విజయుని పరిణయ గాధలు - అచ్చంగా తెలుగు
విజయుని పరిణయ గాధలు

నాగామంజరి గుమ్మా 




విలువిద్యా ప్రవీణుడి గా పేరు గాంచినవాడు అర్జునుడు. అర్జునునికి నాలుగు వివాహాలు జరిగాయి. అన్ని కూడా అర్జునుడు వనవాసం లేదా తీర్ధ యాత్రలలో ఉన్నప్పుడు జరిగినవి కావడం విశేషం. 

తొలి వివాహం ద్రౌపది తో:-

లాక్షా గృహ దహనం తరువాత పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణుల వేషాలలో తల్లి కుంతి తో సహా తలదాచుకున్నారు. అక్కడ ఉండగానే పాంచాల రాకుమార్తె ద్రౌపదికి స్వయంవరం నిశ్చయించినట్లు తెలిసింది. పాండవులు ఐదుగురు వెళ్లారు. అక్కడ వర పరీక్షగా మత్స్య యంత్రం ఒకటి పెట్టారు. కింద నీటిలో తిరుగుతున్న చేప ప్రతిబింబాన్ని చూసి, పైనున్న చేపను గురిచూసి కొట్టాలి. ఎందరో రాజులు, యోధులు విఫలమయ్యాక , ద్రుపదుడు “మత్స్య యంత్రాన్ని ఛేదించే వారే లేరా?” అనగా బ్రాహ్మణుల వరుసలో నుండి అర్జునుడు వస్తాడు. నీటిలో చేప నీడను చూసి, గురిచూసి చేప కంటిని బాణంతో కొడతాడు. ద్రౌపది అర్జునుని మెడలో వరమాల వేస్తుంది. వచ్చిన వారు పాండవులని, వారు లాక్షా గృహదహనం లో మరణించలేదని అందరికి తెలిసిపోతుంది.

ఏకచక్రపురంలో ఉన్న తల్లి వద్దకు ద్రౌపదిని తీసుకు వెళ్లగా కుంతీ దేవి పరాకున “ఐదుగురు పంచుకోండి నాయనలారా” అనడంతో ద్రౌపది పాండవులు ఐదుగురకు భార్య అయ్యింది.

ఏకాంతవాసానికి భంగం రాకుండా ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం ద్రౌపది గృహంలో ఉండేటట్లు, ఆ సమయంలో ఎవరైనా వారున్న గృహంలోకి వెళ్తే ఏడాది పాటు తీర్థయాత్రలు చేయాలని నియమం పెట్టుకున్నారు. ఒకసారి ధర్మరాజు ద్రౌపది తో ఏకాంతమందిరం లో ఉండగా, ఆయుధాలకోసం అర్జునుడు వారి గృహంలోకి వెళ్ళవలసి వచ్చింది. నియమం ప్రకారం అర్జునుడు తీర్ధయాత్రలకు బయలుదేరాడు.

సుభద్రతో వివాహం. 

శ్రీకృష్ణుని సోదరి సుభద్ర. చిన్నతనం నుంచి ఇంట్లో పాండవుల ప్రస్తావన రావడం, వారిలో అర్జునుని ప్రస్తావన , విలువిద్యాప్రావీణ్యత , అందచందాల ప్రస్తావనలు సుభద్ర మనసులో అర్జునుని పట్ల అభిమానాన్ని పెంచాయి. వివాహమంటూ చేసుకుంటే అర్జునునే చేసుకుంటానన్నది. బలరామునకు పాండవులపై కృష్ణుని కున్నంత ప్రేమ లేదు. పైగా దుర్యోధనుడు గదా యుద్ధంలో తన శిష్యుడవడం చేత ఒకింత అభిమానం కూడా ఉంది. అందుచేత సుభద్రను దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయాలని ఉద్దేశ్యంతో ఉన్నాడు.

తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. తీర్ధయాత్రలకు అనువైన వేషధారణలో మునీశ్వరునిలా ఉన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు ప్రభాసతీర్ధం చేరిన విషయం గ్రహించాడు. సుభద్రను మునీశ్వరుని సేవల కొరకు నియోగించాడు. సుభద్ర అంతకుముందు అర్జునుని చూడలేదు. ఈ మునీశ్వరుడు ఎన్నో యాత్రలు చూసి వచ్చాడని తెలుసుకొని, “మా బావ కూడా తీర్ధయాత్రలకు వెళ్ళాడు. మీకు ఎక్కడైనా కనిపించాడా?” అని అడిగింది.

“ఎందుకు” అన్నాడు అర్జునుడు. 

“మా బావ కనిపిస్తే రమ్మని చెప్పండి. నేను అర్జునునే వివాహం చేసుకోదలిచాను.” అంది సుభద్ర.

