ఊరకుండేవో లేదో వోసి చెంచెతా ! (అన్నమయ్య కీర్తనకు వివరణ )
 -డా.తాడేపల్లి పతంజలి 
    చెంచు లక్ష్మి, నరసింహ స్వాముల మధ్య సరస సంభాషణను అన్నమయ్య ఈ కీర్తనలో వివరిస్తున్నాడు.   రేకు972-4      సంపుటము  19-418
పల్లవి  
 ఊరకుండేవో లేదో వోసి చెంచెతా ! వోరి 
  నరసింహుడుః-
అడవుల్లో చెట్ల వెంబడి తిరిగే ఓ చెంచు లచ్చీ ! ఇంకా ఎక్కువ మాట్లాడకు. ఊరుకుంటావా ! లేదా?
 కోరి నిన్ను నెంచుకొంటి గొల్లఁడవుగదరా చెంచెతః-
ఏందిరా గొల్లోడా !(ఆవులు కాసుకొనే వాడా ) నేను మాట్లాడితే భరించలేక పోతున్నావా! నిన్ను కోరి నాకు తగిన వాడివని ఎంచుకొన్నానురా! అప్పుడే ప్రేమ తగ్గిందా!?
 01వ చరణం జమళిపీకిలిదండ సరి నీకేలే నరసింహుడుః-
మీ గూడెంలో ఎవరైనా ఒక పికిలి పిట్ట ఈకల దండ ఒకటి వేసుకొంటారు. నువ్వు రెండు పికిలి పిట్ట ఈకల దండలు (=జమళిపీకిలిదండ) వేసుకొన్నావు. ఇట్లాంటి వేషాలన్నీ నీకే చెల్లు.
 నెమలిచుంగులపాగా నీకేలేరా చెంచెతః-
అట్లాగా సామీ ! ఎవరైనా తలపాగా ఒకటే పెడతారు. తమరు ఒకటి కాదు- అనేక   నెమలి కుచ్చులతో పాగా పెట్టారు. ఇది మీకే ప్రత్యేకం.
 అమరెనే సంకుఁగడె మందుకుఁ దోడు నరసింహుడుః-
ఓ చెంచులచ్చీ! రెండు పికిలి పిట్ట ఈకల దండలు సరిపోలేదే నీకు! 
శంఖాలతో చేసిన గొలుసు(= సంకుఁగడెము) కూడా పెట్టావు.
 భ్రమసి నీవేల గుల్ల పట్టుకున్నాఁడవురా చెంచెతః-
నన్ను శంఖాలతో చేసిన గొలుసు పెట్టానని వెక్కిరిస్తున్నావు.
నువ్వు  (= భ్రమసి) తబ్బిబ్బై చేతిలో ఆ క్షుద్ర శంఖము (=గుల్ల )పట్టుకొన్నావేమిటి?
 02వ చరణం పలుమెకాలవెంటను పారేవేలే ! నీవు నరసింహుడుః-
అయినా చెంచూ ! జింకలు, చిరుతలు, ముండ్ల పందులు- అబ్బబ్బా-
ఇలా అనేక మృగాలవెంట పరిగెత్తే జాతి నీది.ఒక చోట నిలకడగా ఉండరు. 
 యెలమిఁ బులుగునేల యెక్కితివిరా చెంచెతః-
అట్టాగా నరసింహసామీ ! నేను జంతువుల వెంట పరిగెత్తే దాన్ని. సరే. నువ్వు ప్రేమతో (యెలమి) ఆ పక్షి (= పులుగు, గద్ద) మీది కెక్కి పరుగులు తీస్తుంటావేం?!
 పలచని పారెటాకు పయ్యదేఁటికే నరసింహుడుః-
బట్టకి బదులుగా కట్టుకొనే ఆకు పారెటాకు. అంత పలచని పారెటాకు  ఎవరైనా పైటగా వేసుకొంటారుటే !?
 అల మఱ్ఱేకుపానుపు అది నీకు నేలరా చెంచెతః-
నన్ను వెక్కిరించనక్కరలేదు మహాను భావా ! మీరు సృష్టి ప్రారంభంలో నోట్లో బొటన వేలు పెట్టుకొంటూ ఆ మర్రాకు మీద పడుకొంటారు. ఇంక వేరేవి దొరకలేదా!? ఆకులెందుకు? !
 కాకిపైఁడిబొట్టు నీకుఁ గడుప్రియమా నరసింహుడుః-
అద్దపు పెంకులలాంటి వస్తువు అభ్రకము. పసుపు వర్ణముతో కలిసిన అభ్రకముతో పెట్టుకొనే బొట్టు  కాకి పైడి బొట్టు. ఇట్లాంటి కాకిపైఁడిబొట్టు   పెట్టుకొన్నావా ! ఇట్లాంటివి నీకు ఇష్టమా ! 
 03వ చరణం  
 ఆకుఁ దొలసిదండ నీకది బాఁతా చెంచెతః-
ఆకులతో కలిసిన ఆ తులసీమాల  (=ఆకుఁ దొలసిదండ). వేసుకొన్నావు.నిన్ను అది రక్షిస్తుందా? ! (= పాతా?) నీకు అది ఇష్టమా ! 
 కైకొంటి శ్రీ వేంకటాద్రిఘనుఁడ నిన్ను- చెంచెతః-
శ్రీవేంకట పర్వతము మీద ఉన్న గొప్పవాడా ! నిన్ను నేను అనుసరిస్తున్నాను. పొందాను. (=కైకొంటి)
 నేకమైతిఁ గదరా నీయిందిరాదేవిని నరసింహుడుః-
ఈ చెంచు లక్ష్మీదేవితో  నేను  ఏకమయ్యాను. (=ఈ యిందిరాదేవిని)
విశేషాలు
 నరసింహ స్వామిని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించిందని ఒక జానపద కథ. దానికి ఈ అన్నమయ్య కీర్తన అందమైన రూపాన్నిచ్చింది
 స్వామి -చెంచెతకు -  శ్రీ భార్గవ నరసింహ స్వామి, శ్రీ యోగానంద నరసింహ స్వామి,  శ్రీ ఛత్రవట నరసింహస్వామి ,శ్రీ అహోబిల నరసింహస్వామి,శ్రీ వరాహ నరసింహస్వామి, శ్రీ మాలోల నరసింహస్వామి,  శ్రీ జ్వాలా నరసింహస్వామి ,శ్రీ పావన నరసింహస్వామి, శ్రీ కరంజ నరసింహస్వామి  అను నవరూపాల్లో దర్శనమిచ్చారు. 
 అహోబిలంలో  ఉన్న గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా కొలుస్తుంటారు
 చెంచులక్ష్మి సమేతుడైన నరసింహ స్వామిని అహోబిల కొండల ప్రాంతంలో  పావన నరసింహస్వామి  అంటారు. చెంచులక్ష్మి అడవిజాతి స్త్రీ .కనుక  చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చి ప్రతి శనివారం గుడిబయట బలులిస్తుంటారు..
 ’’చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్క గలవా ? తెలుగువారికి సుపరిచితమైన చలనచిత్ర గీతం ఇది.ఇటువంటి అనేక గీతాలకు ప్రేరకమైనది  ఈ అన్నమయ్య గీతం
 నిజానికి చెంచులక్ష్మి, నరసింహుడు దెబ్బలాడుకోరు. ఎత్తి పొడుపు మాటలనుకోరు. మరెందుకు ఈ గీతంలో అన్నమయ్య అలా వ్రాసాడంటే- మానవ జాతికి దైవాలను సన్నిహితం చేయటానికి.
 మానవజాతి లో చాలామందికి ఉన్న ఈ ఉడుకుమోత్తనపు సంభాషణ దైవాలకు ఆపాదించటం వల్ల వాళ్లు మానవీకరణ పొంది- దైవాలు -మనలో ఒకరనే ఆత్మీయ భావన వస్తుంది. అప్పుడు మనస్సుకు ఆ దైవ భావన పడుతుంది. అందుకోసం  ఈ దెబ్బలాటల గీతం. ఎలాగో ఒకలా దైవాన్ని 
మనస్సన్నిహితం చేయాలనే భావనతో వేలాది గీతాలు వ్రాసిన అన్నమయ్య ఋణం ఈ జాతి తీర్చుకోలేదు. స్వస్తి. 
***   
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment