అంతర్యామి - 9
పెయ్యేటి రంగారావు
          అందరి కళ్ళూ అవిరళంగా స్రవిస్తున్నాయి.  అందరి హృదయాలలోను తీరని ఆవేదన, తరగని ఆవేశం!  లావాని, అంతర్యామిని ఖండ ఖండాలుగా నరికి, ఆ అభినవ కీచకుల రుధిరధారలతో ద్వారక పాదాలకు పారాణి పూయాలనే తపన!కాని ద్వారక ముకుళిత హస్తాలు, వినీత ప్రార్థనలు వారిని బంధించి వేస్తున్నాయి.అందరి కన్నా రామదాసు గారి పరిస్థితి మరీ దయనీయంగా వుంది.  ఆయన మెడలోని నాళాలు చిట్లిపోతాయేమో అన్నట్లుగా వారి మొహం ఉబ్బిపోయింది.  ఇంతవరకు అంతర్యామిని ఆంజనేయస్వామి ఆవహించడం, ద్వారకకు కాళీమాత పూనడం, కేవలం నాటకమైనప్పటికీ, రామదాసుగారికి మాత్రం నిజమైన వీరావేశమే కలిగింది.  ఉద్రేకంతో వణికిపోతున్నాడు.  దుఖంతో కుమిలిపోతున్నాడు.  శిధిలమైన అవయవాలతో జీవఛ్ఛవంలా ద్వారక వద్దకు వెళ్ళాడు.  అతడి నోటినుంచి మాట సరిగా పెగలటల్లేదు.  తూలి పడబోయాడు.చటుక్కున ద్వారక అతడిని పొదివి పట్టుకుని మంచినీళ్ళు తాగించింది.  కొద్ది క్షణాలు గడిచాయి.  రామదాసు కొద్దిగా తేరుకున్నాడు.  అందరికీ అశ్రునయనాలతో నమస్కరించాడు.  తనని తాను అదుపులోకి తెచ్చుకుని అన్నాడు.  ' ఇక్కడికి విచ్చేసిన విజ్ఞానఖనులారా !  మీ అందరికీ నమస్కారం.  ఇంతవరకు నేను కూడా చాలా మూర్ఖంగా భ్రమల సుడిగుండాలలో పడి, నా జీవితాన్ని అగాధంలోకి తోసేసుకుంటూ వచ్చాను.  ఇప్పుడు ఈ జ్యోతిస్వరూపం, ఈ సబల, ఈ శక్తిస్వరూపిణి నాకు ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని ప్రబోధించింది.  అవును!  దేవుడుంటే ఎవరికి కావాలి?  దేవుడు లేకపోతే ఎవరికి కావాలి?  దేవుడున్నాడని నమ్మితే, కష్టాలలో ఉన్నవాడికి అదొక సాంత్వన.  దేవుడు లేడని వాదనలోకి దిగితే, తనొక విజ్ఞానమూర్తిగా నివాళులందుకోవచ్చన్న వెర్రిదనం!!  రెండూ అల్పమైన విషయాలే.  దేవుడున్నాదని నమ్మితే మనసులో ధ్యానం చేసుకోండి.  ఆ సర్వాంతర్యామి అన్ని వేళలా మిమ్మల్ని పరికిస్తూనే వుంటాడన్న ఆలోచనతో, ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యడానికి ప్రయత్నించండి.  సాటివారికి సహాయపడుతూ, మానవసేవలోనే మాధవుడిని సేవించుకోండి.  అంతేగాని పరమభాగవతోత్తములుగా పైకి సంచరిస్తూ, అంతరాళాలలో కల్మషాన్ని నింపుకోకండి.  మీ భక్తి ముసుగులో అమాయకులని మోసగిస్తూ, మీకు కావలిసిన ఇహలోక సుఖాలను అనుచితంగాను, క్షుద్రంగాను పొందడానికి ప్రయత్నించకండి.  అతీంద్రియ శక్తులున్నాయంటూ, మహిమలు చూపిస్తూ బూడిద జనానికిచ్చి, వారినుంచి అమూల్యమైన ధన, మాన, ప్రాణాలను అపహరించకండి.  కాని దేవుడు లేడనే అనుకుంటే, అప్పుడు కూడా నష్టమేమీ లేదు.  కనిపించిన ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి నమస్కరించడం మానెయ్యండి.  స్వయంకృషితో కీర్తి శిఖరాలని అధిరోహించడానికి ప్రయత్నం చెయ్యండి.  అంతేగాని మరొకరి నమ్మకాలని హేళన చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకండి.  అంతేకాదు, సమాజాన్ని మీరేదో ఉధ్ధరించేస్తున్నట్లుగా నటిస్తూ, అనవసరమైన అల్లర్లు, అలజడులు, హింసాకాండలు, దౌర్జన్యాలు జరపకండి.  మీరు ఆస్తికులైనా, నాస్తికులైనా ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు.  అందుకే మీ నమ్మకాలు మీలోనే వుంచుకుని, సాధ్యమైనంత వరకు సాటివాడికి సాయపడటానికి ప్రయత్నించండి.  సమాజంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి.  ఘోరాలు జరుగుతున్నాయి.  అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఎక్కడ చూసినా మోసం, దగా ! మతం పేరిట హింసాకాండలు, చంపుకోడాలు!  ఈ కుళ్ళిపోయిన సమాజంలో, మనిషిని మనిషి నిర్దాక్షిణ్యంగా పీక్కు తింటున్న తరుణంలో, కనీసం ఒక్క ఆర్తుడికైనా ఆపన్నహస్తం అందించి ఆదుకోండి.  ఒక్క నిస్సహాయుడికైనా మానవతా ధర్మంగా అండగా నిలవండి.  అంధకార బంధురమైన ఒక్కరి జీవితంలోనైనా వెలుగు నింపడానికి మిమ్మల్ని మీరు మండించుకోండి.  అప్పుడే మీ జీవితానికి సార్థకత, మీరు మనిషిగా జన్మించినందుకు సాఫల్యం లభిస్తాయి !'  అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు.  రామదాసు కొనసాగించాడు.  ' ఆగండి!  ఈ లావా లాగు, ఈ అంతర్యామిలాగు నేను కూడా ప్రబోధాలు చేస్తున్నానని మీరనుకోకండి.  నా జన్మకు సాఫల్యాన్ని, నా పుట్టుకకు అర్థాన్ని కల్పించమని మిమ్మల్నందర్ని, ముఖ్యంగా ద్వారక గారిని పాదాలంటి అర్థిస్తున్నాను.  ద్వారక ప్రశ్నార్థకంగా రామదాసు కేసి చూసింది.  రామదాసు అన్నాడు, ' ద్వారకగారూ!  నేను లావాని కాను.  అంతర్యామిని అంతకన్న కాలేను.  ఇక్కడున్న అందరూ నా మాటలకి, నా చేతలకి సాక్షీభూతాలై వుంటారు.  నేను సగటు మగవాడిగా ఈ మాటలు చెప్పడం లేదు.  మీ మీద  సానుభూతితో అంతకన్నా చెప్పడం లేదు.  ఇప్పటివరకు మీరు జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించారు.  చీకటిలోనే బతికారు.  ఇప్పుడైనా మీ జీవితంలోకి వెలుగుని తీసుకు వచ్చే అవకాశాన్ని నాకు ప్రసాదించండి.  మీ పెదవులపై వెలిగే క్షణకాలపు చిరునవ్వుకోసం నా యావత్తు జీ్వితాన్ని వత్తిగా మండించుకోవాలన్న నా పిచ్చి కోరికను మన్నించండి.  బిచ్చగాడిగా మీ ముందు జోలె పడుతున్నాను.  నిజం చెబుతున్నాను.  నాకు మీపై వ్యామోహం లేదు.  మిమ్మల్ని నే్ను కేవలం ఆడదానిగా చూడను.  నా స్నేహితురాలిగా నా యింట్లో వెలుగు నింపండి.  ఈ సమాజపు కట్టుబాట్లకి లోబడి వుండాలి కనక, మీకు భర్తగా వుండే అత్యున్నతమైన హోదాని నాకు కల్పించి, మీ కోసం నన్ను బతకనివ్వండి.  నా ఇంట్లో మీరు వున్నంత మాత్రాన మీరు నా అధీనులు కారు.  నేను మీ స్వేఛ్ఛకి, స్వాతంత్ర్యానికి అడ్డు రాను.  మీ అభీష్టాలకి, అభిరుచులకి ఎదురు చెప్పను.  నేను మీ స్నేహితుడ్ని.  మీ సేవకుడ్ని.  ఈ నా ఆస్తిపాస్తులు, ఈ చిన్ని అంతస్తు మీ పవిత్రమైన అంతరాత్మకు అర్పించుకోనివ్వండి.  కనీసం ఒక్కరికైనా, కొద్దిపాటిగానైనా సాయపడ గలిగానన్న సంతృప్తి నాకు కలిగించండి.  అల్లాగే నా మూర్ఖత్వాన్ని, నా పిచ్చి నమ్మకాలని పటాపంచలు చేసి, నన్నొక కార్యశూరుడిగా మార్చటం కోసం ప్రయత్నించ బోతున్నందుకు మీరున్నూ తృప్తిని, ఆనందాన్ని పొందండి.  నాకు మీరు.....మీకు నేను!  మనిద్దరికి ఈ యావత్తు ప్రపంచం!  ఏ ప్రపంచంలో నైతే ఆర్తులున్నారో, అసహాయులున్నారో, కరువు, కాటకాలతో, రోగాలు, రొచ్చులతో, పరమ దరిద్రంతో బాధ పడుతున్న దీనులున్నారో......ఆ ప్రపంచం మనది!  మనిద్దరం ఈ ప్రపంచం లోని నిర్భాగ్యుల సేవ కోసం, దరిద్రనారాయణుల బాధలని తగ్గించడం కోసం అంకితమై పోదాం.  వీలైనంతమందికి సహాయపడుతూ, అవినీతిని, అక్రమాలని ఎదిరిస్స్తూ బతుకుదాం.  చనిపోయేటప్పుడు కూడా, మన బతుకులు నిరర్థకం కాలేదన్న ఆత్మసంతృప్తితో మరణిద్దాం!  నా ఈ అభ్యర్థనని కాదనకండి.'  ద్వారక వెక్కి వెక్కి ఏడవసాగింది.  రామదాసు చేతులు జోడించి అన్నాడు, ' ద్వారకగారూ!  మీ మనసుకి బాధ కలిగిస్తే నన్ను క్షమించండి.  నా కోరిక అనుచితమైనదైతే, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యండి.  కాని దయచేసి మీ కళ్ళనించి కన్నీటిని రానివ్వకండి.'  ద్వారక అందరి కేసి తిరిగి, ' అన్నలూ, తమ్ముళ్ళూ, నాన్నలూ, అమ్మలూ, అక్కలూ, చెల్లెళ్ళూ!...............ఉన్
                                                                                           ********************** 
          అంతా విపరీతమైన కోలాహలం, సందడి!అక్కడ జరగబోయే వివాహమహోత్సవానికి అందరూ పెద్దలే!ఎవరికి వారే పక్కవాళ్ళకి ఏవో పురమాయింఫులు చేస్తున్నారు!అక్కడ ఎవరూ వేదమంత్రాలు చదవడం లేదు.  అందరూ ' శ్రీరామ, జయరామ, జయ జయ రామ ' అంటూ ఉచ్చైస్వరాలతో భజన చేస్తుండగా, రామదాసు ద్వారక మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు.  పైనించి దేవతలో తలియదు, హేతువాదులో తెలియదు, పూల వర్షం కురిపించారు!  అందరి మనసులు చల్లబడ్డాయి!  అందరికీ జ్ఞానోదయమయింది.  భగవంతుడు వున్నాడా, లేడా అన్న మీమాంస తర్కం నశించాయి.  ఈ సమాజం వుంది.  ఈ ప్రపంచం వుంది.  అందులో ఈ మనుషులు వున్నారు.  వీరిలో స్వార్థం వుంది, త్యాగం వుంది.  పశుత్వం వుంది.  మానవత్వం వుంది.  మంచితనం వుంది.  చెడ్డతనం వుంది.  అమాయకత్వం వుంది.  కౄరత్వం వుంది.  ప్రేమించే గుణం వుంది.  ద్వేషించే బుధ్ధి వుంది.  ఇది.....ఇది మాత్రమే నిజం.  అందరిలో ఒక్క తపనే కనిపిస్తోంది.  ' అందరం దీక్షాకంకణ బధ్ధులమవుదాం.  ఈ సమాజాన్ని పునర్నిర్మించుకుందాం.  అందరం ఒక కుటుంబంగా జీవిద్దాం.  మంచితనాన్ని పెంచుకుందాం.  చెడ్డతనాన్ని వదిలించుకుందాం.  ప్రేమించే తత్వాన్ని పెంపొందించుకుందాం. ద్వేషించే గుణాన్ని పోగొట్టుకుందాం.  మనమంతా మానవులం....మనదంతా ఒకటే కులం!!! 
సర్వేజనాస్సుఖినోభవంతు!!!(అయిపోయింది) ******************************
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment