వ్యాపకం - అచ్చంగా తెలుగు
వ్యాపకం
దొండపాటి కృష్ణ 

“సుధా..! సుధా..! ఎంతసేపు.? టైమవుతుంది. త్వరగా రా!” అంటూ బయట కారులో కూర్చొని గంభీరంగా పిలుస్తున్నాడు.
“వస్తున్నా గోపి! అయిపొయింది. నేను రెడీ” లోపలినుండే గాభరాగా వస్తూ అంది సుధ.
“అమ్మా! ఈ రోజన్నా కుదురుతుందా?” హడావుడిగా వెళ్తున్న సుధకు అడ్డుపడి అడిగింది కూతురు రంజని.
“లేదురా! నేను బిజీ. నాన్నగారు వస్తార్లే. మీరు త్వరగా బయలుదేరి స్కూల్ కేళ్లండి. తమ్ముడిని కూడా తీసుకెళ్ళు, సరేనా?” అంటూ బుజ్జగించి బయటకు పరుగెత్తింది సుధ.
“ఏమోయ్ ఎన్ని సార్లు చెప్పాలి నీకు? మా పేరెంట్స్ పెట్టిన చక్కని పేరు ‘గోపాల్’ అని పిలవమని. ‘గోపి’ అని పిలవద్దని. బుర్రకేక్కదా?” కారు డోర్ తీస్తూ అడిగాడు గోపాల్.
“అబ్బా! మీకన్నీ పట్టింపులే! అది షార్ట్ కట్” అంది సుధలోపల కూర్చుంటూ.
“దేవుడి పేరు షార్ట్ కట్ ఏంటి? ఉన్నవి మూడు అక్షరాలు. అందులో కుదింపులా?” విసుక్కున్నాడు గోపాల్ కారును స్టార్ట్ చేస్తూ.
“చూడు గోపి! నా పేరు సుధ – రెండక్షరాలే! నీ పేరు కూడా రెండక్షరాలే ఉండాలి. నీతో నేనేం తక్కువ కాదు. ఉద్యోగాలు సమానం. జీతాలు సమానం. బరువు బాధ్యతలు సమానం. అలాంటప్పుడు పేర్ల అక్షరాలు సమానమైతే ఏంటి?” ప్రశ్నించింది సుధ.
“వద్దు..వద్దని పెరెంట్సూ, ఫ్రెండ్స్ చెప్పినా వినకుండా సాఫ్ట్ వేర్ చేసేవాడు సాఫ్ట్ వేర్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే అన్యోన్యంగా ఉంటారని భ్రమపడి నిన్ను చేసుకున్నందుకు బాగానే సమాధానమిస్తున్నావ్” లో వాయిస్ లో అన్నాడు.
“ఏంటి ఏదో గొణుకుతున్నారు?”అడిగింది.
“ఎన్ని గొణికితేనేం నీ చెవికేక్కితెనేగా? ఇంకెందుకు బయటకు చెప్పడం” అంటూ వేగంగా కారును నడుపుతున్నాడు.
“సర్లే! పిల్లలు ఎప్పట్నుంచో బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సాయంత్రం కాస్త వీలు చూసుకొని బయటకు తీసుకెళ్ళండి” పురమాయించింది.
“ప్రతీదీ నాకు చెప్పే బదులు నువ్వే చేయొచ్చుగా?” కోపంగా ప్రశ్నించాడు.
“నాకు ఈ రోజు డెలివరీ ఉంది” అంటున్న ఆమెవైపు చూసి “ఏంటి డెలివరీనా?” ఆశ్చర్యపోతూ అడిగేసరికి “ప్చ్.. ఆ డెలివరీ కాదు. ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. త్వరగా రావడం కుదరదు. మీరే చూసుకోవాలి” అందామె.
“నీకే కాదు, త్వరలో మా ప్రాజెక్ట్ కూడా డెలివరీ చేయాలి. మేనేజర్ ఇప్పటికే సతాయిస్తున్నాడు. వర్క్ బాగా పెండింగ్ లో ఉండిపోయింది. నాకు కుదరదమ్మా” అన్నాడు కారును రోడ్ మలుపు తిప్పుతూ.
“అలా అంటే ఎలా?”సీరియస్ అయ్యింది.
