నను పాలింపగ నడచి వచ్చితివా 
 - మధురిమ 
 ఇది హైటెక్ యుగం కదా ఎక్కడ చూసినా ఉరుకులు పరుగులు.....తొందరే  ఆఖరికి వైకుంఠంలో కూడా శ్రీమహాలక్ష్మి  ఓరోజు పొద్దున్నే .........  స్వామీ శ్రీమన్నారాయణా ఇంకా నిద్దుర లేవరేంటి... లేవండీ స్వామీ అంటూ నిద్దురలేపుతోంది.......  అప్పుడు స్వామి .. అబ్బ ఉండు లక్ష్మి తిరుమలలో మరీ రెండు గంటలకే సుప్రభాతం పాడేసి నిద్ర లేపెస్తున్నారు ఇంకాసేపు  పడుకోని లక్ష్మి....  అన్నారు.  లేవండి స్వామీ భూలోకంలో హైదరాబాదులో వరలక్ష్మి అనే మీ భక్తురాలు మీకోసం ఎంత భక్తిగా పాడుతోందో చూడండి అంది శ్రీమహాలక్ష్మి  అప్పుడు స్వామి ఎంతో సంతోషంగా అలాగా లక్ష్మి..... ఎవరి హడావిడిలో వారుండే భూలోకంలో నాగురించి ఎవరు పాడుతున్నారు?  అదీ భక్తితో   పైగా ఇంత పొద్దున్నే.... ఆ మధ్య ఎప్పుడో అన్నమయ్య సినిమా షూటింగులో  నాగార్జున అంత భక్తిగా పాడినట్లు గుర్తు ...... ఏదీ చూడనీ.....అంటూ భూలోకంలోకి తొంగిచూసారు స్వామి  వరలక్ష్మి అప్పటికే స్నానం చేసి  దేవుడిపై  నిర్మాల్యం తొలగిస్తూ...మోహనరాగంలో "నను పాలింపగ నడచి వచ్చితివా"అంటూ ఎంతో భక్తితో  తన్మయత్వంతో గానం చేస్తూ ఈ విధంగా అంటోంది  నారాయణా... నారాయణా...  అంతానీదయ స్వామీ ఈసంసారసాగరాన్ని ఎలాదాటిస్తావో అంటూ నను పాలింపగ నడచీ వచ్చితివా...   అంటోంది.  స్వామి  ఎంతో  ప్రసన్నుడై  లక్ష్మి..." మద్ - భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా"  అని నారదుడితో అన్నాగా ఇప్పుడే వెళ్ళి అక్కడ కూర్చుని విని వస్తాను అన్నారు  సరే స్వామి త్వరగావెళ్ళి రండి ఇంకాస్త ఆలస్యం ఐతే అంతరిక్షంలో ఎయిర్ ట్రాఫిక్, భూలోకంలో రోడ్ ట్రాఫిక్  ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అంది శ్రీమహా లక్ష్మి.  సరే అంటూ శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు....  వరలక్ష్మి అపార్టుమెంటు పేరు బృందావనం కింద అంతా పూల మొక్కలతో చాల అందంగా, ఆహ్లాదకరంగా బృందావనానికే వచ్చినట్లుగా అనిపించింది స్వామికి..  మూడో అంతస్తులో వాళ్ళ ఇంటికి   వెళ్ళారు  స్వామి. గుమ్మం బయట కళకళలాడుతున్న  ముగ్గుని చూసి ఇంకా పిండితోముగ్గుని వేసిన ఈ ఇల్లాలే నా నిజమైన భక్తురాలు అనుకుంటూ ....వరలక్ష్మీ....అందామనుకున్నారు స్వామి. ఈలోగా పనమ్మాయి పార్వతికూడా స్వామితో జతకలిపినట్టుగా అమ్మగారూ.....  అంది  దేవుడి దగ్గర ఉన్న వరలక్ష్మి ....  