పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -3 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -3

Share This

 పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -3 

బాలకాండ

దినవహి సత్యవతి


 
31.
వారిని, వారి అనుచరులైనట్టి సకలరాక్షసులను,
జనస్థానంలోని పధ్నాలుగువేల రాక్షసులను,
దండకారణ్యంలో నివసించే కాలమందును, 
రాముడు యుద్ధమునందు సంహరించెను, 
జ్ఞాతుల మరణమెరింగి రావణుడు కోపించెననె, సత్య! 
32.
 రావణుడు, మారీచుని సాయము కోరెను, 
మారీచుడు, రామునితో వైరము వలదనెను, 
 రావణుడు, మారీచుని మాటలు వినకుండెను, 
మారీచునితో రాముని ఆశ్రమమునకు వెళ్ళెను, 
మాయలేడిగా పర్ణశాల ప్రవేశించె మారీచుడనె, సత్య! 
33.
మాయలేడిని చూసి సీత నిజమని భ్రమించెను,  
రాముని ఆ లేడిని తెచ్చియిమ్మని సీత కోరెను, 
లేడి, రామలక్ష్మణులని దూరంగా గొనిపోయెను,  
రావణుడు మారువేషంలో సీతను ఎత్తుకెళ్ళెను,
అతడి దుష్కార్యాన్ని జటాయువు అడ్డగించెననె,  సత్య! 
34.
రామునికి వార్త చెప్పి, జటాయువు మృతుడయ్యెను, 
సీతాపహరణ వార్త విని రాముడు దుఃఖించెను,  
 జటాయువుకు దహనసంస్కారములు చేసెను,
 సీతను వెదుకుచూ లక్ష్మణునితో సాగిపోయెను, 
మార్గంలో రాక్షస కబంధుడు వారినడ్డగించెననె, సత్య! 
35.
వికృతాకార కబంధుని రాముడు సంహరించెను, 
కబంధుడు చనిపోతూ, శబరిని కలవమనెను, 
రాముడు, ధర్మమూర్తి శబరి ఆశ్ర్రమముకేగెను,
శబరి, రాముని చూసి చక్కగా పూజలు చేసెను,
శబరి సేవలంది రాముడు ముందుకు సాగెననె, సత్య!  
36.
రాముడు పంపాసరోవర తీరము చేరెను, 
అచట హనుమంతుడు పరిచయమయ్యెను,
హనుమ మాటపై సుగ్రీవునితో  స్నేహం చేసెను, 
తన కథ, హనుమ సుగ్రీవులకు, వినిపించెను, 
రాముడు ప్రత్యేకించి సీత వృత్తాంతము చెప్పెననె, సత్య! 
37.
 అగ్నిసాక్షిగా రామసుగ్రీవుల స్నేహం కలిసెను, 
వాలిసుగ్రీవుల విరోధం గూర్చి రాముడడిగెను, 
సుగ్రీవుడు దుఃఖించుచూ ఆ వృత్తాంతం తెలిపెను,
వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను,  
సుగ్రీవుడు, రాముని బలం పరీక్షింపదలచెననె, సత్య! 
38.
కొండవంటి దుందుభి మృతదేహం రామునికి చూపెను,
దాన్ని రాముడు కాలిబొట్టవ్రేలితో దూరం విసిరెను,  
సుగ్రీవునికింకనూ నమ్మకం కలిగింపదలచెను,  
ఏకబాణంతో మద్దిచెట్లు, పర్వతము కూల్చెను,   
పాతాళం ఛేధించి సుగ్రీవునికి నమ్మకం కూర్చెననె, సత్య!  
39.
రాజ్యం తిరిగి లభించునని సుగ్రీవుడు తలచెను, 
రాముని వెంటనిడుకొని కిష్కింధకు వెళ్ళెను, 
వాలిని  రప్పించుటకై  సుగ్రీవుడు గర్జించెను,
ఆ మహానాదం విని వాలి బయటకు వచ్చెను,
యుద్ధానికి వెళ్ళొద్దని వాలిని, తార వారించెననె, సత్య !
40.
తారను ఒప్పించి వాలి యుద్ధమునకు వెళ్ళెను, 
అంతట రాముడు ఒక్క బాణంతో వాలిని చంపెను,
సుగ్రీవుని, వానర రాజ్యానికి రాజుగ జేసెను,
సుగ్రీవుడంత సీతాన్వేషణకై  వానరులనంపెను,  
మహాబలశాలి హనుమ, సంపాతిని కలిసెననె, సత్య!  
41.
గ్రద్దరాజు సంపాతి పలుకులు, హనుమ వినెను, 
నూరుయోజనాల లవణసముద్రము దాటెను, 
హనుమంతుడు, రావణరాజ్యము లంక చేరెను, 
అచట హనుమ, అశోకవనంలో సీతను చూచెను, 
సీత, రాముని ధ్యానించుట హనుమ కాంచెననె, సత్య! 
42.
సీతకు, రామసుగ్రీవుల మైత్రి గూర్చి తెలిపెను, 
రాముడు ఆమెకిమ్మన్న అంగుళీయకమిచ్చెను, 
సీతను ఊరడించి వనపుబహిద్వారం చేరెను, 
అట సేనాగ్రనాయకులు, మంత్రిపుత్రుల వధించెను,  
శూరుడౌ అక్షకుమారుని వధించె హనుమయనె, సత్య! 
43.
హనుమ చర్యకు ఇంద్రజిత్తు కోపించెను, 
హనుమంతునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించెను, 
బ్రహ్మాస్త్రముకు హనుమంతుడు కట్టుబడెను,
హనుమంతుడు బ్రహ్మ వరప్రసాదియనెను,   
కావున బ్రహ్మాస్త్రమతడిని వీడెననె నారదుడు, సత్య! 
44.
     దైత్యులు తనను త్రాళ్ళతో కట్టుట హనుమగనెను, 
తననీడ్చువారిని చంప సమర్థుడై యుండెను, 
కానీ రావణుని చూచుటకై ఆ బాధను సహించెను,  
రావణుగలిసిన పిమ్మట లంకను దహించెను,  
సీతయున్న అశోకవనం మాత్రము కాల్చలేదనె, సత్య! 
45.
లంకను వీడి, హనుమ, రామునివద్దకు వెళ్ళెను,
రామునికి ప్రదక్షిణ నమస్కారములు చేసెను, 
సీతను చూచితినని యథార్థముగా విన్నవించెను,  
అంత రాముడు, సుగ్రీవునితో సముద్రతీరం చేరెను, 
 సముద్రుడు వశం కానందున రాముడు కోపించెననె, సత్య! 

No comments:

Post a Comment

Pages