జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 35 - అచ్చంగా తెలుగు

                                             


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  

అనుకున్నట్లుగానే వేసవి సెలవుల్లో కాంతయ్యకు  బదిలీ వచ్చింది. ఇద్దరు పిల్లలను తీసుకొని కవలంపేట నుండి వెళ్లి పోయాడు. 

కాలేజీ దరిద్రం పోయిందని స్టాఫ్ సంతోషించింది. 

ప్రిన్సిపాల్ పదవీ విరమణతో నాకు ఇంచార్జ్ ప్రిన్సిల్ ఫుల్ అడిషనల్ చార్జీతో దాదాపు మూడు సంవత్సరాలు పనిచేసాను. 

నేను ధైర్యంగా కాలేజీ వాతావరణాన్ని పూర్తిగా మార్చి వేసాను. భూమయ్య నాకు కుడిభుజంగా మద్దతు ఇచ్చాడు, మేము మునిపల్లి కాలేజీని బాగుపరిచిన వైనం గుర్తుకు వచ్చింది. విద్యార్థుల అడ్మిషన్స్ పెరిగాయి.

కాలేజీ సమయపాలనతో ఫలితాలు మెరుగు పడ్డాయి.

గత వేసవిలో నాకు ప్రిన్సిపాల్‍గా ప్రమోషన్ వచ్చి గుమ్మడిదలకు  రావడం మీకు తెలిసిందే.. 

***

స్టాఫ్ అంతా తమ సంతోషాన్ని మరోసారి చప్పట్లతో వ్యక్త పరిచింది.     

ఇంతలో ఆగమయ్య టీ ఫ్లాస్కుతో ప్రత్యక్షమయ్యాడు.

అందరి ముఖాలలో ఆనందపుఛాయలు వెళ్లివిరిశాయి. 

టీ తాగడం పూర్తయ్యింది.               

బ్యాగులు సర్దుకుంటూ సూర్యప్రకాష్ అనుమతి కోసం చూస్తున్నారు స్టాఫ్.

ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని కాబోలు సూర్యప్రకాష్ స్వరం సరిచేసు కోవడం.. అంతా నిశ్శబ్దమయ్యారు. 

“ఒక్క నిముషం..” అంటూ మొదలు పెట్టాడు. “ నీ విజ్ఞానసర్వస్వం వీధి దీపంలా వెలుగునిస్తూ పలువురిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. నీ  క్రమశిక్షణే ఆ దీప సంరక్షణ. అని గుర్తుబెట్టుకోవాలి..    

యిక నాకు కావాల్సింది.. మీ సహకారం. మీ సహకారం లేకుండా నేను మన కాలేజీ ఫలితాలను మెరుగు పరచడం కష్టసాధ్యం.

నాఅనుభవాలను మీకు వివరించాను. 

బియ్యంలో మెరిగలు రావడం సహజమేమో! గాని.. కాలేజీ అనే పరమాన్నంలో మెరిగలు రావడం  ఎంత వరకు సబబు?..

మెరిగలను దంచి  పొట్టు వదిల్చి వండినా రుచికరంగా ఉండదు. అలా మన జూనియర్ కాలేజీ వ్యవస్థ చెడిపోయింది. విద్యార్థుల అడ్మిషన్లు లేక నష్టబోతోంది. దానికి కారణం ప్రతీ కాలేజీలో మెరికల్లాంటి లెక్చరర్ల మధ్య మెరిగల్లాంటి లెక్చరర్లు ఉండడమే..   

నా అనుభవాల దొంతరలలో మెరిగలెవరో.. చూశారు.

మెరిగలు ఎలా ఎరివేయాపడ్డాయో  గ్రహించే ఉంటారు.. అందులోని కొన్ని రహస్యాలు నేను మీకు చెప్పలేదు. రహస్యం, రహస్యంగానే ఉంచాలి. మున్ముందు ప్రయోగానికి అవసరమవుతుందేమో..!” అంటూ ఒక ఝలకిచ్చాడు సూర్యప్రకాష్. 

మన కాలేజీలో మెరిగలం కాగూడదన్నట్లు జోగయ్య, భాగ్యలక్ష్మి వంక చూస్తూ  లేచాడు సూర్యప్రకాష్.  

ఆనాటి సమావేశం ముగిసింది.

***

జోగయ్య మనసు పొయ్యి మీద ఆన్నంలా కుత, కుతా ఉడికిపోతోంది.. 

           ఆరాత్రంతా అతడికి నిద్రపట్ట లేదు. ఆలోచనలు.. ఆలోచనలు.. ఆలోచనలు. మనసును అల్లకల్లోలం చెయ్యసాగాయి.

“సూర్యప్రకాష్ ఉపన్యాసమంతా నన్నూ, భాగ్యలక్ష్మిని  దృష్టిలో పెట్టుకొని కొనసాగించినట్లు తెలుపకనే తెలుస్తోంది. 

నన్ను సాధించాలని చూస్తాడా.. లోకంలో తనొక్కడే ‘తీస్‍మార్ఖాన్’ అనుకుంటున్నాడు. 

అతడికి మిగిలింది ఇంకా  దాదాపు   రెండు సంవత్సరాల సర్వీసు.. ఇక బదిలీలుండవు. గుమ్మడిదలలోనే రిటైర్ మెంటు. ఈ లోగా వీలు చూసి వాత పెడితే కొడుక్కు దిమ్మ దిరగి పోవాలి. 

పెన్షన్ సైతం  నిలిచి పోయేలా ఒక ఉతుకు బండకేసి ఉతకాలి..  

ఏం చెయ్యాలి..? ఏం పథకం వెయ్యాలి..? ఎలా ఉతకాలి..?” అని కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు జోగయ్య. 

అమరునాడు కాలేజీలో కాస్తా మార్పును గమనించాదు సూర్యప్రకాష్. 

సమయానుసారం ఠంచనుగా క్లాసులు జరుగుతున్నాయి.

‘జోగయ్య నిశ్శబ్దానికి నిలయమయ్యాడు. కాని అంతగా నమ్మదగిన వ్యక్తిగాడు. తుఫానుకు ముందు వాతావరణం గంభీరమవుతుందన్నట్లు.. ఏసమయంలో ఏంజరుగుతుందో చెప్పలేమని’ సూర్యప్రకాష్ మనసు మరో వంక హెచ్చరిస్తోంది. 

వాస్తవానికి ప్రిన్సిపాల్ పదవి కత్తిమీద సాములాంటిది. 

సమయ పాలన అంటే.. అటు లెక్చరర్లకూ.. ఇటు విద్యార్థులకూ..గొంతు వరకు కోపం. 

ప్రతీ రోజు విద్యార్థులు కొందరు ఆలస్యంగా రావడం.. వారిని కౌన్సిలింగ్ చేసి క్లాసులకు పంపడం.. ఫిజికల్ డైరక్టర్‍కు, ప్రిన్సిపల్‍కు ప్రతీ రోజు ఒక ప్రహసనం..

మూడు సార్లు ఆలస్యంగా వచ్చినట్లయితే ఒక ఆకస్మిక సెలవు మార్కు చేస్తానంటే..  స్టాఫ్ సహాయ నిరాకరణ ఉద్యమం సరేసరి.. 

సరే..పోనీలే..! చూసీ చూడనట్లుందాం. అందరినీ తృప్తి పరుస్తూ ముందుకు సాగుదామనుకుంటే.. కాలేజీ సాంతం నెత్తికెక్కి కూర్చుంటుంది. దాంతో గ్రామ పెద్దలకు.. రాజకీయ నాయకులుకు లోకువై పోవడం.. దారిన పోయే ప్రతీ  దానయ్య సైతం  నిలదీస్తాడు. 

వారికి సమాధానం  చెప్పుకోవడం.. ఫలితంగా ‘బేకారీ ప్రిన్సిపాల్’ అని మనఃఫలకంపై ముద్ర వేయించుకోవడం.. పైపెచ్చు డిపార్టుమెంటు సంధించే ప్రశ్నావళికి సమాధానాలు రాసుకోవడం..  

ప్రిన్సిపాల్ అంటే వీధిలోని రోట్లో తల.. 

అలాగని కొందరు ప్రిన్సిపాల్స్ నూ తక్కువ అంచనా వేయొద్దు.  కులం.. మతం.. నేపథ్యంలో వీలునుబట్టి లెక్చరర్లను, విద్యార్థులను  విభజించి పాలిస్తూ పబ్బం గడుపుకోవడం.. ఎవరికీ తెలియంది కాదు..! 

కాలేజీ విద్యాలయానికి నిలయం.. తద్వారా ‘నేర్చుకోడానికి కలిసి రండి.. సేవ చేయడానికి తరలి వెళ్ళండి’ అనే నినాదాన్ని ప్రక్కనబెట్టి రాజకీయరంగులు పులుముకుంటూ కలుషిత మవుతోంది..  

సూర్యప్రకాష్ ఒక గంట ముందే కాలేజీకి రావడం అలవాటు. అదే అలవాటుతో ఆగమయ్యను దారిలో పెట్టింది. ఐదు నిముషాలు ముందే వచ్చి కాలేజీ గేటు తెరవడం.. ప్రిన్సిపాల్ టేబులు తుడిచి ఆనాటి దినపత్రిక పెట్టడం ఆగమయ్య నిత్యకృత్యంగా మారింది.  

సూర్యప్రకాష్ పేపర్ చదివేసరికి స్టాఫ్ వస్తుంది..

పదినిముషాల ముందు ప్రార్థన గీతం..‘వందే మాతరం..’ అదీ తనొచ్చాకనే ఆరంభించాడు. 

ప్రార్థనానంతరం.. ప్రతిజ్ఞ.  

ఆనాటి వార్తా విశేషాలు.. ఒక సామెత గాని సూక్తి గాని  చెప్పుకొని తరగతులు ఆరంభమవడం.. ఆనవాయితీగా మారింది.  దాంతో కాలేజీకి నిండుదనం చేకూరుతుందని సూర్యప్రకాష్ ప్రగాఢ విశ్వాసం. 

ఆరోజు యధావిధిగా సూర్యప్రకాష్ కాలేజీకి వచ్చి దినపత్రిక జిల్లా అనుబంధం తిరగేస్తుంటే కనబడిన వార్త చూసి  కొయ్యబారిపోయాడు.. ‘ఎంత హాస్యాస్పదం..?’ అనుకున్నాడు మనసులో.. వెంటనే ఆగమయ్యను పిలిచి లోకల్లో పత్రికా విలేకరులెవరని ఆరా తీసాడు.

వార్త చదివి ఆగమయ్య పేపరు వాణ్ణి బూతులు తిట్టబోతూ.. సూర్యప్రకాష్ ముఖ కవళికలు చూసి ఆగిపోయాడు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages