నిత్య చైతన్యదీప్తి - ఆచరణాత్మక ఆధ్యాత్మికత - అచ్చంగా తెలుగు

నిత్య చైతన్యదీప్తి - ఆచరణాత్మక ఆధ్యాత్మికత

Share This

నిత్య చైతన్యదీప్తి - ఆచరణాత్మక ఆధ్యాత్మికత

మల్లాది వేంకట గోపాలకృష్ణ మూర్తి 


ఆధ్యాత్మికత అంటే ముక్కుమూసుకుని ఓ మూల కూర్చుని తపస్సు చేసుకోవడం కాదు. ఆధ్యాత్మికత అంటే ఎవరికీ కనిపించకుండా మన సాధన మనం చేసుకోవడం మాత్రమే కాదు. ఆధ్యాత్మికత అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టి పూర్తిగా దైవ నామాన్ని స్మరిస్తూ కూర్చోమని అర్ధం కాదు. ఇవన్నీ మన ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గ నిర్దేశం చేసే అంశాలు మాత్రమే.
మన విద్యుక్త ధర్మాన్ని మనం పరిపూర్ణంగా నిర్వర్తించడం, ధర్మబద్ధంగా మనం చేయాల్సిన కార్యాలను పరిపూర్ణంగా నిర్వర్తించడం, మనం అభివృద్ధి పథంలో పయనిస్తూ పదిమందికీ ఉపయోగపడేలా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవడం ఆధునిక కాలంలో నిజమైన ఆధ్యాత్మికత. మనం ధర్మాన్ని తప్పకుండా జీవించగలిగితే చాలు, మన విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగితే చాలు, పూర్తిగా పరమాత్మని సేవించుకున్నట్టే. ఈ నమ్మకంతో ఓ వ్యక్తి, మహా శక్తిగా మారి, అనేకమంది విద్యార్ధుల్ని తీర్చిదిద్దుతూ అలుపెరగని ప్రయాణం చేస్తున్న వైనాన్ని తెలుసుకుందాం.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యాదానం, అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునికమైన వైద్య సౌకర్యం, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం, దాంతోపాటే సామాజిక సేవ, బీదసాదల్ని ఆదుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సమాజానికి మేలు చేయగలిగిన ఔన్నత్యం, ఇవన్నీ ఆధునిక కాలంలో బహు కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే విషయాలు. చాలామంది మహనీయులు ఏదో ఒక మార్గంలో ఎంతో కొంత సాధన, సాయం చేసి ఉండొచ్చు. కానీ అన్నింటినీ కలిపికట్టుగా చెయ్యగల సమర్ధత ఒక్క సత్యసాయిబాబాకే చెల్లుబాటు అయ్యాయంటే అందులో అణుమాత్రమైనా అతిశయోక్తి లేదేమో.
సత్యసాయి సేవాదృక్పథం, ఆయన చేపట్టిన మంచికార్యాలు ఆయన తదనంతరంకూడా నమ్మినవాళ్లద్వారా
చెల్లుబాటు అవడంకూడా మరో విశేషం. ఆ మహనీయ మూర్తి దివ్య స్ఫూర్తితో ఎందరో తమ జీవితాల్లో విలువైన కొంత సమయాన్ని పరోపకారంకోసం వెచ్చించే చక్కటి ఆలోచనని అలవాటుగా మార్చుకున్నారు. సత్యసాయి మాటనే ప్రణవంగా భావించి తోటివాళ్లకి సాయం చేసే గొప్ప గుణాన్ని అలవరుచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరైన ఓ మంచి మనిషి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్ మహానగరంలో దిల్ సుఖ్ నగర్ ఓ చిన్న భాగం. ఆ చిన్న భాగం ఇప్పుడు సేవా ప్రపంచంలో ఇప్పుడు అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఇక్కడ ఉన్న సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎందరో విద్యార్ధులకు లౌకిక విద్యతోపాటుగా, సేవాదృక్పధాన్ని, ఆచరణాత్మక ఆధ్యాత్మికను అందించి జీవితాల్ని సమున్నతంగా తీర్చిదిద్దుకునేందుకు దోహదపడుతోంది. చీకోటి విశ్వనాధం ఆలోచనలనుంచి పుట్టిన ఈ  విద్యాలయానికి అనతికాలంలోనే అన్నివిధాలుగానూ మరికొంతమంది అండదండల్ని అందించి ప్రోత్సహించారు. వైట్ల ఆనందరావు ఏకంగా తన ఇంటి ప్రాగణంలో ఉన్న సొంత స్థలంలో ఓ చక్కటి భవంతిని నిర్మించి ఇచ్చారు.
రెండంతస్తుల ఈ భవంతిలో కింది భాగంలో పాతికేళ్లుగా ఇప్పటికీ నారాయణ సేవ, అంటే అన్నార్తులకు ఆహారాన్ని అందించే కార్యక్రమంతోపాటుగా ఉచితంగా మెడికల్ క్యాంప్ నడుస్తోంది. మొదటి అంతస్తులో ఉన్న సత్యసాయి మందిరంలో నిత్యం భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. రెండో అంతస్తులో విద్యార్ధులకు సరైన మార్గనిర్దేశం చెయ్యాలన్న తలంపుతో సమున్నతమైన సంస్కారం కలిగిన ఓ విద్యావేత్త కామర్స్ విద్యార్ధులకు ఉచితంగా ట్యూషన్ క్లాసులు చెబుతున్నారు. కానీ వీటిలో ఏ ఒక్కదానికీ ఈనాటి వరకూ ప్రచారం అన్న పదమే లేదు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమున్నతమైన అధ్యాపక పదవిలో పనిచేసిన చీకోటి విశ్వనాధం పాతికేళ్ల క్రితం సత్యసాయి ఆధ్యాత్మిక బోధలకు ప్రభావితమయ్యారు. అప్పటివరకూ విద్యార్ధులకు ఫీజు తీసుకుని పాఠాలు చెప్పిన ఆయన, సత్యసాయి ప్రేరణతో ఉచితంగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు. మొదట్లో కొద్ది మంది విద్యార్ధులు మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్లు. ఏటికేడు విద్యార్ధుల సంఖ్య పెరగడం మొదలయ్యింది. కేవలం పాఠాలు నేర్చుకోవడమే కాకుండా, ఈ మందిరంలో జరిగే సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఇక్కడ చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్ధులందరికీ అబ్బింది.
ప్రతినెలా జరిగే నారాయణ సేవలో, మెడికల్ క్యాంపుల్లో చురుకుగా పాలుపంచుకోవడం, గ్రామసేవకి స్వచ్ఛందంగా తరలివెళ్లడం లాంటి మంచి లక్షణాలు పూర్తిగా విద్యార్ధులకు అలవడ్డాయి. ఈనాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్ధులు పాతికేళ్లుగా గ్రామసేవ పేరుతో చురుకుగా, స్వచ్ఛందంగా నిర్వహిస్తూరావడం  ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విశేషం.
జనవరి 31 వ తేదీ 2016న జరిగిన సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలో వందలాది మంది విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన అనేకమంది విద్యార్ధులు ప్రత్యేకంగా ఈ వేడుకకి తరలిరావడం మరో విశేషం. పుట్టపర్తిలో సత్యసాయికి అనేక సంవత్సరాలపాటు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయనకి దుబాసీగా పనిచేసిన కామరాజు అనిల్ కుమార్ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ప్రధాన అతిధిగా విచ్చేశారు.
ఈ సంస్థలో విద్యార్ధులకు ఉచితంగా పాతికేళ్లుగా పాఠాలు చెబుతున్న చీకోటి విశ్వనాధంతో అనుబంధం ఉన్న కొందరు విద్యారంగ ప్రముఖులు, స్థలాన్ని, భవంతినీకూడా ఉచితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ జరుపుకునేందుకు ఇచ్చేసిన స్వర్గీయ వైట్ల ఆనందరావు కుటుంబ సభ్యులు, ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో ఇన్నేళ్లుగా పాలు పంచుకుంటూ పరోపకారంలో అత్మానందాన్ని అనుభవిస్తూవస్తున్న మరికొందరు మంచి మనుషులు, ఈ వేడుకల్లో పాల్గొని హర్షాన్ని తెలియజేశారు. పుట్టపర్తి మునిసిపాలిటీగా మారిన తర్వాత తొట్టతొలి ప్రెసిడెంటైన వైట్ల సునిల్ కుమార్, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కి భవంతిని నిర్మించి ఇచ్చిన వైట్ల ఆనందరావు తమ్ముడు. ఈయన ప్రోద్బలంతోనే కామరాజు అనిల్ కుమార్ ప్రత్యేక అతిధిగా ఈ వేడుకలకు విచ్చేశారు.
కొన్నేళ్లపాటు సత్యసాయిని అంటిపెట్టుకుని, ఆయన్ని దగ్గరగా చూసిన అనుభవం ఉన్న అనిల్ కుమార్, జీవితంలో అడుగడుగునా సత్యసాయి ఔన్నత్యాన్ని తాను ఎలా దర్శించగారో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్ధులకు వివరించారు. అర్భాటం లేకుండా, ప్రచారంకోసం పాకులాడకుండా విద్యార్ధుల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న శక్తిగా విశ్వనాధాన్ని అభివర్ణించారు. ఆయనకి అండదండగా నిలుస్తూ ఈ సంస్థ విద్యార్ధులకు తాముకూడా ఉచితంగా పాఠాలు చెబుతున్న గూడవల్లి విద్యానాథ్(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ స్వర్గీయ గూడవల్లి వెంకట సుబ్రహ్మణ్యం తనయుడు), ప్రేమ్ రాజ్ వంటి సమున్నత సంస్కారవంతులైన, సేవానిరతి కలిగిన విద్యారంగ ప్రముఖుల్ని అభినందించారు.
1997వ సంవత్సరంలో నేను ఆ విద్యాసంస్థలో చదువుకుని ఉన్నత శ్రేణిలో బీకాం పట్టాని పొందాను. అంటే దాదాపు
ఇరవై ఏళ్లక్రితంనాటి మాట. ఆ రోజుల్లో కేవలం పాఠాలు వినడానికి మాత్రమేకాక, అక్కడ జరిగే సేవా కార్యక్రమాలన్నింటిలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలోనూ ప్రత్యక్షంగా పాలు పంచుకునే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. వయసుతోపాటుగా బంధాలు, బాధ్యతలు కూడా పెరిగాయి. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో మునిగిపోయి మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయిన నాకు ఈ వేడుకలు జరగడానికి వారం రోజులముందు చీకోటి విశ్వనాధం మాస్టారి దగ్గర్నుంచి ఫోన్ కాల్ వచ్చింది. “ఎలా ఉన్నావ్ నాయనా” అంటూ ఆత్మీయమైన పలకరింపు.
మరో నాలుగు రోజుల తర్వాత ప్రస్తుతం ఆ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్ధులు “సాయిరాం అన్నయ్యా! మన ఇనిస్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. మీరు తప్పకుండా రావాలి” అంటూ మరో కాల్. ఆ పిలుపు వినగానే నాకు పట్టలేని ఆనందం. ఇరవై సంవత్సరాల క్రితం ఆ విద్యాలయంలో చదువుకున్న విద్యార్ధిని గుర్తుపెట్టుకుని, వివరాలు సేకరించి, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్ధులు ఆప్యాయంగా పలకరించడం, కార్యక్రమానికి ఆహ్వానించడం నాకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టాయి. ఇంత ప్రేమ, ఇంతటి అప్యాయత, ఇంతటి అనురాగం మనం ఇంకెక్కడైనా చూడగలమా?
ప్రొఫెసర్ విశ్వనాధం గారెని విశ్వనాధం మాస్టారు అని నేను సంబోధించడం వెనకకూడా ఓ ఆంతర్యం ఉంది. చిన్నతనంలో నేను తెనాలిలో ఓ వీధి బడిలో ట్యూషన్ చదువుకునేవాడిని. ఆ మాస్టారి పేరు శ్రీరామ్మూర్తి. అప్పటికి ఆయన వయసు దాదాపుగా అరవై, డెభ్బై ఏళ్లకి పైమాటే. వాళ్లది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణార్ధం ఆయన ఆ వయసులోకూడా పిల్లలకి పాఠాలు చెబుతూ నెట్టుకొచ్చేవారు. నాకు బాగా గుర్తు. ఆయన కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటే, నేను రోజూ కాళ్లు పిసికి శుశ్రూష చేసేవాడిని.
నిజానికి ఇంజినీరుగారబ్బాయిని కాబట్టి అక్కడ నాకు రాచమర్యాదలే ఉండేవి. కానీ మాస్టారికి సేవచేసే విషయంలో మాత్రం నేనే ముందుండేవాడిని. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కాన్వెంట్ చదువుల పుణ్యమా అని నేను పదాలు, వాక్యాలు రాసేటప్పుడు ఇంగ్లిష్ అక్షరాల్ని విడివిడిగా రాసేవాడిని. ఆయన నాకు చాలాసార్లు కలిపిరాత రాయడం నేర్పడానికి ప్రయత్నించేవాళ్లు. కానీ నేను ఎప్పటికప్పుడు మళ్లీ విడివిడి అక్షరాలు రాసేవాడ్ని.
ఓ రోజు ఆయనకి ఎందుకంత కోపం వచ్చిందో తెలీదుగానీ, అది నాకు మేలు చేయడానికే వచ్చింది. ఆ రోజున ఆయన విద్యార్ధులందరినీ పేము బెత్తంతో విపరీతంగా కొట్టేశారు. నాకు దెబ్బలు పడడానికి కారణం, కలిపిరాత రాయలేకపోవడమే. శ్రీరామ్మూర్తి మాస్టారు కొట్టిన దెబ్బలకి ఒళ్లంతా వాతలు తేలాయి. జ్వరంకూడా వచ్చింది. విచిత్రం, నాలుగు రోజుల తర్వాత జ్వరం తగ్గి మళ్లీ నేను పాఠాలకు వెళ్లడం మొదలుపెట్టిన రోజునుంచీ నాకు కలిపిరాత రాయడం వచ్చేసింది. తర్వాత్తర్వాత ఆయన పుణ్యమా అని ఇంగ్లిష్ భాషమీద పట్టు వచ్చేసింది.
నేను పదో తరగతి చదువుకొనేటప్పుడు జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపల్ పిచ్చిరెడ్డి నాన్ డిటైల్డ్ స్టోరీస్ ని బోర్డ్ మీద శ్రద్ధగా రాసి, విద్యార్ధులందరితోనూ ప్రతి ఒక్కరితోనూ ఆ స్టోరీని చదివించి, తర్వాత ఎవరు ముందుగా అప్పజెప్తే వాళ్లని ఇంటికి పంపించేవాళ్లు. ఆయన బోర్డ్ మీద రాసిన స్టోరీని నోట్ బుక్ లో కాపీ చేసుకుని, ఆఖరి వాక్యాన్ని ముగించి పుల్ స్టాప్ పెట్టగానే, నేను అప్పజెప్పేస్తానంటూ చేయి పైకెత్తేవాడ్ని. ఆయనకి ఆశ్చర్యం.
ఒక్క పదం తప్పైనా, ఒక్క తప్పు దొర్లినా తీవ్రమైన దండన ఉంటుందని మొదటి రోజున ఆయన నన్ను హెచ్చరించారు. నేను గట్టిగా సరేనని చెప్పి, స్టోరీని అలవోకగా చెప్పేసి, చకచకా పుస్తకాలు బ్యాగ్ లో పెట్టేసుకుని ఇంటికెళ్లిపోయాను. ప్రతిరోజూ ఇదే వరస. ఆయన ఆశ్చర్యపోయేవారు. ఇదంతా నేను స్వోత్కర్షగా చెప్పడం లేదు. పేము బెత్తంతో నన్ను వాతలు తేలేలా కొట్టి, నాలో పట్టుదలనీ, భయాన్నీ, భక్తినీ పెంచి, అక్షర భిక్ష పెట్టి, ఇంగ్లిష్ భాషమీద పట్టొచ్చేలా చేసిన మహనీయులైన శ్రీరామ్మూర్తి మాస్టారికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశంగా దీన్ని నేను భావిస్తున్నాను.
ఆనాడు శ్రీరామ్మూర్తి మాస్టారు వేసిన చక్కటి పునాదే నాకు భాషమీద పట్టు సంపాదించుకోవడానికీ, ఇవాళ నేను సమర్ధుడైన సీనియెర్ జర్నలిస్ట్ గా, అనువాదకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మూలం. నలభై సంవత్సరాల క్రితంనాటి మాట. నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా మాస్టారి మొహం గుర్తుంది. ఇప్పటికీ నేను ఎన్నోసార్లు ఆయన్ని తలచుకుంటూ ఉంటాను. కేవలం ఆనాటి గురుసేవాఫలమే, ఈనాడు నన్ను అనువాద ప్రపంచంలో దిగ్గజంగా నిలబెట్టిందన్న సత్యం నాకు అనుక్షణం గుర్తొస్తూనే ఉంటుంది. సేవకి అంతటి మహత్తరమైన శక్తి ఉంది.
సరిగ్గా అలాగే, ఇరవై ఏళ్ల క్రితం నాకు ఉచితంగా విద్యని పొందే అవకాశంతోపాటుగా , మంచి లక్షణాల్ని, నడవడిని నేర్చుకుని సేవా పథంలో పయనించే అవకాశాన్ని సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కలుగజేసింది. ఆనాడు నేను ఈ సంస్థ విద్యార్ధిగా వందమందిలో ఒకడిగా ఉంటూ, నిష్కల్మషంగా చేసుకున్న నారాయణ సేవ, గ్రామ సేవలు నా పైన అనంతమైన భగవదనుగ్రహాన్ని కురిపించడానికీ, ఈనాడు జీవితంలో నేను నిలబడడానికీ దోహదం చేశాయని నేను పరిపూర్ణంగా భావిస్తున్నాను.
జీవన పయనంలో అనేక మజిలీల్లో మనకి అనేకమంది మంచి మనుషులు కలుస్తారు. కొన్నేళ్ళ తర్వాత ఎవరికి వారుగా విడిపోతాం. ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ మామూలే. కానీ మనకి జ్ఞాన భిక్ష పెట్టిన గురువుల్ని మాత్రం ఎన్నటికీ మనం మర్చిపోలేం. ఎందరో మహనీయుల అనుగ్రహ ఫలంగా మనకి అబ్బిన నాలుగు అక్షరాలు, జీవితాంతం మనల్ని సమున్నతమైన మార్గంలో పయనింపజేయడానికి దోహదకారులవుతాయి.
పీజీ పూర్తైన తర్వాత నేను జర్నలిజంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఈనాడు జర్నలిజం స్కూల్లో నాకు ఇంగ్లిష్ భాషతో అలవోకగా ఆడుకోవడం నేర్పించిన వంగీపురపు శ్రీనాధాచారిగారిని, అనువాదం పాఠాలు చెప్పిన ఆర్వీరామారావుగారినికూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సబబేమో అని నాకు అనిపించింది. వాళ్లతోపాటుగా ఇతర సబ్జెక్ట్స్ ని కూలంకషంగా నేర్పించి జీవనపయనంలో సమున్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి నాకు మార్గనిర్దేశం చేసిన అధ్యాపకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకోవడాన్నికూడా నేను నా బాధ్యతగా భావిస్తున్నాను.
సాధారణంగా ఈ రోజుల్లో కాలేజీ రీ యూనియెన్లు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరగడం, పాత విద్యార్ధులు వాటికి వందల సంఖ్యలో హాజరు కావడం, వాళ్ల గురువుల్ని గౌరవించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్లలో కొంతమంది తాము అభివృద్ధిని సాధించడమే కాక, సమాజానికికూడా ఎంతోకొంత ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యడమూ మనం చూస్తూనే ఉంటాం.
అదే తరహాలో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలకుకూడా వందలాదిమంది విద్యార్ధులు హాజరయ్యారు. కానీ ఇక్కడికొచ్చిన విద్యార్ధులందరినీ కట్టిపడేస్తున్న బలవత్తరమైన శక్తి ఒకటుంది. అదే ప్రేమ. ఈ సంస్థలో చదువుకున్న విద్యార్ధులందరూ అనంతమైన ప్రేమనీ సోదర భావాన్నీ అందుకున్నవాళ్లే. ఇప్పటికీ సేవానిరతితో జీవితాల్ని కొనసాగిస్తున్నవాళ్లే.
నిజం చెప్పాలంటే వాళ్లందరికంటే తక్కువ సేవ చేసిన వాడిగా నేను ఆఖరు వరసలో నిలబడాలేమో. అందుకే ఇలా అక్షర రూపంలో ఆ సంస్థ రుణాన్ని తీర్చుకునే చిరు ప్రయత్నం చేస్తున్నాను. వందలాది మంది విద్యార్ధుల్ని సన్మార్గంలో నడిపిస్తూ, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిస్వార్ధంగా సేవచేస్తున్న మా మంచి మాస్టారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
  • మల్లాది వేంకట గోపాలకృష్ణ

No comments:

Post a Comment

Pages