ఓం కేశవాయనమః  వచ్చావా.... అంది. స్వామి తననే అనుకుని ఆ.... వచ్చాను లక్ష్మీ.. అన్నారు. ఇదేమీ వినిపించుకోని వరలక్ష్మి తనదైన ధోరణిలో  ఓం నారాయణాయనమః  ఇప్పుడా తగలడ్డావు  ఓం గోవిందాయనమః నిన్న సాయంత్రం ఏం  మాయరోగం వచ్చింది ? రాలేదెం? అంది  స్వామి చెవులుమూసుకుని అయోమయంగా ఆకాశంలోకి చూసారు. ఈలోగా బయటికి వచ్చిన వరలక్ష్మి నారాయణుడికన్నా ముందు పార్వతినే చూస్తూ..అస్తమాటూ మానేస్తే ఎలా చచ్చేది???రావేమో అనుకుని భయపడి ఛస్తున్నాను  త్వరగా తగలడు అంది విసుక్కుంటూ ...  పక్కకి తిరిగి నారాయణునిచూస్తూ ఎవరయ్యా నువ్వు పొద్దున్నే??? పగటి వేషగాడివా??వెళ్ళు వెళ్ళు ఇప్పుడు టైము లేదు....సాక్షాత్తుశ్రీమన్నారాయణుడు వచ్చినా నాకు టైము లేదు అంది...స్వామి నివ్వెరపోయి అయ్యో వరలక్ష్మీ"  నేనేనమ్మా నీ నారాయణుడిని"  నువ్వు భక్తి తో గానం చేస్తూంటే వచ్చానమ్మా ఏది మళ్ళీ పాడు అనగానే  ఆ  స్వామీ... ఇది కలా  నిజమా  నీమాయా  రా స్వామీ  రా .. అంటూ  ఇంట్లోకి  తీస్కువచ్చింది.  కానీ అంతలోనే అదేమిటి స్వామి ఇంత పొద్దున్నే వచ్చావు?? ఇప్పుడెంత పనుంటుందో తెలుసా? పోనీలే అలా కూర్చో అంటూ.... అమ్మవారు బావున్నారా స్వామీ అంటూ..... ఓపక్క కుక్కరు పెడుతూ.....ఇందాక ఎక్కడ ఆగేను ... ఆ....... ఓం విష్ణవేనమః    విష్ణూ (వరలక్ష్మి కొడుకు) లేవరా  బాబూ  స్కూల్ బస్సువెళిపోతుంది రెడీ అవ్వరా...   ఓం పురుషోత్తమాయనమః ..ఇదిగో పురుష్ (వరలక్ష్మి భర్త పురుషోత్తమ రావు వరలక్ష్మి ముద్దుగా పురుష్ అంటుందన్నమాట) ఆఫీసుకి టైమవుతోంది  లేవండీ ..... అంటూ నిద్ర లేపుతోంది  స్వామి నవ్వుకున్నారు కలికాలం అనుకున్నారు. కుక్కరు ఎక్కిస్తూ నామాలు అవగానే"పాల కడలిలో శేషతల్పమున పవళించేవా" అంటూ ఇంకో పాట అందుకోగానే స్వామి  భక్తురాలివైపు ప్రసన్నంగా చూసారు ఇంతలోనే ఈ పాలవెధవ ఒకడు ఎన్ని సార్లు  చెప్పి చచ్చినా టైముకి వచ్చి చావడు అని తిట్టుకోగానే.. స్వామి మళ్ళా చెవులు మూసుకున్నారు.  టిఫిను చేస్తూ ధూపం ,దీపం   బాక్సులు కడుతూ అందులోచే  నైవేద్యం ముగించింది మన వరలక్ష్మి.స్వామి చిద్విలాసంగా నవ్వుకుంటూ... యుగధర్మం  అనుకున్నారు.  ఈలోగా హడావిడిగా స్వామి దగ్గరగా వచ్చి నారాయణా వీళ్ళు వెళ్ళిపోతే  ఇక అంతా ఖాళీయే..అప్పటివరకు కాస్త కూర్చోతండ్రీ అంది.  అయినా.. నువ్వు కాకపొతే నాలాంటివారికోసం ఎవరు ఆగుతారు స్వామీ ....అంటూ మళ్ళా పరుగుపెట్టింది...   పురుషోత్తమరావు కాఫీ ఆస్వాదిస్తూ పేపరులో మునిగాడేగానీ ప్రత్యక్ష నారాయణునివైపు మాత్రం చూడలేదు  అలా పేపరులోనే మునిగి  ఒక్కసారిగా గడియారం  చూసి అమ్మో! 8:30 అనుకుంటూ పరుగెట్టాడు.   ఈలోగా పిల్లాడు  బాయ్.. మమ్మి,డాడీ అంటూ జీవితం అంటే  మోయలేని భారం అన్నట్లుగా ఒక పెద్ద బస్తాడు పుస్తకాల్ని చిన్నడబ్బాడు భోజనాన్ని  పట్టుకుపోయాడు.  హారతి ఇస్తున్న మన వరలక్ష్మి "ఓం వేదాహమేతం ..."     విష్ణూ జాగ్రత్త ...  "పురుషం మహాంతం " పురుష్...టిఫిన్ రెడీ...  "ఆదిత్య వర్ణం "   ...డబ్బులున్నాయా.. విష్ణూ  అంటోంది కానీ వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు.   స్వామి  చేసేది ఏమీలేక చూస్తూ కూర్చున్నాడు.  స్వామికి అంతా అయోమయంగా తోచింది.... "ఏమిటో ఎవరి పనులలో వాళ్ళు.ఒకరితో ఒకరికి  ఓ మాటా లేదు మంచీ లేదు అనుకున్నాడు..."  భర్త టిప్-టాప్ గా రెడీఅయ్యి....వాతంవచ్చిన కోడిలా బుర్ర పక్కకివాలుస్తూ ఫొన్లో మాట్లాడుతూనే దేవుడి గది బయటనుంచే  ఓ నమస్కారం పారేసాడు.  స్వామి నివ్వెరపోయాడు!   టిఫిను నోట్లో కుక్కుకుంటూ... బాయ్ లక్కి డార్లింగ్  ..  ఈవినింగ్ మీటింగ్ ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు భోంచేసి పడుకొ.నేను తాళం తీస్కుని వెళుతున్నా..అంటూ వెళ్లిపోయాడు.   వరలక్ష్మి పూజగదిలోంచి బయటకి వచ్చి తలుపులు వేసి గడియకూడా పెట్టేసింది. భగవంతుడిని భక్తితో బంధించే భక్తులకాలంపోయి గదిలో బందించే భక్తులొచ్చినందుకు స్వామి చిద్విలాసంగా నవ్వుకున్నారు...   ఇంతలో వరలక్ష్మి.. హమ్మయ్య..ఇక ఖాళీయే స్వామి.. అంటోంది..ఇంతలో చాకలి సూరిబాబు అమ్మగారూ..అంటూ వచ్చాడు....ఒక్కనిమిషం స్వామి... అంటూ వాడుతెచ్చిన బట్టలపద్దు చూసి..రేపురా ... అని వాడిని పంపేలోగా వాచ్ మాన్  రామక్రిష్ణ తలుపు దగ్గరే ఎదురై .... మేడంగారూ  అర్జెంటుగా  ఆడాళ్ళకి మీటింగటమ్మా..  నీళ్ళటాంకరోడు....  రేటుపెంచాడటమ్మా అన్నాడు.  వరలక్ష్మి కాస్త లేని విచారం తెచ్చిపెట్టుకుని మరీ స్వామీ.. అసలే నీళ్ళకివి గడ్డురోజులు...మా హైదరాబాదుకి సాక్షాత్తు     శంకరుడొచ్చినా అభిషేకానికి ఇప్పుడు నీళ్ళులేవనుకో..   ఇప్పుడు మీటింగుకి వెళ్ళలేదనుకొ మాకు నీళ్ళివ్వరు... ఇప్పుడే అరగంటలో వచ్చెస్తానే....అంటూ వెళ్ళిపోయింది.   స్వామికి మాత్రం అంతా విడ్డూరంగాఉంది.....    అరగంట అన్నమన  వరలక్ష్మి సరిగ్గా గంటయ్యాక వచ్చింది..అబ్బబ్బబ్బా..ఈ వెధవ అపార్ట్మెంట్ గోల అనుకుంటూ లోపలకి వచ్చింది.   శ్రీమన్నా రాయణా..అంది   ఇక్కడే ఉన్నానమ్మా..అన్నారు స్వామి. ఇంతలో గడియారం పదకొండు గంటలు కొట్టింది. అయ్యో...అప్పుడే పదకొండయ్యిందా...ఉండు స్వామి  పెళ్ళంటే నూరేళ్ళ పంట సీరియల్ టైమైంది.. ఇవాళ అసలే వాళ్ళకి  కోర్టులో విడాకులు కూడాను. వాళ్ళకి విడాకులు ఇస్తారో ఇవ్వరో అని నాకు నిన్నరాత్రంతా నిద్దరలేదనుకో. ఒక్క అరగంట అలాకూర్చోవూ నా తండ్రీ అంది.   ఫెళ్ళంటే నూరేళ్ళ పంటలో  వాళ్ళకి విడాకులు ఇచ్చారు.  ఈలోగా ఈతరం ఇల్లాలు వచ్చి వెళ్ళింది. ఆ తరువాత అ త్తా ఒకప్పటి కోడలే..వచ్చింది.. వీటి గోలలో పడి మన వరలక్ష్మి సాక్షాత్తు శ్రీహరినే మరిచింది.   ఇంతలో సీరియల్ లో బ్రేక్ రాగానే స్వామి మాట గుర్తొచ్చి అయ్యో అనుకుంటూ నారాయణా వీక్ డేస్ లో అంతా ఇంతే అనుకో..ఎదో ఒక పని.ఇదిగో ఇప్పుడు నేను కాస్త తిని మళ్ళా సాయంత్రం పిల్లాడు వచ్చేసరికి ఎదో ఒకటి చేసి పెట్టలా?? ఆ తరువాత రాత్రికి  వంట  పూర్తి చేసుకుని నేను సాయంత్రం ఉ ద్యోగానికి వెళ్తాను. నేను ఈవెనింగ్  కాలేజిలో ఉపాధ్యాయురాలిని. ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది మరి.  ఇక ఇంటికి వచ్చాక దేనికీ ఓపిక ఉండదనుకో.. కాళ్ళుతేలిపోయి కళ్ళుపడిపోతాయనుకో  మళ్ళీ పొద్దునే లేచి పరుగులు మొదలనుకో...    కాస్త కష్టం అనుకోకుండా  నువ్వొపనిచెయ్యి..   శని,ఆది వారాలలో రాగలవా?? అదికూడా పొద్దునే కాదు సుమా.. సెలవు కదా కాస్త ఆలస్యంగా లేస్తాం..పోనీ మధ్యాహ్నం వస్తావా?? అయ్యో అసలొద్దు స్వామీ ఆవేళ లంచ్ కి బయటకివెళతాం. వెధవది వారమంతా వండుకు చచ్చి ఆరోజు కాస్త బయటకి  పోతాం.. పోనీ శనివారం  సాయంత్రం  రమ్మనదామంటే  ఆ రోజేగా స్వామీ ఏ సినిమాకో ,షికారుకో  పోయేది???  సరే స్వామీ ఇవన్నీకాదు కాని నువ్వు చక్కగా ఆదివారం మరీ పొద్దునే కాకుండా పదకొండూ పన్నేడు గంటల మధ్య వచ్చేయ గలిగితే నాకు, నీకు కూడా వీలుగా ఉంటుంది. ఆవేళ  నీకు వేడి, వేడిగా పులిహోర , చక్కెరపొంగలి అన్నీ చేసిపెడతా ఈ జన్మకి ఈ అదృష్టం చాలు స్వామీ... అంటూ  తనధోరణిలో తను మాట్లాడేసుకుంటూ  ఫ్రిడ్జ్ లోంచి కూరలు తీసుకుని తరుగుకునేందుకు వంటింట్లోకి వెళ్ళిపోయింది.   ఒకప్పుడు భగవంతుడిని చూసి భక్తుడు ఆనందంతో నిశ్చేష్టుడైతే ఇప్పుడు భక్తుడిని చూసి భగవంతుడు అయోమయంతో నిశ్చేష్టుడైయ్యాడు.  ననుపాలింపగా ...అని పాడగానే నడచి వచ్చిన స్వామి అంతా మాయ... భక్తుని మాయ విష్ణు మాయ కన్నా పెద్ద మాయ సుమా... అంటూ నవ్వుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు. ఆలస్యం అయ్యి సాయంత్రం అయితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోతుందేమోఅని.
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment