ప్రక్కింటి అమ్మాయి (కధ) - అచ్చంగా తెలుగు

ప్రక్కింటి అమ్మాయి (కధ)

Share This

(జ)వరాలి కధలు -12
ప్రక్కింటి అమ్మాయి (కధ)

 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)


పల్లెటూళ్ళలో నిఘాలెక్కువనే చెప్పాలి. మన ఇంటికి ఎవరు వచ్చినా చుట్టుప్రక్కల వాళ్ళంతా క్యూ కట్టి " ఏం వదినా? మీ యింటికి ఎవరో వచ్చినట్లున్నారే?" అని మన యింటిపై దాడి చేస్తారు. మన యింటికి వచ్చిన చుట్టం పుట్టుపూర్వోత్తరాలు రాబట్టి ఆ వ్యక్తిని పలకరించి గాని వెనుదిరిగి వెళ్ళరు. నగరాలలో అలా కాదు. ఎవరి గోల వాళ్ళదే! ఎవరింటికి ఎవరొచ్చినా, ఎవరెవరు కలిసి కాపురం ఉంటున్నా, వారి సంబంధబాంధవ్యాలు వీరికి అనవసరం. దానివల్ల బుగ్గలు నొక్కుకొనే అమ్మలక్కల వ్యవహారాలుండవు. ఎవరైనా ఉత్సాహవంతులు వేరొకరి వ్యక్తిగత విషయాలను తమకు చెప్పినా, వారి ప్రక్కవాళ్ళు ' వాళ్ళ జీవితాలు వాళ్ళవి. వాళ్ళెలా పోతే మనకెందుకు? ' అని ఆ అమ్మలక్క ఉత్సాహాన్ని నీరుగార్చేస్తారు. అందుకు కారణం లేకపోలేదు. ఉదయం నిద్రలేస్తే త్రాగే నీళ్ళ దగ్గర నుంచి ఎవరికి వారికి అన్నీ సమస్యలే! ఈ సమస్యలతో సతమతమయ్యేవాళ్ళు ప్రక్కవాళ్ళ సమస్యల గురించి ఏం ఆలోచించగలరు? అలా ఉండటం కూడా ఒక విధంగా మంచిది కాదేమో!
ఇది వివాహమైన కొత్తలో జరిగిన సంఘటన. పుట్టింటివాళ్ళ నుంచి పిలుపు రావటంతో వరాల్ని తీసుకెళ్ళి దించి వచ్చాను. ఉన్న రోజుల్లో వరాలి వాగ్బాణాలు అప్పుడప్పుడు చిరాకు తెప్పించినా, అదో టివి ప్రోగ్రాం లాగా నాకు అలవాటైపోయింది. ఆఫీసునుంచి అలసిపోయి వచ్చిన నాకు కాఫీ యిచ్చి నేను ఆఫీసుకెళ్ళిన దగ్గరనుంచి వచ్చే వరకూ చుట్టు ప్రక్కల జరిగిన విషయాలన్నీ ఏకరువు పెడుతూంటే, కధలకు కరువొచ్చిన యీ రోజుల్లో నాకేదైనా కధాంశం దొరుకుతుందేమోని ఓపిగ్గా వినేవాణ్ణి.(వరాలు పల్లెటూరి అమ్మాయి గనుక ఆరా తీయకపోయిన వీధిలో జరిగే విషయాలపై నిఘా వేయటం అలవాటు లెండి. నేను కూడా అలాంటి వాతావరణంలో పెరిగాను గనుక ఆఫీసు విషయాలు ఆమెకు చెబుతూంటాను.) అప్పుడప్పుడు మన సంప్రదాయాల ముఖ్యోద్దేశ్యమిదంటూ తర్కించి చెబుతూంటే గురువు చెప్పే పాఠాన్ని వినే శిష్యుడిలా తలూపేవాణ్ణి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మన సంప్రదాయాలపై ఆమె తర్కం వింటూంటే మన పెద్దలు ఆయా ఉద్దేశ్యాలతోనే ఆయా సంప్రదాయాలను పెట్టి ఉంటారనిపించేది. అలా కొన్ని విషయాల్లో నాకు గురువుగా వ్యవహరించిన వరాలు లేకపోయేసరికి బుర్ర పిచ్చెక్కినట్లే ఉంది. ఆఫీసునుంచి యింటికొచ్చి కొన్నాళ్ళు ఆ రోజు పేపరు తిరగేస్తున్నా, ఏదో తెలియని ఒంటరితనం. ప్రక్కింటివాళ్ళతో బాతాఖానీ వేయటానికి అదేం పల్లెటూరు కాదు. ముందే చెప్పానుగా! నగరజీవితంలో ఎవరి గోల వాళ్ళదే! జీవితమంతా ఒంటరి పరుగే! అందుకే ఒక వారం రోజులు ఆఫీసునుంచి నేరుగా యింటికి రాకుండా, ఏ బస్టాండులోనో బిచాణా వేసి, సిటీబస్సులోంచి ఎక్కే, దిగే జనాన్ని చూస్తూ, బట్టలదుకాణాల్లో సేల్సుగరల్స్ యిబ్బంది పడేలా (కొనేసే వాళ్ళా పోజుపెట్టి) నాలుగు రకాల బట్టలను చూసి నచ్చనట్లు బయటకొచ్చేస్తూ, కొంత కాలక్షేపం చేసి బజారుకెళ్ళేవాణ్ణి. అక్కడ కూరగాయలు కొనుక్కొచ్చి , యింట్లో మెల్లిగా వంట కానిచ్చి , కడుపునింపి, ఉత్సాహం ఉంటే నాలుగు కాగితాలు ఖరాబు చేసేవాణ్ణి. నిద్రసమయానికి మంచమెక్కినా అప్పుడప్పుడు నిద్ర పట్టేది కాదు. ' ఈ సమయంలో వరాలేం చేస్తోందో?" అని అలిసిపోయేవరకూ ఆలోచించి నిద్రపోయేవాణ్ణి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాణ్ణో గానీ, యిప్పుడు మాత్రం నిత్యం వాగే వరాలు ప్రక్కన లేక ఏదో వెలితిగానే ఉంది. నిజమే! ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాక, దాన్ని మరిచిపోయి మరోలా బ్రతకాలంటే కష్టమే!
ఆరోజు సెలవుదినం. పగలంతా ఎదో పని పెట్టుకొని కష్టపడి, సాయంత్రం డాబామీదకెళ్ళాను. వరాలు ఉన్నప్పుడు సెలవురోజుల్లో, మార్కెట్టు కెళ్ళకపోతే డాబా ఎక్కి దూరంగా కనిపించే పార్కులో పిల్లల ఆటలు చూస్తూ కబుర్లు చెప్పుకొనేవాళ్ళం. ఇప్పుడు వరాలు లేకపోయినా కాలక్షేపానికి పార్కు ఉందిగా! ఆ రోజు బజారుకి వెళ్ళే ఓపిక లేక డాబా ఎక్కి పార్కులోని పిల్లల ఆటలు చూస్తున్నాను. ఇంతలో మా యింటికి నాలుగిళ్ళవతల డాబాపైనుంచి చిన్నపిల్లాడి నవ్వు వినిపించి అటు చూశాను. నా కళ్ళముందు మెరుపు మెరిసినట్లయింది. ఒక చంటిపిల్లాణ్ణి ఎత్తుకొని ఆడిస్తున్న ఇరవై ఏళ్ళ అమ్మాయి కనిపించింది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఆ యింట్లో నాలుగురోజుల క్రితం ఎవరో దిగినట్లు గమనించాను. తరువాత ఆ యింటిపై దృష్టి పెట్టలేదు. ఈరోజు బయటకు వెళ్ళబుద్ధిగాక డాబా మీద కొస్తే ఈ అమ్మాయి కనిపించింది. పిల్లవాడితో ఆడుతూ పార్కువైపు చూపిస్తున్న ఆమె, నేను గమనించటం చూసి డాబా దిగిపోయింది. ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ కళ్ళలో ఏదో ఆకర్షణ. ఆ ముఖంలో ఎదో తేజస్సు. గతంలో నేను చూసిన సినిమాలో ఒక కవి తమ ఊరి పిల్లలను చెడగొడుతోందని ఆ ఊరి ఏటి అవతల ఉన్న ఒక వేశ్య యింటిపైకి దాడి వెళ్ళాడట! కానీ ఆమెను చూడగానే అతనిలోని కవితాత్మ పొంగింది. ఆ కవితాస్ఫూర్తి ప్రేరణతో, ఆమెపై యుద్ధానికెళ్ళిన అతను రోజూ ఆమెను చూట్టానికి వెళ్ళేవాట్ట. అలాగే ఆమె నవ్వు,ఆ ముఖంలో వెలుగు నాలో కవితాస్ఫూర్తిగా మారి ఆ రాత్రి ఒక కధ వ్రాసి పడేశాను. ఆ రాత్రి వరాలికి బదులుగా అమాయికమైన ఆ నవ్వు మొహమే గుర్తు రాసాగింది. మర్నాడు సాయంత్రం ఆఫీసు వదలగానే తిన్నగా యింటికొచ్చి, చిన్నగా ముస్తాబై డాబా మీద కెళ్ళాను. అప్పటికే తమ డాబా మీద ఉన్న ఆమె, నన్ను చూసి పారిపోలేదు. ఆ పిల్లవాడితో తమ డాబాలో ఆ చివరికెళ్ళి అప్రయత్నంగా తన వోణీ కొంగును పెదాల మధ్య బిగించి పిల్లవాడితో అక్కడక్కడే తిరగసాగింది. ఆ పిల్లాడు హుషారుగా అల్లరి చేస్తున్నా, ప్రతిస్పందించక మౌనంగా తిరుగుతోంది. ఆమెలో సిగ్గు అన్న కొత్తకోణాన్ని చూశాక నాలో కవి మరింత పేట్రేగిపోయాడు. దొంగచూపులు మాని తిన్నగా ఆమెనే చూస్తుంటే అరగంట సేపు అక్కడే తిరిగి, క్రిందకు వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం బండిపై ఆఫీసుకి వెడుతూంటే, మా యింటిప్రక్క దుకాణం నుంచి వస్తున్నట్లుగా నాకు ఎదురు వచ్చింది. అలా వారం రోజులు మౌనంగానే ఒకరికొకరు ఎదురుపడుతూ, సాయంత్రాలు డాబాపై చూపులతో పలకరించుకొంటూ సన్నిహితమవుతున్నాం. వారం తరువాత, స్కూటరు ఆపి " మీరు ఆ యింట్లో కొత్తగా దిగారు కదూ!" అన్నాను. అనుకోని ఆ పలకరింపుకి ఆమె కంగారుపడింది. తలవంచుకొనే "ఔనండీ" అని బదులిచ్చి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం డాబా మీదకొచ్చి పిల్లవాణ్ణి పలకరిస్తున్నట్లు చేయి ఊపాను. తను కూడా ఆ పిల్లవాడి చేతిని పట్టుకొని చేయి ఊపింది. నాలో కవిగాడు ఆ రాత్రి మరింత రెచ్చిపోయాడు. ఒక్క క్షణం నా మనసు ' కన్నెపిల్ల ఆశలతో ఆడుకొంటున్నావేమో! ఆలోచించు ' అని హెచ్చరించింది. నాలో కవిగాడు ఆ హెచ్చరికని కొట్టి పడేశాడు. రెండురోజుల తరువాత బజారు మీదుగా రావటంతో కొంచెం ఆలశ్యమైంది. కూరగాయల సంచి కుర్చీలో పడేసి అలాగే డాబామీద కెళ్ళాను. ఒంటరిగా తమ డాబాపై తిరుగుతున్న ఆమె నన్ను చూడగానే క్రిందకు వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్ళిపోయిందో అర్ధంగాక జుట్టు పీక్కున్నాను. అంతలో మా గేటు తీసుకొస్తున్న ఆమెను చూసి గుండె ఝల్లుమంది. " చెబితే విన్నావా? తనకు రోజూ చేతులూపుతున్నావని హెచ్చరించటానికో, నీతో ఉండిపోడానికి తమ యిల్లు వదిలేసో వచ్చి ఉంటుంది" అని మనసు వికృతంగా నవ్వింది. వణుకుతున్న కాళ్ళతో మెట్లు దిగాను.
" ఏంటిలా వచ్చారు? " వీధి తలుపు తీస్తూ అడిగాను..
"ఈరోజు ఆఫీసులో ఆలశ్యమైనట్లుంది?" అంది. ఎప్పుడు ఆలశ్యమైనా వరాలు యిలా అడగలేదు. అప్పుడే ఈమె ఆలశ్యానికి కారణం అడిగి తన అధార్టీ చూపిస్తోంది.
" లేదండీ! కూరగాయలకోసం మార్కెట్టుకెళ్ళాను. అందుకే ఆలశ్యమైంది" అప్రయత్నంగానే సంజాయిషీ యిచ్చుకొన్నాను.
"లోపలకి రండి" మర్యాదగా పిలిచాను.
" లేదండీ! ఇంట్లో అమ్మకు చెప్పలేదు. కంగారు పడుతుందేమో!" అంది.
" ఇలా గుమ్మంలో నిలబడి మాట్లాడటం మంచిది కాదు గదా! " అనగానే లోపలి కొచ్చింది.
"ఒంటరోణ్ణి కదా! ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. తిట్టుకోకండి" అంటూ కుర్చీలోని కూరలసంచీని గోడవార నేలపై ఉంచి, కుర్చీని ఆమె ముందుకు తోశాను.
' వరాలుంటే అన్నీ చూసుకొనేదని కూడా చెప్పు" అని అంతర్గతంగా అరుస్తున్న మనసు నోరు నొక్కేశాను.
మొహమాటంగా కుర్చీలో కూర్చుంటూ " నా పేరు శైలజ. బి.కాం పాసయ్యాను" తనను పరిచయం చేసుకొందామె.
నేనూ నా పేరు చెప్పి, " పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోయారా?" అన్నాను.
"ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. దానికి కొన్ని పుస్తకాలు కావాలండీ! ఇక్కడ షాపుల్లో దొరకలేదు. మీరు ఆఫీసునుంచి వచ్చేటప్పుడు పెద్దబజారులోంచే వస్తారు కదా! నాకా పుస్తకాలు తెస్తారా?"
"తప్పకుండా! ఆ పుస్తకాల లిస్ట్ యివ్వండి" అన్నాను.
" ఏం మగాళ్ళురా మీరు? ఇంట్లో వరాలికి ఓపికలేక ప్రక్కవీధిలో సంతనుంచి కూరగాయలు తెమ్మంటే సణుక్కొంటారు! పక్కింటి అమ్మాయి అడిగితే సై అంటారా?" నోరు నొక్కేసినా, మనసు అరుస్తూనే ఉంది.
ఆమె లిస్ట్ తో బాటు డబ్బులిస్తూంటే వద్దన్నాను.
" పుస్తకాలు తెచ్చాక డబ్బులివ్వొచ్చు. ప్రస్తుతానికి మీ దగ్గరే ఉంచండి" అని లిస్ట్ జేబులోకి తోసేశాను.
"వస్తానండీ!" అని లేవబోతున్న ఆమెను కూర్చోమని వంటింట్లోకెళ్ళాను. కాఫీ కలిపి కప్పుల్లో పోసి తెచ్చే సమయానికి, ఆమె బల్లపై ఉంచిన నా డైరీ తీసి చదువుతోంది.
" కాఫీ " నా గొంతు విని త్రుళ్ళిపడి డైరీ మూసేసి బల్లపై పెట్టేసింది.నా చేతిలోని కాఫీకప్పు అందుకొని కుర్చీలో కూర్చుంది. .
"మీరు కవితలు వ్రాస్తారా?" అడిగింది.
"కవితలు, కధలు. . .ఏది తోస్తే అది. ." అన్నాను.
" సారీ! పుస్తకాలంటే నాకు పిచ్చి. కంటికి ఏ పుస్తకం కనిపించినా తెరిచి చూడకుండా ఉండలేను. మీ అనుమతి లేకుండా చదివాను"
"ఫరవాలేదు. మీలాంటివారు చదివితేనే కద మా రాతలకో గుర్తింపు " మెలికలు తిరిగిపోయాను.
"అనామిక కవిత బాగుంది. ఆ పేరెందుకు పెట్టారో చెప్పగలరా?"
" అతను చూశాడు. నచ్చింది. మనసులో ముద్రపడిపోయింది. పేరేమిటో తెలియదు. అందుకే అనామిక అని పిలుచుకొన్నాడు" అన్నాను. నా సమాధానానికి తలవంచిన ఆమె సిగ్గులమొగ్గే అయింది.
" కవిత సరే! కాఫీ ఎలా ఉందో చెప్పలేదు"
"అన్నిపాళ్ళు సరిగా కుదిరాయి" అంటూ కప్పు నా చేతికిచ్చింది.
"వస్తాను" ఆమె గొంతులోని మార్దవానికి లోకం మరిచిన నేను తేరుకొనేసరికి ఆమె కళ్ళకి కనిపించలేదు. రూపమే కాదు ఆమె గొంతు కూడా వీణానాదంలా వీనులకు విందు చేసింది. మరునాడు ఆమె అడిగిన పుస్తకాలను తెచ్చి యిచ్చాను.
ఉదయాన ఆమె ఎదురొచ్చి నన్ను ఆఫీసుకి పంపటం, సాయంత్రం డాబాపై నేను ఆమెకి చేతినూపటంతో రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను ముస్తాబై డాబామీదకు వెడదామనుకొంటుండగా ఎవరో తలుపు కొట్టినట్లై వెనక్కి చూశాను. అపర సరస్వతిలా ముస్తాబై ఉన్న శైలజ కనిపించి హృదయం ఉప్పొంగింది.
"శైలజలో యీ కొత్తదనానికి కారణమేమిటి?" నా ప్రశ్నకు కొద్దిక్షణాలు సిగ్గుతో మెలికలు తిరిగింది.
"నా పుట్టినరోజు" చెప్పిందామె.
"ఆ విషయం ఉదయమే తెలిస్తే ఏదో బహుమతి తెచ్చేవాణ్ణిగా"
"మీ 'అనామిక 'నివ్వండి. చాలు"
"అక్షరాలు లక్షల విలువ చెయ్యవుగా"
"అభిమానం ఉన్నచోట అక్షరాలే లక్షలు. మీరలా మంచంపై కూర్చోండి" ఆమె ఆదేశాన్ని శిరసావహిస్తూ కూర్చున్నాను. ఆమె వంగి నా పాదాలకు నమస్కరించింది.
"త్వరలోనే ఒక యింటిదానివై సుఖంగా ఉండాలి" అని ఆశీర్వదిస్తూ ఆమె భుజాలు పట్టుకొని లేపాను.
ఆమె బుగ్గల్లో ఎర్రదనం చూసి త్రుళ్ళిపడ్డాను. వెంటనే కారణం గ్రహించి, ఆమె భుజాలు వదిలేశాను.
ఆమె బయటకు వెళ్ళినట్లు వెళ్ళి, గుమ్మంలో పెట్టిన కేరేజీతో తిరిగి వచ్చింది.
" ఏమిటిది?" అడిగాను.
"నా పుట్టినరోజు కదాని. . . పులిహోర, పరమాన్నం, బూరెలు. . .నేనే చేశాను. తొలిప్రయత్నం. ఎలా ఉన్నాయో చెప్పాలి?"
"బూరెలా? నాకు చాలా యిష్టం" అంటూ కేరేజీ తెరచి ఒక బూరె బయటకు తీశాను. దాన్ని రెండు భాగాలు చేసి ఒకభాగం ఆమెకివ్వబోయాను. ఆమె తీసుకోవటానికి సిగ్గుపడింది.
"ఫరవాలేదు. మా ఆఫీసులో ఆడవాళ్ళతో, కాగితంలో పోసిన మిక్చర్ని పంచుకు తింటాం. అలా తినటాన్ని తప్పుగా అనుకోం"
నా మాటలకు సిగ్గుపడుతూనే బూరెలో భాగం పంచుకొంది. వెంటనే లేచి వెళ్ళబోయింది.
"అనామికను అడిగారు" గుర్తుచేశాను. తలవంచుకొని నిలబడ్డ ఆమెకు బల్లపై డైరీ తీసి యిచ్చాను.
" అనామికనే కాదు. అన్నీ చదివి యివ్వండి"
నా చేతిలోని డైరీ తీసుకొని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.
ఆరోజునుంచి మా మధ్య స్నేహం మరింత బలపడింది. అప్పుడప్పుడు ఆమె కూరలు, ఆవకాయ, కొన్ని రాత్రులు భోజనం తెచ్చి యిస్తోంది. మొదట్లో మొహమాటపడినా, ఆఫీసునుంచి అలిసిపోయి వచ్చిన నాకు రాత్రి వంట చేసుకోకుండా భోజనం దొరుకుతోందని పొంగిపోతున్నాను. కేరేజీ తెచ్చినరోజు ఆమె తన కాలేజీ జీవితంలో మరపురాని ఘట్టాలను వర్ణించి చెబుతూ చాలాసేపు కూర్చునేది. . నాకు కధలకు సరుకు దొరుకుతోందని ఆమె కబుర్లు వినటం అలవాటు చేసుకొన్నాను. కబుర్లలో పడి ఒకటి, రెండు సార్లు రాత్రి బాగా పొద్దుపోతే, శైలజ అమ్మగారు వచ్చి ఆమెను తీసుకెళ్ళిన ఘట్టాలు ఉన్నాయి.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు ఉదయాన్నే తలుపు చప్పుడైతే హుషారుగా తలుపు తీశాను. గుమ్మంలో వరాలు కనిపించగానే నీరుగారిపోయాను.
"ఏమిటలా నీరసంగా ఉన్నారు? పదిహేను రోజుల్లో వచ్చేద్దామని వెడితే, అనుకోకుండా నెల్లాళ్ళు అయిపోయింది. ఈ నెల్లాళ్ళు నా కోసం బెంగ పెట్టుకొన్నట్లున్నారు" అంటున్న వరాలిని వెర్రినవ్వుతో చూశాను.
" మీ సంగతి నాకు తెలుసుగా! ఇంకెప్పుడు ఊరెళ్ళినా యింతకాలం ఉండనులెండి" సంజాయిషీ యిస్తున్నట్లు చెప్పి యింట్లోకి నడిచింది.
ఆ రోజు ఆఫీసుకి వెడుతుంటే ఎదురుపడ్డ శైలజను గమనించకుండానే వెళ్ళిపోయాను.
సాయంత్రం యింటికి రాగానే ముస్తాబవుతూంటే వరాలు వింతగా చూసింది. శుభ్రంగా కాళ్ళూ చేతులు, ముఖం కడుక్కొని, తల దువ్వుకొని, ముఖానికి పౌడరు అద్ది, డాబాపైకి వెళ్ళబోయాను.
"ఆ అమ్మాయి మరి కనిపించదు లెండి" వరాలు మాట వినిపించి త్రుళ్ళిపడ్డాను.
"అమ్మాయా? అమ్మాయేమిటి?" అంటున్న నా చేతిలో డైరీ ఉంచింది.
డైరీ చూడగానే నా గుండె జారిపోయింది.
"ఈ. . .ఈ డైరీ.. "
"మీరెవరికి యిచ్చారో వారే తెచ్చి యిచ్చారు" నా కాళ్ళకింద భూమి చీలిపోయినట్లనిపించింది.
"కలం పట్టుకొన్న ప్రతీవాళ్ళకూ యిదో అలవాటు. ఆధునిక కవులు కద! కలల్లోని ప్రేయసికి కలంతో నుదుట తిలకం దిద్దుతారు. కట్టుకొన్న యిల్లాలి ఆశలను మాత్రం ఆ తాళిబొట్టుతోనే ఉరి తీస్తారు" వరాలు సణిగింది. మధ్యాహ్నం ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఊహించాను.
"అడిగేదేదో తిన్నగా అడగొచ్చుగా!" కోపాన్ని ప్రదర్శించాలనుకొన్నా, నాకు ధైర్యం చాలక గొణిగాను.
"మధ్యాహ్నం శైలజ అమ్మగారొచ్చారు" వరాలు చెప్పింది విని వెన్నులో వణుకు పుట్టింది.
" ఆ అమ్మాయి పేరు శైలజా?"
" అబ్బా! పేరు తెలియకుండానే పరిచయం పెంచుకొన్నారన్నమాట!"
" పలకరించినంతమాత్రాన పేరు తెలుసుకోవాలని ఉందా?" బుకాయించబోయాను.
" అమాయకులు! సర్లెండి. వాళ్ళ అమ్మగారు ఎందుకొచ్చారో అడగరేం?"
"ఎందుకటా?"
"మీకు సంబంధం మాట్లాడదామని" వరాలు మాట బాంబులా పేలింది.
"నాకు సంబంధమేమిటోయి? నువ్వున్నావుగా!"
" నేను ఉన్నానని మీకు తెలుసు. నేను ఊళ్ళో లేనప్పుడు ఆ యింట్లో దిగినవాళ్ళకేమి తెలుస్తుంది?" వరాలు ప్రశ్నకు ఏదో చెప్పబోయాను.
"చెప్పేది వింటారా?"
చెప్పమన్నట్లు తలూపాను.
"మధ్యాహ్నం భోజనం చేసి యిల్లు సర్దుతుండగా ఆవిడ వచ్చారు. తనను తాను పరిచయం చేసుకొన్నారు. సరే! పట్నవాసం వాళ్ళలా కాకుండా యింటికొచ్చి పలకరిస్తున్నారు కదా అని కూర్చోమన్నాను. ఆ మాటా యీ మాటా చెబుతూ, " మీ అన్నయ్యగారికి మా పిల్లని అడుగుదామని వచ్చాను" అంది.
`నాకు సొంత అన్నలు లేరు. మా భజగోవిందం బాబయ్య కొడుకు పదహారేళ్ళవాడు. వాడు నాకు తమ్ముడే గాని అన్నయ్య కాడుగా! మరి యీ అన్నయ్య ఎక్కడనుంచి వచ్చాడు?' అని ఆలోచిస్తూంటే ఆమె మీ పరిచయ వివరాలన్నీ చెప్పింది. మీరు యిన్నాళ్ళూ శ్రీరామచంద్రులు అనుకొన్నాను. నేను ఊళ్ళో లేనప్పుడు మీరు యింత కధ నడిపారని ఆవిడ చెబితేనే తెలిసింది" వరాలి మాటలకు నాకు ఒకింత కళ్ళు తిరిగినట్లనిపించింది. ఎలాగో సముదాయించుకొని నా గొంతు సవరించుకొన్నాను.
"అదికాదు వరాలూ! ఆ అమ్మాయిని చూస్తే నాలో ఏదో కవితాస్ఫూర్తి నిద్రలేచినట్లనిపించింది. ఆమెను చూసినా, మాట్లాడినా నాలో ప్రేరణ కలిగి కాస్త పరిచయం పెంచుకొన్నాను. అంతేకానీ నాలో మరో దురుద్దేశం లేదు" సంజాయిషీగా చెప్పాను.
"మీరిలా ప్రేరణ యిచ్చిన ప్రతీ ఆడదాని వెంట పడితే, వాళ్ళ వాళ్ళు మరోలా అనుకొని మిమ్మల్ని జైల్లో తోయించేస్తారు. మనం విదేశాల్లో ఉంటున్నామా-కనిపించిన ప్రతి ఆడపిల్లతో కరచాలనం చేయటానికి? `మీరు నాకు అన్న కాదు, భర్త ' అని చెప్పగానే ఆమె ఎంత చులకనగా చూసిందో మీకేం తెలుసు? ఆ చూపుకి సిగ్గుతో చచ్చిపోయాను. మీరు కవితాస్ఫూర్తితో కాదు, నా వల్ల ఏదో యిబ్బంది ఉండి, వాళ్ళ అమ్మాయి వెంట పడ్డారన్నట్లు ఆమె చూసింది" వరాలు గొంతు గద్గదమైంది.
అమ్మయ్య! ఆమె గొంతు బొంగురోయిందంటే నామీద నమ్మకం పోలేదన్నమాట! అందుకే అణ్వస్త్రాలు సంధించలేదు.
"నువ్వు తప్పుగా అనుకోపోతే అదే చాలు " అంటూ డాబామీద కెళ్ళే ప్రయత్నం విరమించి వరాలిని మంచి చేసుకొనే పనిలో పడ్డాను.
"ఆటవికయుగంలో బంధుత్వంతో సంబంధం లేకుండా ఆడదాని వెంట ఆమె చుట్టూ ఉన్న మగాళ్ళెందరో పడేవారు. ఆరోగ్యరీత్యానూ, మగవాళ్ళ మధ్య కలహాలు రాకూడదని భారతీయ సంఘంలో వివాహవ్యవస్థ పెట్టుకొన్నారు. ఫలానా స్త్రీకి వివాహమయిందని చెప్పటానికి మా మెళ్ళో మంగళసూత్రం పడేశారు. మరి మగవాళ్ళకి పెళ్ళయిందని చెప్పటానికి మాత్రం ఏ గుర్తూ ఉండకుండా జాగ్రత్తపడ్డారు. మీకు గూడా పెళ్ళయిందన్న గుర్తు ఒకటి ఉంటే, భార్య పక్కన లేనప్పుడు కన్నెపిల్లలు మీరు కన్నేసినా తొందరపడకుండా ఉంటారు కద! మీ మగాళ్ళెంత స్వార్ధపరులండీ! నియమనిబంధనలు మాకేనా? మీ మగాళ్ళకు వర్తించవా?" జవాబు లేని వరాలి ప్రశ్నకు బదులీయలేక పెరట్లోకి తప్పుకొన్నాను.
నిజమే! ఒకరి విషయాలు ఒకరు పట్టించుకోని నగరజీవితంలో యిలాంటి సంఘటనలు ఎన్నో!ఇదే పల్లెటూళ్ళలో అయితే శైలజ తల్లి చుట్టుపక్కల అడిగి, నాకు పెళ్ళయిందని తెలుసుకొనేది. కానీ నగరం కద! ఆ అవకాశం లేక నా భార్యతోనే నాకు సంబంధం మాట్లాడాలని వచ్చింది. అందుకే నగరజీవితాల్లో కూడా మగాడు మోసం చేయకుండా ఉండాలంటే వారిపై సంఘం నిఘా తప్పనిసరిగా ఉండాలి. అది లేకే పక్కింటి అమ్మాయిలు పొరుగింటి మగాళ్ళ చేతిలో మోసపోతున్నారు. మీరేమంటారు?
****

No comments:

Post a Comment

Pages