గోదావరీ  ప్రేంఖణం
 - ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం
ఉ.            స్వైరవిహారధీరయగు శారదనీర తరంగరంగ గం
భీరము గౌతమీనదము ప్రేంఖణ నడ్డెడి పాపికొండలన్
భోరున చీల్చి నిమ్నతల భూముల దూకెడువేళ చూపు శృం
గార విలాసముల్ కనగ కన్నుల పండువ గాదె యేరికిన్.
శా.           కన్నుల్  చాలవు చూడ ముచ్చటలునౌ  కల్యాణి గోదావరీ
పన్నీరంబులు,  త్ర్యంబకేశ్వర పదోత్పన్నంబులౌ  నిత్య సం
పన్నంబుల్, బహుళాంధ్ర ధీరవనితాప్రాగల్భ్య  సంఘాతమౌ
విన్నాణంబులు, నాట్యభంగిమలు, సంవేగ ప్రతిధ్వానముల్.
ఉ.            భద్రగిరీశు భవ్యపదపద్మ గవేషుడు రామదాసు హృ
న్ముద్రల తెల్గు వెల్గు పదమోహరమందు పసందు విందులన్,
తద్రస మాధురీ ఝరుల తన్మయతన్ విహరించి మించు నా
భద్రవతిన్ కనంగ మది ప్రాప్తముగావె  యనేక లాస్యముల్.
శా.           రంగత్తుంగ తరంగ రంగములునై రంజిల్లు వైభోగముల్,
పొంగంబారెడు బుద్బుదంబులు వళీపుంజంపు సందోహముల్,
సాంగోపాంగముగాగ పూర్ణ, శబరీ సాంగత్య మాంగళ్యముల్,
గంగామౌళి వసించు క్షేత్రవర శృంగాలింగనాభంగిమల్.
ఉ.            పట్టిస వీరభద్రు శుభపాద పవిత్ర మహత్వయౌచు, నే
పట్టున నిల్వనొల్లక అపాంపతి శీఘ్రమె జేరు నిచ్చతో,
గట్టుల కోనలన్ దుమికి గాఢ తరంగ పృషంతిభంగ, అ
ప్పట్టున నేడు పాయలయి పావన సప్త ఋషీశ్వరాన్వయై.
శా.           అక్షయ్యంబుగ సప్త నిర్ఝరుల అన్యోనానుసంధానమౌ
సుక్షేత్రంబుల శ్రీ ఉమాసహిత  తేజోమూర్తియై శర్వుడున్
సాక్షాత్కారము నిచ్చు నాశ్రితజనాశామోదమై, యందునన్
దక్షారామము క్షోణిపై వెలసె సత్యంబైన కైలాసమై.
ఉ.            ఎన్నగ తెల్గు సాహితికి నేర్పడ వాగనుశాసనుండు  సం
పన్న మనోభిరామముగభారతసంహిత నాంధ్రభాషలో
నెన్నికగల్గురీతి వెలయించిన నన్నయభట్టు వాక్కులో
నన్నువ గౌతమీజలములందున కన్పడు భావుకాళికిన్.
 
 
       
    
 
 
 
 
            
          
 
 
 
 
No comments:
Post a Comment