శ్రీమద్భగవద్గీత -23 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -23
రెడ్లం రాజగోపాలరావు 

రాజవిద్యా రాజగుహ్యయోగము
పత్రం పుష్పం ఫలంతోయం యోమేభక్త్యా ప్రయశ్చతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః
- 26 వ శ్లోకం
ఎవడు నాకు భక్తితో ఆకును గాని, పువ్వునుగాని, పండునుగాని, నీపునుగాని, సమర్వించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతః కరణుని యొక్క, భక్తి పూర్వకముగా నొసగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో స్వీకరించి అనుభవించుచున్నాను.
భగవంతుని సమసమానత్వము ఇచటదెలియబడుచున్నది. ఆయనకు, ధనిక, పేద అను తేడా లేదు. ఎవ్వరైననూ సరే పత్ర పుష్ప, ఫల,తోయములు భక్తితో సమర్పించిన తను ప్రీతితో స్వీకరించెదనని తెలిపినాడు. నిజమైన సమతావాది భగవంతుడే. ఇచట తెలిపిన నాలుగు వస్తువులు ధనికులకు, పేదవారికి అందుబాటులో నున్న వస్తువులే. భగవంతుడు భక్తిని, హృదయశుద్దిని గమనించునుగాని వస్తువుయొక్క గొప్పదనమును గాదు.
శ్రీరామచంద్రమూర్తి శబరియొసగిన ఎంగిలిపండ్లను ప్రీతితో నారగించలేదా
శ్రీకృష్ణపరమాత్మ భక్తోన్మత్తుడైన విదురుడు సమర్పించిన పండ్లతొక్కలు ప్రీతితో ఆరగించలేదా
విశ్వానికి మాతృమూర్తియైన భగవంతుడు తన బిడ్డలందరిపై సమావేశమైన ప్రేమ, కరుణ కురిపిస్తాడు. బాహ్యమైన అశుచి, దుర్గంధాన్నికించిత్తుకూడా పరిగణించక అంతః శుద్ధినే గమనిస్తాడు. భగవంతునికి, జాతి,మతములుగాని, కులము గోత్రముగాని అరేహములుగావు.భక్తి, నిర్మలాంతఃకరణ ముఖ్యములు.
ఈ శ్లోకములోని అంతరార్ధమును సూక్ష్మముగా పరిశీలించిన గొప్ప భావము గోచరించగలదు. నిజానికి యోగావతారుడైన శ్రీకృష్ణపరమాత్మ గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్నిపొందుపరచినాడు.
పత్రమనగా ప్రకృతిలో లభించే ఆకులుకాదు, బాహ్యంగా మనలను కప్పి ఉంచిన చర్మమనే తొడుగు ద్వారా ఆచరించే మంచి కర్మలన్నియు భగవంతునికి సమర్వించుటమే నిజమైన పత్రసమర్పణ. చాలామంది ధనవంతులు దానధర్మాలు విరివిగా చేస్తూ ఉంటారు. వారు కూడా కించిత్తు అహంకారానికిలోనై , నేనే ఈ సహాయములన్నియు చేస్తున్నానని తెలియజేస్తుంటారు. నిజానికి భగవంతుని అనుజ్ఞ, ఆశీస్సులు లేనిదే ఏ పనిలోనూ విజయము లభించదు. త్రికరణశుద్ధిగా కర్మలను భగవంతునికర్పించుటయే నిజమైన శరణాగతి.

పుష్పం - సుగంధ భరితములైన ఎన్నెన్నో పుష్పాలు జీవులపై కరుణతో దేవుడు సృష్టించాడు. తను సృష్టించి యిచ్చిన బాహ్య పుష్పాలు సమర్పించుట నిజమైన  పుష్ప సమర్పణకాదు. నిర్మలమైన, అణువణువు భగవంతుని నింపుకున్న, స్పచ్ఛమైన హృదయపుష్పాన్ని ఆదయామయునికి సమర్పించాలి.
ఫలం - మధుర ఫలములెన్నెన్నో జీవులపై ప్రేమతో భగవంతుడు సృష్టించాడు.ఈ ఫలమపలన్నీ సమర్వించినచో, తను సృష్టించిన ఫలములు మరలా తనకి సమర్పించుట పూర్ణముకాదు. మనం చేయుచున్న కర్మలన్నియు భగవంతునికే సమర్పణచేయుచు శరణాగతితో కర్మఫల త్యాగం చెయ్యాలి. అది కర్మయోగంగా మారుతుంది.
తోయం - అనగా జలం (నీళ్ళు) భక్తితో నీళ్ళు సమర్పించినా చాలు ఇది బాహ్య భావన. అంతరార్థాన్ని తరచి చూస్తే  నిర్మలాంతఃకరణ కలిగిన భక్తుడు భగవంతుని గాఢ పరిష్వంగంలో తనువు మరిచి తన్మయుడై అసంకల్పితంగా జాలువారే ఆనందబాష్పాలతో భగవంతుని అభిషేకించాలి. ఇదియే తోయ సమర్పణ. ఆనందభాష్పాలు జాలువారే ఆ భక్తుడు సాయుజ్య (సమాధి) స్థితికి సమీపంలోయున్నాడని అర్థము. ఇదియే మానవజన్మకు నిజమైన పరమార్ధము.
సమోహం సర్వభూతేషు సమేద్వేష్యోస్తినప్రియః
యే భజన్తితుమాం భక్త్యామయితే తేషుచాప్యహమ్
- 29 వ శ్లోకం
నేను సమస్త ప్రాణులందును సమముగానుండువాడను. నాకు ద్వేషింపదగినవాడు గాని, ఇష్టుడుగాని ఎవరును లేరు. ఎవరు నన్ను భక్తితో సేవించుచుందురో వారియందునేను, నాయందువారును ఉందురు. అందరియందును భగవంతునికి సమానవాత్సల్యము కలదు. ఐతే లోకయులో కొందరు సుఖవంతులుగను, మరికొందరు దుఃఖవంతులుగను యుండుటకు కారణమేమి?
భగవంతునికెవరిపైననూ పక్షపాతములేదు కానీ జీవులు వారు వారు చేసుకొనిన కర్మలననుసరించి సుఖదుఃఖాది ఫలములనొందుచున్నారు. కొందరు పుణ్యమును, మరికొందరు పాపమును ఆచరించుటవలన తత్ఫలితములగు సుఖదుఃఖములనొందుచున్నారు. ఇది ప్రకృతినందుగల అనుల్లంఘనీయమగు నియమము. నిజానికి జీవుల సుఖదుఃఖములుకు భగవంతుని బాధ్యతయేమియు లేదని ఋజువగుచున్నది. సూర్యుని ప్రకాశము అంతటనూ సమానముగామున్ననూ మట్టిపై ప్రకాశింపక అద్దమునందుబాగుగా ప్రకాశించును. అట్లే భగవంతుని కరుణ స్వీకరించగలరు. ఎచట పరమాత్మయుండునో అచట సుఖము, ఐశ్వర్యము మరియు విజయము తప్పక సిద్ధించును.
మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు
మామేవైష్యసియుక్త్యైవమాత్మానం మత్పరాయణః
- 34 వ శ్లోకం
సాధన చేయనిచో సాధ్యవస్తువు లభించదు. ఈ శ్లోకమందు బ్రహ్మాభ్యాసము చక్కగా వివరించబడినది. బ్రహ్మమును పొందుటకు మార్గము చెప్పబడినది. లక్ష్యమగు దైవమును గూర్చియే చింతించుట, ఆతనిని గూర్చియే చెప్పుట ఆతనిని గూర్చియే సంభాశించుకొనుట, ఆతనిని గూర్చియే ధ్యానించుట మొదలగు క్రియల ద్వారా మనుజుడు ఆ పరమాత్మను త్వరితముగా చేరుకొనగలడు. నిరంతరము భగవత్పరాయణుడై శరీరము, వాక్కు మనస్సులను త్రికరణములను అతనియందే నిలిపి, తదేకనిష్టుడైయుండు వాడు లక్ష్యమును సులభముగా పొందగలడు.
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9482013801
  

Show quoted text

No comments:

Post a Comment

Pages