“నేనే అర్జునుణ్ణి. తీర్ధయాత్రలలో ఉన్నందున ఇలా మునీశ్వర అవతారంలో ఉన్నాను” అన్నాడు అర్జునుడు.

బలరాముడు వీరి వివాహానికి అంగీకరించలేదు. కానీ కృష్ణుని సహాయంతో గాంధర్వ విధిని సుభద్ర ను  వివాహం  చేసుకున్నాడు  అర్జునుడు.  యాత్రలు ముగిసిన పిమ్మట సుభద్రను హస్తినాపురానికి తీసుకు వెళ్ళాడు. వీరి కలిగిన కొడుకు అభిమన్యుడు. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తున్నపుడు సుభద్ర అన్నగారింటనే ఉంది.

ఉలూచి / ఉలూపి తో వివాహం

పాతాళ లోకపు సర్పరాజు కౌరవ్య. ఆతని కుమార్తె ఉలూచి. అందాలభరిణ.  విహారార్ధం చెలులతో కూడి భూలోకానికి వెళ్లి రావడం ఆమెకు అలవాటు. వనాలలో విహరించి, సరస్సులలో జలకాలాడి, నెమళ్లతో నర్తించి, హంసలతో సయ్యాటాడి, జింకలను పరుగులు పెట్టించి ఆనందిస్తుంది. 

తపస్సుచేసి, మూకాసురుడనే వరాహ రూప రాక్షసుడిని సంహరించి, ఆ సందర్భంలో కిరాత రూపంలో ఉన్న శివునితో యుద్ధం చేసి, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించిన అర్జునుడు తన యాత్రలను కొనసాగిస్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురైన ఒక సరోవరం లో స్నానార్ధమై దిగాడు. అప్పటికే ఆ సరోవరంలో నాగకన్య ఉలూచి తన నెచ్చెలులతో జలకాలాడుతున్నది. మునీశ్వరునిలా కనిపిస్తున్నా, అర్జునునిలోని రాచఠీవి, సౌందర్యం ఉలూచిని ఆకర్షించాయి.

“మన్మథాకారా! నేను సర్పరాజు కౌరవ్య కుమార్తెను. ఉలూచి నా నామధేయం. ఆకారంలో మునీశ్వరునిలా కనిపిస్తున్నా, నిండైన నీ విగ్రహం, రూపం, సౌందర్యం నీవు రాచ కుటుంబానికి చెందిన వాడవని చెప్పకనే చెప్తున్నాయి. నీవెవ్వరవు?” అని తన పరిచయం చేసుకుని, అర్జునుని పరిచయం కోరింది.

“ పాతాళ లోకపు నాగకన్యకు నా నమస్కారాలు. నేను కురురాజ్యాధినేత పాండురాజు తనయుడను. అర్జునుడు నా పేరు. అవసరార్ధమై తీర్థయాత్రలు చేస్తున్నాను” అని వివరించాడు.

“మనోహరా… నిన్ను చూసిన క్షణము నుండి నా మనసు నిన్నే కోరుచున్నది. నన్ను ఆనందపరచు” అని తనకోరికను తెలియజేసింది ఉలూచి.

“సుందరీ, మీ జాతి మాకు పూజనీయము. మానవుడనైన నన్ను ఇలాంటి కోరిక కోరడం తగదు” అని నచ్చజెప్ప చూసాడు అర్జునుడు.

“మన్మధుడు తన పంచబాణాలను నాపై ఎక్కుపెట్టినట్లుగా ఉంది నా పరిస్థితి. దేవ, గంధర్వ, యక్ష, నాగ, సిద్దాధర కన్యలు కోరి వలచి వస్తే నిరాకరించడం మంచిది కాదు. మాకు ఇలా విహరించడం తప్పు కాదు. అంగీకరించమని” కోరింది ఉలూచి

అర్జునుడు నిరాకరించాడు. మౌనంగా తన స్నానాదులు పూర్తిచేసుకుని, సరోవరం నుండి బయటకు రాబోయాడు. పట్టువదలని ఉలూచి, అర్జునుని తన విషపు గాలులతో స్పృహ తప్పించి, పాతాళలోకానికి తీసుకుపోయింది. తన మందిరంలో దాచి ఉంచింది. 

