పుష్యమిత్ర – 10 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర – 10

- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా,  సింహకేతనుడు నగరం వదలివెళ్తాడు. అష్టసేనానులతో జరిగిన తొలి సమావేశంలోనే మహారాజుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం స్పష్టమౌతుంది. కోటలో జరిగిన కన్యాపహరణం, ఆమె ఆత్మహత్య సంఘటనలు పుష్యమిత్రుని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. తన గతం గురించి చెప్తూ సుదర్శన భట్టు వద్ద సాగిన వేదవిద్యాభ్యాసం, ఆయన గురువైన వేదాంత భట్టు జాతకం చూసి మహారాజ యోగం గమనించి శస్త్ర శిక్షణ ఇప్పించమని చెప్పడం, దేవాపి ఐదు సంవత్సరాలలో సకల శస్త్రాస్త్ర విద్యలూ నేర్పించి అతనికి హిందూ ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేయమని చెప్పడం గురించి చెప్తాడు.( ఇక చదవండి).
పుష్యమిత్రుడు తన విడిదికి వచ్చాక నిద్ర పట్టదు. మనసు మళ్ళీ గతంలోకి జారుతుంది.  పుష్యమిత్రుడు గురువు దేవాపి మహర్షి వద్ద శెలవు పుచ్చుకుని గుర్రం పై మూడు రోజులు ప్రయాణించి గిరినగరం చేరే సరికి ఉదయం ఐదు గంటలు కావస్తోంది. ఇంటికి వెళ్ళి తల్లికి నమస్కరించి, సంధ్యాదులు ముగించి,  తండ్రి జ్ఞానమిత్రుడు మహారాజు వద్ద  ముఖ్యమైన సమావేశంలో ఉన్నాడన్న విషయం తెలిసి అక్కడకు వెళ్తాడు.
కొలువులో ప్రవేశించగానే.. సౌరాష్ట్ర ప్రభువు సాదరం గా ఆహ్వానించి "మేము మీ గురించి మీ తండ్రి గారి ద్వారా వింటూనే ఉన్నాం. మీరు వేద వేదాంగాలలోనే గాక సకల శస్త్రాస్త్ర విద్యలూ నేర్చుకున్నారని తెలిసి ఆనందించాము. మా కాబోయే మహామంత్రి మంత్రాంగంలోనే కాక శస్త్రాస్త్రవిద్యల్లో ప్రవీణుడు కావడం మా అదృష్టం. మీ తండ్రి గారి తర్వాత మాకు సరైన మహామంత్రి లభించాడని మహదానందం గా ఉంది" అన్నాడు. అది విన్న జ్ఞానమిత్రుడు "ఈ లోపు ఉప మహామంత్రిగా శిక్షణ ఇస్తే మంచిదని చెప్పగా మహారాజు "తధాస్తు" అంటాడు. పుష్యమిత్రుడు లేచి "మహారాజా క్షమించాలి నాకు మహామంత్రిగా పని చేయాలని లేదు. నేను హస్తినాపురంలో ఈ భరతఖండ చక్రవర్తి మౌర్య వంశజుడు అయిన బృహద్ధ్రధుని వద్ద సర్వసైన్యాధికారిగా చేయాలని మా గురువు దేవాపి మహర్షి ఆజ్ఞ. తండ్రిగారి అనుమతి కోసం నేను ఇక్కడకు వచ్చాను." అనగానే ఆ సభలోని వారందరూ అవాక్కయ్యారు. అంతలో తండ్రి జ్ఞానమిత్రుడు తేరుకుని "పుష్యమిత్రా! మనం  నిర్ణయించేది ఏదీ ఉండదు. ఆ సర్వేశ్వరుని అభీష్టం మేరకే అన్నీ జరుగుతాయి. నీ మనోవాంఛ ఎలా ఉంటే అలాగే కానివ్వు నీవు ఏ రోజైనా తిరిగి వచ్చి ఇక్కడ కొలువులో చేరవచ్చు." అని చెప్పి ఆశీర్వదిస్తాడు.
*  *  *
 మరునాడు సంధ్యావందనం చేసుకుని త్వరగా రాజసభకు వెళ్ళాలని ఉన్న సమయంలో.. అష్టసేనానులలో ముఖ్యులైన నలుగురు పుష్యమిత్రుని కోసం విశ్రాంతి మందిరంలో వేచి ఉన్నారన్న సంగతి తెలిసి అక్కడకు వచ్చాడు. "జయము జయము మహాసేనాని పుష్యమిత్రులవారికి" అని అభివాదం చేసారు. పుష్యమిత్రుడు నవ్వుతూ "నాకు ఇలాంటి జయజయధ్వానాల కంటే రాజ ధర్మం ముఖ్యం. మన దేశభద్రత ముఖ్యం.  చెప్పండి మీ రాకకు కారణం" అనగానే వారు "పుష్యమిత్రా! దక్షిణ భారతదేశం లో గత రెండు సంవత్సరాలుగా కరువు తాండవిస్తోంది. వర్షాలు లేని కారణంగా పంటలు ఏమీ పండడం లేదు. చెరువులు ఎండిపోయాయి."  "అవును ఆ విషయం నేనూ విన్నాను".  " సామంతులు పన్ను కట్టాల్సిందే అని పట్టుబట్టడంతో దిక్కుతోచక ఆయా దేశాల గ్రామాధికారులు  మన చక్రవర్తి దర్శనార్ధం వచ్చి నగర పొలిమేరల్లో విడిదిచేసారు. వారి గోడును చెప్పుకోవాలని వచ్చారు". అయ్యో పాపం. వారికి సహాయ కార్యక్రమాలు చేయడం ఈ దేశ ప్రభువు కర్తవ్యం." అనగానే.. "ఈ విషయం తమరికి తెలియజేద్దామని వచ్చాము. మీరూ చక్రవర్తుల వారికి సహాయం చేయమని ప్రజల తరఫున అభ్యర్ధించాలని మా కోరిక" అని శెలవు తీసుకున్నారు.
*  *  *
అది బృహద్ధ్రధ మహారాజు కొలువు. అందరూ ఆశీనులై ఉన్నారు. మహారాజు గారు వచ్చే సమయమైందన్నట్లు అలికిడి అయింది. భట్రాజులు "జయము! జయము! బృహద్ధ్రధ మహారాజా! జయము! జయము!" అని పలుకుతూ ఉండగా చక్రవర్తి ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్నారు.   "మహా మంత్రిగారూ! నేటి విశేషాలు ఏమిటి? " అనగానే మంత్రి లేచి "మహారాజా! దక్షిణ భారతదేశం కరువుకోరల్లో చిక్కుకుంది. ప్రజల ఆకటి కేకల శోకాల బాకాలు మన అంత:పురాన్ని సైతం తాకుతున్నాయి. అక్కడి గ్రామాధికారులు తమ దర్శనార్ధం వేచి ఉన్నారు." అని అనగానే.. " వారు ఇక్కడకు రావడం వలన ప్రయోజనం ఏమిటి? సామంతులు ఏమి చేస్తున్నారు? అక్కడ కరువు ఉంటే నేనేమి చేయగలను? ప్రవేశ పెట్టండి." అనగానే పాతిక మంది వ్యక్తులు సభలో ప్రవేసించి.."బృహద్ధ్రధుల వారికి ప్రణామములు. మేము గత రెండుసంవత్సరాలుగా అష్ట కష్టాలు పడుతున్నాము ప్రభూ! తినడానికి తిండి లేదు. సరి అయిన బట్టలు లేవు కందమూలాలు తిని బతుకుతున్నాము ప్రభూ! ప్రస్తుతం శిస్తులు కట్టలేము. పరిస్థితి చక్కబడ్డ తర్వాత వాయిదాల వారీగా కట్టుకుంటాము. తమరు కనికరించాలి" అని చెప్పి అందరూ నమస్కారాలతో నిలుచున్నారు. "దేశంలోని కరువు కాటకాలకు మేము బాధ్యులము కాదు. అంతా భగవంతుని కృప. ఏది ఏమైనా మీరు శిస్తులు కట్టక పోవడం నేరం రాజద్రోహం! నిజమేనా?" "అవును ప్రభూ తినడానికే లేక పోతే శిస్తులు ఎలా కట్టగలం? తమరు రెండు సంవత్సరాల శిస్తులు ప్రస్తుతం మాఫీ చేసి మాకు తమ ధాన్యాగారం నుండి తిండి గింజలు పంపాలని మిక్కిలి ప్రార్ధిస్తున్నాం. ప్రభూ!"  "అసంభవం! శిస్తులు దేనికి రద్దు చేయాలి? మీరు తరతరాలుగా ఎంతో భోగ భాగ్యాలు అనుభవించారు. రెండు సంవత్సరాలు కరువు వస్తే ఏమవుతుంది. మీ ఇళ్ళలోని వెండి బంగారు ఆభరణాలు, వస్తువులు, అమ్మి శిస్తులు కట్టండి వెంటనే! లేక పోతే రాజ దండన తప్పదు!" అని మహారాజు అనగానే ఆ గ్రామాధికారులు "ఇది చాలా అన్యాయం ప్రభూ! దేశాన్ని ఏలే ప్రభువు తమరు దయచూడకపోతే ఎవరు దయ చూస్తారు ప్రభూ!" అన్నారు. చక్రవర్తి ఆగ్రహోదగ్దుడై "నేను ఎటువంటి సహాయమూ చెయ్యలేను. మీరు శిస్తులు ఈ మాసం చివరిలోగా చెల్లించండి లేకపోతే మీ మీ ఆస్తులు జప్తు చేయబడతాయి. ఇక మీరు వెళ్ళవచ్చు" అన్నాడు.
పుష్యమిత్రుడు అందుకుని మహారాజా! " ఇక్కడి సారనాధ్ మొదలైన క్షేత్రాలలో బౌద్ధులు తమ దయవల్ల అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. వారి దగ్గర ఉన్న సంభారాలు ధనధాన్యాలూ ఇంకా కొద్ది సంవత్సరాల వరకూ వస్తాయని మన గణకులు చెప్తున్నారు. అయినా మనం ఆనవాయితీ గా వారికి ఇంకా పంపిస్తూనే ఉన్నాము. అందువల్ల" అనగానే.. చక్రవర్తి "ఆ అందువల్ల" అన్నాడు. పుష్యమిత్రుడు క్షణం ఆగి "మానవ సేవే మాధవసేవ యని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం బౌద్ధులకు పంపవలసినవి అన్నీ దక్షిణ దేశానికి తరలించమని మా విన్నపం. ప్రజలు బాగుంటేనే రాజ్యం. రాజ్యం సుభిక్షంగా ఉంటేనే మనం!" అనగానే.. గ్రామాధికారులు "పుష్యమిత్రులవారికీ జై" అని నినాదాలు చేసారు. మహారాజు తీవ్ర కోపంతో.. "పుష్యమిత్రా! చాలించు నీ అధిక ప్రసంగం! మీరు ఇక్కడ సైన్యాధికారి మాత్రమే! మా సలహాదారు కాదు! మాకు మీ సలహాలు అవసరం లేదు. మీ హితోపదేశాలు కట్టిపెట్టి మీ వ్యవహారం మీరు చూసుకోండి." అన్నాడు. "గ్రామాధికారులను తక్షణం ఈ సభనుండి పంపించి వేయండి" అని " ఈనాటికి కొలువు ముగిసింది. వెళ్ళిరండి"  అని సెలవు తీసుకున్నాడు.
*  *  *
పుష్యమిత్రుడు తన నివాస భవనానికి చేరే సరికి యాభై మంది పైచిలుకు జనం ఇంటిముందు గుమి కూడి ఉన్నారు. వారిలో అష్ట సేనానులు, ఇతర ప్రాంతాల గ్రామాధికారులు, మిగతా జనం ఉన్నారు. అందరూ ఒక్కసారి గొంతెత్తి  "పుష్యమిత్రుల వారికీ జై" అని నినాదాలు చేసారు.  అందరి వైపూ ఓ సారి చూసి ఆగమని చెప్పి ఆరుబయట మైదానం లోకి ఒక ఆసనం తెప్పించి అక్కడే కూర్చున్నాడు. "చెప్పండి" అనగానే..."మీరు దయతో చెప్పిన మాటలను మహారాజు లక్ష్య పెట్టలేదు. మమ్మల్ని శిస్తులు ఈ మాసాంతంలోపు కట్టమనడం ఎంత వరకూ సమంజసం?  మీలాంటి వారు చక్రవర్తిగా ఉంటే దేశం ఎంత బాగుపడుతుంది. మీరే ఏదో ఒక దారి చూపించాలి పుష్యమిత్రా! దయవుంచి" అనగానే. "సరే! మనం అనవసర విషయాలు చర్చించ కూడదు. నాకు కొంత సమయం ఇవ్వండి. మీరు వెళ్ళేలోపు ఎవరెవరు ఎంత శిస్తు కట్టాలో, మొత్తం ఎంతో పత్రం పై రాసి ఇచ్చి వెళ్ళండి. నా ప్రయత్నం నేను చేస్తాను" అన్నాడు. మళ్ళీ వారు ఇంకో సారి జయ జయ ధ్వానాలు చేసి సెలవు తీసుకున్నారు. అష్ట సేనానులు సెలవు తీసుకుంటూ "పుష్యమిత్రుల వారికి జనం మనోభీష్టం విశదమైందనుకుంటాము" అన్నారు. "ప్రియమైన అష్ట సేనానులారా! చక్రవర్తికి ఇంత కాలం మంచి చెప్పిన వారు లేరు. మనం మంచి మాటలు చెప్పి వారిని శిస్తు మాఫీకి ఒప్పిద్దాం" అనగానే...వారు అంతా భ్రమ అన్నట్టు ఓ చిరు నవ్వు నవ్వి సెలవు తీసుకున్నారు.
*  *  *
మహారాజుగారితో సాయంత్రం వేళ ముఖ్యమైన విషయం మాట్లాడాలని కబురు పంపగానే.. రమ్మని చెప్పడం తో వెళ్ళి ఆయన ఆంతరంగిక మందిరం బయట వేచి ఉన్నాడు పుష్యమిత్రుడు. రాజుగారి గదినుండి కిల కిల నవ్వులూ..సరస సంభాషణలూ తెరల చాటుగా వినవస్తున్నాయి. కొంతసేపటికి నలుగురు స్త్రీలున్న బృందం ఒకటి ఏవో కానుకల పళ్ళేలతో ఆ మందిరం వీడి వెళ్ళిపోయారు. అనంతరం మహారాజు గారు లోనికి రమ్మన్నారని పిలుపు అందగా లోనికి వెళ్ళాడు. ఆ గది నిండా రక రకాల పుష్పాలు హంస తూలికా తల్పం పైనా నేల పైనా చిందర వందరగా పడి ఉన్నాయి. మదిరాపానీయాల వాసన వేస్తోంది. పరిస్తితి అంచనా వేస్తూ పుష్యమిత్రుడు ఆ గదిలో ప్రవేశించాడు. "రా పుష్యమిత్రా ఆశీనుడవుకా! మదిర ఏదైనా పుచ్చుకుంటావా?" అనగానే "క్షమించండి మహారాజా.. నేను సద్బ్రాహ్మణుడను" అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఆయన నవ్వి..."చెప్పండి" అనగానే.. "మహారాజా.. ఉదయం సంఘటన నాకు తీవ్ర మనస్తాపం కలిగించింది. తమరు మంచి మనసు చేసుకుని ఏదో విధంగా సహాయ పడాలి అనగానే.." నీవు నన్ను సరిగా అర్ధం చేసుకోడం లేదు... ఎన్ని సార్లు చెప్పినా...ఎలా కుదుర్తుంది చెప్పు పుష్యమిత్రా! ఒక సంవత్సరానికి పది లక్షల వరహాల చొప్పున ఇరవై లక్షల వరహాల మొత్తం రావాలి వారినుండి. ఆదాయం లేకుండా మనం ఈ సామ్రాజ్యాన్ని ఎలా నడపగలం చెప్పు?" అనగానే... "మహారాజా మన సైనిక బలం నలభై వేల మంది ఉన్నారు. ఒక్కొక్కరికీ జీత భత్యాల క్రింద మనం నెలకు పాతిక వరహాలు ఖర్చు చేస్తున్నాము కదా!" అనగానే మహారాజు "అవును నిజమే" అంటూ దానికీ దీనికీ సంబంధం అర్ధం గాక చూస్తుండగా... పుష్యమిత్రుడు కొనసాగించాడు. "నెలకు  మొత్తం 10 లక్షల వరహాలు ఖర్చు అవుతోంది. నేను మన సైనికులతో మాట్లాడి వారిని నెలకు ఐదు వరహాలు దక్షిణ భారత దేశం లోని కరువు బాధితులకు చందా క్రింద ఇవ్వడానికి ఒప్పిస్తాను. అలా 10 నెలలపాటు వారు 5 వరహాలు ఇస్తే మనకు 20 లక్షల వరహాలు వచ్చినట్లే గదా! కరువు తీరి పరిస్తితులు చక్కబడగానే మనం దక్షిణాది వాసుల వద్ద మళ్ళీ వాయిదాల పద్ధతి లో బాకీలు రెండు లక్షల వరహాలు వసూలు చేసి సైనికులకు అదనపు జీతంగా, పండుగల సందర్భంగా.. ఇవ్వవచ్చు" అనగానే "నిజమే పుష్యమిత్రా! దీనికి అందరూ ఒప్పుకోవాలి. పైగా మనం వారి తరఫున ఇంత భారం ఎందుకు మోయాలో నాకు అర్ధం కావటం లేదు. "మహారాజా! రత్న గర్భ అయిన మన దేశంపై ఇప్పటికే ఇతర దేశాల వారు కన్ను వేసారు. యవన సామ్రాట్ అలెగ్జాండర్ మొన్నటికి మొన్న సాగించిన దండయాత్రలూ.. దురాగతాలు మరచిపోగలమా? అంభిలాంటి సామంతులు మళ్ళీ తలెత్తకుండా వుండాలికదా? దేశంకోసం ప్రాణాలర్పించవచ్చు అన్న దృఢనిశ్చయం కలిగించాలి జనంలో మనం.  అవసరసమయం లో మన దేశ ప్రజలంతా మనకు మద్దతు పలికి అవసరమైతే యువత మొత్తం కదనరంగం లో దూకేందుకు సిద్ధంగా ఉండాలి. దానికి దేశం లోని యువతకు శిక్షణ ఇవ్వడానికి దేశం లో పలుచోట్ల మీ అనుమతి తో శిబిరాలు ఏర్పాటు చేయవలసి ఉంది. దేనికైనా ప్రజల మద్దతు కావాలి మనకు. ప్రజల మద్దతులేని ఏ సామ్రాజ్యాలు నిలువలేవు అన్న విషయం మనం విస్మరించరాదు. అందుకే మహారాజా.. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. రేపటి రోజున మీరు మహామంత్రి తో మాట్లాడి సభలో ఈ విషయం మీరే ప్రకటించండి. నాకు సెలవు” అని వెళ్ళిపోయాడు. ఈ సైన్యాధికారికి అప్పుడే అన్ని లెక్కలూ తెలిసిపోయాయి. అదీగాక పుష్యమిత్రుని మాటా నిజమే! ప్రజలు తిరుగుబాటు చెయ్యకుండా చూడవలసిన బాధ్యత నాపైన ఉంది. శిస్తుమాఫీ వద్దన్న నా నోటితోనే ప్రకటన చేయిస్తున్నాడు. వీని తెలివితేటలు అపూర్వం... అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు.  (సశేషం)
*  *  *

No comments:

Post a Comment

Pages