“ఏం చెయ్యమంటావ్.? డవలప్మెంట్లో ఉండి జనరల్ షిఫ్ట్ లు చేస్తున్నా ఒకసారి ఆఫీస్ లోపలికెళ్తే ఎప్పుడు బయటకోస్తామో తెలియదు. టీమ్ లీడర్ అంటే నార్మల్ ఎంప్లొయ్ లాగా తనపని తాను చేసుకోచ్చేసే రకం కాదని నీకూ తెలుసుగా! మళ్ళీ ఎందుకీ యాగీ?” తన కోపంలో మాటలతోపాటు కారు కూడా మరింత వేగం అందుకుంది.
“మీకు నచ్చినట్లు చేయండి! పక్కన ఆపండి. మా ఆఫీస్ వచ్చేసింది” అంది పళ్ళను బిగిస్తూ అతన్ని కొట్టలేక.
“ఎప్పుడొస్తావో నీ ఇష్టం. బస్లో రా” అనేసి రయ్ మని తన ఆఫీస్ వైపు కారును కదిలించాడు.
భర్తమీద కోపాన్ని మనస్సులోనే సంతృప్తి పడేలా తిట్టుకుంటూ తన చూపును కారు దాటేల్లిపోయంతవరకూచూస్తూ, తృప్తి పడ్డాక లోపలికెళ్ళింది.
* * * * * *
కారును పార్కింగ్ లో పెట్టేసి తన క్యాబిన్ లోకి వెళ్లి సిస్టం ఆన్ చేశాడు గోపాల్. తన లాప్టాప్ నుండి వి.పి.ఎన్. కనెక్ట్ అయ్యి అందరికీ అందుబాటులోకి వచ్చాడు. వెంటనే మెయిల్ లన్నీ లోడ్ అయ్యాయి. ఎక్కువ భాగం మేనేజర్ ప్రశాంత్ దగ్గరనుంచే. ప్రాజెక్ట్ టైం దగ్గరపడుతున్నా చేయాల్సిన వర్క్ బాగా పెరిగిపోవడంతో ఉన్న టెన్షన్ కు మరింత టెన్షన్ తోడయ్యింది.టెన్షన్ లో ఒకదానికి బదులుగా ఇంకొక సమాధానం ఇస్తాడేమోనన్న భయంతో ఎవ్వరికీ సమాధానమివ్వలేదు. ఇంతలో మరో మెయిల్.పసుపు రంగులో ‘ఇంపార్టెంట్ అండ్ అర్జెంటు’ అని ఉండడంతో ఓపెన్ చేశాడు. “గోపాల్ మీరొకసారి నా క్యాబిన్ కు రావాలి” అనుంది. ఈ సారి మేనేజర్ ను కలవక తప్పదు. మేనేజర్ క్యాబిన్ కెళ్ళి మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు. ప్రశాంత్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. లోపలికి రమ్మని సైగ చేయడంతో వెళ్లి ప్రశాంత్ కెదురుగా కూర్చున్నాడు గోపాల్.
మరో ఐదు నిమిషాల్లో ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్.
“విన్నావ్ గా క్లయింట్ అప్డేట్ అడుగుతున్నాడు. మన డవలప్మెంట్ కు తోడుగా మేనేజ్మెంట్ కూడా. త్వరలో వచ్చి ప్రాజెక్ట్ ఒకసారి చెక్ చేసుకుంటా మంటున్నారు. కోడింగ్ ఎంతవరకు చేశారో, ఇంటిగ్రేషన్ ఎంతవరకు అయ్యిందో నేను అడుగుతూనే ఉన్నానుకాని మీరు సరైన ఆన్సర్ ఇవ్వడం లేదు. రీజన్ ఏంటి?” ప్రశ్నించాడు ప్రశాంత్.
“టీమ్ అంతా అదే పని మీద ఉంది ప్రశాంత్! డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేస్తాం” అన్నాడు గోపాల్ గొంతును సవరించుకొని.
“మీరు మాకున్న గ్రేట్ పర్సనల్ రిసోర్స్. అందుకే మీరు లేట్ గా వచ్చినా మేమేం అడగం. దాన్ని అలుసుగా తీసుకుంటే ఎలా గోపాల్?” మళ్ళీ ప్రశ్నించాడు ప్రశాంత్.
“అలుసుగా కాదు ప్రశాంత్! ఏవో కొన్ని ప్రోబ్లమ్స్. అంతే” నిష్టూర్చేడు గోపాల్.
“అవునా? ఏంటవి?” సావధానంగా అడిగాడు ప్రశాంత్.
“ఇప్పుడవన్నీ ఎందుకులే ప్రశాంత్” అన్నాడు గోపాల్.
“నో..నో.. ప్రాజెక్ట్ డెడ్ లైన్ లోపు కంప్లీట్ అవ్వాలంటే ఎంప్లాయ్ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే సాధ్యమవుతుంది. వీకెండ్ పార్టీలు, మూవీలు కంపెనీ ఆఫర్ చేస్తున్నా ఇంకా బాధలు, భావోద్వేగాలు మనస్సునిండా నింపుకుంటే వర్క్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం చెప్పు? కావాలంటే రెండు రోజులు శెలవు తీసుకో కాని డల్ గా మాత్రం వర్క్ చేయొద్దు” చెప్పాడు ప్రశాంత్.
“శారీరిక అలసట అయితే శెలవు తీసుకుంటే సరిపోతుందికాని మానసికంగా అయితే తీసుకున్నా వృధానే! శెలవులు వద్దులే ప్రశాంత్. అవసరమున్నప్పుడు తీసుకుంటాలే” అన్నాడు గోపాల్.
“చూడు గోపాల్ మనస్సులో ఏదో ఉంచుకొని ఒక్కడివే బాధపడడం దేనికి? ఐ యాం లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్. అదేంటో చెప్పు. సొల్యూషన్ ఉంటె ఆలోచిద్దాం” భారోసానిచ్చాడు ప్రశాంత్ భుజంపై చేయి వేస్తూ.
కొన్నాళ్ళ నుంచీ వేధిస్తున్న సమస్య. మనోవేదనకు గురిచేస్తున్న సమస్య. మనస్సును కుదురుగా ఉండనివ్వక ఇబ్బంది పెడుతున్న సమస్య గురించి చెప్పేశాడు గోపాల్. బాధను మేనేజర్ ముందుంచాడు.
“అమ్మాయి రంజనికి పద్నాలుగు సంవత్సరాలు నిండాయి. అందరితో కలివిడిగా ఉండగలదు. మేము తనతో సరిగ్గా గడపలేకపోయినా బాధపడదు. అబ్బాయి హరికి పది సంవత్సరాలు. కాని వీడలా కాదు. ప్రతి దానికీ మూడీగా కూర్చుంటాడు. మాతోనూ సరిగ్గా మాట్లాడడు. పలకరించినా ముభావంగానే ఉంటాడు. రోజులు గడుస్తున్నాకాని వాడిలో మార్పు రావడం లేదు. అనుమానమొచ్చి తన టీచర్ ను కలిస్తే బడిలో కూడా అలాగే ఉంటున్నాడని, తోటి వాళ్ళతోనూ కలవడం లేదని తెలిసింది. చిన్నప్పుడు బాగానే ఉండేవాడు. రాన్రాను వాడలా మారిపోతుంటే నాకు భయమేస్తుంది ప్రశాంత్. సుధకు చెప్తే పిల్లలంతేలే, వారే మారతారులే అంటుంది. తనూ చిన్నప్పుడు అలాగే ఉండేదాన్నని, పెళ్లి చేసుకున్నాకే బాగా మారానని సమర్ధిస్తుంది. అవును పెళ్ళయ్యాకా బాగా మారిందిలే! ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడలా చలనం లేకుండా ఉంటుంటే మనసుకెంతో బాధగా ఉంది ప్రశాంత్. ఏం చేయాలో తెలియడం లేదు” కంటతడి పెట్టుకున్నాడు గోపాల్.
“నో..నో..నో.. అమ్మాయిలు నవ్వినా, కన్నీళ్లు పెట్టినా అందంగా ఉంటుంది కానీ అబ్బాయిలలా చేస్తే విడ్డూరంగా ఉంటుంది. బాధపడకు. నువ్వు కరెక్ట్ పర్సన్ కె చెప్పావ్” ఓదార్చే ప్రయత్నం చేశాడు ప్రశాంత్.
“కంగారు పడకు.కొత్త పరిచయమొచ్చి పాత పరిచయాన్ని మరుగున పడేసినప్పుడు, పాత పరిచయమే మరో కొత్త పరిచయంలా ఎదురై నిలదీస్తే, అది నేటి మానవ సంబంధాలకు ఓ మచ్చు తునక.మనలో సంబంధాలలా తయారవుతున్నాయి.తల్లంటే ఓ త్యాగం. తండ్రంటే ఓ త్యాగం. బిడ్డకోరకు త్యాగం చేసి వాత్సల్యమని పేరు పెడతారు.ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. మీ పిల్లలకోసం వారి భవిష్యత్ కోసం బాగా సంపాదించాలని యాంత్రిక జీవనంలో పడిపోయారు. పనుల ఒత్తిడుల వలన పిల్లల పెంపకంపై శ్రద్ధ పెట్టలేక పనిమనిషిని పెట్టుకున్నారు. బిడ్డలకు తల్లి చేయగలిగినవి పనిమనిషి చేయగలిగినా అమ్మే ఇవ్వగలిగిన చేతి స్పర్శను, నాన్నే పంచివ్వగల ఆత్మీయతను పనిమనిషి ఇవ్వగలదా ఒక్కసారి ఆలోచించు గోపాల్. పెద్దిల్లు కట్టడం, కారు కొనడం మన ఆర్ధిక ఎదుగుదలను సూచిస్తుందికాని మన పిల్లలు సరైన మార్గంలో నడుచుకున్నప్పుడే టెక్నికల్ గా మనం ఎదిగినట్లు” అన్నాడు ప్రశాంత్.
“నువ్వెందుకు చెప్తున్నావో అర్ధమవుతుంది కాని హరి పరిస్థితిని మార్చడమెలాగో తెలియడం లేదు ప్రశాంత్?” అడిగాడు గోపాల్.
“ఎందుకు లేదు? ఆ మార్గం నేనే. నా అనుభవమే” చెప్పాడు ప్రశాంత్.
“ఏంటి మీరా? కాస్త వివరంగా చెప్పండి ప్లీజ్” అన్నాడు గోపాల్ కొడుకు మీద ప్రేమతో.
“మన సాఫ్ట్ వేర్ రంగం ఇళ్ళల్లో ప్రతి గడపలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. హరిలాగానే మా అబ్బాయి విక్రమ్ విషయంలోనూ జరిగింది. పనుల ఒత్తిడులవలన వాడిన సరిగ్గా పట్టించుకోలేదు. దాంతో మాపై కోపం, నలుగురిలో తిరిగే మనస్థత్వం రాకపోవడంతో ప్రోగ్రామింగ్ కోసం ఎంతలా ఆలోచించేవాడినో అంతలా వాడిగురించి ఆలోచించాక సైకాలజిస్ట్ ను కలిశాను. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది” అన్నాడు ప్రశాంత్.
“అవునా.? సైకాలజిస్ట్ ఏమన్నాడు.? ఎలా సాల్వ్ అయ్యింది” గోపాల్ కళ్ళల్లో ఆనందం వికసించింది. ఆత్రుతగా వింటున్నాడు. గడియారాన్ని చూస్తూ ఆరోజు జరిగినదంతా వివరంగా చెప్పనారంభించాడు ప్రశాంత్.
* * * * * *
“ఆఫీస్కి లీవ్ పెట్టి డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున విక్రమ్ ను తీసుకెళ్ళి కలిశాను. ఆయన ఆఫీస్ మన ఆఫీస్ కేం తీసిపోలేదు. ప్రశాంతంగా ఉంది. ప్రాబ్లమ్ అంతా ఆయనకీ చెప్పి ఏదైనా పరిష్కారం చూపమని అడిగాను. నన్ను బయట వెయిట్ చేయమని పంపించారు. ఏం చేశారో తెలియదుకాని పావుగంట తర్వాత లోపలికి పిలిస్తే వెళ్లాను. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. తేడాలెం కనిపించలేదు.
“కంగారు పడాల్సిన పనేం లేదు. మీ పెంపకంలో ప్రేమాభిమానం, ఆత్మీయత చిన్నపట్నుంచి లోటుందన్న సంగతి బాబుతో మాట్లాడాకే తెలిసింది. తనలో ఆ బాధ లోతుగా ఉండిపోయింది. అది తీరాలంటే మీరే అతనికో వ్యాపకమవ్వాలి. మందులెం అక్కర్లేదు” అని ముగించాడు డాక్టర్ గారు.
“వ్యాపకమా?” అంటే ఏం చేయాలని అడిగాను. “పిల్లాడిలో ఐ.క్యూ. లెవెల్స్ చాలా తక్కువుగా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగయిన మీకీ వాటిని పెంచడం పెద్ద విషయమేమీ కాదు. ముందు బాబుతో క్లోజ్ గా మూవ్ అవ్వండి. తనతో కలిసి ఉండండి. ఏదో ఒక వ్యాపకం ఏర్పరచండి” అని చెప్పాడాయన.
ఖాళీగా ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడడమో, ఆన్ లైన్ గేమ్స్ ఆడడమో, టీవీ చూడడమో ఏదోకటి చేస్తూనే ఉంటాడని చెప్పాన్నేను. బాబుని కాసేపు బయట ఉండమని పంపించి నాతో పర్సనల్ గా చాలా సేపు విసుగు చెందకుండా మాట్లాడారు.
“టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వ్యాపకాలు కావండి. అలవాట్లు మాత్రమే. రోజూ చేసేవాటిని అలవాట్లంటాం. దినచర్యలా మారిపోతుందే తప్ప పెద్దగా ఒరిగేదేం ఉండదు. మానసిక దృక్పధాన్ని పెంచవు. ఐ.క్యూ. లు పెరగకపోవడానికి ఇదో కారణమే!పిల్లలనే కాదు ఎవరైనా ఏదోకటి చేస్తూనే ఉండాలి. వృత్తి, ప్రవృత్తి అని రెండుంటాయి. వృత్తి, ప్రవృత్తి ఏదైనా కావొచ్చు. వృత్తినేలా దైవంగా భావిస్తామో ప్రవృత్తిని కూడా భావించి చేయాలి.వేరేవాడికోసం చేసేది వృత్తి. మనకోసం మన ఆసక్తిపై చేసుకునేది ప్రవృత్తి. ఒకరకంగా చూస్తే వృత్తి కన్నా ప్రవృత్తిపైనే మనసేక్కువ పెడతాం. దురదృష్టమెంటంటే మీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో రోజుకు ముప్పావంతు వృత్తి జీవితమే, వ్యక్తిగత జీవితానికికాని ప్రవృత్తికికాని చోటెక్కడ.? మీలాంటి కేసులు బాగా పెరిగిపోతున్నాయి” అనికాస్త నిరాశ చెందాడాయన.
ఏం చేస్తాం. ఆయన బాధ ఆయనిది, మన బాధ మనది. వర్కలా ఉంటుంది మరి. అంతేసి జీతాలు ఊరికే ఇవ్వరు కదా మనకి.! అదే విషయాన్ని సూటిగా అడిగాను.
“నిజమే! అంతేసి జీతం మీ అబ్బాయిని మార్చిందా? ఈ స్థితి రాకుండా కాపాడగల్గిందా?” అని ఆయన అనేసరికి నాకు షాక్ కొట్టినట్లు అయ్యింది. దిమ్మ తిరిగిపోయే ప్రశ్న వేశారు.
“ప్రవృత్తంటే బుక్ రీడింగ్ కావొచ్చు, గార్డెనింగ్ కావొచ్చు, సమాజ సేవ కావొచ్చు, ట్యూషన్ చెప్పడం కావొచ్చు, కవిత్వం రాయడం కాని, కథ రాయడం కాని కావొచ్చు, ఎదురెదురుగా కూర్చొని మైండ్ గేమ్స్ ఆడడం కావొచ్చు. అవన్నీ మన మేధోసంపత్తిని పెంచుతాయి.ప్రవృత్తి మనస్సు తృప్తికి. అలవాట్లు టైంపాస్ కు.ప్రత్యక్షానికి, పరోక్షానికి, అనుభవానికితేడా ఎంతుందో దీంట్లో కూడా అంతే వ్యత్యాసముంది. టీవీలో‘ఎప్పుడు? ఎక్కడ? ఎలా?’ అని వాళ్ళే విడమర్చి చెప్పి చూపిస్తున్నప్పుడు మన ఆలోచనలకు, ఊహాశక్తికి పని చెప్పాల్సిన అవసరమేముంది? ఒకసారి పూర్తిగా ఆడేస్తే వీడియో గేమ్ లో ఇంకేం కొత్తగుంటుంది? ఇవన్నీ సమయాన్ని వృధా చేస్తాయే తప్ప ముందుకు తీసుకేళ్ళవు. కాని జీవితంలో ఎన్నో దార్లుంటాయ్ కదండీ” అన్నారాయన.
నాకే అంతలా విడమర్చి చెప్తున్నారో లేక అందరి పేషెంట్స్ కుకూడా అలాగే చెప్తున్నారో తెలియదు కాని ఆయన చెప్పాలనుకున్నది మాత్రం కుండ బద్దలుకొట్టినట్లు ఖరాకండిగా చెప్తున్నారు. ఆయన చెప్పేది వాస్తవ పరిస్థితుల గురించి కావడంతో నేను కూడా త్వరగానే కనెక్ట్ అయ్యాను.
కొనసాగిస్తూ“పాఠశాలలో పాఠం నేర్చుకొని పరీక్ష రాస్తాం. జీవితంలో పరీక్ష రాసి గుణపాఠం నేర్చుకుంటాం.అదేదో ముందే మేల్కుంటే మన జీవితాల్ని నచ్చినట్లు మార్చుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. మీలాంటి ఉద్యోగులు ఇది గుర్తెరగకపోతే పిల్లలకు ఆత్మీయత కరువై సమాజంపైనే అసహ్యం కలగొచ్చు. ‘అందరూ ఇంతే’ ననే ఒక విచిత్రమైన ధోరణికి అలవాటు పడిపోవచ్చు. లక్షణాలన్నీ పేరెంట్స్ నుండే వస్తాయనుకుంటే పొరపాటే.! సమాజం నుంచి నేర్చుకునే విషయాలెన్నో. ఇంట్లో ఎవ్వరికీ సిగరెట్టు త్రాగడం, మందు కొట్టడం, జూదం ఆడడం లేకపోయినా తమ పిల్లలకు రావనుకోవడం ఎంత పొరపాటో, బాబు పరిస్థితి కూడా అంతే. వయసు పెరిగే కొద్దీ అతనెలా మారతాడో చెప్పలేం” అన్నాడాయన.
మన క్లయింట్లకు మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఎంతలా వివరిస్తామో ఆయనంతలా చెప్పాడు. కాసేపు నేనేం మాట్లాడలేదు. విక్రమ్ విషయంలో ఏం చేద్దామని చివరి ప్రశ్నగా అడిగాను.
“ఉద్యోగస్తులకు వృత్తి, ప్రవృత్తి ఎంత ముఖ్యమో విద్యార్ధులకు చదువు, వ్యాపకం అంతే ముఖ్యం.మీ వ్యక్తిగత జీవితంలో కొంత సమయాన్ని తగ్గించుకొని పిల్లాడు కోసం కేటాయించడమే మీరు చేయాల్సింది. పజిల్స్ ఇచ్చి పూర్తి చేయమనండి, బొమ్మలు గీయమని వాటికి రంగులు వేయమని చెప్పండి. దినపత్రికల్లో వారం వారం వచ్చే మేగజీన్ వారికి అందివ్వండి. ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమని అడగండి. గ్రౌండ్ కు తీసుకెళ్ళి తోటివాళ్ళతో ఆడుకునేలా ప్రోత్సహించండి. అతని ఇష్టానిష్టాలేంటో తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకోండి. అందరూ కలిసి ఒకేసారి కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మనస్సు విప్పి మాట్లాడుతూ వారి కోరికలేంటో తెలుసుకోండి. ముఖ్యమైతే తీర్చే ప్రయత్నం చేయండి. ఇలాంటివెన్నో చేయొచ్చు. చిన్న చిన్న విషయాలేగా అని పట్టించుకోకపోతే అవే పెద్ద తుఫాన్ లా మారి వాళ్ళ గుండెల్లో అలజడి రేపవచ్చు.బయట వ్యక్తులకన్నా తమ కన్నవారి ప్రవర్తనా తీరుపైనే పిల్లల ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటేతల్లీదండ్రులే పిల్లలకు మొదటి గురువులు కాబట్టి. వారిని దగ్గర్నుంచి చూస్తారు. వాళ్ళలా చేయాలని ప్రయత్నిస్తారు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి. మీరు మీ అబ్బాయితో కలివిడిగా ఉండగల్గితే మారతాడు. ఇంకేం ఆలోచించకుండా ముందెళ్ళి చెప్పినట్లు చేయండి” అని ముగించారు.
ఆఫీసులో మన పరిస్థితి తెలియంది కాదు. ఇన్ని టెన్షన్స్ మధ్యలో వాళ్ళకంత టైం కేటాయించడమంటే కుదిరే పనికాదు. అంత టైం కేటాయించేకన్నా ప్రాజెక్ట్ మీద పెడితే డెడ్ లైన్ కన్నా ముందే పూర్తి చేసేయొచ్చు అనే అభిమతంలు ఉంటాం. అదే విషయాన్ని లేవనేత్తేసరికి కంఠం పెంచుకుని -
“సైకాలజిస్ట్ అంటే సైన్సు ను చెప్పడం కాదు, వ్యక్తుల మనస్థత్వాలను అర్ధం చేసుకుని వాళ్ళెం కోల్పోతున్నారనే విషయాల్ని తెలుసుకొని వాటిని వారికి అందించమని చెప్పే శాస్త్రం. విద్యావంతులైన మీరే ఇలా మాట్లాడితే ఎలాగండి? మీరు ఎంత సంపాదించినా అది మీ పిల్లలకోసమే కదా.! వారితో బంధం లేనప్పుడు రేపు నలుగురిలో మిమ్మల్ని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు సంకోచిస్తే ఏం చేస్తారు.? ఆలోచించండి. మంచి కొడుకయ్యారు అలాగే మంచి తండ్రి కూడా అవ్వండి. సమాజంలో మీస్థానం గొప్పదే కావొచ్చు కాని మీ కుటుంబంలో మీకు స్థానం లేకపోతే ఇంకెందుకు? టైం కేటాయించాలి. ఇరవైనాలుగు గంటల్ని ప్లానింగ్ చేసుకోండి. ఈ రోజు చెప్పి వీలుపడినప్పుడు చెక్ చేయండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, కాని సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే దేన్నీ వదులుకోనక్కరలేదు. అర్ధమైందనుకుంటాను” అన్నారాయన.
అంతే ఒక్కసారిగా జలదరింత మొదలైంది. ‘తన ఫ్రెండ్స్ దగ్గర నా గురించి చెప్పుకోవడానికే సంకోచిస్తాడేమో’ అన్నప్పుడు చెమ్మ మొదలైంది.
నన్నీ పొజిషన్లో చూడాలని మా నాన్నగారు ఎంత కష్టపడ్డారో, ఎన్ని కలలుగన్నారో ఆయన గురించి ఎంత పొగిడినా తక్కువేనని మీటింగ్స్ లో చెప్పుకునేటప్పుడు ఎంతో పులకరించిపోయేవాడిని. అలాగే నా కొడుకు నేను గుర్తుకొచ్చినప్పుడు బాధపడకూడదని, గర్వంగా చెప్పుకోవాలని, ధైర్యంగా తలెత్తుకొని తిరగాలని నాకు మాత్రం ఉండదా? అందుకే అక్కడనుంచి విక్రంను తీసుకొని వచ్చేశాను.
పేరెంట్స్ అంటే పిల్లల్ని కనడం, వారికి కావాల్సినవి అందివ్వడమే అనుకుంటాం కాని సమాజానికి ఉపయోగపడే, సమాజాన్నే మార్చేసే రేపటి తరాన్ని ఇస్తున్నామనుకోం. పేరెంట్స్ పిల్లల కోసం త్యాగాలు చేస్తారంటారు కాని అవి త్యాగాలు కావు. అదో బాధ్యత.పుత్రోత్సాహం కోసం ఏం చేసినా అందులో త్యాగం కనిపించదు. బాధ్యతే కనిపిస్తుంది. ప్రేమకన్నా బాధ్యతే గొప్పదని అర్ధమైంది. అమ్మ నడక నేర్పిస్తే నాన్న నడవడిక నేర్పిస్తాడంటారు.నేనిప్పుడు చేస్తున్నదదే! పిల్లల కోసం కొంచెం వెనక్కి తగ్గకపోతే మన కంపనీలో మరో గొప్ప పొజిషన్లో ఉండేవాడినే. డాక్టర్ గారు నా మెదడుకు పట్టిన బూజును తన మాటల ఈకలతో తుడిచేయ్యడంతో అర్ధమైంది. నా విక్రమ్ సమస్యతో నాలోని నాన్నతనం నిద్ర లేచింది”
* * * * * *
“ఇప్పుడు చెప్పు గోపాల్” అడిగాడు ప్రశాంత్ వివరంగా చెప్పడం పూర్తిచేశాక.
చెప్పిందంతా మౌనంగా విన్న గోపాల్ “పిల్లలెలా పెరగాలన్నా, అది వాళ్ళ పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుందని, వాళ్ళు నేర్పించే సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుందని, అదే రేపటి తరానికి సంక్రమించే వరప్రసాదమని” అని చెప్పాడు.
“కరేక్టగా చెప్పారు. కొంతమందిని చూసి సమాజం చెడిపోతుందని గొణకడం దేనికి? పాశ్చత్య పోకడలు విజ్రుంభిస్తున్నాయని గోల చేయడం దేనికి? ఇవన్నీ మనం నేర్పించే పద్దతులపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన సాఫ్ట్ వేర్ కుటుంబాల్లో చాలానే ఉన్నాయి. మీలో మీరు మధన పడుతూ ఉంటే మాకేలా తెలుస్తుంది. వర్కెలా పూర్తవుతుంది?” అన్నాడు ప్రశాంత్.
“సారీ ప్రశాంత్! ఏం చేస్తాం? ఇంట్లో ప్రతీదీ అందరికీ చెప్పుకోలెం కదా! మీరింత లిబరల్ గా ఉంటారనుకోలేదు. సమానమైన హోదా ఉన్నవారితో ఈజీగా కలిసిపోవచ్చు కాని పైహోదాలో ఉన్నవారితో కలవలెం కదా.!మీరింత ఓపిగ్గా చెప్పినందుకు చాల చాలా థాంక్స్” కృతజ్ఞతగా చెప్పాడు గోపాల్.
“ఫర్వాలేదులే గోపాల్. సొల్యూషన్ దొరికిందిగా!పిల్లలు మాత్రం జాగ్రత్త.వాళ్ళే మన ఆస్థి. రేపటి తరానికి ప్రతినిధులు. ఇంకెప్పుడూ డల్ గా ఉండి వర్క్ పెండింగ్ లో పెట్టొద్దు. నౌ యు కెన్ లీవ్” అన్నాడు ప్రశాంత్.
“థాంక్స్ ప్రశాంత్. సొల్యూషన్ చెప్పి నాకో మార్గం చూపించారు” అని మేనేజర్ క్యాబిన్ ను వదిలి తన క్యాబిన్ లోకి వెళ్లి పని హడావుడిలో పడిపోయాడు. సాయంత్రం త్వరగానే బ్యాగ్ సర్దుకున్నాడు.
* * * * * *
“అక్కా!జూకెళ్దామన్నావ్ గా, వెళ్దామా?” అడిగాడు హరి.
“డాడీ వస్తారని మమ్మీ చెప్పింది. వచ్చాక వెళ్దాం” అంది రంజని.
“వాళ్ళలాగే అంటారు. ఎప్పుడూ రారని నీకూ తెలుసుగా. మనమే వెళ్దాం. లేదంటే పనిమనిషిని తీసుకెళ్దాం” సలహా ఇచ్చాడు హరి.
“అమ్మో! ఇంకేమన్నా ఉందా? మమ్మీ కోప్పడుతుంది. అదిగో డాడీ వచ్చినట్లున్నారు” ఆనందంగా అంది రంజని.
“డాడీనా? వచ్చి పడుకుంటాడు కాని మనతో రాడు. మమ్మీని తీసుకెళ్ళమంటారు. ఒకరిమీద ఒకరు వంతులేసుకుంటారు” నిష్టూర్చాడు హరి.
“అడుగుదాం. ఈ రోజన్నా తీసుకెళ్తారేమో” ఆశాభావం వ్యక్తం చేసింది రంజని.
“రారు. వద్దులే” అని వెనక్కి తిరిగి వెళ్తున్నాడు.
కారుని పార్క్ చేసి రెండు ఐస్క్రీమలు పట్టుకొని లోపలికొస్తూ “హరీ” అని పిలిచాడు గోపాల్. వెనక్కి తిరిగాడు హరి.
“ఇవిగో ఐస్క్రీమలు. అక్కకొకటి-నీకొకటి. రా..తీసుకో” అని పిలిచాడు గోపాల్.
సంకోచించాడు హరి.
ఒక్క ఉదుటున వెళ్లి తీసుకొని తమ్ముడికి ఒకటిచ్చి తనొకటి తీసుకుంది రంజని.
“ఏంటి నాన్నా అలా ఉన్నావ్? మనం జూకి వెళ్తున్నాం. అక్క చెప్పలేదా? వెళ్ళు త్వరగా రెడీ అవ్వు” అన్నాడుకొడుకు బుగ్గలను పట్టుకుంటూ గోపాల్.
“డాడీ...జూకా.. నేను రెడీ. డ్రస్ మార్చుకొని వస్తాను” అని లోపలికెళ్ళింది రంజని.
“జూనుండి వచ్చేటప్పుడు రెస్టారెంట్ కూడా వెళ్దాం. ఇష్టమైంది తినొచ్చు” అంటూ ఊరించాడు గోపాల్.
హరి మొహంలో కనిపించీ కనిపించని ఆనందం మొదలైంది.
“అయితే ఇంకెందుకు ఆలస్యం. నేను కూడా డ్రస్ మార్చుకుంటాను. నువ్వు కూడా మార్చుకో” అనిగోపాల్ తన గదిలోకి వెళ్ళగానే హరిలో ఆనందం రెక్కలు విప్పింది.
ఒక్కసారి ఎగిరి గంతేసినంత పన్జేశాడు.
-: సమాప్తం :-

1 comment:

  1. Very Nice Story... Must read all parents... Congratulations to Writer...!

    ReplyDelete

Pages