విద్వంస'కులు - అచ్చంగా తెలుగు
విద్వంస’కులు!!!...
టి.వి.ఎల్.ఎన్.మూర్తి 

ఎవడి పేరు చెప్తే పిల్లలు పిచ్చెక్కిపోతారో … ఎవడి ఊసు ఎత్తితే ఆ ఏరియాలో బిచ్చగాళ్ళు అడుక్కోడానికీ భయపడతారో వాడే … వాడే …కిరాతకరావు!  అతడో సాధారణ వ్యక్తి కాదు అలా అని ఏ సామూహిక శక్తో కూడా కాదు. టెర్రరిస్ట్ కన్నా డేంజర్, నక్సలైట్ ని మించిన పవర్ ఫుల్. ఇంత ‘ఇంట్రో’ ఇతనికి అవసరమా అని అంటారా...  మనిషిని బట్టి ఇంట్రో ఉండాలి. ఇలాంటి క్రూరమైన వ్యక్తి ‘ఉండబోరు’!.. ఉంటే ‘మహాబోరు’. ఇలాంటి మనిషి కేవలం సినిమాల్లోనే ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అన్నట్లు సినిమా అంటే గుర్తొచ్చింది. శుభాకాంక్షలు సినిమాలో ఏవీఎస్ ని మించినవాడు ఇతను. అసలు పేరు కన్నా ఈ కిరాతకమే అందరికీ గుర్తుండిపోయింది. ఇంతచెప్పాక అతగాడి గురించి చెప్పకపోతే ఊకదంపుడే అవుద్ది.  అతను మా కాలనీ పుట్టినప్పటినుంచి అక్కడే ‘బురదలో గేదె’లా  కూరుకుపోయి  ఉండిపోయాడు.  తానో సంగీత దర్శకుడినని చెప్పుకుంటాడు. కానీ సరిగమలు పాడినట్లు ఎవరూ వినలేదు.  ‘స్వరాలని ఉరి’తీసే వాడిలా అరుస్తాడు! కర్ణకఠోరం విన భయంకరం - అతని రాగాలు. అయినా కిరాతకరావ్ ని ఇల్లు ఖాళీ చేయ మని అడిగే దమ్మూ ధైర్యమూ ఎవడికీ లేవు.  కాలనీ వాళ్లంతా వాడి భరించలేక, ఉండలేకా నానా బాధలూ పడుతున్నారు. 
ఇలాంటి పరిస్థితుల్లో ..
ఓ వ్యక్తి సైకిలు మీద  కిరాతకం ఇంటికొచ్చాడు. బైటికి పిల్చి మరీ శాలువా కప్పాడు. కాళ్ళకి  మొక్కాడు. అది కిరాతకానికే కాదు, మాక్కూడా అర్ధం కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి కిరాతకంతో చెప్పాడు. “అయ్యా...మీ వల్ల మా చంటిగాడు దొరికాడు! జీవితంలో మళ్ళీ చంటిని చూడలేమని మా ఆడంగులంతా  ఏడిస్తున్న టైంలో నిన్న రాత్రి మీ పాట వింటూ మీ గుమ్మంలో తచ్చాడుతుంటే నేను ఇంటికి తీసుకు పోయాను... మీరు నిజంగా మా పాలిట దేవుడు …సామీ! అంటూ మళ్ళీ కాళ్లమీద పడుతుంటే... 
“చంటిగాడెవ్వడు... మా ఇంటికెందుకొచ్చాడు” అని  కిరాతకం ప్రశ్నించాడు
“చంటిగాడంటే… చంటిగాడంటే…. మా గాడిద”!!... గొణుక్కుంటూ ముక్కు ఎగబీలుస్తూ  ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
‘దభ్’ మనే  సౌండ్.  కిరాతకం మొహం తిరిగిపడిపోయి ఉన్నాడు.  చుట్టూ ఉన్నవాళ్లలో ధైర్యమున్న ఇద్దరు కుర్రాళ్ళు  అతని మొహమ్మీద నీళ్ళు చల్లి ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఇది జరిగిన కొన్నాళ్ల వరకూ కిరాతకం గాత్రకచేరీ వినలేదు...అతని మొహం కనలేదు. సిగ్గుతో చితికి పోయాడనీ, సంగీతానికి ఫుల్ స్టాప్ పెట్టేసాడని అంతా ఆనందించాం. అయితే ఆ ఆనందం ఆవిరయ్యింది.  టిక్కెట్టు రాకపోతే టీవీచానల్లో రంకెలేసేవాడిలా మళ్ళీ సంగీతాన్ని ప్రారంభించాడు. అతన్ని బెదిరించో  బతిమాలో పాటలు వద్దని చెప్పాలని తలంపు ఉన్నా,  మరీ రెచ్చిపోతాడని తలుపులు వేసుకుంటూ బతికేస్తున్నాం.

ఇలాంటి బాధాకరమైన రోజుల్లో...
కిరాతకం ఇంటిముందు పెద్ద పడవ లాంటి కారు వచ్చి ఆగింది.  మా కిరాతకానికింత డబ్బున్న చుట్టాలె వరబ్బా చూద్దామని అందరం కొంచెం దూరంగా గుమిగూడాం.  ఖరీదైన సూట్ వేసుకున్న ఓ శాల్తీ - గజమాలని కిరాతకం మెళ్ళో వేసాడు. అతను మా పక్క వెంచర్ కాంట్రాక్టర్.  అంత పెద్ద కాంట్రాక్టర్ ఇంత పెద్ద పూలమాల కిరాతకానికి ఎందుకేసాడని మా మొహంలో కొచ్చెన్ మార్క్. అదే మార్క్- కిరాతకం మోములో కూడా! గతంలో జరిగిన అనుభవం మరిచిపోయేటంత చిన్నదా మరీ. అందుకే బిడియంతో కూడిన భయంతో- 
“ఈ సన్మానం నాకెందుకూ” అని ఆ పెద్దాయన్ని అడిగాడు.
“ఏం చెప్పమంటారు...మొన్న మా ఇంట ఓ శుభకార్యం జరిగింది. చుట్టాలూ బంధువులూ వచ్చి  సిటీ చూస్తాం, ఫిల్మ్ సిటీ చూస్తాం అంటూ నెల పైనే మా ఇంట తిష్ట వేసారు. ఎలా వెళ్లగొట్టాలో తెలీక నేనూ మా ఆవిడా నిద్రాహారాలు మానేసాం.  ఇంతలో మీరు పాడటం మొదలు పెట్టారు. మీ పాట వాళ్ళకి వినబడింది. అప్పుడు వాళ్ళు నిద్రాహారాలు మానేసారు. బతికుంటే  సిటీని, ఫిల్మ్ సిటీనీ సినిమాలో చూడొచ్చనీ  పెట్టే బేడా సర్దుకుని పరారైపోయారు.  ఇన్నాళ్ళు మీరు పాట మానేసినా మళ్ళీ మొదలుపెట్టి నాలాంటి అర్భకుడికి సాయం చేసారు. అందుకే ఓ ‘నూలుతాడు’లా మీకీ దండ”!!..... అంటూ దణ్ణం పెట్టి కార్లో తుర్రుమన్నాడు.
దండ బరువుకో…  పోయిన పరువుకో కిరాతకం మళ్ళి ‘దభ్’ మనే సౌండ్ తో కింద పడ్డాడు. మరికొన్నాళ్ళు పాటలకి రెస్ట్ ఇచ్చాడు. 
ఈసారి కిరాతకం ఇంటిముందు లారీ వచ్చి ఆగింది.  కిరాతకం ఇంటికి బాగానే జనం వస్తున్నారు. సైకిలూ, కారూ ఇప్పుడు లారీ. కిరాతకం బ్రహ్మాచారి కదా. చుట్టాలు రావడం మేమెప్పుడూ చూడలేదు.
నలుగురు కూలీలు లారీ దిగి కిరాతకం ఇంట్లోని వస్తువుల్ని లారీలోకి ఎత్తేసారు. అప్పు ఎగ్గొట్టి ఉంటాడు. అందుకే సామాను తీసుకుపోతున్నారేమో అని మేం అనుకునేలోపు మాదగ్గరకొచ్చి – “ఇల్లు ఖాళీచేస్తూన్నా” అని చెప్పాడు. “వేరే కాలనీలో ఇల్లు కొనుక్కున్నాననీ, అక్కడికే వెళ్తున్నా”నని చెప్పాడు. మేమంతా ఒకర్నొకరు గిల్లుకుని అది నిజమని రూఢీ చేసుకున్నాం. అయితే అతను వెళ్ళిన కొన్ని రోజులవరకూ అతని గాత్రకచేరీ లేక నిద్రపోలేక పోయాం.
నిజం చెప్పొద్దూ... ఓ నెలరోజులవరకూ అతను ఎక్కడ ఉన్నాడో పాటలు ఎలా పాడుతున్నారో., చుట్టు పక్కలవాళ్ళు ఎలా భరిస్తున్నారో అనే కుతూహలం మాలో ఎక్కువవుతోంది. ఓ ఆదివారం అతనుండే ఏరియాకి వెళ్ళాం. చుట్టుపక్కల వాళ్లని వాకబు చేస్తే అతను సంగీతం(?) మానేసాడనీ, బుద్ధిగా ఓ చిన్న ఉద్యోగానికి రెండ్రోజులుగా వెళ్తున్నాడని  తెలుసుకుని అవాక్కయ్యాం.
మా కాలనీలో లేని గొప్పతనం ఈ కాలనీలో ఎలా ఉందనీ ఆ రహస్యాన్ని తెలుసుకున్నాం.  అది చెప్పాలంటే మనం కాలంతో పాటు పక్షం రోజులు వెనక్కి వెళ్ళాలి.
కిరాతకం కొన్న కొత్త ఇంట్లో రెండు పోర్షన్స్ ఉన్నాయి.  అప్పటికే ఓ పోర్షన్ లో ‘చెంగల్రావు’ ఉంటున్నాడు. అతనూ బ్రహ్మచారే.  అతను సినిమాల్లో పాటలు రాసేందుకు తెగ కసితో కృషి చేస్తుంటాడు. ఆ-ప్రయత్నంలో ‘అప్రయత్నం’గా కలిసాడు కిరాతకం. పాటలు రాసి కాగితాలు తగలేసి తగలేసి -సినిమా కంపెనీల చుట్టూ తిరిగి తిరిగీ అప్పుల పాలయ్యాడు  చెంగల్రావ్. దాంతో రెండు పోర్షన్స్ లో ఒక భాగాన్ని అమ్మేసి మరిన్ని ప్రయత్నాలు చేయాలని భావించాడు. సరిగ్గా అదే సమయంలో తారసిల్లాడు కిరాతకం. మన సంగీత విద్వంసకుడికీ అప్పులెక్కువై పెద్ద ఇల్లు అమ్మేసి ఓ చిన్న ఇంట్లోకి మారాలనుకుంటూన్న సమయం అది.  ‘దొందూ దొందే’లా  ఇద్దరికీ పరిచయమైంది.  తాను ఇల్లు చవగ్గా అమ్ముతాననీ, అయితే తన పాటకి ట్యూన్ కూర్చాలని  చెంగల్రావ్ ఆశ చూపాడు. పెద్ద విద్వాంసుడననే ధీమాతో అందుకొప్పేసుకుని ఇల్లు కొనుక్కున్నాడు. ఇక అప్పుడు మొదలయ్యాయి పాట్లు. కిరాతకం అంటే ఏంటో కిరాతకానికే తెలిసొచ్చిన కాలమది.
చెంగల్రావు రాసిన పాటలు ట్యూన్ కట్టేందుకు పాట చదువుతుంటే వాంతి వచ్చే అనుభూతి.  అతికష్టమ్మీద చదివినా ట్యూన్ కట్టేటప్పుడు కళ్ళ ముందు చుక్కలు కనబడేవి. ఎప్పుడూ చూడని తాత ముత్తాతలు కదలాడేవారు.  మొదట్లో మొహమాటానికి ట్యూన్ కట్టి పాడితే ఆ గాత్ర మాధుర్యానికి(?) చెంగల్రావు చర్మం చిట్లిపోయే అనుభూతి. చెవుల్లో హోరు తప్ప తను రాసిన పదాలు వినబడేవి కావు.  అతని బాధని చూసి తనకి ట్యూన్ అవుతున్నాడని కిరాతకం మరింత కసితో రెచ్చిపోయేవాడు. అలా పాట చదివినందుకు - చెత్త ‘కపిత్వం’ రాసి టార్చర్ పెట్టినందుకు పగ తీర్చుకుంటున్నాని భావించాడు తప్ప, ఆ కవిత్వం  చదివి తనకి పిచ్చి ఎక్కుతున్నట్లు గ్రహించలేకపోయాడు కిరాతకం. ఇలా రెండు మూడు రోజులు నాలుగైదు పాటలు ప్రాక్టీస్ చేసారు. అయిదో పాట వరకూ వచ్చేసరికి అతనికి కవిత్వం రాదని కిరాతకానికీ, ఇతనికి సంగీతం రాదని చెంగల్రావుకీ అర్ధమైంది. దాంతో ఇద్దరూ ఓ ఒప్పందానికొచ్చారు .  
అదేవిటంటే-
అదేవిటంటే!..
చెంగల్రావు పాట రాయకూడదనీ!..
కిరాతకం మరి పాడకూడదనీ!!.
… ఒక్కొక్కరూ ఒక్కోతరహా ప్రళయాన్ని సృష్టించగల విద్వంసుకులు ఇప్పుడు ఒకే ఒక్క ఒడంబడికతో ఒకే చూరుకింద ప్రశాంతంగా ఉంటున్నారు.  ఊరిని ప్రశాంతంగా ఉంచుతున్నారు.
***

No comments:

Post a Comment

Pages