సామ్రాజ్ఞి (మొదటి భాగం ) - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి (మొదటి భాగం )

Share This

సామ్రాజ్ఞి (మొదటి భాగం )

భావరాజు పద్మిని

ఆమె... కనుసన్నలతో ప్రపంచాన్నిశాసించగల ధీర ! మహా మహా వీరులు, శూరులైన మగమహారాజులే ఆమె పేరు చెబితే ఒణికిపోతారు. ఆమె రాజ్యంలోకి అడుగుపెట్టాలన్నా, ఆమె శాసనాన్ని ధిక్కరించాలన్నా  బెదిరిపోతారు. ఆమె సకల శస్త్రాస్త్ర విద్యల్ని, యుద్ధ తంత్రాలను, రాజ నీతిని ఔపాసన పట్టింది. ఆమెకు తెలియని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు లేవు. ఆమెకు  తెలియని కళలు లేవు. ఆమె అడుగులకు మడుగులు ఒత్తేందుకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటారు. అంతటి బలపరాక్రమాలు, అందం, మేధస్సు, దయాగుణం, ధర్మగుణం, కలగలసిన అపురూప ధీరవనిత ఆమె...

అది పడమటి కనుమల మధ్య, పచ్చదనం పోతపసుకున్న సువిశాలమైన సీమంతినీ నగరం. నగరంలో ఎత్తైన కొండమీద కంచుకోట లాంటి రాణి భవనం. ఆ నగరానికి సామ్రాజ్ఞి ప్రమీలాదేవి కోటి పున్నముల కాంతిని, రాజహంసల దర్పాన్ని, సింహం ఠీవిని సంతరించుకున్నట్లు తన సింహాసనంపై అధిష్టించి ఉంది. ఆమె ముందు నిండు కొలువులో ఉన్న సభాసదులు, మంత్రులు అంతా స్త్రీలే. ఆ మాటకొస్తే, ఆ రాజ్యంలో అంతా స్త్రీలే ! అవును - అది ప్రస్తుతం నేటి మళయాళ దేశం ఉన్న చోట ఒకప్పుడు కొలువై ఉన్న స్త్రీ సామ్రాజ్యం. **
లాలిత్యం, రాజ సహజమైన దర్పం కలగలసిన స్వరంలో ఇలా చెప్పసాగింది ప్రమీలాదేవి.
 "శూరనారీమణులారా! ఇవాళ మీకొక పురాణ సంస్కృత కధనాన్ని చెబుతాను. శ్రద్ధగా వినండి. " అంటూ ఒక్క క్షణం మౌనం వహించి, పరిసరాల్ని పరికించింది ఆమె. అంతా ఆమె ఏమి చెబుతుందా అని ఊపిరి బిగబట్టి వినసాగారు.
"సంస్కృత కధనం ప్రకారం అన్నిటికీ మూలమైన ఆదిశక్తి ఈ విశాల విశ్వాన్నిసృజించింది. ముందుగా తన నుండి సృష్టికి - బ్రహ్మను, స్థితికి - విష్ణువును, లయకు - మహేశ్వరుడిని త్రిమూర్తులను సృష్టించి, వారికి తోడుగా ఉండేందుకు తన శక్తులైన మహాలక్ష్మి, మహాసరస్వతి, పార్వతి మాతలను సృష్టించింది. తన తత్త్వం జీవులకు అంత సులువుగా అర్ధం కాకుండా, ఈ విశ్వాన్ని ఆవరించి ఉండేలా "యోగ మాయను" సృష్టించింది. ఆ తర్వాత బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టి, సూర్య చంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను, గోళాలను, పంచభూతాలను, సృష్టించి, ఇక మిగతా సృష్టి బాధ్యతను ప్రజాపతులకు అప్పగించారట ! అప్పుడు " త్వష్త్రి " అనే ప్రజాపతి కొండల్ని, అడవుల్ని, జంతువుల్ని, సమస్త జీవజాలాన్ని ,చివరికి పురుషుడిని సృష్టించాడు. ఇక ఆ సృష్టితో ఆయన వద్ద ఉన్న ధృడమైన వస్తువులన్నీ అయిపోయాయట. ఇక స్త్రీ ని సృష్టించే బాధ్యత మిగిలింది...
అప్పుడు ఆయన బాగా ఆలోచించి స్త్రీని సృష్టించేందుకు ఈ వస్తువులు వాడాడట... చంద్రుడి నుంచి గుండ్రని రూపును, లతల వంపులను, తీగల అల్లుకునే తత్వాన్ని, గడ్డిపరకల చలించే గుణాన్ని, రెల్లు పొదల నాజూకును, పువ్వులలోని కోమలత్వాన్ని, ఆకువంటి తేలికైన బరువును, జింకపిల్లల త్వరిత వీక్షణాన్ని, సూర్యకిరణాల కాంతిని, మంచు బిందువుల స్వచ్చతను, గాలిలోని చలన స్వభావాన్ని, చెవులపిల్లి బెరుకును, నెమలి లోని ఆత్మవిశ్వాసాన్ని, వేకువలోని సున్నితత్వాన్ని, వజ్రంలోని కాఠిన్యాన్ని, తేనెలోని తియ్యదనాన్ని, శత్రువును చీల్చే పులిలోని క్రూరత్వాన్ని, అగ్నిలోని వెచ్చదనాన్ని, మంచులోని చల్లదనాన్ని, కోతి నుంచి ఉత్సాహమైన మాటల్ని చెప్పే వాచాలతను, కోకిల స్వరాన్ని, పగబడితే క్షమించని పాము విషాన్ని, వీటన్నింటినీ కలగలిపి వనితను తయారు చేసారట !
అలా సృష్టించిన స్త్రీని పురుషుడికి అప్పగించారు. పురుషుడి ఆనందానికి అవధులు లేవు! తనతో ఇప్పుడీ విశాల విశ్వంలోని మాధుర్యాన్ని పంచుకోడానికి ఒక స్త్రీ దొరికింది.
ఒక అమూల్యమైన వస్తువు మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలీదు. అది కోల్పోయాకే దాని అసలు విలువ తెలుస్తుంది. పురుషుడి విషయంలో కూడా అలాగే జరిగిందట! కొన్నాళ్ళకే ఆ పురుషుడు త్వష్త్రి వద్దకు వచ్చి, "మీరు సృష్టించి ఇచ్చిన ఈ ప్రాణి నా జీవితాన్ని క్లిష్టంగా మార్చింది. ఆమె మాట్లాడుతూనే ఉంటుంది, నా ఓర్పును పరీక్షిస్తుంది. నిరంతరం నేను ఆమెను పట్టించుకుంటూనే ఉండాలి, ఊరికే ఏడుస్తుంది, ఆమె నాకు అర్ధం కావట్లేదు. ఆమెను వెనక్కు తీసుకోండి," అన్నాడట. సరేనని, త్వష్త్రి ఆమెను వెనక్కు తీసేసుకున్నారు. రెండు రోజులైనా గడవలేదు. పురుషుడు మళ్ళీ త్వష్త్రి వద్దకు వచ్చాడు.
" ప్రభూ !ఆమె వెళ్ళిన క్షణం నుంచి నా జీవితం నిస్సారంగా, ఒంటరిగా ఉంది. ఆమె నాతో ఎలా ఆడి, పాడిందో, ఎలా తన నవ్వుతో నా మనసులో ఆనందాన్ని నింపిందో మర్చిపోలేకపోతున్నాను. లతలా నన్ను ఎలా అల్లుకుపోయిందో, ఆమె సాహచర్యంలో నాకు ఎంత మాధుర్యాన్ని చవి చూపించిందో, ఆ అమూల్యమైన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. దయుంచి, ఆమెను మళ్ళీ నాకు ఇచ్చెయ్యండి. " అని అడిగాడట.
కొద్ది రోజుల్లోనే స్త్రీ లేని వెలితి ఆ పురుషుడికి తేటతెల్లం కావడానికి కారణం ఏమిటి ? ఆమెలో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటి? పైన చెప్పిన అంశాల్ని , మరొక్కమారు మీరు నిశితంగా గమనిస్తే, ఒక్కమాటలో చెప్పాలంటే - స్త్రీ క్లుప్తంగా ఈ ప్రకృతికి ప్రతిరూపం ! ఆమెలో సూక్ష్మరూపంలో ఈ సమస్త విశ్వం, ఆ విశ్వంలోని గుణాలు ఇమిడి ఉన్నాయి. అందుకే అంటారు, ఆడది ఆదిశక్తి అని, స్త్రీ అబల కాదు, సబల అని!
కాబట్టి మనలోనే వజ్రానికి ఉన్న కాఠిన్యం ఉంది, అందుకే స్త్రీ ఎంతటి సుకుమారి అయినా, దుస్సహమైన పురుటి నెప్పుల్ని సైతం తట్టుకుంటుంది. మనలోనే బెబ్బులికి ఉండే పరాక్రమం ఉంది. నిజానికి విధాత మనలో పురుషుడి కంటే ఎక్కువ శక్తులనే నింపాడు. కాని, ఈ సమాజం “స్త్రీ బాల్యంలో తండ్రి నీడలో, యవ్వనంలో భర్త/ సోదరుడి నీడలో, వృద్ధాప్యంలో కొడుకు నీడలో బ్రతకాలని – న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అని, శాసించింది. ఆమె పురుషుడితో సమానంగా చదవకూడదు, కుల వృత్తులు చెప్పాట్ట కూడదు, సమాజంలో తలెత్తుకు తిరగకూడదు, అతనితో సమానంగా కూర్చోకూడదు. చివరికి ఎంత ఆకలి వేసినా, ఇంట్లో అందరూ తిన్నాకే తను భోజనం చెయ్యాలి. జీవితాంతం ఎవరోఒకరి అదుపాజ్ఞలలో ఉంటూ, తన ఇష్టాఇష్టాలను చంపుకుని, గంగిరెద్దు లాగా వారు చెప్పినదే చెయ్యాలి. చెప్పండి... వేరే ఏ జంతువులలో అయినా ఈ వివక్ష ఉందా ? ఇదంతా మనిషి సృష్టించిన విభేదం కాదా?
అణగదొక్కిన ఏ జాతి అయినా ఏదో ఒకనాడు తిరగబడక మానదు. నిశితంగా పరిశీలిస్తే, అదే ప్రపంచంలోని ఎన్నో విప్లవాల వెనుక ఉన్న ప్రధాన సూత్రం ! ఇప్పుడు మన సామ్రాజ్యంలో జరుగుతున్నది కూడా అదే ! విధాత అన్ని విధాలుగా, ప్రకృతికి ప్రతిబింబంగా, సర్వ స్వతంత్ర గా స్త్రీ ని సృష్టిస్తే, సమాజం వారికి సంకెళ్ళు వేసి కూర్చోబెట్టింది. తరతరాలుగా మీలో సమాజం నింపిన పిరికి రసాన్ని పారద్రోలండి. బ్రతికేందుకు ఆమెకు ఆలంబనలు అక్కర్లేదని మనం నిరూపించండి. మనకీ స్వంత ఊపిరి, భావాలు, ఇష్టాలు, కోరికలు ఉన్నాయని, తనను తాను రక్షించుకోగల సత్తా ప్రతి స్త్రీకి ఉందని, మన సీమంతిని సామ్రాజ్యం నిరూపించి, చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తియ్యాలి. అందుకు నాకు మీలోని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. బిందువులు కొన్ని కలిస్తేనే సింధువులు అయినట్లు, అడుగులు కొన్ని కలిస్తేనే నడకలు అయినట్లు, ఐకమత్యంతో కొత్త శకానికి నాంది పలుకుదాం ! జై ఆదిపరాశక్తి ! జై సీమంతినీ సామ్రాజ్య లక్ష్మి !”
“జై ఆదిపరాశక్తి ! జై సీమంతిని సామ్రాజ్ఞి !” అన్న నినాదాలు మిన్నంటాయి. అక్కడున్న ప్రతి ఒక్కరి రక్తంలో కొత్త శక్తి ప్రవహిస్తోంది.
ఈ సంబరాన్ని ఆనందంగా తిలకిస్తోంది గుర్విణి శక్తిసేన. ఒక ఉత్తమమైన నాయకురాలికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాల్లో మొదటిది, మానసికంగా తన సైన్యంలో ఉన్న జాడ్యాల్ని నిర్మూలించి, వారికి కొత్త స్పూర్తిని కలిగించి, వారి మంచి చెడ్డలను కనుక్కుంటూ, ప్రేమగా పలకరిస్తూ, చివరికి తనకోసం వారు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యేలా పురికొల్పడం ! ఈ లక్షణాలన్నీ తన ప్రమీలలో పుష్కలంగా ఉన్నాయి. ప్రమీలాదేవినే గమనిస్తున్న ఆమె కళ్ళలో ఒక్క క్షణం తన శిష్యురాల్ని చూస్తూ మెరిసిన గర్వరేఖ, స్త్రీ సామ్రాజ్ఞి దృష్టిని దాటి పోలేదు !
*****
లతలు అల్లుకున్న పర్ణ కుటీరంలో, ప్రశాంతమైన ధ్యానముద్రలో కూర్చుంది గుర్విణి శక్తిసేన. ఎంతో పరిచయమున్న అందెల రవళి ఆమె ధ్యానాన్ని భగ్నం చెయ్యడంతో, నెమ్మదిగా కళ్ళు తెరచి చూసింది. ఎదురుగా తన మానసపుత్రి ప్రమీల ! పసిడి అంచు ఎర్ర చీరలో, ఉదయభానుడి కాంతిని తలపిస్తూ అరుదెంచిన ఆమెను చూస్తూనే, ఆనందంతో విప్పారిన ఆమె నేత్రాలు, వెనువెంటనే ఆశ్చర్యంతో దిగ్భ్రమ చెందాయి.
“ఏమైంది ప్రమీలా?చేతికి ఆ కట్టేమిటి ?” ఆందోళనతో కూడిన వాత్సల్యపూరితమైన స్వరంతో అడిగింది ఆమె.
“ప్రణామాలు గుర్విణీ ! మన రాజ్య పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న అడవిలో గిరిజనులకు బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందట. వారి అభ్యర్ధనపై, అక్కడకు వెళ్ళిన నాకు, ఆ బందిపోటు నాయకుడికి భీకరమైన పోరు జరిగింది. అందులో నన్ను దెబ్బ తియ్యాలని, అతను తన చురకత్తితో, నా చేతిపై గాయం చేసాడు. స్త్రీనే కదా, చిన్న వేటుకే కంట తడి పెట్టి, వెనక్కు తగ్గుతానని అతని భావన. కాని, నేను గుర్విణి శక్తిసేన శిష్యురాలినని అతనికి తెలీదు పాపం ! మొత్తం సైన్యంతో సహా పట్టుబడ్డాడు గుర్విణీ !” నవ్వుతూ అంది ప్రమీల.
“భేష్ ప్రమీల ! ఏ పోరులో, పోటీలోనైనా, నిజమైన ఓటమి ఎప్పుడు మొదలవుతుందో తెలుసా ! మనం బాధపడ్డామని, గాయపడ్డామని మన శత్రువుకు ఏ మాత్రం జాడ చూపినా, అదే మన బలహీనత, వారి బలం అవుతుంది. లోకంలో జీవన నియమం ఇదే ! ఒకరి బలహీనతే, వేరొకరి బలం అవుతుంది. అందుకే మిన్ను విరిగి మీదపడ్డా, సంయమనంతో ఉండగల స్థైర్యం మనకు ఉందని మనం నిరూపించినప్పుడు, ఏ శక్తులూ మనల్ని అడ్డుకోలేవు ! స్త్రీ సామ్రాజ్ఞిగా, ఇందరిని కంటికి రెప్పలా కాపాడే తల్లిగా, నువ్వు ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.”
“ఆజ్ఞ గుర్విణీ ! మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దామని వచ్చాను...” అర్ధోక్తిలో ఆమె ఆజ్ఞ కోసం ఆగింది ప్రమీల.
“చెప్పు పుత్రీ ! నీ తల్లివంటి దాన్ని. నా వద్ద సంకోచమెందుకు...” అంది అనునయంగా శక్తిసేన.
(**జైమిని మహాభారతంలోని అశ్వమేధ పర్వం ఈ సీరియల్ కు మూలం. మూలకధను రక్తి కట్టించేందుకు కాస్త  సృజన, కల్పనా కలగలపడం జరిగింది.)
(సశేషం...)

No comments:

Post a Comment

Pages