పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -10
బాలకాండ
దినవహి సత్యవతి
141.
బ్రాహ్మణులు కర్మలయెడ ఆసక్తులై యుండిరి,
వేదాధ్యయనం చేయు గుణముతో ఒప్పుచుండిరి,
పరభార్యా విముఖులై, స్వభార్యానురక్తులైయుండిరి,
ఇంద్రియ నిగ్రహవంతులై, దానశీలురై యుండిరి,
తప్పని స్థితిలో మాత్రమే దానము పట్టుచుండిరి, సత్య!
142.
షడంగవేత్త కానివాడూ, వ్రతానుష్ఠానం లేనివాడూ,
దీనుడూ, బాధలుపడువాడు, కలతమనస్కుడూ,
దానము చేయనివాడూ, ఐశ్వర్యము లేనివాడూ,
సౌందర్యహీనుడూ, రాజభక్తి లేని పురుషుడూ,
రాజభక్తి లేని స్త్రీయూ అయోధ్యలో కానరాకుండిరి, సత్య!
143.
అయోధ్యా నివాసితులు నాలుగు వర్ణాలవారు,
పురుషులు, అతిథులనూ దైవాన్నీ పూజించువారు,
సత్యధర్మపరులు, దీర్ఘాయుష్షు కలిగినవారు,
పరాక్రములు, ఉదారులు, శూరత్వం కలవారు,
దారపుత్రపౌత్రాదులతో ఆనందించువారు, సత్య!
144.
క్షత్రియులు బ్రాహ్మణులననుసరించెడివారు,
వైశ్యులు క్షత్రియులను అనుసరించెడివారు,
శూద్రులు స్వధర్మనిరతులై ఉండెడివారు,
మూడు ధర్మముల వారికీ సేవ చేసెడివారు,
మనువువలె, దశరథుడు అయోధ్య పరిరక్షించె, సత్య!
145.
అయోధ్య అగ్నితుల్యులైన మహాయోధులతో,
పౌరుషవంతులు, ధీరులుయైన యోధులతో,
నేర్పరులు, శస్త్ర విద్యానిపుణులైన యోధులతో,
పరాక్రమవంతులు, శూరులైన మహాయోధులతో,
పర్వతగుహవలె నగరి నిండియుండె సత్య!
146.
అయోధ్యలో ఉచ్ఛైశ్రవ సమ ఉత్తమాశ్వాలుండె,
హిమవత్పర్వత ప్రాంతపు మదగజములుండె,
వింధ్యపర్వత ప్రాంతపు మత్తగజములుండె,
ఐరావత, మహాపద్మకులజాత ఏనుగులుండె,
అంజనకుల, వామనకుల జాత గజములుండె సత్య!
147.
భద్రజాతి, మంద్రజాతి, మృగజాతి గజములతో,
మృగమంద్ర జాతీయపు మద గజములతో,
భద్రమంద్ర, భద్రమృగ జాతీయ గజములతో,
భద్రమంద్రమృగ జాతీయ పర్వత గజములతో,
అయోధ్యా నగరి ఎల్లప్పుడూ నిండియుండెను, సత్య!
148.
అయోధ్య, లోపల, వైరికెదిరింప శక్యం కాకుండె,
వెలుపలా ద్వియోజనాలు దుర్భేద్యమైయుండె,
అయోధ్య సార్థక నామధేయ నగరియైయుండె,
శత్రువులందరిని దశరథుడు అణచియుండె,
చంద్రుడు తారలనేలినట్లు అతడయోధ్యనేలె, సత్య!
149.
అయోధ్య ధృఢతోరణాలు, గడియలు కల్గియుండె,
విచిత్రమైన గృహములతో ప్రకాశించుచుండె,
వేలాది జనులతో నిండి మంగళకరమైయుండె,
యథార్థమైన పేరు కలిగిన నగరియైయుండె,
అట్టి అయోధ్యను, ఇంద్ర సముడౌ దశరథుడేలె, సత్య!
******
7 వ సర్గ
దశరథుడి మంత్రులు...
150.
ప్రజ్ఞాదిగుణాలచే మంత్రణమందు సమర్థులు,
ఆకారాదులబట్టి మనసు గ్రహించగలవారలు,
ప్రభువుకు ఇష్టమగు కార్యములు చేయువారలు,
సదా ప్రభువు హితమందు ఆసక్తిగలవారలు,
మేటి అష్ఠమంత్రులు దశరథునకు ఉండిరి, సత్య!
151.
మంత్రులు వ్యవహారదక్షులు, దోషాలు లేనివారు,
లంచముగొననివారు, రాచకార్యమగ్నులైనవారు,
వారే సుమంత్ర, అర్థసాధక, అశోక, మంత్రపాలురు,
జయంత, విజయ, సిద్ధార్థ, ధృష్టి యనువారు,
ఋత్త్విక్కులుగా వసిష్ఠ, వాసుదేవులుండిరి, సత్య!
152.
మహాబుద్ధిశాలురు, ధృఢపరాక్రమవంతులు,
అకార్యములు చేయుటకు సిగ్గు చెందువారలు,
నేర్పుకలవారు, ఇంద్రియనిగ్రహం కలవారలు,
ఐశ్వర్యవంతులు, శాస్త్రజ్ఞానం కలిగిన వారలు,
దశరథుని మంత్రులందరూ కీర్తిమంతులు, సత్య!
153.
చెప్పిన విధముగా కార్యములు చేయువారు,
తేజోవంతులూ, కీర్తి, ఓర్పు కలిగినవారు,
చిరునగవులు చిందిస్తూ సంభాషించువారు,
ఏకాగ్రచిత్తులు, వ్యవహారదక్షత గలవారు,
మహావీరుడు దశరథుని మంత్రులుగా యుండిరి, సత్య!
154.
ప్రలోభాలకు లొంగి అసత్యమాడనివారు,
పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థయున్నవారు,
రాజుచే పరీక్షితులైన స్నేహితులుగలవారు,
నేరస్థుల్ని శిక్షించుటలో వివక్ష చూపనివారు,
శత్రువైనా నిరపరాధిని హింసించనట్టి మంత్రులు, సత్య!
155.
రాజ్యధనాగారం నింపుట, సైన్యము సమకూర్చుట,
రాజశాస్త్ర ప్రకారము కార్యానుష్ఠానము చేయుట,
వీరులై, సత్పురుషులను ఆపదలనుంచి కాచుట,
బ్రాహ్మణ, క్షత్రియుల బాధలు తీర్చి, కోశం నింపుట,
చలించని ఉత్సాహంతో చేసేరు దశరథ మంత్రులు, సత్య!
***
No comments:
Post a Comment