ఎంత పిలిచినా ఎంతెంత కొలిచినా ఎన్ని భజనలు చేసినా
వారకరీ పాదయాత్రలొ వందల మైళ్ళు నడచినా నీ భక్తులకు పలుకవేమిరా
నీ కొరకై తోటను పెంచుతూ తన తోటనుండి వెడలు వారకరీ యాత్రికులకు
సవతా మాలి చేసిన అన్నదానము కాచితివి, సవతామాలి అర్ధాంగి జానాబాయి
భక్తిని అనునిత్యము కాపాడితివి, భక్త వత్సల కారుణ్య హృదయా సంత్ తుకారామ్ సేవితా,
పాండురంగా నే సంత్ జ్ఞానేశ్వరుడను కాలేను, భక్త మావులీ అసలే కాను, పండరీ నాధా
సంతులగు నామదేవ్ వంటి వారికే మాత్రమే కనబడెదవా, వారి మాట మాత్రమే వినెదవా
నిమ్న జాతి వాడైన చోఖా మేలాను బ్రోచితివికదా, ఆతనిని తరియించితివికదా
తన తల్లి తండ్రులకు సేవచేయు పుండలీకుని మాటను దాటక నిలచితివట
భక్త పుండలీకుని ఆజ్ఞను దాటక అతని కొరకు కలకాలము ఇటుకపై నిలిచితిగా
సంత్ జనాబాయి మాటను వింటివి తోడుగా అంట్లు తోమితివి, అభంగాలు
వ్రాయించితివి, సక్కుబాయి కొరకు పిండి విసిరితివి, సంత్ కన్హోపాత్రను
మొహమ్మదీయ రాజునుండి రక్షించుటకు ఆమెకు పండరీపురాన శరణము
నొసంగితివి, సంత్ ముక్తాబాయి అభంగములను చెవులారా మనసారా వింటివి,
సంత్ బహినాబాయి భక్తి కవితలు వింటివి, నాకేమో అభంగాలు వ్రాయుటకు చదువు రాదు,
భక్తి ఏమిటో అసలు తెలియదు, భక్త జన హృదయ తరంగా, రంగా, జయ పాండురంగా
జ్ఞానము పేరును కనీసం ఉచ్చరించలేని పరమ అజ్ఞానిని నను కావగలేవా ప్రభూ
హరివి నీవు హరి విఠలా, శ్రీ హరి నీవు జయ విఠలా, కావుము నన్ను హరి విఠలా
నిన్ను కొలచితి, నిన్నే తలచితి నన్ను కావరా శ్రీ కృష్ణా, భక్తుల పాలిటి ఆశ్రిత వత్సలా
ఆర్త త్రాన పరాయణుడవందురు నాతో ఆటలాడుతుంటివి పరీక్షలకు నిలబడగలనా
బ్రతుకుకు ప్రయోజనము లేదు, ఎవరికి నాతో ఉపయోగము లేదురా కారుణ్య హృదయా
పండరీ నాథ, పాండురంగా, విఠల విఠల పాండురంగా, నిన్ను నమ్మితిని, నిన్ను వేడితిని
నన్ను కావుము, ఈ జీవిని కావుము, ముక్తిని ప్రసాదించుము,ఆర్త జన రక్షకా హరివిఠలా
దీపము వెలిగింపురా, నాలో భక్తి దీపము వెలిగింపరా, లోపలి తిమిరము హరియింపుమురా




No comments:
Post a Comment