ప్రయాణం 
                                                                              - వెంకట్ బోడ 
నిన్న బాల్య స్నేహితుడు ప్రకాష్  కూతురి పెళ్ళికి వెళ్ళాను. సిటీ నుండి 100 కి.మీ  , ఇంట్లో నుండి ఉదయం  8.30  కి నా బైక్ పైన బయలు దేరి,, సనత్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైకి రాగానే , ట్రాఫిక్ ప్రవాహం చుట్టిముట్టింది. ఇంత పొద్దున్నే ఇంత తొందర ఎందుకో... దారికి మద్యలో ఏర్పాటు చేసిన డివైడర్, రోడ్ పై ఒక వాహనం  మాత్రమే ముందుకు సాగేలా చేస్తోంది.  అటు బల్కంపేట్ ఇటు సనత్ నగర్ నుండి వచ్చే వాహనాలతో రోడ్ కిక్కిరిసి పోయింది.  నా బైక్  మెల్లిగా బొయిన్ పల్లి చేరే సరికి 45 నిమిషాలు పట్టింది. పోలీస్ స్టేషన్ ముందున్న ఖాళీ స్థలంలో  బైక్ ను స్టాండ్ వేసి నిలబెట్టాను, బస్సు స్టాప్ లో నిజామాబాదు వెళ్ళే బస్సులు  అన్నీ కిక్కిరిసి ఉన్నాయి. పది నిమిషాల తర్వాత వచ్చిన  నాన్ స్టాప్  కామారెడ్డి బస్సులో వెళ్లి కూర్చున్నాను.  టికెట్ తీసుకొని సర్దుకుని కూర్చొని కళ్ళు మూసుకున్నాను. ఇప్పటికి 35 సంవత్సరాల వెనక్కి నా ఆలోచనలు...  ఆ ఊరికి మా బాపు వైద్యుడిగా వచ్చి ప్రాక్టీసు చేస్తున్నాడు. ప్రకాష్, నేను ఆ ఊరికి వచ్చినప్పటి నుండి నాకు ప్రాణ స్నేహితుడు అయ్యాడు . క్రికెట్ టీం స్నేహితులలో ప్రత్యేకమైన స్నేహితుడిగా ఎప్పుడూ ,వెంటే వుండేవాడు. ప్రకాష్ కి అమ్మమ్మ, తల్లి మాత్రమే వుంది, తండ్రి ప్రకాష్ పుట్టిన వెంటనే, తను ఇంకొక పెళ్లి చేసికొని అమ్మను ఇంట్లో నుండి పంపించేసాడని  చెప్తుంటారు. నేను ఎప్పుడూ ప్రత్యేకంగా అడగలేదు. మేన మామ వాళ్ళ దగ్గర పెరిగాడు. చలాకీ గా  గలగలా మాట్లాడే వాడు. నడిచేటప్పుడు ప్రకాష్, నా  భుజాల పై చెయ్యి వేసి నడిచే వాడు. మా అమ్మ, ప్రకాష్ ఇంట్లోకి వచ్చాడంటే ఏదో ఒకటి తినిపించందే పంపేది కాదు, మా నానమ్మకు మాత్రం నచ్చేది కాదు.  ఈ రోజు తను లేకుండా, కూతురి పెళ్లి జరుగుతోంది, .సంవత్సరం కిందనే మాయదారి రోగం తనను కబళించుకు పోయింది.  తలచుకుంటేనే ఏదో గుండెలో మెలి పెట్టినట్టు ... బాధ.  నేను ప్రకాష్  ఎన్నో రాత్రులు క్లినిక్ లో నే ఇద్దరం పడుకునే వాళ్ళం, ఫ్యూచర్ గురించి ఎన్నో ఆలోచనలు చేసే వాళ్ళం, నా  ప్రేమ గురించి పూర్తిగా తెలిసిన మనిషి ప్రకాష్ ఒక్కడే. బ్రాహ్మల అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని తెలిసిన నా స్నేహితులలో ఒకడైన, ప్రకాష్ చాల ధైర్యం ఇచ్చేవాడు. ఇంటర్ లో  చదువు ఆపేసి మహారాష్ట్ర వెళ్తున్నానని, అక్కడ పెద్ద మామ దగ్గర వైన్ షాప్ ను చూస్తానని ఊరొదిలి వెళ్ళాడు.  రెండు నెలలకు ఒక్కసారి ఉరికి వచ్చి వెళ్తుండే వాడు. తను వచ్చినప్పుడు, నేను తప్పకుండా కలిసి క్షేమ సమాచారాలు తెలిసికోడానికి ఊరికి వచ్చేవాడిని. తను లేని సమయంలో నేను  ఊరికి వస్తే ప్రకాష్ అమ్మను, అమ్మమ్మను,  తప్పకుండా వెళ్లి పరామర్శించేవాడిని. ఒక్కటి మాత్రం, చెప్పుకోదగ్గ  విషయమేమిటంటే ఇన్ని సంవత్సరాల స్నేహంలో డబ్బులు అప్పు, బాధలు,  తను అడగలేదు, నేనూ అడగలేదు. మాకెప్పుడూ బేధాభిప్రాయాలు రాలేదు. అదే ప్రకాష్ స్నేహం గొప్పతనం, అదీగాక తను మాత్రం నన్ను స్నేహ ఋణంలో పడేసాడు. ఈ రోజు తను లేడు ..  టికెట్... టికెట్... కండక్టర్ భుజాన్ని తట్టి మరీ లేపింది. ఒక అందమైన లేడి కండక్టర్ కళ్ళ ముందు టికెట్ తీసుకున్నావా ,అన్నట్టు సైగ చేసింది. అవును, అన్నట్టు నేను తల ఊపాను. పక్క సీట్ లో కూర్చున్న అతను గురక పెడ్తున్నాడు. తలను కిటికీ వైపు పెట్టడం వలన, గురక తీవ్రత నా వరకు రావడం లేదు. బయట చూస్తే ఇంకా తూప్రాన్ దాటినట్టు లేదు. ఒకసారి లేడి కండక్టర్ వైపు చూసి నాకు రావలిసిన  చిల్లర డబ్బులు, టికెట్ వెనకాల రాసిన అంకెను చూపించాను. తను సరే అంది. కళ్ళు మూసుకొని మళ్ళీ నా గతాన్ని నేమరువేసుకోసాగాను....  ప్రకాష్ మహారాష్ట్ర వెళ్ళిన నాలుగు సంవత్సరాలలో బస్టాండ్ వెనక ఒక పెంకుటిల్లును కొన్నాడు. మహారాష్ట్ర నుండి  వచ్చాడంటే, అక్కడి నుంచి తెచ్చిన ఏదో ఒక వైన్ బాటిల్ తో, వాళ్ళ ఇంటి వెనక చాప వేసికొని ఎన్నెన్నో ముచ్చట్లు. అక్కడి పరిస్థితులు,  తన  భవిష్యతు ....అలా మాట్లాడుతూ  నా ప్రేమ విషయాలు అడిగి మరీ  తెలిసికొని,  ఏం  భయపడొద్దు పెళ్లి మహారాష్ట్రలో చేద్దాం. పెద్ద మామకు చెప్తాను, అన్నాడు. చాలా  ధైర్యమొచ్చింది ఆ మాటతో నాకు, ఆ సమయం రానే వచ్చింది.  నేను పెళ్లి విషయాన్ని ఇంట్లో అమ్మకు, బాపు కు వివరంగా తెలిపి సహాయం అడిగా. బాపు భయపడ్డాడు, “నీకు ఇష్టమే, కావచ్చు, నీకు ఈ విషయంలో నేను ఏ సహాయం చెయ్యలేను ,”అని కచ్చితంగా చెప్పాడు. “పిల్ల మేనమామలకు   దొరికితే మాత్రం నీ శవాన్ని కుడా మాకు ఇవ్వరు రా...”, అన్నాడు బాపు. అదే రోజు అర్ధరాత్రి నా ప్రియమైన రాణి దగ్గరకు బయలుదేరాను. బస్టాండ్ దగ్గర హోటల్ లో పక్క ఊరికి పోడానికి సరిపడా ఐదు రూపాయలు అడిగాను. ఆ ఊరిలోనే స్నేహితుడి గదిలో ఆ రాత్రి గడిపి, తెల్లవారి బస్టాండ్ లో 'శివం కట్ పీసెస్ ' సెంటర్ నడుపుతున్న మా అన్నను, ఐదు వందల రూపాయలు అడిగి తీసుకున్నాను. కాలేజీనుంచి బయలు దేరిన రాణిని, సర్వీస్ బస్సులో వూరు దాటించి, మరో ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్ కు రాత్రి 8 గంటలకు చేరుకున్నాము. హైదరాబాద్ లో జాబు చేస్తున్న మా పెద్ద బాపు కొడుకు -  అశోక్ గదికి చేరుకున్నాము. అశోక్ తో పాటు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆటో ట్రాలీ లో బస్టాండ్ వరకు వెళ్లి, మహారాష్ట్ర బయలుదేరి, ప్రకాష్ వైన్స్ నడుపుతున్నఊరికి, రాత్రి పొద్దు పోయిన తర్వాత చేరుకున్నాము. ప్రకాష్ పెద్ద మామ ఆరోజు రాత్రి  తీవ్రంగా ఆలోచించి, మర్నాడు తుల్జాపూర్ లో పెళ్లి చేద్దామని  నిర్ణయం తీసుకున్నాడు. అప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసి కొంటాడో,  అని మేము ఆ రాత్రి నిద్ర పోలేదు.  ప్రకాష్ ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యంగా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఇష్టం లేని పనిని ఎలా తప్పించు కోవాలో, చాకచాక్యంగా మాట్లాడి ఆశ్చర్య పరిచేవాడు. ఊర్లో అందరి నాల్కల పై ప్రకాష్ ..ప్రకాష్ ... అన్న పేరు నానుతూ ఉండేది. 
 నా పెళ్లి మహారాష్ట్ర లో జరగడానికి  ప్రకాష్ మాత్రమే కారణం. పెళ్లి కి  అంతా తానై దగ్గరుండి జరిపించాడు.  మహారాష్ట్ర నుండి తిరిగి వూరికి వచ్చాడు. మామతో ఏదో తగవు వచ్చినట్టు, తను వూరులోనే అమ్మను అమ్మమ్మను ,పిల్లలను చూస్తూ వున్నానని , దసరాకి వూళ్ళో కల్సి నప్పుడు చెప్పాడు.  ప్రకాష్ మా స్నేహాన్నిమరొకసారి సమున్నతం చేసాడు. నా పెద్ద కూతురు పెళ్లికి, తన కొడుకును వారం ముందే పంపించి స్నేహమంటే ఏమిటో చూపాడు ప్రకాష్.  ఇప్పుడు ప్రకాష్ కొడుకు, నాకు నిన్నటి రోజు ఫోన్ చేసి,” చెల్లి పెళ్లి పెట్టుకున్నాం రేపు తప్పకుండా రావాలి అంకుల్, ముందే చేద్దామనుకున్నాను కాని నీ కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు”, అన్నాడు. ఏమి ఆలోచించాడో, ఎలా చేస్తున్నాడో, అని నాకు ఒకటే కంగారు. చాల చిన్న వయస్సు వీడికి, ఇంత పెద్ద భారం వేసాడు దేవుడు... అని దయ.  వూరు దగ్గర పడుతున్న కొద్దీ , ఉద్వేగాన్ని ఆపుకోలేక పోతున్న గొంతు, అదోలా మూగగా రోదిస్తున్నది. బస్సు దిగగానే ప్రకాష్ కొడుకును కలుద్దామని పెళ్లి పందిట్లో వెళ్లి చూసాను. పెద్ద  మామకు నమస్కారం చెప్తూ, మాకు పెళ్లి జర్పించిన ప్రకాష్ పెద్ద మామను కలిసాను. మనస్పూర్తిగా దణ్ణం పెట్టి ఆశీర్వాదాలు తీసికొన్నాను, తనను నేను కూడా మామ అని సంభోదిస్తుంటాను. ప్రకాష్ కొడుకు కొరకు ఆ చుట్టూ పక్కల వారిని ఆరా తీసాను, “ఏమో సారూ ఒక్కడే అటు ఇటు పిట్టలాగా తిరుగుతున్నాడు, ఇక్కడే ఎక్కడనో వుంటాడు..”, సమాధానం విని నిశ్చేష్టుడిని  అయ్యాను.  అంకుల్....అంకుల్.... నా చెయ్యి పట్టుకున్నాడు ప్రకాష్ కొడుకు. వాడిని చూసి  నా కళ్ళు  చెమర్చాయి.  “ఎలా చేస్తున్నావురా ఇంత పెద్ద పెళ్లి ఒక్కడివే..”, అని భుజాన్ని తట్టి అడిగాను.  “అంకుల్.. చాల కష్టమయ్యింది, ఏ తాతా వాళ్ళు నాకు సహాయం చెయ్యలేదు.,” కళ్ళనుండి నీళ్ళు దుమ్కుతున్నాయి. దగ్గరకు తీసికొని ఓదార్చాను. “చాల ఘనంగా చేస్తున్నావురా పెళ్లి,” అని వాడి మనసు కుదుట పడ్డానికి టాపిక్ మార్చాను.  పెళ్లి అయ్యేంత వరకు వుండి, ప్రకాష్ కొడుక్కి నా విసిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి, ఒకసారి హైదరాబాద్ వచ్చి కలువమన్నాను.  ప్రకాష్.. ‘నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను .. నీ స్నేహాన్ని ఎలా మరువగలను ...అవకాశం వస్తే ఈ జన్మ లోనే ఋణం తీర్చుకునే భాగ్యం కలిగించమని ఆ భగవంతున్ని ప్రార్థిస్థూ ఉంటాను,’ అంటూ ప్రకాష్ ను స్మరించుకుని, మనసారా అశ్రునయనాలతో నివాళి అర్పించాను.
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment