అనుబంధం - అచ్చంగా తెలుగు
అనుబంధం
వై.ఎస్.ఆర్.లక్ష్మి 

                
 అదొక పల్లెటూరు.అక్కడొక కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నడపబడుతున్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాల.ఐదు ఎకరాల పెద్ద ఆవరణ.   చుట్టూ ప్రహరీ గోడ దానిపై చక్కటి సూక్తులు.దానిని ఆనుకొని షామియానాలు వేసినట్లుగా పచ్చదనం పరచుకున్న పెద్ద పెద్ద చెట్లు.ఒకపక్క పిల్లలు ఆడుకోవడానికి వీలుగా టెన్నిస్, వాలీబాల్,టెన్నికాయిట్ కోర్టులు.యు షేప్ లో ఉన్న రెండంతస్తుల భవనాలు.విద్యార్ధులు ప్రతిరోజు  అసెంబ్లీ నిర్వహించుకోడానికి వీలుగా మధ్యలో జెండా దిమ్మ.మరొక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు,సమావేశాలు నిర్వహించుకోడానికి వీలుగా వేదిక ఉన్నాయి.ప్రతి తరగతి ఎదురుగా నయనానందకరము గా రకరకాల పూల మొక్కలు ఉన్నాయి.వాటి సమరక్షణ బాధ్యత ఆ తరగతి విద్యార్ధులు తీసుకుంటారు.ఆ భవనాలకు వెనుక వైపున ఖాళీ స్థలం లో తోటకూర,బచ్చలి,పాల కూర వంటి ఆకుకూరలు,  సొర,బీర,బెండ,వంగ మొదలైన కూరగాయ పాదులు ఉన్నాయి.వీటికి పాదులు చేయడం,నీరు పెట్టడం వంటి పనులన్నీ వ్యాయామ ఉపాధ్యాయుని సహకారం తో తమ ఖాళీ సమయం లో విద్యార్ధులు చూస్తారు. అవి అమ్మగా వచ్చిన ఆదాయాన్ని పాఠశాల అభివృధ్ధికి వినియోగిస్తారు.మెయిన్ గేటు దాటి రెండు గజాలు రాగానే ఉపాధ్యాయులు,విద్యార్ధులు తమ వాహనాలు సైకిళ్ళు పెట్టుకోవడానికి వీలుగా  షెడ్ ఉన్నది.వంటకు ,పిల్లలు భోజనాలు చేయడానికి మరొక షెడ్ ఉన్నాయి.ఆవరణ అంతా పరిశుభ్రం గా ఉన్నది.భవనాలలోకి ప్రవేశించే ముందు సరస్వతీ దేవి విగ్రహం దాని కింద"సరస్వతీ నమస్తుభ్యం.........." శ్లోకం ఉన్నది.భవనం గోడల మీద జాతీయ నాయకుల,శాస్త్రఙ్ఞుల చిత్రాలు ఉన్నాయి.ప్రయోగశాల,గ్రంధాలయాలు ఉన్నాయి.సంగీతం,జానపద,శాస్త్రీయ నృత్యాలు,చిత్రలేఖనం ఆయా రంగాలలో ఆసక్తి కల విద్యార్ధులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు.ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.అత్యున్నత ప్రమాణాలతో,సకల సదుపాయాలతో ఆ పాఠశాల నడవడానికి కారకులు అక్కడ ప్రధానోపాధ్యాయుడు నారాయణ మూర్తి తక్కిన ఉపాధ్యాయులు."నిత్యమై,వినిర్మలమై,నిశ్చలమై యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి"అన్న చిలకమర్తి వారి మాటలు అక్షర సత్యములని గ్రహించిన వారు కనుకనే  ఒక నిబధ్ధతతో పనిచేస్తున్నారు.నారాయణమూర్తి గారు ఆ ఊరి గ్రామస్థులను కూడగట్టడం లో సఫలీకృతు లవ్వడం తో వారు కూడ ఆ పాఠశాల అభివృధ్ధిలో పాలుపంచు  కుంటున్నారు.వెయ్యి మంది విద్యార్ధులు అక్కడ చదువుతున్నారంటేనే ఆ పాఠశాల ఘనత అర్ధం చేసుకోవచ్చు.

                                     ఇప్పుడు అక్కడ జరుగుతున్న వేడుక పాఠశాల డిజటలీకరణ. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఎన్ ఆర్ ఐ పూర్వ విద్యార్ధులు కొందరు కంప్యూటర్లు ఇవ్వడమే కాక డిజిటల్ విద్యకు కావలసిన సదుపాయాల్ని సమకూర్చడానికి ముందుకు వచ్చారు.ఆ ప్రారంభొత్సవ కార్యక్రమమే ఇది.పనిలో పనిగా పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరుపుకోవాలని నిర్ణయించుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది.వచ్చే అతిధులకు బానర్లు,రంగు రంగుల తోరణాల తో ఆవరణ అంతా శోభాయమానం గా  ఉన్నది.సభాధ్యక్షుల తొలి పలుకులతో సభ  ప్రారంభమైంది.డిజటలీకరణకు పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన శివరాం ని వక్తలు గ్రామస్తులు అందరూ అభినందనలతో ముంచెత్తారు.ఆ పాఠశాలలో చదివి ఆ ఊరిలోనే ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వాసూరావు ఆ కార్యక్రమమంతా సజావుగా జరగడానికి పనులన్నీ తనభుజ స్కందాలపై వేసుకొని పర్యవేక్షించాడు.సభ విజయవంతం గా ముగియడం తో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

                                            శివరాం తమ్ముడు మురళి ఆ ఊరిలోనే ఉంటాడు.అతడు వాళ్ళింట్లోనే దిగాడు కానీ ఊరి అభివృధ్ధికి ఏ విరాళం ఇవ్వాలన్నా సన్నిహిత మిత్రుడు వాసూరావు ద్వారానే ఇస్తాడు.ఇప్పుడూ అలాగే ఇచ్చాడు.వాసుని కలిసి కబుర్లు చెప్పుకోవాలని వాళ్ళింటికి వెళ్ళాడు శివరాం.అతడు వెళ్ళేటప్పటికి వాసు  గేదల షెడ్ నుంచి పాలు తీసుకొని వస్తున్నాడు .శివరాం ని చూడగానే "రా!రా!" అని అప్యాయంగా ఆహ్వానించాడు.

   "లేదు లేరా! పనేమీ లేకపోతే నువ్వే రా బయటకు వెళదాం.చాలా రోజులు అయ్యింది అలా ఫొలమ్రెద్ద్య్ గట్టు వెంబడి వెళతా మాట్లాడుకుందాము."

  "ఒక్క పది నిముషాలు.ఇప్పుడే పాలు తీసానుగా కమ్మని కాఫీ తాగి వెళదాము."

     అలాగే కాఫీ తాగి పొలం బాట పట్టారు ప్రాణమిత్రులిద్దరూ.పొలందాటి కాలవ వెంబడి కొంతలెక్క నడచి గట్టున ఉన్న చెట్టు కింద బండరాయి మీద కూర్చున్నారు.

    శివరాం అల్లరిగా చిన్నచిన్న రాళ్ళు తీసి కాలువలోకి విసురుతూ అవి నీటిలో చేసే అలజడిని గమనిస్తూ "ఊ ఇప్పుడు చెప్పరా ?ఏమిటి కబుర్లు?ఊళ్ళో విశేషాలేమిటి?"

 "నీకు తెలియనవి కొత్తగా ఏమున్నాయి?నువ్వు ఫోన్ చేసినప్పుడు చెబుతూనే వున్నాగా!"

      "అవుననుకో!అది సరే నిన్నో విషయం అడుగతాను నిజం చెప్పు.మేమందరమూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి బడికో,గుడికో ఎవరి కి తోచిన విరాళం వాళ్ళు ఇస్తున్నాము .పనులన్నీ భుజానవేసుకొని చేస్తావు కానీ ఒక్క రూపాయ కూడా ఆర్ధిక సహాయం చేయవెందుకని?"

"నేను మీ అంత స్థితి మంతుడినీ కాను అంతటి విశాల హృదయమూ నాకు లేదు .నేను చేయగలిగింది కాయ కష్టం మాత్రమే!"నవ్వుతూ అన్నాడు వాసు.

"నోర్ముయ్యరా!ఆ మాట అంటే చంపేస్తాను.నీకేమి తక్కువ?పొలం బాగానే ఉన్నది. నిరంతరం కష్టపడతావు.పిల్లలిద్దరూ ఉన్నత చదువులు చదివి చక్కగా స్థిరపడ్డారు.కారణం అది కాదు ఏదో ఉంది.చెప్పు."

 "నువ్వు చెప్పిన వీటన్నిటికీ నీ లాంటి మనసున్న మా రాజులు ఎంతోమంది సహాయం చేస్తారు.పేరు కోసమో ,తమ గొప్పతనాన్ని చాటుకోవడానికో,కీర్తి కోసమో ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అలా అని మీరు చేస్తున్నది తప్పని నేను అనడం లేదు.ఎవరి ఇష్టం వారిది.మా చెల్లిలి భర్త చనిపోయాడు నీకు తెలుసు కదా!ఆయన చనిపోయేనాటికి పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు.దానికి ఆయన ఆఫీసు లో ఉద్యోగం ఇచ్చినా ఆ సంపాదన కుటుంబానికి అస్తూ బిస్తూ సరిపోతుంది.ఆ పిల్లల చదువులకి సహాయం చేస్తాను.అలాగే మా కజిన్.వాడూ అంతే ఏదో చిన్న ప్రైవేటు ఉద్యోగం వాళ్ళ పిల్లల చదువులు ...................."

 మధ్యలోనే శివరాం అందుకొని " మీ పాలేరు వీరయ్య కొడుకు చదువు ,మీ ఇంట్లో పని చేసే లక్ష్మి గుండె ఆపరేషన్ ఖర్చు ,ఇవి కాక ఎవరి కి  ఏమి కావాల్సిన ముందుంటావట. ఇవన్నీ చూచాయిగా తెలిసే నీ నుంచి తెలుసుకుందామని అడిగాను. "

 "వీరందరినీ గాలికి వదిలేస్తే వాళ్ళను ఎవరు చూస్తారు .ముందు ఇంటిని చక్కబెట్టుకుంటేనే కదా! చుట్టు ఉన్న వారి గురించి ఆలోచించేది.ఒకటో,రెండో లక్షలు గుడికో,బడికో ఇచాననుకో అక్కడ గొడ మీద దాతల పేర్లలో నా పేరు చూసుకొని నేను ఏదో సాధించానని భుజాలు ఎగరేసుకోవచ్చు.రేపు వీరి పరిస్థితి ఏమిటి .వాళ్ళను చూసినప్పుడల్లా కొంచెం చేయూత ఇస్తే వాళ్ళు జివితం లో చక్కగా స్థిరపడేవారు కదా అనిపిస్తుంది.సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఎన్నో దారులు. నాకు తోచిన దారి ఇది. నా కిదే ఎంతో సంతృప్తి నిస్తుంది.రేపు వీళ్ళంతా ఉన్నత స్థానాల్లో ఉంటే వారి తల్లి తండ్రుల కళ్ళళ్ళో కంపించే ఆనందానికి విలువ కట్టగలమా? నువ్వే చెప్పు?"

     అప్పటికే అన్యమనస్కంగా ఉన్న శివరాం ఏమీ మాట్లాడలేదు."మాట్లాడవేరా నీకు నచ్చ లేదా?"

 "నువ్వన్నది నిజమే !ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి. పద వెళదాం.చీకటి పడుతోంది."ఇద్దరూ లేచి ఇంటికి బయలుదేరారు.

  శివరాం తమ్ముడింటికి వచ్చి అన్యమనస్కంగా నే మరదలు పెట్టిన భోజనం చేసి పక్క మీద వాలాడు కాని ఆలోచనలతో నిదురపట్టలేదు.

