పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం
బాలకాండ
దినవహి
సత్యవతి 
 1 వ సర్గ
 నారదుడు, వాల్మీకికి, రామాయణ కథ
సంక్షిప్తంగా చెప్పుట... 
1.
వేదాధ్యయనములో బహు ఆసక్తిగలవాడు,  
వేదార్థమునెరిగిన
వారిలో  అగ్రగణ్యుడు, 
          తపోసంపన్నుడు, మునులందరిలో గొప్పవాడు,  
          శ్రీమన్నారాయణుని
భక్తులలో వరిష్ఠుడు,  
నారదుడు, వాల్మీకికి, రామకథ వినిపించె,
సత్య! 
2.
మంచి గుణములు, పరాక్రమమూ కలిగినవాడు,  
సత్యవాక్పరిపాలకుడు, ధర్మనిరతుడైనవాడు, 
కృతజ్ఞుడును, ధృఢసంకల్పము కలిగినవాడు, 
భూలోకములో మహాపురుషుడనదగినవాడు, 
ఎవరని, దేవర్షి నారదుని,
ప్రశ్నించె వాల్మీకి, సత్య!
3.
మంచి నడవడిక కలిగి, విద్వాంసుడైనవాడు, 
సర్వప్రాణులకు హితమునాచరించెడివాడు, 
అసాధ్యమౌ కార్యాలు సాధించు సమర్థుడు,  
కాంచు వారందరికీ ఆనందము
కలిగించువాడు,
అట్టి మహాపురుషుడెవరని
ప్రశ్నించె, వాల్మీకి, సత్య! 
4.
కోపమును గెలిచినవాడు, ధైర్యము కలవాడు, 
ప్రశస్తమైన కాంతి కలిగి, అసూయ లేనివాడు, 
దేవతలను సైతం యుద్ధాన
జయించగలవాడు, 
సకల సద్గుణ సంపన్నుడైన
మానుషరూపుడు,
సమర్థుడైన వ్యక్తి ఎవరని  ప్రశ్నించె,
వాల్మీకి, సత్య! 
5.
అట్టి గుణాలున్న మనుష్యుని
గురించి అడిగెను,     
తెలుసుకోగల సమర్థుడు
నారదుడని పలికెను,    
ఆ విషయం తెలియగోరుచుంటినని
వాల్మీకియనెను,      
నారదుడు ముల్లోకాల గూర్చి
యెరిగియుండెను, 
వాల్మీకి ఉత్సుకతగని
నారదుడు సంతసించెను,  సత్య! 
6.
ఇక్ష్వాకు కులమున జన్మించిన
ధైర్యవంతుడు, 
కాలప్రసిద్ధుడు, మనోనిగ్రహము ఉన్నవాడు, 
గొప్ప పరాక్రమవంతుడు, తేజస్సుగలవాడు, 
ఇంద్రియములను వశములో
ఉంచుకున్నవాడు,
ఉత్తమ పురుషుడు, రాముడనె, నారదుడు, సత్య! 
7.
విశాలమూపులు, దీర్ఘబాహువులు కలవాడు, 
బుద్ధి, నీతి, వాక్పటిమ,
ఐశ్వర్యము కలవాడు, 
విశాల వక్షస్థలము, నునుపు చెక్కిళ్ళు కలవాడు, 
శంఖుకంఠము, మంచి శిరస్సు, లలాటం
కలవాడు, 
గొప్ప ధనుస్సున్నవాడు  రాముడనె, నారదుడు, సత్య! 
8.
సుందర శరీరసౌష్ఠవముతో
శోభిల్లువాడు, 
స్ఫురద్రూపి, చక్కటి మేని ఛాయగలవాడు, 
విశాల నేత్రములు, అవయవ శోభగలవాడు, 
సాముద్రిక శాస్త్రానుసారం
శుభలక్షణాలవాడు, 
తేజస్వి, శ్రీరాముడని, పొగిడెను
నారదుడు, సత్య! 
9.
యశస్వి, సకలధర్మములు తెలిసినవాడు,
ప్రజాహితైషుడు, ఆడినమాట తప్పనివాడు,
విషయజ్ఞానమున్నవాడు, కల్మషం లేనివాడు, 
శ్రీమంతుడు, ధర్మరక్షకుడు, శత్రువినాశకుడు,  
బ్రహ్మదేవునితో సమానము
రాముడనె, నారదుడు,  సత్య! 
10.
సమస్త ప్రాణి సముదాయమును
రక్షించువాడు,
వేదవేదాంగాల రహస్యాలు
తెలిసినవాడు, 
సాధుస్వభావుడు, ధనుర్వేదములో ప్రావీణ్యుడు,
ప్రతిభావంతుడు, శాస్త్రాల సారమెరిగినవాడు,  
సకల ప్రజలకు ఇష్టుడు రాముడనె, నారదుడు, సత్య! 
11.
జ్ఞాపకశక్తి కలవాడు, దైన్యమెరుగనివాడు, 
ఆర్యుడు, పనులయందు మంచి నేర్పుకలవాడు,
సత్పురుషులు కొలుచువాడు, సమవర్తనుడు, 
దర్శనమాత్రమున
ఆనందమొసగెడివాడు, 
కౌసల్యానంద వర్థనుడు రాముడనె, నారదుడు, సత్య! 
12.
సముద్రమువంటి గాంభీర్యము
కలిగినవాడు, 
ధైర్యములో
హిమవత్పర్వతమువంటివాడు, 
మదిలోని భావాలను
గ్రహింపనీయనివాడు, 
ఎవరూ కదల్పలేని మానసిక
స్థైర్యమున్నవాడు,
ఓర్పులో భూమితో సమము రాముడనె, నారదుడు, సత్య! 
13.
 పరాక్రమములో విష్ణువుతో సమానుడు, 
చూపరులకు మోదమిచ్చుటలో  చంద్రుడు, 
క్రోధము వచ్చిన
ప్రళయకాలాగ్ని సమానుడు, 
దానము చేయుటలో కుబేరుని
వంటివాడు,
సత్యంలో రెండవ ధర్మదేవతే
రాముడని పలికె, సత్య! 
14.
దశరథుడు ప్రజల హితము
చేయుటకని,
పరాక్రమవంతుడిని, సద్గుణసంపన్నుని, 
ఎల్లప్పుడు ప్రజల హితము
కోరెడువాని, 
తనకు ప్రీతిపాత్రుడు
జ్యేష్ఠసుతుడు రాముని 
 యువరాజు చేయగొరెనని, నారదుడు పలికె,
సత్య!  
15.
 దశరథమహారాజుకి ముగ్గురు రాణులు, 
 కౌసల్య, సుమిత్ర, కైకేయిలనువారలు, 
 కైకకిచ్చెను దశరథుడు మూడు వరాలు, 
కైక చూసి రాముని అభిషేకపు
సంబరాలు, 
 పతిని
వరములిమ్మని కోరెననె, నారదుడు, సత్య!  
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment