శాపగ్రస్తుడు - అచ్చంగా తెలుగు

శాపగ్రస్తుడు

Share This
శాపగ్రస్తుడు
రచన: “శారదా తనయ


“మహాభారతంలో మనకు విరోధాభాసంగా కనవచ్చే పాత్ర కర్ణుడిది. విలువిద్యలో అర్జునుడికి సమానమని అనిపించినవాడు. కొంతవరకు అతడికి దడ పుట్టించినవాడు. తనదే అయిన వ్యక్తిత్వం కలిగినవాడు. తన దానగుణంతో ముందు తరానికి ఉదాహరణగా నిలిచినవాడు. దుష్టచతుష్టయంలో ఒక్కడైనా మిగిలిన ముగ్గురిని ద్వేషించినంత కర్ణుడిని ఎవరూ ద్వేషించరు. చెడ్డవాడని తిట్టరు. కానీ అంతే దురదృష్టవంతుడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, అన్నీఉన్నా ఏమీ లేనట్టయింది అతడి బ్రతుకు.
“ నా బ్రతుకూ అంతే. ఏమీ లేదని లేదు. అంతా ఉంది. కానీ దానికి తోడు వెన్నంటిన వ్యథ కూడా ఉంది. “
ఆలోచనల తేనె తుట్టెలో మునిగిపోయిన కుమారస్వామి నిర్ణయం ఇది. తను కూడా అన్నీ ఉండి కూడా, మంచి పేరు తెచ్చుకోలేకపోయిన కర్ణుడి మాదిరే అని ఆలోచిస్తూ తన జీవితంలోనూ, కర్ణుడి జీవితంలోని పోలికలను వెతుకుతూ పోయాడు. తన జీవితపు శిశిరంలో ఉన్న ఆయనకు తన గత జీవితపు సింహావలోకనం చేసుకునేటప్పుడు అనిపించిన ఆలోచన ఇది. 
 *****
తనకు తన ఐదవ సంవత్సరపు వయస్సునుండి తన జీవితంలో గడిచిన ముఖ్య సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. అప్పటి నుండే తన అసహాయకత ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. తన తల్లికి అదేదో మానసిక ఇబ్బంది. ఆమె ఎవరినీ దగ్గరకు తీసుకునేది కాదు. లాలించి ముద్దించడమన్నది అసలు లేదు. ఎప్పుడూ పడక మీదే ఉండేది. ఇంటి పనులు చేతనయ్యేవి కావు. భారమంతా తండ్రి పైనే. ఆఫీసు పనితో పాటు ఇంటి పనులు చేసుకోవాలసి వచ్చేసరికి ఆయన ఎప్పుడూ చిరాకు పడుతూ ఉండేవాడు. అలాగని కర్తవ్యలోపం జరగనీయలేదు. రెండూ పాత్రలను సమర్థవంతంగానే నిర్వర్తించినా అందులో ఆప్యాయత కనిపించేది కాదు. తన భార్యకు కావలసిన మందూ మాకూ తెచ్చిచ్చేవారు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళేవారు. కడుపుకు కావలసినంత తిండి, భోజనం సమకూర్చేవారు. కానీ అంతా కర్తవ్యపాలన మాత్రమే. ఆయనకు పిల్లల చదువులంటే ఎంతో శ్రద్ధ.  పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చదువు చెప్పేవాడు. పుస్తకాలకు కానీ, ఫీజుకి కానీ, యూనిఫారమ్ కి కానీ ఎప్పుడూ అడ్డు చెప్పేవాడు కాడు. కానీ ఎప్పుడూ తనను అక్కరగా దగ్గరికి తీసుకోలేదు. అంతా ఒక క్రమబద్ధంగా చేసేవాడు అంతే. ఆయన వ్రేలు పట్టుకుని మారాం చేస్తూ నడిచింది తనకు అసలు జ్ఞాపకం లేదు. అప్పుడు తనకేమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు తన మనమడు తన కొడుకువద్ద మారాం చేస్తూ తన పంతం నెగ్గించుకుంటూంటే తను బాల్యంలో దేనిని కోల్పోయానో అర్థమవుతూంది. తన మనమరాలు వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చుని ముద్దు చేయించుకుంటూంటే మనస్సు బాధగా మూలిగేది. అక్కడినుండే ప్రారంభమయ్యింది ఇలా అవలోకనం 
-2-
చేసుకోవడం. తన జీవితం తను కోరనట్టు గడవలేదు అని అనిపించసాగింది. ఈ మధ్య మహాభారతం రోజూ చదివుకునేటప్పుడు తన జీవితం కూడా కర్ణుడి జీవితం మాదిరిగానే అంటూ పోల్చుకోసాగాడు.

కర్ణుడి జీవితం కూడా తన జీవితం లాగానే కదా ? తన మాదిరిగానే దురదృష్టవంతుడు. ఎటువంటి వంశంలో జన్మించాడు ?  కురువంశపు కోడలు, కృష్ణుడి చెల్లెలు అయిన కుంతీదేవి కడుపున. ధర్మాన్నే ఆచరించి కురుక్షేత్రంలో విజయం సాధించిన పాండవుల అగ్రజుడిగా ఉన్నత స్థానంలో ఉండాల్సినవాడు. కానీ జరిగిందేమిటి? పరీక్షించాలనుకున్న కుంతీదేవికి అవాంఛితంగా కలిగిన కొడుకయ్యాడు. లోకనిందకు భయపడి ఆమె నీటిలో వదిలేసింది. ఎవరి దగ్గరికో చేరుకుని, పెరిగి పెద్దవాడయ్యాడు. విలువిద్య నేర్చుకున్నాడు. మహాభారతంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. కాని కన్నతల్లి ప్రేమ అందలేదు. పెంచిన రాధ చూపిన ప్రేమ, ఆత్మీయత అన్నీ ఆమె తన కన్నతల్లి కాదని కృష్ణుడు   తెలియజేయగానే పరాయివాడుగా అనిపించింది. ప్రేమ చూపించిన తల్లి తన తల్లి కాదు. తన కన్నతల్లేమో తనను వద్దనుకున్నది. కురుక్షేత్ర యుద్దం సమయంలో తన మరొక కొడుకు ప్రాణాల కోసం బిక్షకు వచ్చింది. అతని ద్వంద్వ భావం చెప్పనలవి కాదు. 
**** 

కర్ణుడికి మంచి విలుకాడికి కావలసిన అర్హతలన్నీ ఉండేవి.  తాను నేర్చుకున్న విద్యల తరువాత ఇంకా నేర్చుకోవాలని పరశురాముడి వద్దకు వెళ్ళాడు. ఆయన క్షత్రియులంటేనే మండిపడేవాడు. తను బ్రాహ్మణుడని అసత్యం పలికి ఆయన వద్ద విలువిద్యలోని మెళకువలను తెలుసుకున్నాడు. ఇక విద్యాభ్యాసం ముగిసింది అనే సరికి అనుకోకుండా వచ్చి పడిందొక అగ్ని పరీక్ష. అది కూడా అతడు చేయరాని పనిని చేసి గురువుల ఆగ్రహానికి గురి కాలేదు. ఆయనకు నిద్రాభంగం కాకూడదని తనకు కలిగిన అసాధ్యమైన నొప్పిని భరించడం వలననే ముంచుకొచ్చింది గండాంతరం. అంత బాధను భరించే శక్తి తనకు కలదనే నిజమే తను బ్రాహ్మణుడు కాడని బయటపెట్టింది. కోపగించిన భార్గవరాముడు శాపాన్నిచ్చాడు. తను నేర్చుకున్నవిధ్య తన అవసరానికి సరిగా గుర్తుకు రాకుండా పోనీ అనే శాపాన్ని మూటగట్టుకుని వచ్చాడు.
తన బ్రతుకూ అంతే. తనకు ఎవరూ శాపమివ్వలేదు. కానీ రెండేళ్ళు కాచుకున్నా తాను చదువుకున్న పోస్ట్ గ్రాజుయేషన్ సబ్జెక్ట్ లో తనకు ఉద్యోగం దొరకలేదు. చివరికి ఒక గుమాస్తా ఉద్యోగమే దొరికింది. ఏదో ఒక ఉద్యోగం తన కుటుంబానికి అత్యవసరమైన స్థితి. నాన్నగారి దీనమైన చూపులు తనను ఆ ఉద్యోగానికే జాయిన్ అయ్యేలా చేశాయి. బ్రతుకు గడిచిపోయింది. కానీ తను నాన్నగారిని పీడించి చేసిన పిజి కోర్సు ఖర్చు వెక్కిరించేది. అక్కడ కర్ణుడికి శాపం, తనకు బ్రతుకు కొనసాగించాల్సిన అవసరం. 
*** 
సరే అయిపోయిందేదో అయిపోయింది. మునివర్యులు కూడా తన శాపానికి పశ్చాత్తాపపడి కర్ణుడికి భార్గవాస్త్రాన్ని, విజయ అనే వింటిని ఆశీర్వదించి ఇచ్చి పంపారు. సరే ఇక ఇలాగే కొనసాగుదాం అనుకునేంతలో అశనిపాతంలా వచ్చి పడింది మరో శాపం కర్ణుడికి.  శబ్దవేధి విద్యను అభ్యసించేటప్పుడు కర్ణుడు వదలిన బాణం ఒక గోవుకు తగలడమేమిటి, అది మరణించడమేమిటి, ఆ గోవు యజమానియైన ఒక బ్రాహ్మణుడు శాపమివ్వడమేమిటి? అన్నీ జరిగిపోయాయి. తన గోవు ఎలాంటి అసహాయ స్థితిలో చనిపోయిందో కర్ణుడు కూడా అలాంటి అసహాయక స్థితిలో చనిపోవాలని శాపమిచ్చాడు ఆ బ్రాహ్మణుడు. కురుక్షేత్రంలో ఆ శాపం తట్టింది. తన రథం నేలలో కూరుకుపోయి అసహాయ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు శరపరంపరను కర్ణుడిపైన గుప్పించాడు. ఆ స్థితిలో కర్ణుడు నేర్చిన విద్య కానీ, పరాక్రమం కానీ, దానశీలత కానీ ఏవీ సహాయానికి రాలేదు. దీన స్థితిలో చచ్చిపోయాడు.

తన పరిస్థితి కూడా అంతే అయింది మళ్ళీ. తను చదువుకున్న సబ్జెక్ట్ ఉద్యోగం రాలేదన్న వేదన తనలో ఉన్నా, దొరికిన ఉద్యోగంలో నైనా పరీక్షలు రాసి ప్రమోషన్లు తీసుకుని పైకి వద్దామని అనుకున్నాడు. కానీ అక్కడా చుక్కెదురైంది. తను చదివిందంతా సైన్స్ సబ్జెక్టే. అక్కడేమో అంతా అకౌంట్స్. తనకది ఒంటబట్టకుండా పరీక్షల్లో ఫెయిలవ్వడం జరిగింది. తన విద్యార్థి దశలో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ వస్తున్న తనకు ఈ పరీక్షల్లో ఫెయిలవ్వడం అన్నది మింగుడుపడలేదు. మళ్ళీ మళ్ళీ పరీక్షలు వ్రాసినా, సంసార తాపత్రయాలలో చదువుకోవడం కుదరక కొంతా, చదివింది ఒంటబట్టకుండా మరికొంతా అయి చివరికి తను సీనియారిటీ పైనే ప్రమోషన్లు తీసుకోవాలని తేలిపోయింది. అప్పుడు ఈ జమానాలాగా విరివిగా ఉద్యోగాలు దొరికేవి కావు మరో దాన్లో చేరదాం అంటే. ఏది దొరుకుతుందో దాన్నే అంటిపెట్టుకుని పైకి వస్తూ అందులోనే రిటైరవ్వడమే పరిపాటి అందరికీ.  కర్ణుడికి తగిలిన మరో శాపం లాగే తనకూ పునరావృత్తం అయింది.
**** 

కర్ణుడి శాపాల శృంఖల కొనసాగింది. ఇంకోరోజు కర్ణుడు రథం పైన వస్తుండగా, దార్లో ఒక అమ్మాయి ఏడుస్తూ నిలుచుండడం కనిపించింది. రథం దిగి ఏమైందని విచారిస్తే, తాను ఇంటికి తీసుకు వెళుతున్న నేతి కుండ పడిపోయి నెయ్యంతా ఒలికి పోయిందనీ, ఇప్పుడిక తన సవతి తల్లి తనను ఊరకే వదలదనీ ఏడుస్తూ చెప్పింది. కర్ణుడు ఆ పాపకు తను వేరే నెయ్యి కుండ ఇప్పిస్తానని చెప్పినా, ఆ చిన్నది తనకు
-4-
క్రింద ఒలికిపోయిన నెయ్యే కావాలని పట్టుబట్టింది. విధి లేక కర్ణుడు తన బలమంతా ఉపయోగించి మట్టిలోనుంచి నేతిని పిండి ఆ అమ్మాయిని సమాధాన పరచాడు. కానీ తన దేహానికి ఇంత బాధను

కలిగించినందుకు భూదేవి కర్ణుడి పైన కోపగించుకుని అతడు చేసే అతి ముఖ్యమైన యుద్ధంలో అతడి రథాన్ని తనలోకి కూరుకుపోయేలా చేస్తానని శాపం పెట్టింది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రథం దిగబడిపోయి, కర్ణుడి చావుకు కారణమయ్యింది.
తన బ్రతుకూ అంతే. పన్లో తాను చాలా చురుకు. ఎవరి వద్దా మాట పడకుండా పని చేసి ముగించే పస ఉండేది తన దగ్గర. తన అధికారులందరికీ తనని చాలా ఇష్ట పడేవారు. వారందరికీ తన ప్రమోషన్ గురించి తెలుసు. తనకు సహాయ పడాలనే అభిలషించేవారు.  కానీ, తాను ఎప్పుడో చేసిన చిన్న పొరబాటు వలన తన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ లో నల్ల చుక్క దాఖలయింది. తన పనితనం చూసి ముచ్చట పడి, తనను ప్రమోషన్లకు సిఫారసు చేయాలనుకున్నవారు కాస్త, ఆ నల్ల చుక్క వద్దకు వచ్చేటప్పటికి ఆగిపోయేవారు. వారి చేతులకు సంకెళ్ళు పడేవి. “ ఏం చెయ్యమంటావయ్యా ! ఇదొక్కటి లేకపోతే ఏమైనా చెయ్యొచ్చు. కానీ...” అనే జాలితో కూడిన మాటలతో వారి ఉత్సాహం కాస్త నీరయిపోయేది. తనకు కర్ణుడి శాపం పునరావృత్తమయేది.
************
కర్ణుడికి ఈ శాపాలతో పాటే అతని దానగుణం కూడా అతనికి ముల్లుగా మారింది. ఎవరేమి అడిగినా లేదనకుండా ఇచ్చే దానగుణం అతని ప్రతిష్ట ఇనుమడింపజేసింది కానీ, అతనికి మారణాంతకాంగా మారింది. తనకు రక్షణగా తండ్రి సూర్యదేవుడు ఇచ్చిన సహజ కవచ కుండలాలను మహాభారత సూత్రధారియైన శ్రీ కృష్ణుడు, ఇంద్రుడిద్వారా దానంగా తీసేసుకున్నాడు. దానికి బదులుగా ఇచ్చిన నాగాస్త్రాన్ని కాస్త యుద్ధ రాజకీయాలలో మరొకరి పైన ప్రయోగించాల్సి వచ్చింది.  అటు తన సహజ కవచ కుండలాలు పోయాయి, ఇటు దానికి బదులుగా వచ్చిన అస్త్రం తనకు కావలసిన వారిపైన ప్రయోగించడానికి లేకుండా పోయింది.

తనకు దానశీలత లేకపోయినా ఇతరులకు సహాయం చేసే గుణమైతే మెండుగా ఉంది. దాంతో డబ్బు రూపంలో కానీ, తాను చేసే వైయక్తిక సహాయంలో కానీ ఎప్పుడూ దెబ్బతినడమే జరిగేది. తన నుండి సహాయం పొందినవార్లలో నూటికొక్కరు మాత్రం గుర్తు పెట్టుకుని మరు సహాయం చేసేవారు. మిగతా వారి గురించి బాధ పడడమే జరిగేది. దీనివలన ఇంట్లో మనస్పర్థలు కలిగేవి. “ఇంటి వారికి మీరు ఉపయోగ
-5-
పడరు” అని భార్య ఎప్పుడూ దెప్పేది. పిల్లలు కూడా “ ఏంటి నాన్నా ! మాకు కావలసినప్పుడు మాకు దొరకవు నువ్వు. “ అనే వారు.

తన జీవితంలో తను ఎప్పుడూ పైకెదగలేదు. పోనీ ఉన్నదాన్లో నైనా సుఖంగా ఉన్నాడ అంటే అదీ లేదు. జీవితమంతా శాపాలతోనే బ్రతికిన కర్ణుడి మాదిరిగానే తనూ ఒక శాపగ్రస్తుడిలా మిగిలిపోయాడు.
తనకు కర్ణుడి మాదిరిగా అసహాయకపు చావు రాకుంటే అంతే చాలు అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కుమారస్వామి.
*** 

No comments:

Post a Comment

Pages