ప్రేమతో నీ ఋషి – 10 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 10

Share This

ప్రేమతో నీ ఋషి – 10

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. ఇక చదవండి...)
“అయితే ఋషి, నువ్వొక పది నిముషాల్లో నన్ను నా కాబిన్ లో కలవగాలవా ? అంటూ ఋషికి విలియం స్కాట్ ఫోన్ చేసాడు. “వచ్చేటప్పుడు, నేను చైనా ప్రభుత్వానికి నా క్లైంట్ “B2K4444” ను గురించి చైనా ప్రభుత్వానికి పంపాల్సిన లేఖను తీసుకురావడం మర్చిపోకు.” అన్నాడు. ఋషి క్లుప్తంగా మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.
ఋషి మహేంద్రను కలవబోయే ముందు రోజది. దానిగురించి అతను తన బాస్ అయిన విలియం స్కాట్ కు చెప్పాల్సి ఉంది.
ఇతరులకు ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా, స్విస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్లకి క్లైంట్ ల గురించి కోడ్ నంబర్లలో మాట్లాడుకోవడం పరిపాటే. క్లైంట్ ల నిజమైన అస్తిత్వం గురించి బ్యాంకు లో ఉన్న అతి కొద్దిమందికి తప్ప, ఇతర ఉద్యోగులకు తెలియదు. ఇది అన్నిస్విస్ బ్యాంకులకు సాధారణమే !
క్లైంట్ సొంత పేరుతో ఎకౌంటు వ్యవహారాలు నడిపితే, సమాచారం లీక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం అంతర్గత ప్రక్రియలు పూర్తి అయ్యేసరికి ఆ డాక్యుమెంట్లు ఎన్నో చేతులు మారతాయి.
ఆ రిస్క్ ను తప్పించుకునేందుకు, స్విస్ బ్యాంకులు తమ క్లైంట్ ల అసలు వివరాలు ఇతరులకు తెలియకుండా చూసుకుంటాయి. ఋషి లాగా కేవలం ఆ క్లైంట్ కు సంబంధించిన బ్యాంకర్ మాత్రమే అతని పూర్తిపేరు, చిరునామా వంటి వివరాలను తెలుసుకుని ఉంటాడు.
ఒకసారి ఎకౌంటు తెరిచాకా, ఋషి సాధారణంగా క్లైంట్ కు సంబంధించిన అసలు పేరు, చిరునామా ఉన్న పత్రాలు అన్నింటినీ సేఫ్ లో పెట్టేస్తాడు. కేవలం అతికొద్ది మందికే ఈ పత్రాలు చూసే వీలు ఉంటుంది. అది కూడా వారు ఏ ఫైల్ నెంబర్ ను, ఏ కోసం తెరుస్తున్నారో రిజిస్టర్ లో రికార్డు చేసిన తరువాతే !
ఇదంతా స్విస్ బ్యాంకులు తమకు తాము ఏర్పరచుకున్న ‘గోప్యతా నియమాల చట్టాలు’ తప్పనిసరిగా అమలు జరిగేలా చూసుకునే ప్రయత్నం. ఈ నియమాలను 300 ఏళ్ళ క్రితం ప్రతిపాదించారు. తనకు ఎప్పుడు అధికంగా నిధులు కావలసివచ్చి అప్పుగా తీసుకున్నా, దాన్ని తిరిగికట్టే  సామర్ధ్యం తనకుంది కనుక, ఈ వ్యవహారాలన్నీ  గోప్యంగా జరగాలని, అప్పటి ఫ్రాన్స్ రాజు, స్విస్ బ్యాంకు వారిపై ఒత్తిడి తీసుకురావడంతో ఇదంతా మొదలయ్యింది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, హిట్లర్ పాలనలో, స్విస్ బ్యాంకింగ్ వారి ‘గోప్యతా నియమాల’ను మరొకసారి సవరించారు. అప్పట్లో జర్మన్ చట్టం జర్మనీలో కాక, విదేశాల్లో నిధులున్న వారికి మరణశిక్ష విధించాలని తీర్మానించినప్పుడు ఇది జరిగింది. తమ దేశపు నిధులు దేశం దాటిపోకుండా చేసేందుకు, జర్మనీకి కఠినమైన విదేశీ మారక నియమాలు ఉండేవి.
స్విస్ బ్యాంకు ఎకౌంటులను కలిగిఉన్న జర్మన్లకు మరణశిక్ష విధిస్తూ ఉండడంతో, స్విస్ ప్రభుత్వం తమ బ్యాంకుకు గోప్యత మరింత అవసరమని భావించింది.
చివరికి 1984 లో స్విట్జర్లాండ్ ప్రజలు బ్యాంకు గోప్యతను అలాగే ఉంచమని, మరొక్కసారి వోట్ చేసారు.  73 % ఓట్లు దీనికి అనుకూలంగా లభించాయి.
ఋషి తన డెస్క్ మీద కావలసిన పత్రాలను సిద్ధం చేసి, స్కాట్ చెప్పిన క్లైంట్ డాక్యుమెంట్లు తీసుకుని బయలుదేరాడు. ఒక క్లైంట్ బ్యాంకు ట్రాన్సాక్షన్ల గురించిన వివరాలు ఇవ్వమన్న చైనా ప్రభుత్వపు అభ్యర్ధనను గురించిన కాగితాలవి.
ఆ అభ్యర్ధనలో క్లైంట్ ఎకౌంటు నెంబర్ లేదు, అతని పేరు తప్ప. ఆ క్లైంట్ చైనాలో ఒక లంచగొండి ప్రభుత్వాధికారి అని చైనా మీడియా రిపోర్ట్ లు ఇచ్చింది. దీనికి సంబంధించి, ఆ ప్రభుత్వానికి ఋషి బ్యాంకు నుంచి కొన్ని వివరాలు కావలసి వచ్చాయి.
కాని, స్విస్ బ్యాంకు చట్టాల ప్రకారం, కేవలం టాక్స్ ఫ్రాడ్ జరిగినప్పుడు మాత్రమే వారి అభ్యర్ధనపై తమ క్లైంట్ ల వివరాలను విదేశీయులకు వెల్లడిస్తారు. అంతర్జాతీయంగా,పన్నులకు సంబంధించి, పన్ను ఎగవేత, పన్ను ప్రణాళిక అన్న పదాలను వాడతారు. పన్ను ప్రణాళిక అంటే, చట్టపరంగా పన్నులను నిర్వహణ, ఆమోదయోగ్యమైన విధానాల్లో పెట్టుబడులు పెట్టడం. పన్ను ఎగవేత అంటే, చట్ట విరుద్ధంగా పన్నును చెల్లించకపోవడం.
ఏమైనా, స్విస్ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం  పన్ను ప్రణాళికలకు, పన్ను ఎగవేతకు కూడా తారతమ్యం ఉంది. రెండూ టాక్స్ కట్టకుండా తప్పించుకునేందుకే అయినా, రెంటినీ వేరుగా చూస్తారు. పన్ను కట్టేప్రభుత్వ అధికారులకు తమ రాబడుల వివరాలను వెల్లడించకుండా ఎగ్గొడితే, అది పన్ను ఎగవేత. పన్నుకట్టేవారు కొంత ఆదాయాన్ని, ఖర్చునీ చూపి, తక్కువ రాబడిని/ ఎక్కువ ఖర్చును నిరూపించుకునేందుకు తప్పుడు  పత్రాలను చూపితే అది ‘టాక్స్ ఫ్రాడ్’ అవుతుంది.
ఎన్నో ఏళ్ళుగా స్విస్ బ్యాంకులు, కేవలం విదేశీ ప్రభుత్వాలు తమ బ్యాంకు క్లైంట్ లపై ‘టాక్స్ ఫ్రాడ్’ అనే నేరాన్ని మోపితే తప్ప, తమ క్లైంట్ ల వివరాలను వెల్లడించము అనే సంప్రదాయాన్ని సమర్ధవంతంగా అమలు జరుపుతున్నాయి. లేకపోతే, టాక్స్ కట్టనప్పుడు, టాక్స్ ఫ్రాడ్ లేనప్పుడు,  క్లైంట్ ల వివరాల కోసం వచ్చే మామూలు అభ్యర్ధనలను స్విస్ బ్యాంకు పట్టించుకోదు.
“చైనా ప్రభుత్వం టాక్స్ ఫ్రాడ్ ను నిరూపించితే తప్ప, తాము క్లైంట్ వివరాలను వెల్లడించలేము,” అని ఋషి వారికి బదులివ్వాల్సి ఉంది. అంతేకాక, ఆ ప్రభుత్వం సంబంధిత ఎకౌంటు నెంబర్ ను కూడా బ్యాంకు కు ఇవ్వాల్సి ఉంది.
“అయితే, నువ్వీ లేఖను మన లీగల్ డిపార్టుమెంటు కు అందించావా ?” అని అడిగాడు స్కాట్, ఋషి చైనా ప్రభుత్వానికి అందించబోతున్న పత్రాలను చూపాకా.
“ ఇచ్చాను స్కాట్, మన లీగల్ విభాగానికి పత్రాలు చూపాను. కాని, ఇలా ఎన్ని అభ్యర్ధనలను తిప్పి కొట్టగలమో తెలియట్లేదు, ఇవాళ కూడా US, స్విస్ బ్యాంకు వారి గోప్యతకు విరుద్ధంగా చట్టాలు చెయ్యనుందన్న సమాచారం వచ్చింది. భవిష్యత్తులో ఏమి జరగనుందో చూడాలి. కాని ప్రస్తుతానికి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి క్లైంట్ లను తీసుకురావడం కష్టంగా ఉంది.”
ఎంతోమంది స్విస్ బాంకర్లు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యను ఋషి ప్రస్తావించాడు. విదేశీ ప్రభుత్వాలు అడిగిన సమాచారం ఇవ్వకపోతే, త్వరలోనే విశ్వ ఆర్ధిక ప్రపంచంలో స్విస్ బ్యాంకులను ‘నాన్- కో-ఆపరేటివ్ బ్యాంకు’ లుగా పరిగణించే అవకాశం ఉందని, అతనికి బాగా తెలుసు.
“హేయ్ ఋషి, నిరాశగా మాట్లాడకు. నేనూ విన్నాను, అయితే, ఇవాళ మరొక 15 మంది క్లైంట్ లను తెస్తున్నావా ?
“అవును స్కాట్, వారంతా ఇండియా నుంచే.” బదులిచ్చాడు ఋషి.
“కాని, జాగ్రత్తగా ఉండు ఋషి, ఈ 15 మంది కూడా నీవు గతంలో ప్రస్తావించిన సాఫ్ట్వేర్ కంపెనీ కి చెందినవారే కదూ,” గంభీరమైన స్వరంతో అన్నాడు స్కాట్.
“స్కాట్, మీ భావాలను నేను అర్ధం చేసుకోగలను. ఇండియా లోని నా నెట్వర్క్ ల నుంచి ఈ క్లైంట్ రిఫరెన్స్ లు నాకు దొరికాయి. ఇవన్నీ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ కి చెందినవని నాకు తెలుసు – నిర్వాణ ప్లస్. కాని వారంతా ఎక్కువ జీతాలున్న సీనియర్ ఉద్యోగులు అన్న సంగతి మనం గమనించాలి. వారి ఎకౌంటుల విషయంలో మనకు ఇబ్బందులు ఏమీ ఉండవని నేను భావిస్తున్నాను.”బదులిచ్చాడు ఋషి.
స్కాట్ కాస్త సమాధానపడ్డట్లు కనిపిస్తూ,’ ఉద్యోగుల విషయంలో నాకు అనుమానాలు లేవు, కాని నిర్వాణ ప్లస్ అనే కంపెనీ అంతర్జాతీయంగా కొన్ని వివాదాలను ఎదుర్కుంటోంది. ఆ కంపెనీ MD మహేంద్ర వాటినుంచి ఎలా బయటపడతాడో మనం చూడాలి. ఒకసారి కంపెనీ ఇబ్బందుల్లో పడితే, ఉద్యోగులు కూడా ఇరుకున పడతారు కదా.” అన్నాడు.
“స్కాట్, మీ భావాలతో నేను ఏకీభవిస్తాను. ఇంకో సంగతి చెప్పనా ? రేపు నేను మహేంద్రను కలవబోతున్నాను. అతన్ని మన క్లైంట్ గా మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను, నాకు శుభాకాంక్షలు చెప్పండి. ఇది మన ఆఫీస్ కు పెద్ద బిజినెస్ అవుతుంది,” అన్నాడు ఋషి ఉత్సాహంగా.
స్కాట్ అతని ఉత్సాహాన్ని అర్ధం చేసుకోగలడు. అతను ఋషిని అభినందించి, “కాని, వారి వ్యవహారాలపై ఒక కన్నేసి ఉంచు, పేపర్ వర్క్ అంతా సవ్యంగా జరిగేలా చూడు,” అని చెప్పాడు. ఋషి అతని కాబిన్ వదిలి వెళ్ళాడు.
***
“గుడ్ మార్నింగ్ మిష్టర్ మహేంద్ర, నేను బ్యాంకు ప్రైమ్ సూయిస్ నుంచి వచ్చిన ఋషిని,”నవ్వుతూ మహేంద్రను పలకరించాడు ఋషి. అతను నేవీ బ్లూ సూట్ లో తెల్ల షర్టు, ఎరుపు టై వేసుకుని ఉన్నాడు.
“మార్నింగ్ ఋషి, మిష్టర్ శర్మ మీ వైన్ టేస్టింగ్ సెషన్ల గురించి, వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడుల గురించి చెప్పారు, ఆయన వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడుల కోసం నా అనుమతిని కూడా తీసుకున్నారనుకుంటా !” మహేంద్ర ఋషిని కూర్చోమని చెబుతూ అన్నాడు. ఋషికి ఒక కప్ కాఫీ ఇచ్చాడు.
“నిజమే, మహేంద్ర గారు, మిష్టర్ శర్మ మా బ్యాంకుకు పనిచేస్తున్నప్పటి నుంచి నాకు మంచి మిత్రులు, ఆయన కస్టమర్ ల రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. మీతో పరిచయం కల్పించమని నేనే వారిని అభ్యర్ధించాను. మీకు ఇంతకుముందు స్విస్ బ్యాంకు ఎకౌంటు లేనట్లయితే, మీ డిపాజిట్లు, పెట్టుబడులను స్విస్ బ్యాంకు లో పెట్టడం చాలా తెలివైన నిర్ణయం అని, మీకు తెలిసే ఉంటుంది. స్విస్ ఎకౌంట్లు పూర్తిగా నమ్మదగ్గవి, ఆర్ధిక లావాదేవీలలో మీకు గోప్యత, అత్యంత భద్రత కల్పిస్తాయి.” ఋషి నేరుగా సంభాషణలోకి దిగాడు.
ఒకవేళ మహేంద్రకు ముందే స్విస్ బ్యాంకు ఎకౌంటు ఉన్నా, క్లైంట్స్ తమ ఇతర బ్యాంకుల లోని ఖాతాల వివరాలు వెల్లడించరని, ఋషికి బాగా తెలుసు. కాని, ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ లో నేరుగా పెట్టుబడి పెట్టమని కోరే బదులు, సంభాషణను చాలా మామూలుగా ప్రారంభించాలని ఋషి అనుకున్నాడు.
“మిష్టర్ ఋషి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను చాలా పొదుపరిని. నావద్ద అధికంగా నిధులు ఏమీ లేవు. నావద్ద ఉన్నదంతా నిర్వాణ ప్లస్ లో పెట్టానని మీకు తెలుసు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక ఇబ్బందుల్లో, అన్నీ కంపెనీలోనే చిక్కుకు పోయాయి. మిష్టర్ శర్మ ఒత్తిడి చెయ్యడం వల్ల నేను మిమ్మల్ని కలవాలని అనుకున్నాను.” మహేంద్ర తన ఉద్దేశాన్ని స్పష్టపరిచాడు.
ఋషి మొదట్లో కాస్త నిరాశ చెందినా, మహేంద్రను ఒప్పించడం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. మరికొన్ని చర్చల తర్వాత, మహేంద్ర సమ్మతితో ఆర్ట్ ఫండ్ పెట్టుబడుల గురించి అతనికి వివరించాడు. దానిపై తాను రూపొందించిన ప్రేసెంటేషన్ ను మహేంద్రకు .
ఈ పరిస్థితుల్లో ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలో, ప్రస్తుతం మార్కెట్ యెంత కృంగిపోయి, చవకగా ఉందో, త్వరలో ఇది విరివిగా పెరిగే అవకాశాలు ఎలా ఉన్నాయో, వివరించాడు.
వైన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాగే, ఆర్ట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కనీస క్లైంట్ పెట్టుబడులను USD25000 – 1,000,000 దాకా కలిగి ఉంటుంది. అలా తీసుకున్న మొత్తాన్ని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కు అందిస్తారు. అతను కళాఖండాల పోర్ట్ ఫోలియో ను పరిశీలించి, ఫండ్ తొలిదశల్లో కొంటాడు.
ప్రతిపాదించిన కాలం పూర్తి అయ్యాకా, పోగుచేసిన కళాఖండాలను ఉమ్మడిగా వేలం వేస్తారు. కొన్న ధరకీ, అమ్మిన ధరకీ మధ్య వచ్చిన లాభాన్ని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, డిస్ట్రిబ్యూటర్ల కమిషన్ పోగా, మిగతాది పెట్టుబడిదారులకు పంచుతారు.
“కాని ప్రస్తుతం ఆర్ట్ మార్కెట్ చాలా డల్ గా ఉందని విన్నాను. ఆర్ట్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా ? ఈ మార్కెట్ నిజంగానే విస్త్రుతమైనదా ?”
“ఆర్ట్ మార్కెట్ అనేది అతిపెద్ద ఆస్తి క్రిందకు వస్తుంది. ద్రవ్యోల్బణం వల్ల అన్నిటి ధర పడిపోయింది అన్నది వాస్తవమే. వాటితో పాటే ‘మీ మోసెస్ ఫ్యామిలీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ సూచిక కూడా పడిపోయింది. కాని వీటిని  తిరిగి S&P తో అనుసంధానించడంతో తిరిగి పుంజుకుంటాయి. కాబట్టి, ఇందులో పెట్టుబడులు చాలా మంచివి, ఎందుకంటే, ఇప్పుడు మార్కెట్ చాలా తక్కువలో ఉంది. “ ఋషి మహేంద్రను ఒప్పించేందుకు గురి చూసి మాట్లాడాడు.
మహేంద్ర మరొక్కసారి ఋషి ఇచ్చిన సమాచారాన్ని, ప్రేసెంటేషన్ ను పరిశీలించాడు. కాస్త వెనక్కు వెళ్లి, అతని బ్యాంకు గతంలో పెట్టిన ఆర్ట్ ఫండ్ ల గురించి, ఋషి మునుపు చూపిన స్లయిడ్ లను మరలా చూపమని కోరాడు.
ఒకచోట అతన్ని ఆపి, వెంటనే “ మీ బ్యాంకు ఇండియన్ ఆర్ట్ ఫండ్ ను 4-5 ఏళ్ళ క్రితం ఆరంభించిందని మీరు  చెప్పారు కదూ ? ఈ ఏడాదితో దాని కాలపరిమితి పూర్తవుతుంది. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి ? మీరు దీనిలో లాభాలు గడించగలిగారా ?”
ఋషి అవాక్కయ్యాడు. ఋషి ఆ ఆర్ట్ ఫండ్ గురించి అడుగుతాడని అతను ఊహించలేదు. మహేంద్ర వివరాలు అడుగుతున్న ఆర్ట్ ఫండ్ గురించి ఋషికి తెలిసినా, ఆ వివరాలను వెల్లడించవచ్చో లేదో, అతనికి తెలీదు. అతను వాస్తవాలను మహేంద్రకు వెల్లడిచేసాడు.
అది ఇతర ఫండ్స్ లాగానే 5 ఏళ్ళ క్రితం ప్రారంభించబడింది. బాగానే నడవసాగింది. కాని, కాలం గడిచే కొద్దీ, ఫండ్ ఆరంభమైన కొత్తల్లో ఉన్న ధరకి కళాఖండాలను కొనే ఆసక్తి ఉన్నవారు అంతకంతకీ తగ్గసాగారు. ఇది 500 కళాఖండాలు ఉన్న అతి పెద్ద ఫండ్. అందుకే, వాటిని అమ్మడాన్ని బ్యాంకు మరొక ఆరు నెలలు వాయిదా వేసింది.
మహేంద్ర బాహాటంగా తన అభిప్రాయాన్ని ఇలా చెప్పడు.” మిష్టర్ ఋషి, నేను మునుపు చెప్పినట్లుగా పెట్టుబడుల కోసం నాకు వ్యక్తిగత నిధులు ఏమీ లేవు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం, రానున్న ప్రద్యుమ్న మ్యూజియం కోసం నేను త్వరగా కళాఖండాలను సేకరించాలి. మీకు ఇదంతా తెలుసు కదూ ?” ఋషి అవునన్నట్లు తలూపాడు. సంభాషణ ఎటువైపు సాగుతోందో అతనికి అర్ధం కాలేదు.
“ మీకోసం నావద్ద ఒక ఆఫర్ ఉంది. మీరు గతంలో ఇండియన్ ఆర్ట్ ఫండ్ కోసం సేకరించిన వాటిలో కొన్నిటిని కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జాతీయ కళాఖండాలు గా ముద్రించబడిన వాటిని అన్నింటినీ నేను కొంటాను. మీరు ముందే వాటిని నిశితంగా పరిశీలించి ఉంటారు కనుక, నాకూ కాస్త సమయం ఆదా అవుతుంది. మీరు వేలం వేసినప్పుడు, నేను అందరికంటే ఎక్కువ ధరకి వాటిని కొంటాను. మ్యూజియం కు అవసరమైన మిగతా 200 కళాఖండాలను ఒకేసారి కొనేందుకు ఇది నాకు ఉపయోగపడుతుంది, నేను ప్రభుత్వానికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోగలుగుతాను.” కొనసాగించాడు మహేంద్ర.
మహేంద్ర తన ఉద్దేశాన్ని స్పష్టపరిచాడు. వారు గతంలో ఫండ్ కోసం కొన్న కళాఖండాలను తనకు ఎలా అమ్మగలరో ఋషిని అడిగి తెలుసుకుంటూ కాలం గడిపాడు. ఋషి దాని గురించి వివరిస్తున్నప్పుడు, అది చట్టబద్ధంగా ఇరువర్గాలకి లాభదాయకంగా ఉందని తెలిసింది.
ఋషికి, అతని బ్యాంకుకు కూడా ఇదొక పెద్ద వరం లాంటిది. మహేంద్ర భాగస్వామ్యంతో వారు గతంలో పెట్టిన ఆర్ట్ ఫండ్స్ కు మంచి లాభాలను గడించగలరు. మహేంద్ర పరంగా చూస్తే, కళాఖండాల కొనుగోళ్లలో జాప్యం జరుగకుండా, ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం అనుకున్న సమయానికే ప్రారంభించ బడేలా అది ఉపయోగపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ఋషి తన ఆసక్తిని వెల్లడించి, సంభాషణ ముగించాడు. మహేంద్ర కూడా దీని గురించి ఆనందించాడు. దీన్ని అమలు పరిచేందుకు అప్సర, స్నిగ్ధ లను కలవమని అతను ఋషిని కోరాడు.
ఋషి మహేంద్ర సమక్షంలో మొదటిసారిగా ఆఫీస్ లో స్నిగ్ధను కలిసాడు. స్నిగ్ధ తనకు ఇంతకు ముందే తెలుసని, మహేంద్రకు చెప్పాడు, స్నిగ్ధ ఆఫీస్ లో ఇంకా జూనియర్ కనుక, సంభాషణ అంతకు మించి కొనసాగలేదు. అదొక మామూలు కలయిక. తరువాత అప్సరను కలవాల్సి ఉంది.
అప్సర తమ గదిలోకి వస్తుండగా చూసిన ఋషి, ఆమె అందాన్ని చూసి, అవాక్కయ్యాడు. అందంగా ఉండడం మాత్రమే కాక, ఆమె కనిపించే విధానం అతని కళ్ళకు ఆకర్షణీయంగా అనిపించింది.
ఆమె ఋషి వంక చూసి,” నిర్వాణ ప్లస్ అనే మా కుటుంబానికి స్వాగతం మిష్టర్ ఋషి,” అంటూ, తన బాగ్ లోంచి ఒక విసిటింగ్ కార్డు ను తీసిచ్చి, “మీకు వీలున్నప్పుడు, మా ఆఫీస్ కు వస్తే, మనం మాట్లాడుకుందాం.” అంటూ, చెయ్యి చాపింది.
ఋషి ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తుండగా, అతనికి కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది. అతనికి మేనకా, విశ్వామిత్రల పెయింటింగ్ హఠాత్తుగా తనముందు మెరిసినట్లు అయ్యింది.
మరికొన్ని సెకండ్లలో అప్సర అక్కడినుంచి వెళ్ళిపోయింది. అతను ఆమెను వెంటనే అనుసరించాడు. స్నిగ్ధకు ఇదంతా నచ్చకపోయినా, మహేంద్ర ముందు ఏమీ మాట్లాడలేకపోయింది.
(సశేషం..)

No comments:

Post a Comment

Pages