మానసవీణ - 3 - అచ్చంగా తెలుగు
మానసవీణ - 3
 పెయ్యేటి శ్రీదేవి



స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆ పాఠశాల యాజమాన్యం వారు రాష్ట్రానికి హోంమంత్రిగారైన కృషీవలరావుగారిని జండా ఆవిష్కరించడానికి ఆహ్వానించారు.  ఆయన ఉదయం ఎనిమిది గంటల ముఫ్ఫై నిముషాలకి వచ్చి జండా ఎగరేస్తానని మాట ఇచ్చారు.  
          కృషీవలరావుగారు అంత ఎత్తుకి ఎదగడం చాలా విచిత్రంగా జరిగింది.  ఆయన తండ్రి అయిన ఓబులేశు ఆ ఊరి జమీందారుగారైన భూషణంగారి దగ్గర పాలేరుగా పని చేస్తుండేవాడు.  భూషణంగారు ఆ ఊళ్ళో మకుటం వున్న మహారాజు.  నిరాఘాటంగా మూడుసార్లు ఆ నియోజకవర్గం నించి ఎం.ఎల్.ఏ.గా ఎన్నికై, మూడవసారి మంత్రిగా కూడా చక్రం తిప్పారు.  కాని నాలుగోసారి ఆయన ఎం.ఎల్.ఏ. కావడానికి ఆటంకం వచ్చింది.  ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ డ్ కేటగిరీగా ప్రకటించడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం తప్పిపోయింది.  ఐనా ఆయన తన ఆధిపత్యమే కొనసాగాలన్న కోరికతో తన దగ్గర పాలేరుగా వున్న ఓబులేశుని ఎన్నికల బరిలో నిలబెట్టి నెగ్గించారు.  ఒక్క దళితుడికైనా మంత్రిపదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిగారు నిర్ణయం తీసుకోవడంతో ఓబులేశు పంట పండి సరాసరి మంత్రి హోదా కూడా దక్కించుకున్నాడు.  ఆ సమయంలో ఆయన కొడుకైన కృషీవలరావు బి.ఏ. పూర్తి చేసి ఎం.ఏ.లో చేరాడు.  ఐతే ప్రత్యర్థివర్గాలు భూషణంగారి మీద వున్న అక్కసు కాస్తా ఓబులేశు మీద తీర్చుకున్నారు.  ప్రమాణస్వీకారం చేసి వస్తున్న ఓబులేసుని గొడ్డళ్ళతో నరికి చంపారు.  ఈ క్షుద్రరాజకీయాలనించి దూరంగా వెళిపోవాలని కృషీవలరావు నిర్ణయించుకున్నా, భూషణంగారి బలవంతం మీద, స్నేహితుల ప్రోత్సాహం వల్ల తప్పనిసరిగా మధ్యంతర ఎన్నికల బరిలో నిలబడాల్సి వచ్చింది.  చనిపోయిన ఓబులేశు మీద సానుభూతితో ప్రజలు అఖండ మెజార్టీతో అతడి కుమారుడైన కృషీవలరావుని నెగ్గించారు.  ఆ విధంగా ఆయన మంత్రి అయ్యారు.  ఐతే విద్యావంతుడు కావడం వలన, ప్రజలకు నిజంగా సేవ చేయాలనే తపన వున్నవాడు కావడం వలన ఆయన అనతికాలంలోనే ప్రజల మన్నన చూరగొన్నాడు. దాంతో తరువాతి ఎన్నికలలో కూడా ఆయన అఖండ మెజార్టీతో గెలుపొంది, హోంమంత్రి పదవిని అలంకరించారు.