     శివరాం కి ఒక తమ్ముడు ,ఒకచెల్లి.తండ్రి వ్యవసాయదారుడైనా ముగ్గురినీ కష్టపడి చదివించాడు. మొదట్నించీ తెలివిగలవాడైన శివరాం ఇంజనీరింగు చదివి అమెరికా వెళ్ళాడు.అమెరికా మీద మోజున్న మామగారు భారీ కట్నంతో పిల్ల నిచ్చి పెళ్ళి చేశాడు.అక్కడే ఒక కంపెనీ పెట్టి రెండు చేతులా అర్జిస్తున్నాడు. అత్తెసరు మార్కులతో పాసైన మురళి ఏ అవకాశం లేక తండ్రి తో పాటు వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండిపోయాడు.బంధువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.ఇండియాలో ఆస్థి తనకు అక్కరలేదని తమ్ముడికి ఇచ్చెయ్యమని ఉదారంగా ప్రకటించాడు శివరాం .తెలివిగా ఆస్థితో పాటు బాధ్యత లను కూడా తమ్ముడి భుజాల మీఇదకి నెట్టేశాడు.మురళి చెల్లెలి పెళ్ళి వైభవం గా చేయడమే గాక తల్లిదండ్రులిద్దరిని చివరివరకు బాగా చూసాడు.తమ్ముడు కానీ మరదలు కానీ ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.తన నుంచి ఏ సహాయం ఆశించ లేదు.ఈ మధ్యే పిల్లల చదువులకి  ఇబ్బంది పడుతున్నట్లు వాసు చెప్పడం వలనతెలిసింది.రెండేళ్ళ నుంచి పంటలు సరిగా పండక నష్టపోయారట.అప్పులు చేసి అవి తీర్చడానికి పొలం బేరం పెట్టి  నట్టు కూడా చెప్పాడు.తనెప్పుడు వచ్చినా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉంటారు.తనకు ఏ అసౌకర్యం కలగకుండా చూస్తారు .పిల్లలు కుడా పెదనాన్నా అంటూ చుట్టూ తిరుగుతూ అమెరికా కబుర్లు అడుగుతారు.తాము ఒక తల్లి కడుపున పుట్టి కూడా వాళ్ళెవరో పరాయి వారన్నట్లు ప్రవర్తించాను. వారి కష్ట సుఖాలలో పాలుపంచుకోలేదు.ఎందుకు ఇంతలా బంధాన్ని తెంచుకున్నాను. ఎంతటి స్వార్ధపరుణ్ణి .రేపు నా కొడుకు కూతురు అయినా అంతేగా. ఒకరి కి మరొకరు ఏమీ కాకుండా పోతారేమో?ఏకాకి జీవితాలు కాకూడదు .బాంధవ్యాలు అనుభందాల విలువ వాళ్ళకి తెలియజెయ్యాలి.దానికి నే నే మార్గదర్శిని కావాలి.అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిగా నిద్రపోయాడు.

           ఉదయమే లేచి పిల్లలతో కలసి టిఫిన్ చేస్తూ వాళ్ళ చదువుల గురించి ఆరాతీశాడు.పెద్దాడు సాగర్ ఇంటర్,చిన్నాడు సాకేత్ టెంత్చదువుతున్నట్లు చెప్పారు.సాగర్ బై పి సి అని చెప్పాడు.

  "బాగా చదువు డాక్టరు సీటు తెచ్చుకో.నేను చదివిస్తాను .నువ్వు కూడా అన్నతో పోటీ పడి చదువు.నువ్వు ఇ ఇ  టి చదువుదువుగాని "

  ఇదంతా వింటున్న మురళి "నీ కెందుకన్నయ్యా శ్రమ "

 "అదేమిట్రా అలా అంటావు. వాళ్ళేమన్నా పరాయివాళ్ళా ? వళ్ళ చదువులు నా కొదిలేయి నేను చూసుకుంటాను "అంటూ టిఫిను ముగించి బయటకు నడిచాడు.

 అన్నయ్యలో ఎదురు చూడని ఈ మార్పుని చూసి మురళి అవాక్కయ్యాడు.
 ********

No comments:

Post a Comment

Pages