పుణ్యవతి - 7వ భాగం - అచ్చంగా తెలుగు

పుణ్యవతి - 7వ భాగం

Share This

 పుణ్యవతి - 7వ భాగం

సోమసుధ 




(పుణ్యవతి చెప్పిన సృజన కథను విన్న రవి ఆమెను పెళ్ళాడటానికి తనకేమీ అభ్యంతరం లేదని, అయితే ఆమె చదువు పూర్తయ్యేవరకూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరతాడు. శేఖర్ తను జీవితంలో పైకెదగటానికి ఎం.బి.ఎ. చదువుతున్నానని రవికి చెబుతాడు. శేఖర్ ప్రవర్తనకు బాధపడే పుణ్యను రవి ఓదారుస్తాడు. తరువాత . . .)
@@@@@@@@@@@

అందమైన పూలతోట నడుమ మూలగా విసిరేసినట్లున్న ఆ పెద్ద గది పర్ణశాలను తలపిస్తోంది. ప్రహారీ గోడ మూలల్లో అందంగా అమర్చిన పూలకుండీల్లో విరబూసిన పూలు అమాయికమైన ఆడపిల్ల హృదయంలా ప్రేమగా స్పందిస్తున్నాయి. తన పసితనంలో సుధ అక్క వెనకాల తిరుగుతూ, తను కూడా ఆ తోటకు ప్రాణప్రతిష్ట చేసింది. విరబూసిన పూవులా ఆ ముంగిట్లో తిరుగాడే సుధ మరణం తరువాత ఆ ప్రాంగణంలో జీవకళ పోయినట్లనిపిస్తోంది. సుధ నాటిన మొక్కలకు తను నీళ్ళు పోస్తూంటే, 'మా యింట్లో నీ పెత్తనమేంటే?' అని సృజన కొట్లాడేది. అప్రయత్నంగా పుణ్యవతి కళ్ళు చెమర్చాయి. గేటు చప్పుడు విని చూసిన ఆమెకు పెద్ద పాకెట్టుతో లోనికొస్తున్న సృజన కనిపించింది.

"ఎంతసేపైందే వచ్చి?" సృజన అడిగింది.

"పావుగంట అయింది. ఇంటికి తాళం కనిపించింది. మేమిల్లు మారాక, ఇక్కడకొచ్చి చాలాకాలం అయింది కదా! ఒకసారి తోట చూద్దామని ఇలా వచ్చాను. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నాన్న లేరా?" పుణ్య అడిగింది.

"మధ్యాహ్నం భోజనాలయ్యాక బాబాయి యింటికెళ్ళాడు. నేను కాసేపు నిద్రపోయి, గంట ముందే బయటికెళ్ళాను" అంటూ సృజన యింటి తాళం తీసింది.

"చేతిలో ఆ పాకెట్టు ఏమిటి?" తాళం తీసిన పిదప, గోడకు ఆనించిన పాకెట్టుని చేతిలోకి తీసుకుంటున్న స్నేహితురాలిని పుణ్య అడిగింది. ఆమె పాకెట్టును విప్పి పుణ్యకి చూపించింది.

"అక్కయ్య ఫొటో! లామినేషన్ చేయించావేమిటి?" ఆ ఫొటోని అందుకుంటూ పుణ్య అడిగింది. అడుగుతున్న స్నేహితురాలిని కింద చూడమన్నట్లు కళ్ళతో సైగ చేసి, బాధతో పెదాలు బిగించింది సృజన.

సుధ ఫొటో కింద భాగంలో ఉన్న పంక్తులను చదివిన పుణ్య కళ్ళు చెమ్మగిల్లాయి.

"బ్రతుకుపై ఆశపడతాం మనం!
కానీ అందులో ఏముంది ఘనం?
మనసు ఆశపడ్డ ప్రతిదాన్నీ
దక్కనీయకపోవటమే -
బ్రతుకు గొప్పదనం! - జయసుధ"

చదివి తలపైకెత్తిన పుణ్యకి పైటతో కళ్ళు తుడుచుకుంటున్న సృజన కనిపించింది.

"రవిగారికి అక్కయ్య గురించి నువ్వు చెప్పిన రోజు రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు. సేవా తత్పరత గల అక్కయ్య కథకు దేవుడిచ్చిన ముగింపు చాలా బాధ కలిగించింది. చిన్నప్పుడు చిత్తు కాగితాల మీద అది చిన్న చిన్న కవితలు వ్రాస్తుంటే, ఏవో పిచ్చి వ్రాతలనిపించేవి. ఈనాడు అక్కయ్య గుర్తుగా మిగిలిపోయిన ఆ వ్రాతల్లో, జీవితసారం బోధపడుతోంది. సంఘానికి అక్కయ్య అక్కరకు రాని చుట్టమే! కానీ నాకు కాదు. అందుకే దాని డిగ్రీ పరీక్షకు తీయించిన ఫొటోని ఎన్‌లార్జ్ చేయించి, దాని క్రింద నాకు నచ్చిన దాని కవితను వ్రాయించి, లామినేట్ చేయించా! ఎలా ఉంది?"