          పాఠశాల ప్రాంగణమంతా మువ్వన్నెల జెండాలతో మనోహరంగా అలంకరించారు.  పిల్లలందరూ యూనిఫారాలు ధరించి, చేతుల్లో జండాలు పట్టుకుని ఎండలో క్యూలో నిల్చున్నారు.  ఉదయం ఎనిమిదిన్నరయింది.  మంత్రిగారు రాలేదు. తొమ్మిదయింది.  ఆయన జాడ లేదు.  ఫోను చేస్తే మంత్రిగారు బయలుదేరారని, కొద్దినిముషాలలో అక్కడికి చేరుకుంటారని సమాధానం వచ్చింది.  పిల్లలు నకనకలాడుతూ, ఎండలో అల్లాగే నిల్చున్నారు. తొమ్మిదిన్నరయింది.  ఆ ఎండకు తట్టుకోలేక ఒక బాలిక స్పృహ తప్పి పడిపోయింది.  ఆమెను గబగబా ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన పిల్లలందరూ క్యూలో నిల్చున్నారు.  మరో పావుగంటకు మంత్రిగారు వచ్చి జండావందనం చేసారు.  తరువాత అందరికీ స్వీట్సు పంచిపెట్టారు  తరువాత ప్రతిభ చూపించిన పిల్లలకు మంత్రిగారి చేతులమీదుగా బహుమతులు అందజేస్తున్నారు.  అంతకు ముందు సంవత్సరం పాఠశాల పరీక్షలలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మానసను వేదికమీదకు వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా ప్రకటించారు.  మానస వేదిక మీదకు వెళ్ళింది.  మంత్రిగారు ఆమె బుజం తట్టి, ఆమెకు బహుమతి అందజేయబోయారు.  కాని మానస బహుమతి తీసుకోవడానికి నిరాకరించింది.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోపంగా ఆమెను మందలించబోయారు.  
          కృషీవలరావుగారు ఆయనను వారించి, మానసను అడిగారు, ' అమ్మా!  నువ్వు బహుమతి తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నావో తెలుసుకోవచ్చా?'
          మానస ఆయనకి నమస్కరించి అంది, 'క్షమించండి మంత్రి అంకుల్!  మీరు ఎనిమిది గంటల ముఫ్ఫై నిముషాలకు వస్తానని మాట ఇచ్చి,తొమ్మిదిగంటల నలభై ఐదు నిముషాలకు వచ్చారు.  మేం చిన్నపిల్లలం అంతా అంతవరకు తిండి, తిప్పలు లేకుండా ఎండలో మాడుతూ నిలబడి వుండిపో్యాము.  మీరు రావడానికి పదిహేను నిముషాలముందు మా స్నేహితురాలు ఒకర్తె స్పృహ తప్పి పడిపోతే ఆస్పత్రికి తరలించారు.  మార్గదర్శకులుగా వుండవలసిన మీరే సమయపాలన చెయ్యకపోవడం భావ్యంగా లేదు. అందుకే నేను మీనుంచి బహుమతి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను.'
          మానస అంత ధైర్యంగా మాట్లాడేసరికి పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ప్రధానోపాధ్యాయుడు తమకు రావలసిన గ్రాంట్లు ఎక్కడ రాకుండా పోతాయోనన్న ఆందోళనతో నెత్తి బాదుకున్నాడు.
          కృషీవలరావు హుందాగా మైకు దగ్గరకు వెళ్ళి, 'పిల్లలూ!  నేను సమయానికి రాకపోవడం నేరమే. అందుకని నేను మీ అందరికీ క్షమాపణ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.  అంతేకాదు.  ఇంక జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పొరపాటు చెయ్యనని హామీ ఇస్తున్నాను.  ధైర్యంగా నా పొరపాటు నాకు తెలియజెప్పిన ఈ చిన్నారిని మనసారా అభినందిస్తున్నాను.' అన్నారు.
          మానస వెంటనే వారి పాదాలకు నమస్కరించింది.  ' నన్ను క్షమించండి అంకుల్.  మీ చేతులమీదుగా నాకు బహుమతి ఇవ్వండి.' అని అడిగి ఆయన చేతులమీదుగా బహుమతిని స్వీకరించింది.
          అదుగో, అప్పటినించే అనిరుధ్ కి మానస అంటే అభిమానం బాగా పెరిగిపోయింది.  అది అభిమానం మాత్రమే.  ఆకర్షణ మాత్రం కాదు.
          మానస చదువుతున్న పాఠశాలకు ఒక ప్రత్యేకత వుంది.  అక్కడి ఉపాధ్యాయులు మొక్కుబడిగా పాఠాలు చెప్పరు.  పిల్లలకు విజ్ఞానాన్ని అందివ్వాలన్న తపనతో బోధిస్తారు.  వారికి ఉత్తీర్ణత శాతం కన్న పిల్లలలో మానసిక వికాసం కలగడమే ముఖ్యం.  చదువుకూడా ఒక ఆటలా నేర్పుతారు.  అందుకే పిల్లలు ఎంతో ఉత్సాహంగా బడికి వచ్చి, ఆసక్తిగా అన్నీ నేర్చుకుంటారు.  దానివల్ల ఉత్తీర్ణత శాతం మిగతా పాఠశాలల కన్న ఎక్కువగా వుంటోంది.
          మానస పదవతరగతిలోకి వచ్చింది.  ఆమె చదువులోనే కాదు, అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించింది.  చక్కగా కవితలు వ్రాస్తుంది.  వాటికి అందంగా బాణీలు కడుతుంది.  కమ్మగా పాడుతుంది. వీణ వాయిస్తుంది.  చిత్రలేఖనంలో కూడా ఆమెది అందె వేసిన చేయి.  ఆమెను అందరూ ఎంతో అభిమానిస్తారు.
          ఇదంతా నాణేనికి ఒక వైపు.  మరొకవైపు పరికిస్తే............
          ఆవు దగ్గర పాలు త్రాగుతున్న దూడను చూసినా,ఆడకోతి ఉరుకుతూ, దుముకుతూ చెట్లెక్కుతూంటే దాని కడుపు కరుచుకుని వుండిపోయే కోతిపిల్లని చూసినా,ఆఖరికి పార్వతీదేవి ఒడిలో కూర్చున్న వినాయకుడిని చూసినా, మానసలో ఆవేదన పెల్లుబుకుతుంది.  ఎవరు కన్నారు నన్ను?  ఏ కన్నతల్లి ఒడికి నేను బరువైపోయాను?  ఆ తల్లి మనసు ఎంత క్షోభించి వుండక పోతే నన్ను ఈ జనారణ్యంలోకి విసిరివేసింది?  అసలు నా కన్నతల్లి ఇంకా బ్రతికే వుందా? లేక.............ఊహు.........అల్లా కాకూడదు.  ఆమె బ్రతికే వుండాలి.  ఏమో, బ్రతికివున్నా నన్ను చూడాలని, నన్ను కలుసుకోవాలని ఎప్పటికైనా వస్తుందా?  ఐనా నేనే తన కూతుర్ని అని తెలుసుకోవడానికి ఇంక ఆమె దగ్గర ఏ ఆధారాలు మిగిలివుంటాయి?  ఆకాశంలోని తారలకేసి చూస్తూ, ఆరుబయట పడుకుని వున్నప్పుడు ఆమెలో ఒక విధమైన నిర్వేదం కలుగుతూ వుండేది.  అనేకరకాలుగా ఆలోచిస్తూ, అమ్మను తలుచుకుంటూ, కంట్లోంచి ఉబికివచ్చే కన్నీళ్ళు బుగ్గలపైకి కారి దిండుని తడిపేస్తూండగా ఎప్పటికో నిద్రలోకి జారుకునేది.
          ఆ నిద్రలో ఆమెకు కలలు వచ్చేవి.  ఎవరో అమృతానందమయి తనను ఒడిలోకి జేర్చుకుని,లాలించి, బుగ్గలునిమిరి, ముద్దులాడి, గోరుముద్దలు తినిపించి, జోలపాడి నిదురపుచ్చుతున్నట్లు మధురమైన స్వప్నాలు!!!   ఆశగా కళ్ళు తెరుస్తే నీరవ నిశీధి!!! భరించలేని ఒంటరితనం!!!
          ' అమ్మా!  ఒక్కసారి నీ ఒళ్ళో తల పెట్టుకుని గుండెల్లో బరువంతా తీరిపోయేటట్లు వెక్కి వెక్కి ఏడవాలనుందమ్మా.   అమ్మా!   అమ్మా!   ఒక్కసారి,  ఒకే ఒక్కసారి కనిపించమ్మా!  అమ్మా!  అమ్మా!!  అమ్మా!!!'
          మళ్ళీ ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకునేది. తెల్లవారితే మళ్ళీ తన దైనందిన చర్యలో నిమగ్నమైపోయేది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages