పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -12
బాలకాండ
దినవహి సత్యవతి
176.
రోమపాదుడు, మంత్రివర్యాదులతో చర్చించును,
ఋష్యశృంగుని గొనివచ్చుటకై ప్రేరేపించును,
అపుడు రోమపాదునికి నిరాకరణ ఎదురౌను,
రోమపాదుడందుకు కారణం తెలియగోరును,
కారణము విభండకుడని వారు చెప్పుదురనె, సత్య!
177.
వారు యోచించి ప్రత్యామ్నాయం తెలుపుదురు,
దోషమంటకుండా ఋష్యశృంగుని తేగలమందురు,
గణికలే, ఋష్యశృంగుని అంగరాజ్యం, తేగలరు,
ఋషి రాకతో వర్షాలు కురియ సంతసించెదరు,
ఋష్యశృంగునికి శాంతనిచ్చి పెండ్లి జరిపెదరనె, సత్య!
178.
అట్లు రోమపాదుని అల్లుడౌను ఋష్యశృంగుడు,
అతడే ఇప్పుడు పుత్రప్రాప్తి మార్గం చెప్పగలడు,
అని సనత్కుమారుడు చెప్పెననె సుమంత్రుడు,
దశరథుడా కథ విని మిక్కిలి సంతసించినాడు,
ఋష్యశృంగుడెట్లు అంగదేశం వచ్చెనో చెప్పమనె, సత్య!
*****
10 వ సర్గ
ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చిన కథ, సుమంత్రుడు, దశరథునికి చెప్పుట...
179.
ఋషి అంగదేశ ప్రవేశం కథ రాజు వినగోరెను,
ఆ వృత్తాంతం, సుమంత్రుడు, విపులంగా చెప్పెను,
ఋషిని తెచ్చుటకు మంత్రులకొక ఉపాయం తోచెను,
ఋష్యశృంగుడు అడవులలో సంచరించుచుండును,
అతడు తపఃస్వాధ్యాయ నిరతి గూర్చి చెప్పిరనె, సత్య!
180.
అనుభవించి ఎరుగడతడు స్త్రీ, విషయసుఖాలు,
ఇంద్రియార్థములు మానవులకు అభిమతములు,
అవి అనుభవించకున్న క్షోభించు వారిమనస్సులు,
ఋషిని ప్రలోభపెట్టగలవు ఇంద్రియార్థములు,
ఆవిధముగ చేయుటకనుమతి కోరిరని, చెప్పె, సత్య!
181.
రాజు అనుమతిపై మంత్రులు కార్యారంభం చేసిరి,
సౌందర్యవతులైన వేశ్యలను అడవికి పంపిరి,
వారు ఋష్యశృంగ ఆశ్రమదరిని వసించసాగిరి,
ఋష్యశృంగుని దర్శనముకై ప్రయత్నించసాగిరి,
అతడెప్పుడూ ఆశ్రమమందే వసించుచుండెననె, సత్య!
182.
ఋష్యశృంగుడు నిష్కాముడు, నిత్యసంతుష్టుడు,
ఆశ్రమం దాటి అతడు బైటకు వెళ్ళి ఎరుగడు,
తండ్రిని తప్ప, అన్య, స్త్రీ, పురుషులనెరుగడు,
అతడెన్నడూ అన్య వస్తువులగని ఎరుగడు,
దైవవశాన అతడు వేశ్యాస్త్రీలను కాంచెననె, సత్య!
183.
వేశ్యాస్త్రీలు, చిత్రవేషధారులై, మదముతోయుండిరి,
వారంతా మధురస్వరంతో గానము చేయుచుండిరి,
ఋష్యశృంగుని చూచి దరికిజేరి సంభాషించిరి,
అతడి వివరాలెరుగుటకై ప్రశ్నలు సంధించిరి,
వారి అందానికి ఋష్యశృంగుడు విభ్రమచెందెననె, సత్య!
184.
ఋష్యశృంగునికా స్త్రీలపై స్నేహభావం కలిగెను,
అంత అందగత్తెలనెపుడూ కాంచలేదనుకొనెను,
తన తండ్రిని గూర్చి వారికి చెప్పదలుచుకొనెను,
తాను విభండకుని ఔరసుడనని తెలిపెను,
తన పేరు, కర్మయు లోకప్రసిద్ధాలని చెప్పెననె, సత్య!
185.
తమ ఆశ్రమం దాపునేయుందని వేశ్యలకు చెప్పెను,
వారిని తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించెను,
వారికి యథారీతి అతిథిసత్కారం చేతుననెను,
వేశ్యలకునూ ఆశ్రమం చూడాలని కోరిక కల్గెను,
వారు ఋష్యశృంగునితో ఆశ్రమానికి వెళ్ళిరనె, సత్య!
186.
ఋషి, వేశ్యలకు అర్ఘ్యపాద్యాదులనిచ్చి పూజించెను,
కందమూల ఫలములు సమర్పించి సత్కరించెను,
వేశ్యాగణము ఉత్సాహముతో పూజలందుకొనెను,
విభండక మహర్షి వచ్చునేమోయని భీతిల్లెను,
మహర్షి రాకమునుపే వెడలిపోవ తలంచిరనె, సత్య!
187.
వేశ్యలు, ఋష్యశృంగుని ఆనందంతో కౌగలించిరి,
తమతో తెచ్చిన మధుర ఫలములతనికిచ్చిరి,
ఇంకనూ వివిధ భక్ష్యములనతనికి ఇచ్చిరి,
విభండక శాప భయముతో సెలవుగైకొనిరి,
కర్మానుష్ఠాన నెపమున వేశ్యలు వెళ్ళిపోయిరనె, సత్య!
188.
భక్ష్యాలను ఋష్యశృంగుడు ఫలములేయని తినెను,
వేశ్యలు వెళ్ళగనే అతని మది వ్యాకులపడెను,
కలతమనస్కుడై, దుఃఖముతో తిరుగాడెను,
మర్నాడా స్త్రీలను మొదట గాంచిన చోటుకు వెళ్ళెను,
అతడి రాక గమనించి వేశ్యలు సంతసించిరనె, సత్య!
189.
వేశ్యాస్త్రీలు, ఋష్యశృంగుని కలిసి పలకరించిరి,
అతడిని, తమ ఆశ్రమానికి రమ్మని పిలిచిరి,
అతనికి విశేష అతిథిసత్కారం చేతుమనిరి,
అతడంగీకరించగా తమతో తీసుకొని వెళ్ళిరి,
అట్లు ఋష్యశృంగుడు అంగదేశం ప్రవేశించెననె, సత్య!
190.
ఇటు ఋష్యశృంగుడు అంగరాజ్యంలో పాదం మోపెను,
అటు వరుణుడు భువికాహ్లాదమిడుచూ వర్షించెను,
రోమపాదుడు, ఋషికెదురేగి ఆహ్వానం పలికెను,
నమ్రుడై, ఋషికి, సాష్టాంగ ప్రణామమాచరించెను,
అనావృష్టి బాపెనని పూజించి సత్కరించెననె, సత్య!
***

.jpg)

No comments:
Post a Comment