"అక్కయ్య మనసంత మధురంగా ఉంది" నవ్వుతూ అంది పుణ్య.

ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టాక, సృజన వంటింటివైపు వెళ్ళింది. తన చేతిలోని ఆ ఫొటోని గదిలోని టేబిలుపై ఉంచి, తదేకంగా దానినే చూస్తూ కూర్చుంది పుణ్యవతి.

సృజన లోనుంచి రెండు మిక్చర్ ప్లేట్లతో వచ్చింది.

"ఏమిటి విశేషం?" నవ్వుతూ అడిగింది పుణ్య.

"నిన్ననే నాకు పెళ్ళిచూపులయ్యాయి. వాళ్ళ కోసం తెప్పించిన వాటిలో మిగిలిపోయినవి. వాటి మీద నీ పేరు వ్రాసి ఉన్నట్లుంది. చాలాకాలానికి మా ఇంటికొచ్చావు కదా! అదే విశేషం!" అంటూ సృజన ఒక ప్లేటుని పుణ్యవతి చేతిలో ఉంచింది.

"ఏమిటిది?" చేతిలోని మిక్చర్ ప్లేటుని చూపిస్తూ అడిగింది పుణ్య.

"తల్లీ! మళ్ళీ రికార్డు వెయ్యాలా? నిన్న నాకు. . ." ఆమె మాటలకు అడ్డు తగిలింది పుణ్య.

"నేను మిక్చర్ చరిత్ర గురించి అడగటం లేదు. మనం పుట్టి బుద్ధెరిగాక, ఎప్పుడైనా యిలా విడి పళ్ళాల్లో తిన్నామా? మనకు సుధక్క ఏమి చెప్పేది? మరిచిపోయావా?" అంటూ తన చేతిలోని పళ్ళాన్ని సృజన పళ్ళెంలోకి బోర్లించింది.

"సారీ! ఈమధ్య నువ్వు మా యింటికి రావటంలేదు కదా! అందుకే అలవాటు తప్పి మరిచిపోయాను. ఇప్పుడేమి చేసినా, పెళ్ళయ్యాక మాత్రం వదిలేయి తల్లీ! లేకుంటే ఈ ఒంటి ప్లేటు సంప్రదాయాన్ని మన శ్రీవార్లు అంగీకరించినా, అత్తగార్లు ఒప్పుకోరు" సృజన మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు.

"అలాగే! అయితే ఒక్క షరతు. అక్కయ్య నాకు నిన్ను, నీకు నన్ను అప్పజెప్పి వెళ్ళిపోయింది. ఆ స్నేహబంధాన్ని మాత్రం మనం వదులుకోవద్దు. కష్టకాలంలో అభిప్రాయాలు, అభిమానాలు పంచుకొంటూ, ఒకరికొకరంగా బ్రతకాలి. సరేనా?"

"పుణ్యా! అక్కయ్య సావాసం చేసి నూటికి తొంభై శాతం దానిలాగే తయారయ్యావు. ఆ మొండితనం, ఆ పట్టుదలా..."

"ఆపుతావా? అక్కయ్య ఎవరనుకున్నావు? నా హీరో! అది మగాడై ఉంటేనా? నీకు వదిన్నయి, నిన్ను కాల్చుకు తినేదాన్ని. ప్చ్! నాకు అదృష్టం లేదు."

"పుణ్యా! నా కన్నా రెండు నెలలు పెద్దదానివి. నాకు అక్కయ్యలాంటి దానివి. నువ్వేమీ అనుకోనంటే నీకొక విషయం చెప్పాలని ఉంది."

చెప్పమన్నట్లు తలూపింది పుణ్యవతి.

"నువ్వూ, నేనూ ఒకరికొకరుగా బ్రతకాలని నువ్వు అన్నావని ఇది చెబుతున్నాను. నా అభిప్రాయం తప్పయితే మన్నించు. నీకు కీడు జరగాలన్నది నా ఉద్దేశం కాదు. ఆనందరావుగారితో నిన్ను చూసినప్పుడల్లా, ఎందుకో సుధ అక్కే గుర్తొచ్చి. . .మనసులో ఏదో తెలియని బాధ, అర్థం కాని అలజడి. అకారణంగా నీపై ఎందుకో సానుభూతి కలుగుతోంది."

తన మాటలకు పుణ్యవతి సీరియస్‌గా చూడటంతో సృజనకు చెమట్లు పట్టాయి. కొద్ది క్షణాల తరువాత పుణ్యవతి నవ్వటంతో, సృజన మనసు తేలికైంది.

"నేను అక్కయ్యలాగ ప్రేమలో దెబ్బ తింటానని నీ భయం కదూ! పిచ్చీ! అన్నం తింటే అజీర్తి చేస్తుందని అసలు తిండే మానుకుంటామా? ఒక వ్యక్తికి గుండిగల కొద్దీ తిన్నా ఆకలి తీరదు. మరొకడు తిన్న ఒక ముద్ద అరగటానికి సమానస్థాయిలో అజీర్తి మందు తాగుతాడు. దానికీ పూర్వజన్మ సుకృతాలు, వంశపారంపర్య లక్షణాలు అంటిపెట్టుకొని ఉంటాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళంతా మోసపోతున్నారా? పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకొని సుఖపడే వాళ్ళెంతమంది? దేనికైనా అదృష్టమన్నది మన బ్రతుకుల్ని నడిపిస్తుంది. ఇకపోతే ఆనందరావుగారు. తను బిజినెస్ మాగ్నెట్ కొడుకైనా, అహంకారం లేని వ్యక్తి. తండ్రి వ్యాపారాన్ని చూసుకోవలసిన వాడు, తన సొంతకాళ్ళపై నిలబడాలని బాంకులో గుమాస్తాగా చేస్తున్నాడు. కారులో తిరగాల్సిన వ్యక్తి మొన్నటి వరకూ సిటీబస్సులో తిరిగాడు. ఈమధ్యనే బాంకు లోన్ తీసుకుని మోటార్ బైక్ కొన్నాడు. దుస్తుల విషయం నీకూ తెలుసుగా ఎంత నిరాడంబరతో! ఆ సింప్లిసిటీయే నాకు నచ్చింది. నేనంటే అతనికి ప్రాణమని కొన్ని సంఘటనల వల్ల తెలుసుకున్నాను. అలాంటి వ్యక్తి నన్ను మోసం చేస్తాడని నేను అనుకోను" పుణ్యవతి నమ్మకానికి సృజన బదులీయలేదు. కొద్ది క్షణాలు ఆగిన తరువాత పుణ్యవతి తిరిగి చెప్పసాగింది.

"ఒకవేళ, నేను మోసపోయానే అనుకో. . ."పుణ్యవతి మాటలకు సృజన అడ్డు తగిలింది.

"వద్దే! ఈ అసురసంధ్యలో తధాస్తు దేవతలు ఉంటారంటారు. ఈ సమయంలో అలాంటి మాటలు వద్దు"

"పిచ్చీ! బ్రతుకులో సుఖపడాలని మన వయసు ఆడపిల్లలంతా వెంపర్లాడుతుంటే, ప్రేమ, భయం, తథాస్తు దేవతలంటూ పాత చింతకాయ కబుర్లాడుతున్నావ్! విను. ఒకవేళ నేను మోసపోయానే అనుకో! అక్కయ్యలాగ దుస్సాహసం చేయను. జీవితమే పోరాటంలా బ్రతుకుతాను. ఈ మనోధైర్యానికి, మొండితనానికి కారణమెవరో తెలుసా? నా హీరో అక్కయ్యే! అక్కయ్య మాత్రం అలా ఎందుకు చేసిందో నీకు తెలియదా? తన భర్త నాన్నని నడిరోడ్డు మీద కొట్టి అవమానించటాన్ని తట్టుకోలేకపోయింది. అలాగే ఆనందరావుగారు శేఖర్ అన్నయ్యని కొడితే, తనే ఊరుకోడు. ఒకవేళ ఊరుకుంటే, నేనే అన్నయ్యకు ఒక బడితెనిచ్చి, నాలుగు తగిలించరా అని ప్రోత్సహిస్తాను. అంతేగానీ, ఆత్మహత్య చేసుకోను, సరేనా?" పుణ్యవతి మాటలకు సృజన తలొంచుకొంది.

"ఏరా! ఇంతకాలానికి ఈ నాన్న గుర్తొచ్చాడా?" అన్న మాటలు వినిపించి తలతిప్పిన పుణ్యవతికి గుమ్మంలో నిలబడ్డ రంగనాధం కనిపించాడు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages