మంచు తెరలు - 1 - అచ్చంగా తెలుగు

మంచు తెరలు -  1

(పెద్ద కథ)

పద్మావతి అన్నా పంతుల.

 



ఎండా కాలం. ఎండ నిప్పులు చెరుగుతున్నాది .పొద్దుట తొమ్మిది గంటలకే ఎండ చాలా తీవ్రంగా వుంది. భగవతం  గారు తన ఛాంబర్ లో ac గదిలో కూర్చుని వున్నారు. ముక్కు మీదకి జారిన కళ్ళ జోడు సవరించు కొని, చేతిలో వున్న దస్తావేజులు పరిశీలిస్తున్నారు. పక్కన వున్న అలమరాలో లా పుస్తకాలు నీట్ గా సర్డబడి వున్నాయి. టేబుల్ మీద దస్తావేజులు దొంతిగా వున్నాయి. అవి ఆరోజుకి సంభందించిన కేసు తాలూకా ఫైల్స్. అతని అసిస్టెంట్ టేబుల్ ముందు కూర్చుని కొంత మ్యాటర్ ని టైప్ చేస్తున్నాడు.

కొంచం దూరంలో ఒకతను కూర్చుని వున్నాడు. అతని వేష దారణని బట్టి అతనొక పల్లెటూరి రైతు  అని తెలుస్తున్నది. ముతక పంచ, ఖద్దరు లాల్చీ ధరించి వున్నాడు.

భగవతం గారు పేరు మోసిన క్రిమినల్ లాయర్. అతను చేపట్టిన ఏ కేసు ఐనా గెలవ వలసిందే. అతను అన్ని కేసులు తీసుకోరు. న్యాయము , ధర్మము గల కేసు లు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. 

కూర్చున్న ఆ పల్లెటూరి అతనిని చూసి “బుచ్చయ్య నీ కేసు మనం తప్పకుండా గెలుస్తాము. నువ్వు భయం పడకు  న్యాయం మనవేపే వుంది” అన్నారు.

బుచ్చయ్య లాయర్ గారికి దండం పెట్టీ “మీ దయ బావూ , ఈ కేసు గెలవక పోతే నా కుటుంబం మలమలా మాడి పోతారు. మా అన్నయ్య నాకు రాసిన పొలం ఎక్కడినుండో  పైదేశాలనుంచి వచ్చి మా అన్న కొడుకు వాడిది అంటూ నామీద కేసు పెట్టెడు. ఎంత ఐనా వాడు వారసుడు కదా అందుకు నాకు భయం బాబు” అన్నాడు బుచ్చయ్య. 

“వాడు ఎంత వారసుడు ఐనా ఒకసారి నీకు రాసి ఇచ్చినది వెనక్కి తీసుకో లేరు. రాసి ఇచ్చిన మీ అన్న లేడు. అతను రాసిన కాగితాలు పక్కాగా వున్నాయి. మనమే గెలుస్తాం” అన్నారు భగవతం గారు.

 ”ప్రసాద్ కోర్టుకి టైమ్ అవుతున్నాది. బుచ్చయ్యని తీసుకుని మీరు కోర్టు కి వెళ్ళండి. నేను భోజన చేసి కోర్టు కి వస్తాను “అన్నారు.

ప్రసాద్ తల వూపి బుచ్చయ్య ని తోడ్చుకొని వెళ్లి పోయేడు.

భగవతం, భగవతం” అని పిలుస్తూ బైట నుండి ఒకతను లోపలికి వచ్చేడు. అతను పంచే, లాల్చీ వేసుకుని, భుజం మీద కండువా వేసుకున్నాడు. మనిషి లావుగా వున్నాడు కానీ బుర్ర మాత్రం చిన్నది గా వుంది. కళ్ళు కూడా చిన్నవే. చూడడానికి మనిషి కొంచం వింత గానే వున్నాడు.

అమ్మయ్య, భగవంతం, ఉన్నావా” అన్నాడు.

“భగవంతం గారు వీడు ఇప్పుడు ఎందుకు వచ్చేడు, కోర్టు కి టైమ్ అవుతూ వుంటే” అనుకున్నారు మనసులో.

నువ్వా  అచ్చు తం రా” అన్నారు.

ఆ నేనే, మూడురోజుల నుండి వస్తున్నాను ఇప్పటికీ దొరికేవు” అన్నారు అచ్చుతం గారు.

ఏమిటి విశేషం ఏదైనా కేసు  వున్నాదా.” అడిగేరు భగవతం గారు. 

అబ్బా ఎప్పుడు కోర్టులు కేసుల గొడవేనా నీకు. నీ కొడుక్కి ఒక మంచి సంబందం తెచ్చాను” అన్నారు అచ్చుతం గారు. 

ఒహో అలాగా! చెప్పు చెప్పు నచ్చితే కుదుర్చు కుందాము “అన్నారు భగవతం గారు.

వాళ్ళు బాగా వున్న వాళ్ళేను. తండ్రి రైల్వే లో పని చేస్తున్నాడు. అమ్మాయి బీఎస్సీ పాస్ అయి ఎంఎస్సీ లో జాయిన్ అయింది.” చెప్పేడు అచ్యుత రామయ్య.

ఇంతకీ మీ గోత్రం ఏమిటి అన్నావు” అన్నాడు అచ్చుతం.

నేనేమీ అనలేదురా” అన్నారు భగవంతం గారు.

చాలు లేరా నువ్వు నీ జోకులును.” అన్నారు అచ్చుతం గారు నవ్వుతూ.

మాగోత్రం హరితస.”

హరితస గోత్రమా, అన్నాన్న ఎంతపని ఐపోయింది. స్వ గోత్రీకులు అయిపోతారు. వాళ్ళది కూడా హరితశ  గోత్రమే. కుదరదు గాక కుదరదు” అన్నారు నోచ్చు కుంటూ.

పోనీ లేరా నువ్వు బాధ పడకు. కుదిరి నప్పుడే కుదురుతుంది. నువ్వు ఇంక బైలు దేరు నాకు కూడా కోర్టు కి టైమ్ అవుతున్నది” అని లేచేరు భగవతం గారు.

సుమిత్ర తలగడాలకి   గలేబులు మారుస్తున్నది. వచ్చిన చట్టాలు రెండు రోజులు వుండి ఆ రోజు మధ్యాన్నమే వెళ్లి పోయేరు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తె వాళ్ళు రెండురోజులు ఉండి తమ  పక్కలు వాడితే వాళ్ళు వెళ్లగానే దుప్పట్లు గలేబులు మార్చడం సుమిత్ర కి అలవాటు. కొంతమంది దగ్గర బంధువులు ఐతే, కొంతమంది దూరపు బంధువులు కోర్టు పనుల మీద వచ్చి వీళ్ళ ఇంటిలోనే  తిష్ట వేస్తారు. వచ్చిన వాళ్ళని పొమ్మనలేక, అవస్తలు పడుతుంది సుమిత్ర. ఈ సారి వచ్చిన వాళ్ళు భగవతం స్నేహితులు. వాళ్ళు పిల్లలతో సహా వచ్చి ఇల్లు పీకి పందిరి వేశారు.వాళ్ళు వెళ్ళేరు.ఇల్లు ప్రశాంతం గా ఉంది.

బట్టలు మార్చి సుమిత్ర కిటికీ దగ్గరికి వచ్చింది. కిటికీ లోంచి చందమామ  పెద్దగా కనిపిస్తున్నాడు.ఆరోజు పౌర్ణిమ. వెన్నెల గదిలో పడి ఆ కాంతి కిరణాలు గది అంతా పరచుకున్నాయి. సుమిత్ర గదిలోని లైట్ తీసేసింది. ఇప్పుడు చంద్రుడి వెన్నెల మరింత అందంగా గది అంతా పరచుకుంది. నిర్మల ఆకాసంలో చంద్రుడు పెద్ద బంతిలా ఉన్నాడు. తను విజ్జి ఎప్పుడూ పున్నమి రోజు వెన్నెలలో కూర్చుని భోజనం చేసే వాళ్ళు. విజ్జి నీ తలచుకో గానే ఆమె మనసు  కొంచం వికలం అయింది.. ఇరవై రెండో ఏడు ఇది విజ్జి ఇల్లు విడిచి. ఎలా ఉందో అనుకుంది.

హాల్ లోకి వచ్చింది. భగవతం గారు టీవీ లో వార్తలు చూస్తున్నారు. సుమిత్ర అతనికి వక్కపొడి భరణి ఇచ్చింది.న్యూస్ ఐపోయింది. టీవీ ఆఫ్ చేసి సోఫాలో కూర్చుని "ఇవాళ అచ్యుతం వచ్చేడు ఛాంబర్ కి. మన సురేష్ కి ఏదో పెళ్లి సంబంధం తెచ్చేడు. పెళ్లి వారిది మనది ఒకటే గోత్రం. నిరాశగా వెళ్లి పోయేడు” అన్నారు భగవతం గారు. 

అబ్బా! ఎన్ని సంబంధాలు తెస్తాడండీ అతను. మన సురేష్ ఏమో పెళ్ళి ఊసు ఎత్తతే ఇంత ఎత్తున లేస్తాడు” అంది సుమిత్ర.

ఆ వాడికి అదొక సరదా. నువ్వలా విసుగు కుంటే ఎలా,” అన్నారు నవ్వుతూ.

"అబ్బా మీ స్నేహితుడిని ఏమీ అనలేదు మహాను బావా” అంది సుమిత్ర.

 ఇంతలో వీధి తలుపు కొట్టిన చప్పుడు అయింది.

ఎవరు వచ్చి ఉంటారు ఈ వేళలో” అనుకుంటూ తలుపు తీయడానికి లేచింది.

ఇంకెవరు నీ సుపుత్రుడే అయి ఉంటాడు. వాడికి ఈ మధ్య తిరుగుళ్ళు ఎక్కువ  అయేయి” అన్నారు భగవంతం గారు.

వెళ్ళబోతున్న సుమిత్ర ఆగి మీ మతి మరుపుకి జోహార్లు.ఇందాకే కదా వాడు మీతో భోజనం చేసేడు. వాడు వాడి గదిలోనే వున్నాడు” అంది సుమిత్ర.

వీధి తలుపు మళ్ళా చప్పుడైంది. సుమిత్ర వెళ్ళి తలుపు తీసింది.తలుపు వెనక ఒక అమ్మాయి నిలుచుని వుంది. ఆ అమ్మాయి పక్కనే ఒక పెద్ద సూట్కేస్,ఒక సంచి ఉన్నాయి. భుజానికి ఒక హ్యాండ్ బ్యాగ్ వెళ్ళాడుతున్నాది. “ఎవరమ్మా నువ్వు” అడిగింది సుమిత్ర.

ఇది భగవతం గారి ఇల్లె నా“ అడిగింది ఆ వచ్చిన అమ్మాయి.

అవును, కానీ ఈ వేళలో అతను క్లైంట్స్ ఎవరినీ చూడరు” అన్నా ది సుమిత్ర.

"నేను క్లయింట్ ను కాదండి నన్ను కొంచం ఇంట్లోకి  అనుమతిస్తే అన్ని చెపుతాను” అని అన్నది ఆ అమ్మాయి.

సుమిత్ర కొంచం తొలిగి ఆ పిల్ల రావడానికి చోటు ఇచ్చింది.

తన లగేజి నీ ఒక మూల పెట్టీ   కొంచం మంచి నీళ్ళు ఇస్తారా” సుమిత్ర ను అడిగింది ఆపిల్ల.

సుమిత్ర లోపలికి వెళ్ళి గ్లాస్ తో నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

 చాలా  ఆతృతగా నీళ్లుతాగింది. తాగడం ముగించేకా ఒక్క క్షణం సేదతీర్చుకుని, నాపేరు నీహారిక” అంది ఆ అమ్మాయి.  

సుమిత్ర ఆపిల్లని పరీక్షగా చూసింది. బట్టలు మురికిగా ఉన్నాయి ముఖం వాడిపోయి అలసట స్పష్టం గా  కనిపిస్తున్నది ఆమెలో.

"నాపేరు నీహారిక” అంది ఆ అమ్మాయి.

ఇందాక చెప్పావ్ కదా” అంటూ “అసలు ఎవరునీవు” ప్రశ్నించింది సుమిత్ర.

మా అమ్మా నాన్న కరోనాతో    చ్చి పోయేరు. అమ్మ పోయే ముందు నన్ను మీ ఇంటికి వెళ్లి వుండ మన్నది. నేను ఇక మీదట ఇక్కడే ఉండాలి అని చెప్పింది” అంది నీహారిక.

సుమిత్ర అయోమయంగా ఆ పిల్లని చూసింది. భగవతం గారు కూడా అక్కడే ఉన్నారు. లాయర్ కదా ఆ పిల్లని ప్రశ్నించడం మొదలు పెట్టాడు.

నీ పేరు సరే. నీహారిక.నువ్వు ఎక్కడినుంచి వస్తున్నావు?”

రాజమండ్రి నుండి. నన్ను ఆదరించే వారు మీరు తప్ప ఎవరు లేరని అమ్మ చెప్పింది.” అంది నీహారిక

సరే అమ్మాయి మీ అమ్మ చెప్పింది బాగుంది కానీ, ఇది అనాథ ఆశ్రమం కాదే ఎవరు పెడితే వాళ్ళు వచ్చిఉండే దానికి.” అన్నారు భగవతం గారు. 

నాకు తెలుసు సార్, మీరు వుండగా నేను అనాధని ఎలా అవుతాను” అంది నీహారిక.

భగవతం గారు తికమక గా ఆపిల్లవేపు చూసేరు. తను ప్రశ్నలు అడిగే తీరు అది కాదు అనుకున్నారు. ఇందాకటి నుండి మా అమ్మ ఇక్కడే ఉండాలి అన్నది అంటున్నది. తను ఆపిల్ల తల్లి పేరు అడగలేదు. అనుకొని “సరే అమ్మాయి మీ అమ్మపేరు చెప్పు” అన్నారు.

మా అమ్మ పేరు విజయ లక్ష్మీ, నాన్న పేరు రాజ్ కుమార్.  మీరందరూ అమ్మని విజ్జి అంటారు” అని అన్నది నీహారిక.

విన్న భగవతం గారు సుమిత్ర దిగ్భ్రాంతి చెందారు. సుమిత్ర ఒక అడుగు ముందుకు వేసి నువ్వు  మా విజ్జి కూతురివా” అంది.

అవును. అమ్మా నాన్న గారు కరోనాతో చనిపోయేరు. ముందు నాన్నగారు తరవాత అమ్మ,”అంది నీహారిక.

ఏమిటే విజ్జి పోయిందా, చనిపోయిందా” అంటూ  అయ్యో అని బిగ్గరగా  ఏడ్చే రు.. భగవతం గారు ఎప్పుడు అలాగ ఏడవని భర్తని చూసి సుమిత్ర కూడా కళ్ళ నీళ్ళు  పెట్టుకుంది.

ఆత్మీయులను చూడగానే నీహారిక కూడా ఏడిచింది. సుమిత్ర నీహారికని పొదివి పట్టుకుని ఓదార్చింది. కొంత సేపటికి అందరూ దుఃఖం నుండి కొంచం తేరుకొన్నారు.

భగవతం గారు ”సుమిత్ర తరవాత మాట్లాడుకుందాము .ముందు ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా పెట్టు” అన్నారు. సుమిత్ర నీహారికని లోనికి తీసుకు వెళ్ళింది.

(సశేషం)

 

No comments:

Post a Comment

Pages