిగో..'' అని తన బాగ్ లో నుంచి చిన్న ఆల్బుమ్ తీసి  విరాజ్ కు అందించింది శకుంతల.

 

విరాజ్ దానిని తండ్రి చేతికి ఇచ్చాడు.

 

విరాజ్ పక్కన పెళ్లికూతురు వేషంలో హరిత కూర్చుని ఉండగా , గాజులు పట్టుకున్న చేతులు విరాజ్ చేతులు పట్టుకుని హరిత మెడలో తాళి కట్టిన దృశ్యాలు .

 

యధాలాపంగా చూసి పక్కన పెట్టేసిన గవర్రాజు చెవుల్లో శకుంతల మాటల్లో కష్టం, వ్యధ క్రమేపీ అర్ధం అవసాగాయి.

 

తన కన్నా బిడ్డ   జీవితం కోసంఆ తల్లి పడిన తపన అర్ధం చేసుకున్న కొద్దీ అతని మనసులో ఏదో తెలియని

 

బాధ సుళ్లుగా తిరిగి మనసుని కుదిపివేయసాగింది. తనకు ఆడపిల్ల ఉన్నా తనకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసి ఉండేవాడే తప్ప...ఇలా ఆలోచించేవాడే కాదు. ఆ అవసరం తనకు లేదు.  ఎందుకంటే  తానూ కోటీశ్వరుడు... డబ్బు ఎవరి నోరైనా మూయిస్తుంది అనే నమ్మకం కలవాడు.

 

విరాజ్ హరితను ప్రేమించి డబ్బులో పుట్టి పెరిగిన తనకు జీవితంలో మరో పార్శ్వాన్ని చూపించాడు.

 

ఇలాంటి కొడుకు కోడలిని తానూ చెందనాడుకుంటే తనకు పుట్టగతులు ఉండవు...ఎంత డబ్బు ఉన్నా చివరకు మనిషి మిగుల్చుకునేది పిడికెడు బూడిద ..

 

అతనికి కాశీలో తండ్రికి పిండప్రదానం చేసాక చేసిన గంగ స్నానం గుర్తుకు వచ్చింది. ఆ స్నానం పవిత్రమైనదో కాదో తనకు అప్పుడు తెలీదు.

 

ఇపుడు అతను తనలోని డబ్బు అహంకార మాలిన్యాన్ని వదిలించుకుంటూ మనసులో గంగానదీస్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ కళ్ళు మూసుకున్నాడు తన కళ్ళల్లో నీళ్లు ఎవరికి కనపడకూడదు అనే అహంభావ పెద్దరికంతో.

 

శకుంతల అంతగా వివరించి చెప్పినా కరగని తండ్రిని చూసి విరాజ్ సహనం నశించిపోయింది.

 

హరిత చేతుల్లో ఉన్న బాబుని ఎత్తుకుని లేచి నిలబడుతూ అన్నాడు.

 

" నాన్న మీకు ఇందాకనే చెప్పాను. ఈ వివరణ అంతా మీరు అర్థం చేసుకుంటారనే. అమ్మ అర్థం చేసుకుంది కాబట్టే కోడల్ని మనవడిని ఇంట్లోకి రానిచ్చింది. మీ పెద్ద కొడుకు  పిల్లల్ని, వాళ్ళు  పుట్టాక మీరు చూశారా... కనీసం ఏనాడైనా ఫోన్లో వీడియో కాల్ లో అయినా చూశారా?

 

అందని దాని కోసం ఆరాటం... అందిన దాన్ని కాలదన్నుకోవడం.... రెండింటికి చెడ్డ రేవడిలా ఒంటరిగాఈ వయసులో మీకు మీరుగా బ్రతకడం అవసరమా చెప్పండి....సరే.. మీ ఇష్టం!మేము వెళ్తున్నాం నాన్నా. పద హరితా..అత్తయ్య పదండి.అమ్మా...వెళ్లొస్తాం." అని ముందుకు అడుగువేయబోయిన విరాజ్ చేతుల్లోంచి బాబుని ఒక్కసారిగా లాక్కుని ...

''నా మనవడు, వంశోద్ధారకుడు చి. 'మురుడేశ్వర శశాంక్'  ని   నాకివ్వకుండా ఎక్కడికిరా వెళ్ళేది? తిన్నగా గదిలోకి వెళ్లి రెండో మనవడిని తొందరలో ఇచ్చే ప్రయత్నంలో పదండి.''అన్నాడు విరాజ్ తో.

''అప్పుడే మనవడికి పేరుకూడా పెట్టేసుకున్నారా నాన్నా?'' అన్నాడు విరాజ్ సంతోషాతిరేకంతో .

''నా వంశానికి చంద్రుడు రా వీడు'' అన్నాడు గవర్రాజు కంఠం వణుకుతుండగా.

''హరితను మీకోడలిగా ఒప్పుకున్నట్లు, నేను తప్పు పని చెయ్యలేదు అని మీరు నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నా...'' అన్నాడు విరాజ్, హరితతో  తల్లికి, తండ్రికి నమస్కరించి.

''మీ కుర్రాళ్లతో పెట్టుకుంటే పెద్దవాళ్ళకి గుణపాఠం నేర్పేస్తారురా...మీరు..'' అని నవ్వుతూ నిండు మనసుతో కొడుకుని, కోడలిని ఆశీర్వదించారు గవర్రాజు దంపతులు.

గవర్రాజు శకుంతలతో అన్నాడు.

''అమ్మా...మీ పేరు ఏమిటో నాకు తెలీదు. ఆడదాని జీవితానికి ఇంతటి పరమార్ధం ఉందని నాకు తెలియదు.మా డబ్బున్న ఇళ్లల్లో అసలు ఆలోచించము కూడా. ఇద్దరు పిల్లల జీవితాన్ని నిలబెట్టడం కోసం మీరు పడ్డ తాపత్రయానికి నేను మనిషిగా మారి మీస్థాయికి దిగివచ్చాను. అందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.

 

ఈవయసులో పిల్లల్ని దూరం చేసుకుంటే మనోవేదన తప్ప ఈ డబ్బు కాపాడాడు అని అర్ధం చేసుకున్నాను. నేను పెట్టిన నియమమే  నాకు, డబ్బుమదంతో ప్రవర్తిస్తున్న నాలాంటివాళ్లకు కనువిప్పు కలిగించేలా విశ్లేషించేటందుకు మీలాంటివాళ్ళు చాల అవసరం. నా ప్రవర్తనకు నిజంగా సిగ్గుపడుతున్నాను.'' అన్నాడు గవర్రాజు.

 

''మీరు పెద్దవారు...అలాంటి మాటలు అనకూడదు. తెలిసో తెలియకో మీ మనసు చాలా బాధ పెట్టిన మీరు మమ్మల్ని క్షమించాలి.''అంది శకుంతల.

 

''ఏవండీ ..అప్పుడే మీ మనవడు మీ మెళ్ళో పులిగోరు గొలుసు పట్టేసుకున్నాడు...చూసుకోంకొందిఅంది విశాల నవ్వుతూ.

 

''ఓరి భడవా...అపుడే తాతని కళ్లెం పట్టి ఆడించేద్దామనే...''అని బాబుని ముద్దు పెట్టుకుని ''వాడు ఎవరనుకున్నావే..ఈ గవర్రాజు వారసుడు.'' అని అక్కడే సోఫాలో వాడితో ఆటల్లో ములిగిపోయాడు.

 

పరిహారం :

 

''హరితా...తయారయ్యావా...''విరాజ్ అరిచాడు హాల్లోంచి.

 

''ఆ..వచ్చేస్తున్నానండీ .'' అంటూ కొడుకుని తీసుకువచ్చి ''ఇదిగో మావయ్యా.''అంటూ గవర్రాజుకు అందించింది.

 

విరాజ్ రెండు షాపుల తాళాలు తీసుకుని , గవర్రాజుతో ''షాపుకు వెళ్లొస్తాం నాన్న...'' చెప్పి హరిత చేయిపట్టుకుని ముందుకు నడిచాడు.

 

వెళ్తున్న కొడుకునీ కోడల్నీ చూస్తూ ''మీరు రాబోయే తరానికి ప్రతినిధులురా...''మనసులో అనుకుని బాబుతో ముచ్చట్లలో పడ్డాడు గవర్రాజు.

 

సమాప్తం

No comments:

Post a Comment

Pages