పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -13 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -13

Share This

   పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -13 

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి 




191.

రోమపాదుడు, ఋష్యశృంగుని అనుగ్రహము కోరెను, 

అతడినచటికి తెచ్చినందుకు మన్నింపుమనెను, 

అతని తండ్రి విభండకుడు కోపించునేమోయనెను,  

విభండకుని ఆగ్రహంనుంచి కాపాడుమని వేడెను,    

ఋష్యశృంగునికి కోపమేమియు కలుగలేదనె, సత్య! 

192.

రోమపాదుడు, ఋష్యశృంగునితో పురి ప్రవేశించెను, 

అతనికి పుత్రికయౌ శాంతతో పెండ్లి జరిపించెను,   

అల్లునికి సమస్త భోగాలు సమకూర్చి పూజించెను, 

పిదప ఋష్యశృంగుడు ఆ దేశమందే నివసించెను, 

అట్లు, ఋషి కథ, సుమంత్రుడు, దశరథునికి, చెప్పె, సత్య! 

        

11 వ సర్గ

      దశరథుడు, ఋష్యశృంగుని అయోధ్యకు తోడ్కొని వచ్చుట... 

193.  

అంత సుమంత్రుడు మరొక విశేషము చెప్పెను,   

సనత్కుమారుని పల్కులు తాను వింటిననెను,   

దశరథునికా హిత విషయం తెలుపబూనెను,   

శ్రీమంతుడౌ రాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టుననెను, 

అతడే దశరథుడను పేర పిలువబడుననె, సత్య! 

194.

దశరథునకు, అంగరాజుతో స్నేహమేర్పడుననె, 

అతడు రోమపాద నామధేయుడై యుండుననె,  

అతనికి శాంతయను కుమార్తె పుట్టగలదనె, 

దశరథుడు, రోమపాదుని కలుసుకొనుననె,  

పుత్రప్రాప్తికై క్రతువు తలపెట్టినట్లు చెప్పుననె, సత్య! 

195.

క్రతువులో రోమపాదుని సాయము కోరగలడనె,  

ఋష్యశృంగుని తనతో పంపుమని కోరగలడనె, 

అతడల్లుడిని, దశరథునితో పంపగలడనె, 

దశరథుడు తన యజ్ఞం పూర్తిచేయగలడనె,  

ఋషి కృపచే దశరథుని కోర్కె తీరగలదనె, సత్య!  

196.

యజ్ఞ ఫలమున, పరాక్రమవంతులైనవారు, 

వంశప్రతిష్ఠను ఇనుమడింప జేసెడివారు, 

సర్వలోకములచే ప్రస్తుతింపబడెడివారు,

నల్వురు పుత్రులు దశరథునికి జనింతురు,  

అట్లు కృతయుగంలో సనత్కుమారుడు చెప్పెననె, సత్య! 

197.

అట్లు ఋత్త్విక్కులు చర్చింపగా వినియుంటిననె,  

కావున దశరథుడినే అంగదేశము వెళ్ళుమనె, 

ఋష్యశృంగుని సాదరముగా తోడ్కొని రమ్మనె, 

దశరథుడు, మంత్రి సుమంత్రుని సలహా వినె, 

రాజగురువు వసిష్ఠమహర్షి అనుమతి గైకొనె, సత్య! 

198.

అమాత్యాదులతోగూడి ఋష్యశృంగుని దేశం వెళ్ళెను, 

మిత్రుడు, అంగరాజు, రోమపాదుని కలుసుకొనెను,   

అచటతడు ద్విజశ్రేష్ఠుడౌ ఋష్యశృంగుని కాంచెను,

ప్రజ్వలించు అగ్నివలె ఋషి ప్రకాశించుచుండెను, 

రోమపాదుడు, దశరథుని, విశేషంగా సత్కరించె, సత్య!   

199.

రోమపాదుడు అల్లునికి మిత్రుడినెఱుక చేసెను, 

అది విని ఋష్యశృంగుడూ, దశరథుని, పూజించెను,

దశరథుడు కొన్నినాళ్ళచట అతిథిగా యుండెను,  

తదుపరి తాను కార్యార్థినై వచ్చితినని చెప్పెను,  

తానొక యజ్ఞం తలపెట్టినట్లు మిత్రునికి తెలిపె, సత్య! 

200.

ఋష్యశృంగుడే ఆ క్రతువు చేయించ సమర్థుడనెను,   

ఋషిని, భార్యా సమేతముగా, తనతో పంపుమనెను,  

మిత్రుని మనవిని రోమపాదుడు ఋషికి చెప్పెను,  

ఋష్యశృంగుడు అందుకు అంగీకారము తెలిపెను, 

అందుకు దశరథ, రోమపాదులు సంతసించిరి, సత్య! 

201.

దశరథుడు, మిత్రునివద్ద సెలవు గైకొనెను, 

దూతల ద్వారా అయోధ్యకు సందేశమంపెను,  

నగరిలోని మార్గములు శుభ్రపరచుమనెను, 

ధూప సుగంధములు వ్యాపింపజేయుమనెను, 

నగరినలంకరించి, పతాకలెగురవేయుమనె, సత్య! 

202.

 మహారాజు వచ్చెడి వార్త పౌరులకానందమిడెను,   

 రాజాజ్ఞ ప్రకారము అయోధ్య  అలంకరించబడెను,  

 ముందుగా ఋష్యశృంగుడు అయోధ్య ప్రవేశించెను,      

 వెన్నంటి దశరథుడు కూడా నగరి ప్రవేశించెను, 

మంగళవాద్యాల ఘోష నగరిలో మిన్నంటెను, సత్య!  

203.

దశరథుడు, ఋష్యశృంగుని యథారీతి పూజించెను, 

అతడిని తెచ్చి కర్తవ్యం పూర్తిచేస్తిననుకొనెను,  

పతీ సమేత శాంతను జూచి స్త్రీజనం సంతసించెను, 

ఆ జంట, రాజు, అంతఃపురస్త్రీల  ఆదరమునొందెను,   

శాంత, ఋష్యశృంగుడు అయోధ్యలో సుఖంగాయుండిరి, సత్య!  

 *****


No comments:

Post a Comment

Pages