ఈ దారి మనసైనది - 43 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 43

అంగులూరి అంజనీదేవి 


ఆ మాటల్నే ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని, మనోస్థయిర్యాన్ని పెంచుకొంది. పాజిటివ్ ఆటిట్యూడ్ అలవాటు చేసుకొంది. ఇప్పుడు తన గురించి తను పూర్తిగా అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తోంది. ఏదో సాధించాలని, గుర్తింపు పొందాలని, దానికోసం ఎంతయినా పనిచేయాలని, అందరి అభినందనలు పొందాలని, దానివల్ల మనసుకి అద్బుతమైన శాంతి దొరుకుతుందని ప్రయత్నిస్తోంది.

ఉదయం పదిగంటల నుండి హాస్పటల్లో ఓ.పి. నడుస్తోంది. ఒకే గదిలో ఎదురెదురుగా కూర్చుని డా|| మన్విత, డా|| దీక్షిత పేషంట్లని చూస్తున్నారు. వాళ్లిద్దరు డాక్టర్ల రూపంలో ఉన్న ఐదున్నర అడుగుల తెల్లని హంసల్లా వున్నారు. వాళ్లనలా చూస్తుంటే డాక్టర్లంటే ఇలా వుంటారు ! ఇలా వుంటేనే డాక్టర్లేమో అనిపిస్తుంది.

మన్విత పేషంట్ హిస్టరీ తీసుకుంటుండగా... దీక్షిత మొబైల్ కి కాల్ వచ్చింది. వెంటనే మన్విత వైపు చూస్తూ ...

“ఎక్స్ క్యూజ్ మిడాక్టర్ ! డా|| అనురాగ్ కాల్ చేశాడు.”అంటూ పక్కకెళ్లింది దీక్షిత. 

అతని కాల్ కోసం ... ఓ.పి లో వున్నా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోకుండా వెయిట్ చేస్తుంది దీక్షిత. స్టేట్స్ లో వున్నాడు కదా ఆ మాత్రం అతృత వుంటుంది. కానీ ... బాధ్యత గల ఒక డాక్టరై వుండి పేషంట్లను వదిలి అలా పక్కకెళ్లి ప్రియునితో మాట్లాడడం మన్వితకి నచ్చలేదు... ఎందుకంటే డాక్టర్లు, సైంటిస్ట్లు, రచయితలు, సైనికులు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు తమ బాధ్యతల్ని విస్మరించి ఇలాంటి కాల్

కోసం వెయిట్ చేసి గంటలు, గంటలు ఫీలింగ్స్ పంచుకోవటం వల్ల దేశానికి అంతో ఇంతో నష్టమే కాని లాభం వుండదు. మొదటిసారిగా ఇలాంటి ఫీలింగ్స్ మీద విముఖత కల్గింది. మన్వితకి ...

ఒకప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎర్రగా కాల్చిన ఇనుమును నెత్తిన పెట్టినట్లుండేది. ఇప్పుడలాలేదు. ఎందుకంటే ...

ప్రేమంటే ఏదో తెలియని భయం, భాధ, ఇన్ సెక్యూర్ ఫీలింగ్ కాదు. ప్రేమంటే గొప్ప రిలీఫ్. అది పంచేకొద్ది పెరగాలి. మరిచి పోవడంలో ప్రేమలేదు. గుర్తుంచుకోవడంలో ప్రేమవుంది. అదెలా అంటే జీవితాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలోని బాధ్యతల్ని గుర్తుంచుకోవాలి. అపకీర్తి, అవమానాలు, ఇంట్లోవాళ్లు అసహ్యించుకొని తలుపులు మూసుకున్న క్షణాలను గుర్తుంచుకోవాలి. స్వాభిమానం కోల్పోకుండా బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలి. అనుకొంది మన్విత. 

... జీవితాన్ని చూస్తున్న కొద్ది ప్రేమను మరో కోణంలో చూసిన మన్విత దృష్టంతా ప్రస్తుతం రోగుల మిద వుంది.

వెంటనే పేషంట్ వైపు తిరిగి ...

“నీ పేరేమిటి ?వయసెంత ? బాధేమిటి ?” అంటూ పేషంటుని అడిగింది మన్విత..

మన్విత అడిగిందానికి పేషంట్ సమాధానం చెబుతోంది. దాన్ని ఓ స్లిప్ మీద రాస్తూ...

“పెళ్లయిందా ?పిల్లలెందరు? ఏదీ నాలిక చూపించు...” అంటూ ఆమె ముఖంలోకి చూసింది..

ఆ తర్వాత ఆమెను స్ర్కీన్ వెనక్కి తీసికెళ్లి పరీక్ష చేసింది. అన్నిటెస్ట్లు అయిన వెంటనే ఆమెను డా|| ధీరజ్ రెడ్డి దగ్గరికి పంపింది. 

'నెక్ట్' అనగానే ఒక పేషంట్ వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అతనిలో వచ్చిన మార్పు చూసి అతనేనా అనుకొంది.

ఒక రోజు తప్పతాగి చేతకాని స్థితిలో వున్న అతన్ని అతని తల్లి, భార్య, నాలుగేళ్ల కూతురు హాస్పటల్ కి తీసుకొచ్చి, బిక్కుబిక్కుమంటూ బాధపడ్తుంటే ... డా|| ధీరజ్ రెడ్డి అతనికి ట్రీట్ మెంట్ ఇచ్చి, తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చాడు. అతని తల్లితో, భార్యతో కూడా మాట్లాడాడు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ - అతన్నే చూస్తూ ....

“ఎలావుందిప్పుడు? ”అని అడిగింది మన్విత.

అతను సమాధానం చెబుతుంటే ... స్టెతస్కోప్ ని వీపు మీద పెట్టి గట్టిగా గాలి పీల్చమని చెప్పింది. 

ఆమె టెస్ట్ చెయ్యడం పూర్తయ్యాక ... ఆమె వైపు చూస్తూ, తాగుడు మానాక, మందులు వాడాక, ఎన్ని అవస్థలు తగ్గాయో మన్వితతోచెప్పాడు.

ఇప్పుడు తన భార్య, తన తల్లి తను కలిసి - పనులకి వెళ్తున్నామని, డబ్బులకి ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నామని తన కూతుర్ని స్కూలుకి పంపుతున్నామని చెప్పాడు. అదెంతో సంతోషించ తగ్గ విషయం... ఎందుకంటే అతను రోజూ తాగి ఇంటికి రావడం, అత్తా, కోడళ్లిద్దరు అతనెప్పుడు మారతాడా అని ఎదురు చూస్తూ ... ఏ పనీ లేకుండా కేవలం అతన్ని మారుమనటమే పనిగా పెట్టుకోవడం ... ఇన్నాళ్లూ జరిగేది. ఇప్పుడా దరిద్రం నుండి బయట పడ్డారు.

అతన్ని ధీరజ్ రెడ్డి దగ్గరికి పంపాక...

అప్పటి వరకు ఫోన్లో మాట్లాడిన దీక్షిత వచ్చి తన సీట్లో కూర్చుంది.

దీక్షిత కూడా తన దగ్గరకి వచ్చిన పేషంట్ హిస్టరీ చూసి, బ్లేడ్ ప్రెషర్ చూసి ఇన్వెస్టిగేషన్స్ రాసి చేయించుకు రమ్మని చెబుతోంది.

రిపోర్టులు రాగానే డా|| ధీరజ్ రెడ్డి దగ్గరికి పంపుతోంది.

అక్కడికి వచ్చే పేషంట్లు చెప్పుకునే కంప్లెయింట్స్లో ఎక్కువగా నీరసం, కాళ్లు పీకడం, గుండె దడ, అయాసం, జ్వరాలు, దగ్గులు, పాము కరవటాలు, కుక్కలు కరవటాలు.

 ఇవి కాక కాన్పుల కేసులు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని మన్విత చక్కగా చేస్తుంది. ఆమెనంతా “కాన్పుల తల్లి, చల్లని తల్లి అని పిలుస్తుంటారు. 

ఓ.పి అయ్యాక మన్విత, దీక్షిత పైకెల్లి వర్ధనమ్మ ఇచ్చిన టీ, బిస్కెట్స్ తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యారు. 

హాస్పటల్ అభివృద్ది చూస్తుంటే తన తాతగారి ఆశయం నెరవేరినట్లు అనిపించింది డా|| ధీరజ్ రెడ్డికి.

*****

దీక్షిత హాస్పటల్ నుండి ఇంటి కెళ్లగానే ... ఢిల్లీ నుండి వచ్చిన శాంభవిని చూడగానే ఆశ్చర్యానందాన్ని కళ్లలో నింపుకొని, చేతిలో వున్న స్టెతస్కోప్ పక్కన పెట్టాలన్న ధ్యాస కూడా లేని దానిలా అలాగే వెళ్లి ఆమెను కావలించుకొని ...

" ఎప్పుడొచ్చారు అత్తయ్యా ?మామయ్య రాలేదా? అందరు బాగున్నారా?” అంది దీక్షిత.

“బాగున్నారు! నేనొక్కదాన్నే వచ్చాను.” అంటూ ఆప్యాయంగా దీక్షిత వైపు చూసింది.

దీక్షితను చూస్తున్న అమెకళ్లలో వింత మెరుపు ... చూసి చాలా రోజులైందన్న అర్ధం కూడా వుందా చూపులో ... 

దీక్షిత తల్లి రామలక్ష్మి, శారద - వదినా, మరదళ్లే కాక, మంచి స్నేహితురాళ్లు ... ఏ అవసరం వచ్చినా ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు. 

శారద ఎప్పుడొచ్చినా ఆ ఇంట్లో సందడి వాతావరణం కన్పిస్తుంది. అందరు సంతోషంగా కన్పిస్తారు. ఆమెను గొప్పగా చూస్తూ, దేవతే తన ఇంటికి వచ్చినట్లు భావిస్తారు. కారణం దీక్షిత డాక్టర్ అయిందంటే శారద గొప్పమనసు చేసిన ఆర్థిక సహాయం.

ఆ రాత్రికి అందరు బోజనాలు చేసి పడుకున్నారు.

అర్ధరాత్రి నిద్రలేచి బాత్రూం కెళ్లాలని బయటకి రాగానే... అక్కడ తనతల్లి రామలక్ష్మి, అత్తయ్య శారద దొండ తీగల పందిరి కింద కూర్చుని వుండడం చూసి.. అర్థం కానట్లు ఆగిపోయింది దీక్షిత.

ఆకుల సందుల్లోంచి వెన్నెల వాళ్లమీదపడి “ఏమిటి మీ వాగ్యుద్దం”? అన్నట్లు చూస్తోంది. 

అలికిడి అయితే వాళ్లు తమ వైపు చూస్తారని ... ఈ టైంలో వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినాలని కుతూహలం ఆపుకోలేక... బాత్రూం పక్కనే తెల్లగాతోమి బోర్లించిన ఇత్తడి బిందెమిద కూర్చుందిదీక్షిత.

అక్కడ పాదుల్లో వున్న - బీర, సొర, గుమ్మడి, సన్నజాజి తీగలు సాగి పచ్చదనాన్ని చాటుతూ ... ఇక్కడ మాకు తెలియని విశ్వరహస్యామిలేవన్నట్లు మౌనంగా చూస్తూ గాలితాకిడికి అప్పుడప్పుడు ఎండిన ఆకుల్ని, మందార పూలని రాలుస్తున్నాయి.

ఆ నిశ్శబ్దంలో ఆకులు రాలిన చప్పుడు సైతం స్పష్టంగా విన్పిస్తోంది.

“దీక్షితను ఓ మాట అడగాలంటున్నావు. ఇన్ని రోజులు ఈ విషయం దీక్షితతో చెప్పలేదా? ఎందుకు? నువ్విచ్చిన మాట కాలగర్భంలో కలిసి మరిచిపోతాననా? లేక మాట మార్చి నన్ను మోసం చేద్దామనా ? ఎందుకు చెప్పలేదు దీక్షితతో ...” అంటూ నెమ్మదిగా మాట్లాడుతున్నా తీవ్రంగా వున్నాయి శారద మాటలు..

"అంత పెద్ద మాట లెందుకు వదినా ! నాకు అలాంటి ఉద్దేశాలేమిలేవు. అదెప్పుడు చూసినా చదువు ద్యాసలో వుండటంతో ఈ మాట లెప్పుడు దాని దగ్గర తీసుకురాలేదు.” అంది రామలక్ష్మి

“చదువుకునే పిల్లల దగ్గర పెళ్లి ప్రసక్తి తెచ్చి వాళ్లను డిస్టర్బ్ చెయ్యటం మంచి పద్దతి కాదు. నువ్వు చేసింది కరక్టే ... ఇప్పుడు హౌస్ సర్జన్స్ అయిపోయి డాక్టరయింది. ఇంకేమిటి నీసంశయం ...?” అంది శారద.

మాట్లాడలేదు రామలక్ష్మి.

“దీక్షిత ఒప్పుకోదనా? చదువుకోమని కట్టలు, కట్టలు డబ్బులు పంపితే ఆర్థిక బాధలు తెలియకుండా చదువుకుంటారు కాని... ఇలాంటి విషయాలల్లో నిర్ణయాలు తీసుకోవడం వాళ్లకేం తెలుస్తుంది? మంచి - చెడు ... పది కాలాల పాటు కలిసి మెలిసి వుండటం లాంటి లెక్కలన్నీ పెద్దవాళ్లుగా మనం చూసుకోవాలి. అయినా దీక్షిత మన మాట కాదనదనుకో... దానికి నేనంటే ప్రాణం కూడా ...” అంది శారద.

ఇంతకీ వీళ్లు తనని ఏం అడగబోతున్నారు? పెళ్లి ప్రసక్తి అంటున్నారు. తన బావ విజయేంద్రను పెళ్లి చేసుకోమని అడుగుతారా? ఆ ఊహకే దీక్షిత గుండెల్లో విస్పోటనం పేలినట్టైంది అనురాగ్ గుర్తొచ్చి...

“నువ్వు చెప్పేది నిజమే వదినా! నువ్వంటే దానికి ప్రాణం, గౌరవం ... దాని చదువు విషయంలో మీరు చేసిన సహాయం అపారమైంది. దాన్ని తీర్చాలన్నా ఇప్పటికిప్పుడు మా వల్ల అయ్యే పని కూడా కాదు. కేవలం కృతజ్ఞత మాత్రమే చూపగలం...” అంది రామలక్ష్మి,

" మరింకేంటి అభ్యంతరం? పెళ్లి పనులు ప్రారంభించాక...”

“ఎంతయినా దానికోమాట చెప్పాకనే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం వదినా ! ఎందుకంటే ..” అంటూ ఆగిపోయింది.

" ఆ ... చెప్పు ?ఆగిపోయావేం ? ఎప్పటికైనా దీక్షిత నీ కోడలు. దాన్ని నువ్వు చదివించుకో వదినా అన్న రోజు దీక్షిత లేదా? దానికో మాట చెప్పాకనే నాకు మాట ఇవ్వాల్సింది. ఈ తేడా మాటలే నాకు నచ్చవు ...” అంది శారద. దీక్షితకి ఓ మాట చెప్పాలనటం శారదకి నచ్చటం లేదు. తనొచ్చి అడగ్గానే పెళ్లి ప్రయత్నాలు చేస్తారనుకొంది.

షాక్ తిన్నది దీక్షిత.

తనకి మెడిసిన్ చదవాలని వుందన్న కోరికను తీర్చటం కోసం ... అమ్మ, అత్తయ్యకి మాట ఇచ్చిందా? అలా మాట ఇచ్చే అధికారం తల్లిగా ఆమె కుంది. కానీ ...ఇప్పుడు తనతో ఎందుకు చెప్పాలనుకుంటోంది? తనో డార్జరై, తనకో వ్యక్తిత్వం వచ్చిందనా? లేక అనురాగ్ని ప్రేమించి, నట్లేమైనా తెలిసిందా? అలాతెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా తన ఇంటి కల్చర్ తెలిసి, ఆర్థిక పరిస్థితి తెలిసి అనురాగ్ని ప్రేమించి తప్పు చేసిందేమో...

“నేనంత తేడాగా ఏం మాట్లాడటం లేదు వదినా! దీక్షిత మనసులో ఏముందో తెలియదు కదా! ఎందుకంటే పెద్ద చదువులు చదివిన పిల్లల మనసు అర్ధం చేసుకోటానికి నేనేమైనా చదువుకున్నానా? దాని మనసు నొప్పించటం నా వల్లకాదు.” అంది రామలక్ష్మి.

తన మనసుకి ప్రాధాన్యత ఇస్తూ అత్తయ్యతో అన్ని మాటలు పడ్తున్న తల్లిని చూస్తుంటే జాలిగా వుంది.

" మేము చదివించక ముందు ఈ ఆలోచన ఏమైంది ?” అంటూ నిలదీసింది శారద.

ఒక్కక్షణం ఏం చేయాలో తోచనట్లు, నిస్సహాయంగా చూస్తూ...

“ఒక వేళ అది వద్దంటే మాత్రం మీ డబ్బు మొత్తం పైసలతో సహా చెల్లు బెడతాం ... కాస్త టైమివ్వండి వదినా!” అంది రామలక్ష్మి

“ఎవరిక్కావాలి మీ డబ్బు ... దానం చేశామని సరిపెట్టుకుంటాను. నువ్వు, మాట మీద నిలబడటంలేదే... అదినాకు నచ్చటం లేదు. నువ్విలాంటిదానివని తెలియక దీక్షిత హౌస్ సర్జన్స్ అయిన వెంటనే విజయేంద్రతో చెప్పాను. దీక్షితను పెళ్లి చేసుకోమని ... “సరే' అన్నాడు. వాడేమైనా అనామకుడా? మిలటరీ ఆఫీసర్. పెళ్లయ్యాక దీక్షిత అక్కడే ప్రాక్టీస్ పెట్టేటట్లు ఏర్పాటుకూడా చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి నేనేం సమాధానం చెప్పాలి?” అంది శారద.

మాట్లాడలేదు రామలక్ష్మి 

మౌనంగా వున్న రామలక్ష్మి వైపు ప్రశాంతంగా చూస్తూ ...

“దీక్షిత మనసులో ఏముందోననేగా నీ అనుమానం? ఏముంటుంది మనసులో ... ఇన్నాళ్లు చదివిన మెడిసిన్ చదువు వుంటుంది. అంతేగా ! అంతకు మించిన అద్భుతం ఇంకేమైనా వుంటేరేపు అడిగి తెలుసుకుందాంలే ... నువ్వింకేం ఆలోచించకు ... రా! వెళ్లి పడుకుందాం !”అంటూ చాలా క్యాజువల్గా లోపలికి దారి తీసింది ఆమెవెంట రామలక్ష్మి కదలకపోవడంతో విసుగ్గాచూస్తూ...

“ నాకు మాట తప్పే వాళ్లంటే అసహ్యం ... మాట వల్ల ఎన్ని లాభాలున్నాయో, అదితప్పడం వల్ల అన్ని అనర్థాలుంటాయి. నువ్వేమైనా చిన్నపిల్లవా? అప్పుడోమాట, ఇప్పుడోమాట చెప్పటానికి ?” అంది నిలదీస్తున్నట్లుగా...

ఆ మాటలతో రామలక్ష్మి ఆత్మాభిమానం దెబ్బతిన్నది.

“నేను చావనైనా చస్తాను కాని మాట తప్పను వదినా ! దీక్షితతో ఒక మాట చెప్పి 'ఈ పెళ్లి నాకు ఇష్టమే ' అని ఒక మాట దాని నోటవెంట వినాలన్నదే నా కోరిక. అది కాదంటుందని కూడా కాదు. ఎలాగైనా నా మాట నిలబెట్టుకుంటాను. సరేనా?” అంది ఆమెవెంట లోపలకి నడుస్తూ రామలక్ష్మి,

అనురాగ్ని తను ప్రేమించినట్లు తెలియక పోతేనే ఇలా వుంది. తెలిస్తే ! ఏ ఆయుధం వాడకుండా మాటలతోనే చంపేస్తుంది శారద అత్తయ్య. ఈ ప్రమాదం నుండి తల్లి నెలా తప్పించాలి?

ఒంట్లో శక్తి లేని దానిలా అక్కడ నుండి లేవలేక అలాగే కూర్చుంది.

ఇప్పుడేంటి తన పరిస్థితి? 

తల్లి చనిపోతే తండ్రి బ్రతుకుతాడా ?

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages