కవిత: కృష్ణకృష్ణం వందేహం...........................
- విసురజ
దేవకీ వసుదేవుల అష్టమగర్భంగా కృష్ణా 
చీకటి చెరసాలలో దుష్టులణచ వెలిసేవు 
విష్ణుమాయతో భటులెల్ల మత్తుగా నిద్రబోవ
 రాత్రివేళే కన్నతల్లి ఒడివీడి బయలుదేరావు
బంధాలూడిన తండ్రి తలపై శయనించి 
యమునానది దారివ్వ నాగరాజు గొడుగవ్వ 
నందునింట మరో తల్లి ఒడి పొందినావు 
యోగమాయను గుట్టుగా నీ స్థానంలో చేర్చేవు 
 నంద యశోదల గారాల సుతుడివై రాజిల్లేవు 
అనురాగ బృందావనంలో అందరిని అలరించేవు 
పొరుగిళ్ళలో వెన్నమీగడలు దోచి దొంగవయ్యేవు 
చంపవచ్చిన రాక్షసులను యుక్తిగా మట్టుపెట్టేవు
 బాలరూపుతో దొడ్డకార్యాలెన్నో ఘనంగా చేసేవు 
గోటితో గోవర్ధనపర్వతాన్ని చిటికెలో ఎత్తేసావు 
ఎల్లరును ఇంద్ర ప్రకోపాన్నుండి సంరక్షించేవు 
కాళిందిసర్పం తలపై నాట్యమాడి డంభమణిచేవు
తల్లి యశోదకు నోటిలోనే ముల్లోకాలు చూపించేవు 
అలవిలేని లీలలెన్నో చేసి గోపికల మనసు దోచేవు 
రాధారమణి ఆత్మీయప్రేమను నెగ్గిన జగన్నాధుడివీవు
 ఆర్తిగా అడిగితే ఆత్మసమర్పణ చేసే కరుణరేడువీవు 
 దుష్ట కంసమామను ద్వందయుద్దంలో చంపినావు 
బందీఖానలో మగ్గుతున్న వారందరికి స్వేచ్చనిచ్చావు 
కంసునిచే చెరపట్టబడిన ముదితలను చేపట్టినావు
 తాతాతండ్రుల చెరను విడిపించి రాజ్యమిప్పించినావు 
 గురుశిష్య పరంపర సుసంపన్నముకై నడుంకట్టేవు 
సర్వజ్ఞానివై కూడా సాందీపుని గురువుగా అందేవు 
శ్రద్దగా గురుముఖతా విద్యలన్నీ పూర్తిగా నేర్చినావు 
చనిన గురుపుత్రుడిని గురుదక్షిణగా తెచ్చిచ్చినావు 
 బలపరాక్రమ వివరాలు నీ రూపలావణ్య వైనాలు శ్రీకృష్ణ 
వినిన విదర్భరమణి రుక్మిణి నిను మోహించే చాలాచాలా 
పురోహితుడిని పంపి ప్రేమవివరము తెలిపి చేపట్టమనే బేల 
వల్లెయని ఒప్పి ప్రేమబాలను గ్రహించి ప్రేమను గెలిపించే 
రాజసూయ సభలో శిశుపాల దూషణలు నూరవ్వ 
దగ్గరివాడైన దండన తప్పదని చక్రంతో తలతెగించావు 
పాండవమధ్యమునిపై సోదరి సుభద్రకు మనసవ్వ 
నిర్మలమైన వారి అనురాగాన్ని ప్రేమను గెలిపించినావు 
సత్యనిష్టులైన పాండవుల వెన్నంటి నిలిచి కాపాడేవు 
గాంధారిపుత్రుల దాష్టికాలను యుక్తితో అడ్డుకున్నావు 
ద్రుపదపుత్రికతో చిన్ననాటి చెలిమికి ఎంతో విలువిచ్చావు 
కురుసభలో ద్రౌపది మాననహరణను నిలువరించావు 
కురుపుత్రుల కుంతిపుత్రుల నడుమ రణమే తప్పదంటే 
ఐదువూళ్ళయైన అడగదలచి రాయభారమేగే కురుసభకు 
అవహేళనల అవమానాల నడుమ చెప్పదలచింది చెప్పే 
తన మాటవిననినాడు కురువంశ నాశనమేనని తేల్చిచేప్పే 
రణభూమిన చుట్టాలను చూచిన పార్ధుడు యుద్దమే వలదనే 
తన వాళ్ళను చంపి పొందే రాజ్యసంపద తుచ్చమని పలికే 
చంపేదెవరు చచ్చేదెవరంటూ కృష్ణుడే గీతారసామృతాన్నిఅందించే 
కళ్ళు మిరిమిట్లు గొలిపే విరాటరూపును కిరీటికి చూపించే 
అహంకార విక్రముడు దుర్యోధనుడు సంధికి తలనొగ్గలేదు 
కురుపురుషోత్తముడు భీష్ముడు నేలకూలకనూ తప్పలేదు 
అరవీరభయంకర పరాక్రముడు కర్ణుడుకి మరణం తప్పలేదు 
చెప్పినట్టుగానే కురువంశ నాశనం సంపూర్తిగా తప్పలేదు 
ధరణిలోన ప్రేమతత్వాన్ని లీలాకృష్ణ నీవు చూపావు
అవసరమైతే పరాక్రము చూపవలిసిందేనని తెలిపావు 
దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మకార్యమని వక్కాణించేవు 
సమదృష్టికి సత్యదృష్టికి సచ్చీలతనే ప్రమాణమన్నావు 
 ప్రేమకు అనురాగ ఆలంబనకు ఆత్మవికాశానికి నీవు 
ఆదివి ఆత్మీయత నిరుపమాన వ్యక్తిత్వ పరాకాష్టకు నీవు 
ప్రతీకవి సదా స్వార్దరహిత ప్రేమను కరుణతో గెలిపించిన నీవు 
దైవానివి హే రాధాకృష్ణ కరుణాకృష్ణ కావ్యకృష్ణ కృష్ణకృష్ణం నీకు వందేహం ..........
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment