అజరామర సూక్తి - అచ్చంగా తెలుగు

అజరామర సూక్తి

Share This

అజరామర సూక్తి -- 1

 - చెరుకు రామమోహనరావు 


देहे पातिनि का रक्षा यशो रक्ष्यमपातवत् नरः पातितकायोऽपि यशःकायेन जीवति
- सुभाषितरत्नभाण्डागार
దేహే పాతిని కా రక్షా యశో రక్ష్యమపాతవత్
నరః పాతితకాయోపి యశః కాయేన జీవతి
- సుభాషితరత్నభాండాగారము
మట్టి కరిచే కట్టెయైన ఈ శరీరానికి ఎన్నియో హంగులు రంగులు తీర్చిదిద్దుతున్నాము కానీ ఈ శరీరము శాశ్వతమా అన్న చింత రవ్వంతైనా మనసులోనికి రావడము లేదు. భాగవతము లోని వామనావతార ఘట్టములో బలి చక్రవర్తి చెప్పే ఈ పద్యము చూడండి :
కారే రాజులు,రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ జెందరే
వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలరే, భూమి పై
పేరైనంగలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాములై
ఈరే కోర్కెలు, వారలున్ గలుగరే యిక్కాలమున్ భార్గవా
ఎంతటి గొప్ప మాటో చూడండి. పై మెరుగులు, మై మెరుగులు పెరిగి వేలకు వేలు శరీరానికి ఖర్చు చేయుట అనవసరమని గ్రహించి , ఆ నిష్ప్రయోజన కార్యములకు సొమ్ము వమ్ము సేయక అందులో కొంతైనా ఖర్చు పెట్టె మనపేరు కలకాలము కాకున్నా మన నిర్గమనమునకు తదనంతరము కొంత కాలమైనా నిలిచె పనులు చేస్తే మన ప్రతిష్ఠ శోభిల్లదా !

అజరామర సూక్తి -- 2

उपकर्तुं यथा स्वल्पः समर्थो न तथा महान् । प्रायः कूपस्तृषां हन्ति न कदापि तु वारिधिः ॥- सुभाषितरत्नसमुच्चय
ఉపకర్తుం యథాః స్వల్పః సమర్థో న తథా మహాన్ |
ప్రాయః కూపస్త్రుషాం హంతి న కదాపి తు వారిధిః ||
- సుభాషితరత్నసముచ్చయము
ఉపకార గుణము కలిగిన పేద, ధనికుడైన లోభికన్నా, ఎంతయోమిన్న. దాహార్థికి మంచినీటి బావి ముఖ్యము గానీ మహాసముద్రమునేమిచేసుకోగలడు.ఇదే అర్థము గల పద్యమును మనము గువ్వల చెన్న శతకములో గూడా చూడవచ్చు. కలిమి గల లోభికన్నను
విలసితముగ పేద మేలు వితరణియైనన్
చలి చలమ మేలుకాదా 
కులనిది అంబోధికన్న గువ్వలచెన్నా
(చలి చలమ అంటే నదీ తీరము లోని నెమ్ము గల ఇసుకను కాస్త త్రవ్వి ఒక వెడల్పయిన గుంత చేస్తే అందులో అమృత తుల్యమైన నీటియూట చూడవచ్చును. ఆ త్రవ్వబడిన గుంత లేక గుంటను 'చలి చలమ' అనిగానీ 'చలమ' అని గానీ అంటారు.

No comments:

Post a Comment

Pages