కొన్ని ప్రేమలిలాక్కూడా... - అచ్చంగా తెలుగు

కొన్ని ప్రేమలిలాక్కూడా...

Share This
కొన్ని ప్రేమలిలాక్కూడా...
(మా నర్సాపురం కథలు)
భావరాజు పద్మిని




కార్తీక పున్నమి...

పెతేడాదిలానే ఈ ఏడాది కూడా పేరుపాలెం బీచ్ లోని హనుమంతుని ఇగ్రహం వొద్ద అన్నదానం జరుగుతాంది. 

ఏర్పాట్లన్నీ చేసిన యాభైయేళ్ల మల్లిక మాత్రం మౌనంగా, ఓ కొబ్బరిచెట్టు నీడలో కూచుని సముద్రం కేసే సూత్తాంది. ఆమె‌ కళ్లనిండా నీళ్లు... పాతికేళ్లు దాటినా ఆమె‌ గుండెలో ఆరని మంట, ఇంకా రగులుతానే ఉంది.

ఆ సాయంకాలం బాగా ముసురుబట్టింది. గత జ్ఞాపకాలన్నీ ఆమె మనసులో సరిగ్గా అలాగే ముసురుకున్నాయి. 
***
రాయ్ పేటలో మల్లికా వాళ్లది పెద్ద డాబా ఇల్లు. వాళ్లింటికి రెండు వీధులవతల వాళ్ల అత్తయ్య కమల వాళ్లిల్లు! అదేంటో, చిన్నప్పటి నుండి మల్లిక తనింట్లో కంటే అత్తయ్య ఇంట్లోనే ఎక్కువుండీది. అత్తయ్య ఒక్కగానొక్క కొడుకు, బావ మనోహర్ అంటే చానా ఇష్టం మల్లికకి‌. అతనితో ఆటలాడడం మరీ ఇష్టం.  

నర్సాపురంలో టేలర్ హైస్కూల్ 150 సం.లకు పైగా చరిత్ర కలిగినది. ఈ ఉన్నత పాఠశాలను 1852లో బ్రిటిష్ విద్యావేత్త మరియు స్థానిక రెవెన్యూ అధికారి హెచ్. టేలర్ స్థాపించారు 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామ రాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వంటి ప్రముఖులు చదివిన స్కూలిది. మనోహర్ అక్కడ ఎనిమిదో తరగతి చదువుతాంటే, మల్లిక ఏడోతరగతి చదివీది. ఆ స్కూల్ ప్రాంగణం విశాలమై‌న ఆట స్థలాలతో, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండీది. స్కూల్ ప్రవేశద్వారం వద్ద ఉండే రావి, కొబ్బరి, కాడమల్లి పూల చెట్లు చాలా బాగుండీవి. స్కూల్ బెల్ కొట్టినప్పుడు సంచీ నిండా నేలరాలిన కాడమల్లిపూలు ఏరుకోవడమంటే చానా ఇష్టం మల్లికకి. 

స్కూలయ్యాకా సాయంత్రం బావా వాళ్లతో కలిసి గుంపుగా గోదారొడ్డుకు వెళ్లేవారు. అక్కడెన్ని కబుర్లో! బావ స్నేహితులు రవణ, బాబి, శంబు లైతే, వాళ్లమ్మలకి తెలీకండా స్కూలు బాగులో టవలు, బట్టలజత కూరుకొచ్చీవోళ్లు! గోదాట్లో దూకి ఈతకొట్టి, తర్వాత ఏవెరగనట్టు తలతుడుచుకుని, స్కూలు బట్టలేసుకునేటోళ్లు. వోళ్లెంత దాచినా తడిబట్టల్జూసి వాళ్లమ్మలు ఇసయం పట్టీసి చెవులు మెలిపెట్టోసేవోళ్లు. 

బాబి చెల్లెలు నాగవల్లి, మల్లిక మంచి దోస్తులు. మగపిల్లలు ఈతలు కొడతా, నీళ్లు జల్లుకుంటా బండల్లరి జేస్తాంటే, వల్లి, మల్లిక ఇసకలో గవ్వలేరుకుంటా, స్కూల్ బాగ్ లో మల్లిక తెచ్చిన కాడమల్లె పూలతో జడలల్లుకుంటా, కబుర్లు చెప్పుకుంటా తిరిగేవోళ్లు. అప్పుడప్పుడు పడవ రావుడు తాతని బతిమాలి, గోదాట్లో షికారు కొట్టేవోళ్లు.

మనోహర్ కి ఈత మీద ధ్యాస తక్కువ, ప్రకృతి ఆరాధన ఎక్కువ. అందుకే రెండు రౌండ్లు ఈత కొట్టీసి, ఒడ్డుకొచ్చి కూకుని, సఖినేటిపల్లి లంకల్లో పచ్చగా కనిపించే రెల్లుగడ్డిని, కొబ్బరి తోటల్ని, దూరంగా తేల్తాన్న పడవల్నీ సూస్తా కూచునీవోడు‌. అప్పుడే ఓ పాటందుకునీది మల్లిక! ఎందుకంటే, మనోహర్ కి ప్రకృతంటే ఎంతిష్టవో, మల్లిక పాటంటే అంతకంటే ఎక్కువిష్టం! అందుకే బావ మనసు కనిపెట్టి, అడక్కుండానే పాడేది. పాటవింటా పరవశంగా తలూపేవాడు మనోహర్.

మలిసంజెలో అక్కడ దొరికే పిడతకింద పప్పు, బజ్జీలు, తింటా కుంగుతున్న సూర్యుని సూస్తా, కాసేపటూ ఇటూ తిరిగాకా, మెల్లిగా నడుచుకుంటా ఇంటిదారి పట్టీవారు పిల్లలంతా. దాదాపు రోజూ ఇదే పద్ధతి. తీర్థాలయ్యీ జరిగినప్పుడైతే జీళ్లు, రంగులరాట్నాలు, ఆటబొమ్మలు ఈటన్నిటితో ఒహటే సందడి!

టేలర్ స్కూల్ తో వోల్లకి ఎన్ని జ్ఞాపకాలో! స్కూల్ వార్షికోత్సవానికి స్టేజి మీద మల్లిక పాట పాడిందంటే, ప్రైజు దక్కాల్సిందే! చదువులో పరుగు పందాల్లో, మార్చ్ ఫాస్ట్ పోటీల్లో మనోహర్ దే పైచేయి! బావామరదళ్లిద్దరూ ఉన్న బహుమతులన్నీ కొట్టుకుపోతున్నారని అంతా ఆటపట్టించీవోరు.

స్కూల్ ముగిసాకా, ఇద్దరూ ఇంటరు, డిగ్రీ చదువుల కోసం నర్సాపురం వె.ఎన్.కాలేజీలో చేరారు. నర్సాపురం లో పైచదువులు లేక పిల్లలంతా చదువాపేసో, వేరే ఊళ్లకెళ్లో ఇబ్బంది పడతాంటే ఎర్రమిల్లి నారాయణమూర్తిగారు 1949లో మొదట 'ది నర్సాపూర్ కాలేజ్' అనే పేరుతో ఈ కాలేజీ పెట్టారు. వారి కృషిని చూసి, అప్పటిదాకా డచ్ భవంతిగా ఉ‌న్న సబ్ కలక్టర్ బంగ్లాని, ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. నెమ్మదిగా 14 ఎకరాల విస్తీర్ణానికి పాకిన ఈ కాలేజీలో చదువుతో పాటు, జిం, లైబ్రరీ, బాస్కెట్ బాల్ కోర్టు, షటిల్ కోర్టు వంటి అధునాతన సౌకర్యాలుండీవి. చదువుతో పాటు విద్యార్థుల సార్వత్రిక అభివృద్ధికి బాటలు పరచిన గొప్ప కాలేజీ ఇది. ముఖ్యంగా కాలేజీ తరఫున ఏవైనా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు జరిగినప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవోడు మనోహర్. 

పిల్లతనం పోకపోడం వల్ల కాలేజీ ముంగిట ఎడంపక్కనున్న చెరువులో కాళ్లు పెట్టి అల్లల్లాడిస్తూ స్నేహితురాళ్లతో కబుర్లాడడం, మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఊగులాడడం చేస్తా ఉండేది మల్లిక. వద్దని కళ్లతోనే వారించే మనోహర్ చూపులను పట్టించుకోకండా కిలకిలా నవ్వీది. ఓసారలాగే ఊడట్టుకు ఊగుతా జారి కిందడింది మల్లిక. నుదురు పగిలి మిషనాసుపత్రిలో నాలుగు కుట్లడ్డాయి. తను కోలుకునే దాకా అన్నీ మానేసి, పక్కనే ఉంటా కంటికి రెప్పలా కాచుకున్నాడు మనోహర్.

చూస్తాండగానే మల్లిక వయసొచ్చి పోతపోసిన బంగారు బొమ్మలా తయారైతే, మనోహర్ మీసాలొచ్చిన కరంటు స్థంబంలాగయ్యాడు. సన్నగా, పీలగా, నల్లగా ఉండే మనోహర్ ది వాళ్ల నాన్న పోలిక. బావ అందం కంటే అతని తోడునే ఇష్టపడుతూ, తన జీవితం అతనితోనే అని తీర్మానించుకుంది మల్లిక! కానీ... అనుకున్నవి అనుకున్నట్టయితే దాన్ని జీవితమని ఎందుకంటారు?

ఓ కార్తీక పున్నమికి స్నేహితులతో పేరుపాలెం బీచ్ లో సముద్రస్నానానికి వెళ్లాడు మనోహర్. సుడిగుండాలకి, ఉన్నట్టుండి నిల్చున్నదగ్గర ఇసక కుంగిపోయి, మనిసిని బలంగాలోనికి లాగేసే నీటిదిగువ కరంటుకి ప్రసిద్ధి ఈ రేవు. ఆ రోజున అలాగే ఆ సముద్రం మనోహర్ ని పొట్టన బెట్టుకుంది. ఒక్కసారిగా మల్లిక జీవితం తల్లక్రిందులైంది. మూడేళ్లు పిచ్చిదానిలా తిరిగింది. ఆ సమయంలో బావ స్నేహితులు, నాగవల్లీ చాలా అండగా నిలిచారు. చివరికి పెద్దలంతా కలిసి, సర్దిచెప్పి, మల్లికకు పాలకొల్లులో బాంకుజ్జోగం చేసే 'హరి' సంబంధం తెచ్చారు.

హరి చాలా మంచివాడు. మల్లిక గతం గురించి ఆమె ముందుగానే అతనికి చెప్పింది. తమ బంధానికి పూర్తి న్యాయం చెయ్యలేనేమో అని మనసులో ఉన్న అనుమానం గురించి కూడా పెళ్లికి ముందే చెప్పింది. ఎంతకాలమైనా ఓపిక పడతానని, ఆమె ఇష్టాలకు అడ్డుపడనని, దేనికీ బలవంతపెట్టననీ, ప్రమాణం చేసి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు హరి. అన్నమాట నిలబెట్టుకుంటా నెమ్మదిగా ఆమె మనసు గెల్చుకున్నాడు. ఇప్పుడు మల్లిక ఇద్దరు పిల్లలు చదూకుని పైకొచ్చారు. చూస్తూండగానే కాలచక్రం గిర్రున తిరిగింది...

***
"మల్లికా! ఇక్కడున్నావా?" అంటూ వెతుక్కుంటా వచ్చింది నాగవల్లి.

"ఏవే? ఏడుస్తన్నావా? పాతికేళ్లైంది. ఇంకా ఏవిటీ బేలతనం? ఐనా మీ బావ చెయ్యాల్సిన బాజ్జతలన్నీ నీ భుజాలమీదేసుకుని తీర్చావు. మీ అత్తయ్యకి జబ్బు చేస్తే దగ్గరుండి చూసుకున్నావు. మావయ్యకు ఏ లోటూ రానీకండా చేసి సాగనంపావు. మావయ్య పొలాల కౌలు లెక్కలవీ చూసి, కోర్టు వివాదాలు తీర్చి, మగ పిల్లాడిలా ఎనక నిలబడ్డావు. వాళ్లిద్దరూ కాలం చేసాకా, వోళ్లు నీకు రాసిన ఆస్తితో బావ పేరుతో అనాథాశ్రమం పెట్టావు. దానిముందు మీ బావకిష్టమైన మొక్కలన్నీ ఎట్టించావు. పాలకొల్లులో మీ ఇంట్లోనే పిల్లలకు ఉచితంగా సంగీతం చెప్తాన్నావు. బావ పేరుతో సేవలు, పూజలు, హోమాలు చేస్తన్నావు. ఇదిగో, చివరకు పాతికేళ్లైనా మరువకండా, ఈ నాటికీ ఈ పేరుపాలెం సముద్రం దగ్గర అన్నదానం చేస్తన్నావు. ఓ‌మాట చెప్పనా మల్లికా! బతికున్న మనుషులనే పేమించడం చేతకాక, ఇడుస్తున్న ఈ రోజుల్లో, పోయిన మడిసి కోసం ఇంత జేసి, నీ‌జీవితాన్నే ధారపోసావే... నిజంగా మీ బావ బతికున్నా, నీ అంత బాగా ఇయ్యన్నీ చేసేవోడు కాడేమో! పేవంటే ఏంటో నిన్ను చూసి నేర్సుకోవాలి!"

"మా బావ పోలేదు మల్లికా! నాలోనే జీవించి ఉన్నాడు. లేని వాళ్లకు పెట్టే ఆ పట్టెడన్నంలో నవ్వుతున్నాడు. పేద పిల్లలు గొంతెత్తి పాడే పాటలో పల్లవిస్తున్నాడు. తనకిష్టమైన మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు చెట్ల సందుల్లో చల్లని గాలితెరగా మారి వీస్తన్నాడు. అనాథలకు అండగా ఉంటా, తనకిష్టమైన సేవ చేస్తున్నప్పుడు చూస్తా నిండారా నన్ను దీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే, నేను మనసారా, హాయిగా జీవించిన క్షణాలన్నీ బావతో ఉన్నవే! ఆ స్మృతులే నాకు ఊపిరి!

ప్రేమంటే, కేవలం ఒక మనిషిని ప్రేమించడం కాదు. వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని,  చుట్టాలను, స్నేహితులను, ఇష్టాలను, అయిష్టాలను, సుగుణాలను, అవగుణాలను... అన్నిటినీ కలిపి ప్రేమించడం. నేనూ అలాగే ప్రేమించాను. 

మనిషి లేకపోయినా వాళ్లకిష్టమైన పనులు జరుగుతున్నంతవరకూ ఆ పుణ్యఫలం రూపంలో వాళ్లు జీవించే ఉంటారు. అలా చూస్తే, మా బావ ఈ పనుల రూపంలో కొన్ని వేలసార్లు ఊపిరి పోసుకునుంటాడు. మా బావ ఎక్కడో కాదు, నాలోనే ఉంటా, నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఊహ, తృప్తి చాలు ఈ జీవితానికి!

కానీ... ఎంత సర్ది చెప్పుకున్నా... ఈ పాడుమనసు, ఈ ఒక్కరోజు మాత్రం నా అధీనంలో ఉండదే! అందుకే ఈ కన్నీరు. సర్లే, పద, ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి." అంటా కళ్లు తుడుచుకుని నడుస్తా ఉన్న మల్లికను చూస్తా, 

"ఎంత గొప్ప మడిసి! కొన్ని గొప్ప ప్రేమలు ఇలాక్కూడా ఉంటాయేమో!"  అనుకుంటా ఆమెతో ముందుకు సాగింది నాగవల్లి.

***

No comments:

Post a Comment

Pages