సర్పరాజు కౌరవ్యకు తన కుమార్తె ఒక నరుణ్ణి తీసుకువచ్చి తన మందిరంలో దాచిన విషయం తెలిసింది. బుసలుకొడుతూ వచ్చాడు. తన వాడియైన కోరలు దించి, విషంతో సంహరించాలని చూసాడు. ఉలూచి తండ్రిని అడ్డుకుంది. అర్జునునిపై తనకు గల ప్రేమను తెలియజేసింది. అర్జునుడు ఉలూచికి తనపై గల ప్రేమకు ఆశ్చర్యపోయాడు. వివాహానికి అంగీకరించాడు. సర్పరాజు కూడా వారి వివాహానికి అంగీకరించాడు. ఉలూచిని వివాహం చేసుకుని, పాతాళలోకంలో వింతలు చూస్తూ, కొన్నాళ్ళు గడిపాడు అర్జునుడు. అనంతరం అక్కడనుండి బయలుదేరాడు. ఈ కథ మనకు మహాభారతం లో ఆదిపర్వంలో కనిపిస్తుంది.

మణిపుర యువరాణి చిత్రాంగద తో వివాహం.

మణిపుర మహారాజు చిత్రసేనుడికి పురుష సంతానం లేదు. ఒక్కతే కుమార్తె. పేరు చిత్రాంగద. అనన్య సామాన్యమైన అందం ఆమెది. వివాహవయస్సులో ఉంది. వీరుడు, అందగాడు అయిన యువకునికి ఇచ్చి వివాహం చేసి, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుని, వారికి కలిగిన కుమారుణ్ణి దత్తత చేసుకుని, తన వారసుని గా ప్రకటించాలని చిత్రసేనుని యోచన. చిత్రాంగద అందాన్ని చూసి ముందుకు వచ్చిన రాకుమారులు అందరూ చిత్రసేనుని  షరతులు చూసి వెనక్కు తగ్గేవారు. 

రాచకార్యాల నిమిత్తం అర్జునుడు మణిపూర్ రావలసి వచ్చింది. చిత్రసేనుడు తన మనసులోని కోరిక బయటపెట్టాడు. 

“వారసులు లేకపోతే నా రాజ్య ప్రజలు అన్యాయమైపోతారు. కూతురికి వివాహం చేసి , అల్లునకు నా రాజ్యం ధారాదత్తం చేయవచ్చు. కానీ నా వంశం ఇక్కడితో అంతమైపోవడం నాకు ఇష్టంలేదు. దౌహిత్రుని (కుమార్తె కొడుకుని) దత్తత తీసుకోవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నీకు ఆంగీకారమైతే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను” అన్నాడు .

అర్జునుడు చిత్రాంగదను చూసాడు. “నేను ఇల్లరికం రాలేను. కానీ ఇద్దరికి ఆమోదయోగ్యమైన విషయం చెప్తాను” అన్నాడు.

“సరేనన్నాడు” చిత్రసేనుడు. 

“కొడుకు పుట్టేవరకు తాను ఇక్కడే ఉంటానని, తర్వాత కుమారుని, భార్యను ఇక్కడే వదిలి, హస్తినాపురానికి వెళ్తానని, అక్కడనుంచి వచ్చి వెళ్తూ ఉంటానని “ మధ్యేమార్గం సూచించాడు. 

ఈ సూచనకు అంగీకరించిన చిత్రసేనుడు ధర్మరాజాదులకు వర్తమానం పంపించాడు. తన కుమార్తె చిత్రాంగదను అర్జునునకు ఇచ్చి వివాహం చేసాడు. అర్జునునకు, చిత్రాంగదకు కలిగిన కుమారుడే బభ్రువాహనుడు. చిత్రసేనునకు ఇచ్చిన మాట ప్రకారం, చిత్రాంగదను, బభ్రువాహనునను చిత్రసేనుని ఇంట్లో వదిలి, తాను హస్తినాపురానికి వెళ్ళాడు.  తల్లి, తాతల సంరక్షణలో వీరునిగా తయారైన బభ్రువాహనుడు అనంతర కాలంలో తండ్రితో యుద్ధంచేయవలసి రావడం, ఆయుద్ధంలో అర్జునుని సంహరించడం, తల్లి వచ్చి అతడే తండ్రి అని తెలియజేయడం, ఉలూచివచ్చి తన మంత్ర శక్తితో అర్జునుని బ్రతికించడం జరుగుతాయి. 

ఏదేమైనా అర్జునుని విజయయాత్రలలో , తీర్ధయాత్రలలో భాగంగా విజయం , పుణ్యం, అస్త్ర శస్త్రాలతో పాటు చక్కని చుక్కల్లాంటి కన్యలను కూడా వివాహం చేసుకువచ్చాడు. చేమకూర వెంటకవి రచించిన “విజయవిలాసం” కావ్యంలో ఈ కథలు ఇంకా వివరంగా చదవ వచ్చు. లేదంటే తాపీ ధర్మారావు గారు రచించిన “విజయవిలాస హృదయోల్లాస కావ్య వ్యాఖ్య” లో నైనా చదవవచ్చు.

స్వస్తి
***నాగమంజరి గుమ్మా***

No comments:

Post a Comment

Pages