అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ -రాజ్యాంగ నిర్మాణ శిల్పి - అచ్చంగా తెలుగు

అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ -రాజ్యాంగ నిర్మాణ శిల్పి

Share This
అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ -రాజ్యాంగ నిర్మాణ శిల్పి
అంబడిపూడి శ్యామసుందర రావు.


డిశంబర్ 6,1946 న రాజ్యాంగ అసెంబ్లీ ఆలోచన మొదటిసారిగా స్వాతంత్య్రానికి ముందు వచ్చినప్పుడు స్వతంత్ర సార్వ భౌమాధికారము కలిగిన దేశాన్ని ఎలా నిర్మించుకోవాలి, దానికి అవసరమైన చట్టాలు ఇతర విషయాలు ఏమి ఏమి ఉండాలి, ఎలా పరిపాలించుకోవాలి  అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ విషయము లో కార్యాచరణకు స్పష్టత లభించటం కోసము దేశములోని మేధావులు విశేషముగా కృషి చేసి రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. బిఆర్ అంబెడ్కర్ ప్రస్తుత రాజ్యాంగ నిర్మాతగా అన్ని రకాల పేరు ప్రతిష్టలను గడించాడు కానీ ఈ పేరు ప్రతిష్టలకు బి ఆర్ అంబెడ్కర్ తో సమానముగా అర్హుడు చెన్నైకి చెందిన ప్రముఖ లాయర్ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్.  రాజ్యాంగ నిర్మాణములో ఈయన పాత్ర కూడా చాలా ముఖ్యమైనది, నిర్మాణాత్మాకమైనది. అంబేద్కర్ స్వయముగా తనకన్నా కృష్ణస్వామి అయ్యర్ సమర్ధుడు గొప్పవాడు అని ప్రశంసించాడు.(bigger better and more competent than myself -Ambedkar).

'ఆయనకు ప్రపంచములోని వివిధ రాజ్యాంగాల పట్ల అవగహన ఉండటం వలన భారతీయ చట్టాలను సమర్ధవంతముగా రూపొందించాడు.' అని అంబెడ్కర్, కృష్ణ స్వామి అయ్యర్ ని స్వయముగా మెచ్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు కృష్ణస్వామి అయ్యర్ కు దక్కవలసినంత పేరు ప్రతిష్టలు అంబెడ్కర్ తో పాటు లభించలేదు. దానికి కారణము రాజకీయనాయకుల సంకుచిత దృష్టి 1883,మే 14,న నెల్లూరు జిల్లాలోని పూడూరు అనే కుగ్రామములో ఏకర్మ శాస్త్రి అనే పూజారి ఇంట జన్మించాడు. తండ్రి ఏకర్మ శాస్త్రి కొడుకుకు మంచి నాణ్యమైన విద్యను అందించాలి అన్న తపనతో కొడుకు భవిష్యత్తును అలోచించి, కాపురాన్ని చెన్నై మార్చాడు. స్కూల్లో లో విద్యాభ్యాసము పూర్తి అయినాక మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చరిత్ర చదవటానికి చేరాడు. 

చదువుతుండగానే ఈయన ప్రతిభ గుర్తించిన కాలేజీ వారు ఈయనను ట్యూటర్ గా నియమించారు. ఖాళి సమయాలలో లా క్లాసులు హాజరు అయేవాడు ఆ విధముగా బి. ఎల్ పరీక్ష పాస్ అయినాడు. పొట్టివాడు అయినప్పటికీ తన వాదన పటిమతో కోర్ట్ హాల్ లో గాని రాజ్యాంగ అసెంబ్లీలోగాని అందరి దృష్టిని ఆకర్శించేవాడు. అని సాహిత్య అకాడమీ వైస్ ప్రెసిడెంట్ అయినా కె ఆర్ శ్రీనివాస అయ్యంగార్  మెచ్చుకొనేవారు. ఏ విధమైన ఆర్ధిక బలము లేదా పరపతి లేకుండానే, తన స్వశక్తితో బార్ కౌన్సిల్ లో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఏడూ ఏళ్లలోనే  ప్రముఖ నాయకుడు అయినాడు. ఆ విధముగా పొందిన స్థానాన్ని తన జీవితకాలం అంతా  నిలుపుకున్నాడు. న్యాయవాద వృత్తిలో అయన ఎదుగుదల అమోఘమైనది అయన మనుమడు విఎస్ రవి పూర్వ IPS ఆఫీసర్ పేర్కొన్నాడు. 1929 నుండి 44 వరకు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో అడ్వాకేట్ జనరల్ గా పని చేశాడు. ఆ సమయములో అయన నీతి  నిజాయితీలకు, న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి ఏరకమైన ప్రలోభాలకు లొంగకుండా నిర్భయముగా వాదించటం వలన మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు.

న్యాయవాద వృత్తిలో ఈయన ఎన్నో బిరుదులూ సత్కారాలుపొందాడు. వాటిలో కొన్నింటిని అయినా మనము తెలుసుకోవాలి. 1926లో కైజర్ ఎ హింద్ అన్న బిరుదు, దీవాన్ బహుదూర్ (ఆరోజుల్లో దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తులకు ఇచ్చే బిరుదు) 1930లో ఇచ్చారు అలాగే రెండేళ్ల తరువాత బ్రిటీష్ గవర్నమెంట్ సార్ బిరుదుతో సత్కరించింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాకపోయినప్పటికీ ఈయనను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు రాజ్యాంగ అసెంబ్లీలోకి అంబెడ్కర్ కన్నా ముందు ఈయనను ఆహ్వానించాడు. రాజ్యాంగ అసెంబ్లీలో ఈయన తొమ్మిది హౌస్ కమిటీలలో సభ్యదిగా ఉండేవాడు. వాటిలో డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగములోని అతి కీలకమైన ప్రాధమిక హక్కుల సబ్ కమిటీలు మొదలైనవి అంతేకాకుండా రాజ్యాంగములోని ప్రధాన అంశాలు అయిన పౌరసత్వము, యూనివర్సల్ అడల్ట్ ప్రాంచైజ్ వంటి విషయాల రూప కల్పనలో ప్రధాన పాత్ర వహించాడు. భారతదేశ రాజ్యాంగము ముఖ్యముగా లౌకికవాద అంశాలపై ఆధారపడివుంది అంటే భారదేశములోని పౌరుల మధ్య కులాల,మతాల ప్రాంతాల ప్రాతిపదికగా ఏరకమైన విచక్షణ చూపకూడదు అన్నది  ప్రధాన అంశము.

రాజ్యాంగములోని ఆర్తికల్ 5(పౌరసత్వము గురించిన ) గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఈయన పౌరసత్వము హక్కులను మాత్రమే ఇవ్వదు కొన్ని ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి అని చెపుతాడు. అంటే ప్రాధమిక హక్కులకు కొన్ని పరిమితులు ఉంటాయన్నది ఈయన భావన. ముఖ్యముగా ఎమర్జన్సీ కాలములో అన్ని రకాల ప్రాధమిక హక్కులకు భంగము వాటిల్ల కూడదు. ఉదాహరణకు వాక్ స్వాతంత్రము లాంటివి ఎమర్జన్సీ కాలములో కూడా కొనసాగాలి లేని పక్షంలో అన్ని రకాల హక్కులకు భంగము వాటిల్లినట్లే అని అయ్యర్ ఉద్దేశ్యము ఆ విధముగా దేశాధ్యక్షుడి పవర్స్ విషయములో ఎమర్జెన్సీ కాలములో చాల ఖచ్చితముగా రాజ్యాంగములో పేర్కొన్నారు.  ఈవిషయములో అమెరికా రాజ్యాంగము నుండి ఆదేశ  అధ్యక్షుడి పవర్స్ ఎమర్జెన్సీ కాలములో ఎలా ఉంటాయో స్ఫూర్తిగా తీసుకున్నట్లు అయ్యర్ చెపుతారు. ఇక్కడ వ్యక్తి కాదు దేశ  ప్రయోజనాలు ముఖ్యము అని కూడా స్పష్టముగా నిర్దేశింపబడింది. దేశ ప్రయోజనాలను కాపాడితేనే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది. 

భిన్న భాషలు జాతులు కులాలు మాటలు ఉన్న దేశములో వ్యక్తిగత ప్రయోజనాలకన్నా దేశ  ప్రయోజనాలు ముఖ్యము అన్న సిద్ధాంతము ఆధారముగా రాజ్యాంగ రూపకల్పన చేయబడింది. అటువంటి పరిస్తుతులలోనే ప్రజాస్వామ్యము రక్షింపబడుతుంది అని అయ్యర్ అంటారు . ఆ తరువాత 30 ఏళ్ల అనంతరము ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు ఏర్పడిన పరిస్తుతులను అయ్యర్ ముందుగానే ఉహించి ఉండవచ్చు అని మనము అనుకోవచ్చు. “అయ్యర్ చాలా ముందు చూపు కలిగిన వ్యక్తిగా మనము భావించవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో భారత దేశ భవిష్యత్తు ఉంటుంది ఇన్ని జాతులు ప్రాంతాలు భాషలు వంటి వైవిధ్యాలు ఉన్న దేశము లో  ప్రజాస్వామ్యము మనుగడలో ఉంటుందా?" అన్న అనుమానము అప్పటి నాయకుల మనసులో ఉండేది అటువంటి అనుమానాలకు తావివ్వకుండా రాజ్యంగములో దేశ సమగ్రతకు ప్రాధాన్యతను ఇచ్చి, రాజ్యాంగ నిర్మాణముచేయటంలో అయ్యర్ పాత్ర ఎంతో ఉంది.అయ్యర్ దృష్టిలో దేశ భవిషత్తు రాజ్యాంగ మనుగడ ఆ దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకొనే ఓటర్ల చేతుల్లో ఉంటుంది. స్వాతంత్రము వచ్చినాక జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ప్రజలు ఉత్సాహముగా పాల్గొనటాన్ని చూసి అయ్యర్ చాలా సంతోషించాడు. 

విదేశస్తులు కూడా మన దేశములోని ఎన్నికల విధానాన్ని ప్రశంసించారు అంటే రాజ్యాంగ నిర్మాతలు వారు అనుకున్నట్లుగానే ప్రజలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ గొప్పతనాన్నిగుర్తించాలి అంటే స్వయముగా అంబెడ్కర్ 1949 లో రాజ్యాంగ అసెంబ్లీ చివరి రోజుల్లో అయన చెప్పిన మాటలను గుర్తుచేసుకోవాలి. "నేను రాజ్యాంగ అసెంబ్లీ లోకి ప్రధానముగా షెడ్యూల్ కులాల హక్కులను కాపాడాలి  అన్న ప్రధాన అంశముగా చేరాను . నాకు ఏ ఇంకా ఎక్కువ భాద్యతలు అప్పజెపుతారు అన్న ఆలోచన లేదు కానీ ఆశ్చర్యముగా రాజ్యాంగ అసెంబ్లీ నన్నుడ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షుడిగా  ఎన్నుకున్నారు. డ్రాఫ్ట్ కమిటీలో నాకన్నా పెద్దవాళ్ళు సమర్థులు మిత్రుడు అల్లాడి కృష్ణ స్వామి లాంటి వారు ఉన్నారు "ఈ విధముగా రాజ్యాంగ అసెంబ్లీ, డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడిగా తన విధులను సమర్ధవంతముగా నిర్వహించి ఎన్నో,జడ్జి లాంటి పదవులను ప్రభుత్వాలు ఆఫర్ చేసిన సున్నితముగా తిరస్కరించి మరల చెన్నైచేరి తన న్యాయవాద వృత్తినే కొనసాగించాడు అక్టోబర్ 3,1952నచెన్నైలోని  తన స్వగృహము అయినా ఏకర్మ నివాస్ లో తనువూ చాలించాడు ఏ రకమైన పేరు ప్రతిష్టలు
ఆశించకుండా తనకు అప్పజెప్పిన భాద్యతను సమర్ధవంతముగా కాలనికి నిలిచే విధముగా నిర్వహించిన కర్మ జీవి అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్.
***

No comments:

Post a Comment

Pages