త్యాగరాజ సంకీర్తనోపాసన - మోక్షానికి సాధన - అచ్చంగా తెలుగు

త్యాగరాజ సంకీర్తనోపాసన - మోక్షానికి సాధన

Share This
త్యాగరాజ సంకీర్తనోపాసన - మోక్షానికి సాధన 
 - మధురిమ 

సంగీతం అంటే శబ్దం కాదు,కానీ ప్రతీ శబ్దంలో సంగీతం ఇమిడి ఉంది. శృతి, లయల సమిష్టి కలయిక వలన శబ్దం, మంచి మాట అవుతుంది,భగవంతుని చేరే బాట అవుతుంది. సంగీతానికి భాష లేదు కానీ ప్రతీ భాషలోనీ భావాన్ని ప్రకటించడానికి మాట్లాడే ప్రతీ మాటకి ఒక నిర్దిష్టమైన శృతి ఉంది. సంస్కృతంలో శృతి బద్ధమైన స్వరాన్ని నాదం అంటారు. ఓంకారాన్ని ప్రణవనాదం అంటారు.ఓం అన్నది ఆ నాదశరీరుడిని అర్చించే దివ్య నామం. హైందవ సంస్కృతిలో బ్రహ్మని సృష్టికర్త అని అంటారు అలాగే సంగీత త్రిమూర్తులలో ప్రప్రధములైన శ్రీ త్యాగరాజస్వామిని త్యాగబ్రహ్మ అంటారు. విశ్వానికి బ్రహ్మ సృష్టికర్త ఐతే తన పవిత్రమైన నాదోపాసనతో భక్తితో తన జీవితం అంతా ఆ శ్రీరామచంద్రమూర్తి పాదార్పణం చేసిన త్యాగబ్రహ్మ ని నాదబ్రహ్మ అని అనుటలో అతిశయోక్తి లేదు. సంగీత ప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులు ఎన్నో రచనలు చేసారు,చేస్తూ ఉన్నారు కానీ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపి తన జీవితకాలం అంతా కేవలం రామ నామ సంకీర్తనోపాసనకే సద్వినియోగ పరుచుకున్న ఆయన ధన్య జీవి. కేవలం రామభక్తి అన్న నిధిని పెన్నిధిగా దైవసన్నిధికి ఏగిన పుణ్యజీవి. హైందవ సంస్కృతి అన్ని జీవులలో భగవంతుడిని చూడగలిగే గొప్ప సంస్కృతి. అందుకే ఈశ్వర సర్వభూతానాం అంది మనగీత. అందరిలో ఒక దివ్యత్వం నింపి పరమేశ్వరుడు ప్రాణంపోశాడు,కానీ ఆ దివ్యత్వం ఎవరిలో ఐతే దైవత్వం అవుతుందో వారు మహానుభావులవుతారు. ఆ దైవత్వం తనలో పరిపూర్ణంగా ఉంది కనుకనే ఆయన కీర్తనలన్నీ భక్తిభావ ప్రధానంగా ఉన్నాయి. ఆయన కీర్తనలన్నీ అలా ఆలపించుకుంటే చాలు మోక్ష ద్వారాలు ప్రతీ మనిషికై అలా తెరుచుకుంటాయి. కలియుగంలో యజ్ఞ, యాగాదులు కాదు నామస్మరణ మాత్రమే ముక్తిని ఇస్తుంది అనుటకు ఆయన కీర్తనలే తార్కాణాలు. పుట్టుక తల్లితండ్రులు : బాహ్య ప్రపంచానికి ఆయన కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మ కుమారుడిగా ఎరిగినా తన కీర్తనలో ఆయన సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాతండ్రి అని తనని వారి సంతానంగా అభివర్ణించుకున్నాడు. సర్వజిత్ నామ సంవత్సరం చైత్ర శుక్ల సప్తమి ,పుష్యమి నక్షత్రంలో అనగా మే 4, 1767 నాడు జన్మించాడు. తిరువాయూరులోని ప్రసిద్ధ త్యాగరాజస్వామి పేరిట ఆయనకి త్యాగరాజు అని నామకరణం చేసారు. నాదబ్రహ్మ యొక్క గురుబ్రహ్మ : బాల్యంలో శ్రీ శొంఠి వేంకట రమణయ్యగారి శిష్యరికంలో సంగీతాభ్యాసం ప్రారం భించారు. సంగీతం ఆయనకు భగవంతునిచేరే మార్గం కానీ ఎప్పుడూ కీర్తికోసం ధనం కోసం ఆశించలేదు. తాదాప్యం చెందిన ఆయన హృదయంలోని భావావేశం కీర్తనగా పరిణమించింది కానీ ఆయన ఎన్నడూ ఒక కీర్తన రాయలని రాయలేదు.నారద మహర్షి ఆయనకు మంత్రోపదేశం చేసినట్లుగా చరిత్ర చెపుతున్నది,ఆ సమయంలోనే ఆయన "శ్రీ నారద మౌని "అన్న కృతిని గానం చేసినట్లుగా తెలుస్తొంది. 13ఏళ్ళ వయసులోనే "నమో నమో రాఘవ " అన్న కృతిని దేశికతోడి రాగంలో గానం చేసిన ప్రతిభాశాలి" ఓసారి శొంఠి వేంకట రమణయ్యగారు శిష్యుని గానం వినాలని త్యాగయ్యని ఇంటికి ఆహ్వానించినారట. అప్పుడు స్వామి పాడిన ఎందరోమహానుభావులు అందరికీ వందనములు అన్న కీర్తన పంచరత్న కీర్తనగా ప్రసిద్ధికెక్కింది. 18వ ఏట పార్వతమ్మతో వివాహం, 23వ ఏట విషాదం అయినా ఆమె చెల్లెలు కమలాంబగారిని తిరిగి వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె ఆమే సీతామహాలక్ష్మి. రాముని సన్నిధే సుఃఖం: వేంకట రమణయ్యగారి ద్వారా త్యాగరాజస్వామి సంగీతసామర్ధ్యాన్ని విన్న తంజావూరు మహారాజుగారు ఆయనకు ఎన్నో విలువైన బహుమానాలు పంపి తన ఆస్థాన గాయకులుగా ఉండమన్నారు కానీ "నిధి చాలా సుఃఖమా రాముని సన్నిధి సుఃఖమా నిజముగ తెలుపు మనసా" అని రాముని సన్నిధినే నిరంతరం కోరుకున్న త్యాగరాజస్వామి మనోబలం అనితర సాధ్యం. కేవలం భిక్షాటనతో తన బాహ్య జీవితానికి కావలిసిన అన్నపానీయాలు సమకూర్చుకునేవారు.ఇలా ఎల్లప్పుడూ భక్తి సాగరంలో మునిగిఉండే స్వామి జీవన విధానం అన్నగారికి నచ్చేది కాదు. రాజు అండ ఉంటే భోగభాగ్యాలు అనుభవించవచ్చని ఎన్నో విధాలుగా చెప్పినా త్యాగరాజస్వామి రామ నామ సంకీర్తనా భాగ్యం తప్ప ఇంకేమీ వద్దని చేప్పేవారు. ఆగ్రహించిన అగ్రజులు ఆయన పూజించే రామపంచాయతనాన్ని కావేరి నదిలో పారవేసారు. అప్పుడు త్యాగయ్య ఎంతో కలతచెంది నిద్రాహారాలు సహితం మాని "ఎందు దాగినాడో " అన్న కృతిని రచించారు. చివరికి నిరీక్షించిన తరువాత తన రాముడిని తానే స్వయంగా తానే వెతికి తెచ్చుకోవాలని ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. అలా ఆ పుణ్యక్షేత్రంలో గల దైవంపై ఎన్నో ప్రసిద్ధ కృతులను రచించారు. అందుకే తిరుమలలో స్వామి దర్శనానికై వెళ్ళినప్పుడు తెరవేసి ఉండుట చూసి"తెర తీయగ రాదా తిరుపతి వేంకటరమణ నాలో మదమత్సరమను తెర తీయగ రాదా"అన్న కృతిని ఆలాపించారు. ఈ కృతి పూర్తవగానే తెర అదే తొలగిపోయిందట అప్పుడు వేంకటేశ నినుసేవింప అని ఇంకో కృతిని ఆలాపించారట. ఇలా యాత్ర చేస్తూ ఉండగా స్వామి కలలో ప్రత్యక్షమై తను ఎక్కడున్నారో చెప్పగానే "కనుగొంటిని శ్రీరాముని" అన్న బిలహరిరాగ కృతి చాలా ప్రాచుర్యం పొందింది. నాదా తనుమనిశం శంకరం , శోభిల్లు సప్తాస్వర వంటి కృతిలు మనిషిలోని జ్ఞానముకన్న బుద్ధి మిన్న అన్న నిజానికి నిద ర్శనాలు. మనసా ఎటులోతునే అన్న కీర్తనలో స్వామి ఏమన్నారంటే "దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి, దినము గడుప మనిన నీవు వినవదేల ఓ మనసా". "తెలియలేదు రామ భక్తి మార్గము" అన్న కృతిలో త్యాగయ్య మానవుని దుర్భర జీవనాన్ని వర్ణించారు ఎలాగంటే "వేగలేచి నీట మునిగి భూతి పూసి బాగా పైకమార్జన లోలులైరే కాని నీయందు భక్తి తెలియలేరు కదా" సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే మనసా అన్నారు. ఈ కీర్తన నేటివిద్యార్ధులకు ఒక చక్కని బోధన ఎందుకంటే నేటితరం విధ్యార్ధులకు జ్ఞానము ఉంది కానీ అది సన్మార్గము కాక దుర్మార్గములో పయనిస్తోంది. అలా కాకుండా కేవలం భక్తితో జ్ఞానాన్ని సన్మార్గంలో పయనింప చేయగలం అని స్వామి ఆనాడే సెలవిచ్చారు. ఆయన నోటినుండి జాలువారిన 24,000 సంకీర్తనలలో ఇవి కొన్ని మచ్చుతునకలు. ఇక పంచరత్నాల విషయానికొస్తే వాటి పేరులోనే వాటి గొప్పతనం వినిపిస్తుంది. ఒక్కో కీర్తన ఒక భావ తరంగం ఆయన సంగీత జ్ఞానము అనంతమైన సాగరం. ఇవియే కాక గంధముపుయ్యరుగా వంటి ఉత్సవ సాంప్రదాయ సంకీర్తనలు ,వందనము రఘునందన వంటి దివ్య నామ సంకీర్తనలు ప్రహ్లాద భక్త విజయము , నౌకా చరిత్రము వంటి పద్య గద్య నాటకాలు కూడా రచించారు త్యాగరాజస్వామి జీవితం ఆయన కీర్తనలు భారతదేశానికి ఒక గొప్ప వారసత్వ సంపద. దాదాపుగా అన్ని రాగ తాళాలను ఆయన సృశించారు. ఈ భూమి పైకి రాముడు ఏకార్యం కోసం తనని పంపించాడో అది పూర్తైందని తెలుసుకొన్న వెంటనే "దయ చూచుటకు ఇది వేళ" అన్న గానవర్ధినిరాగంలో కృతిని ఆలాపించగానే స్వామి సాక్షాత్కారం జరిగిందట. ఆ ఆనందంలో ఆయన ఆలపించిన "గిరిపై నెలకొన్న"(సహన రాగం)కీర్తనలో స్వామిపదిరోజులలో తనని కరుణిస్తారన్న విషయాన్ని ప్రస్తావించారు ఈ విధంగా పదిరోజులు గడిచినా స్వామి పిలుపు రాకపోవడంతో "పరితాపము కనియాడిన పలుకుల మరచితివో"అన్న కృతిని ఆలపించారట,అందులో ఇలా అన్నారు."వరమగు బంగారు ఓడను మెరయుచు పది పూటలపై కరుణించెదనుచు క్రీకనుల త్యాగరాజుని" అంటే సరయూ నదిలో సీతా సమేతంగా బంగారు ఓడలో ద ర్శనం ఇచ్చి పది పూటలలో నన్ను కరుణిస్తావన్న మాట మరిచావా స్వామీ అని భావం ఇలాంటి కృతి పాడించుకోవాలనేమో రాముడు పదిరోజులైనా మౌనంగా ఉ న్నాడు. ఈ కృతిని గానం చేసిన వెంటనే అనగా 1847, ప్రభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమిరోజున త్యాగరాజస్వామి శరీరం నుండీ ఓం కారం వినిపించి వెంటనే ఒక దివ్యజ్యోతి శిరస్సు నుండీ బయటకి వచ్చి శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యం అయ్యింది. ఈ విధంగా 80 సంవత్సరాలు 5కోట్లసార్లు నిరంతర రామ నామ జపంతో పునీతులై పుణ్యలోకాలకి వెళ్ళిన త్యాగయ్య ధన్యుడు. ఆయన కుమార్తె సీతాలక్ష్మి కుమారుడైన త్యాగరాజు(మనుమడు) కూడా చిన్నతనంలో మరణించడం వల్ల త్యాగయ్య వంశం ఆయనతోనే అంతరించింది కానీ ఆయన సంగీత మహావృక్షం అక్కడనుండీ శిష్య ప్రశిష్యులతో శాఖోపశాఖలై ఎందరో సంగాతాభిమానులకి చల్లని నీడనిచ్చి ఈ లౌకిక ప్రపంచంలోని అశాంతిని దూరం చేసి సేద తీరుస్తొంది. ఆయన సంస్మర్ణార్థం ఇప్పటికి ప్రతీ సంవత్సరం పుష్యబహుళ పంచమి రోజున శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవం తిరువయ్యారులో కావేరీ తీరాన ఆయన సమాధివద్ద ఇప్పటికీ జరుగుతోంది. సంగీతాభిమానులందరికీ ఇదే సంక్రాంతి. అక్కడ పాడి తరించాలని ప్రతీ సంగీత విధ్యార్ధి ఆ రాముడిని అభ్యర్ధిస్తాడు.యువత ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని భక్తిబీజాలు మనసులో నాటుకుంటే అవి కాలక్రమేణా మహావృక్షాలై వారికి నీడని ఇస్తాయి. చక్కని త్యాగరాజ కీర్తనల్ని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages