మాడర్న్ దేవతలు - అచ్చంగా తెలుగు

మాడర్న్ దేవతలు

Share This

(జ)వరాలి కధలు - 9

మాడర్న్ దేవతలు 

గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)


ఒకరోజు ఆఫీసునుంచి యింటికొస్తూంటే మా యింటికి నాలుగువీధులు అవతల 18-22 సంవత్సరాల వయసున్న పదిమంది కుర్రాళ్ళు దారికాచి నా బండిని ఆపారు. "ఎవరయ్యా మీరు? ఏం కావాలి?" నా ప్రశ్నల పరంపర పూర్తి కాకుండానే ఒక రసీదు పుస్తకం నా చేతిలో పెట్టారు. "ఓ రెండొందలు వ్రాయి" వారిలో వయసులో పెద్దగా కనిపించే కుర్రాడు చెప్పాడు. " ఏమిటి? నేను డబ్బులియ్యాలా? టోల్గేట్లు ఊరి చివర పెట్టుకోవాలి గాని యిలా కాలనీల్లో పెట్టరు" పరిహాసంగా అన్నాను. " ఇవి టోల్గేటు కలెక్షన్లు కావు. రెండువారాల్లో వస్తున్న వినాయకచవితి చందా" అతని ప్రక్కనున్న కుర్రాడు చెప్పబోయాడు. " మామయ్యగారికి యిదేం కొత్తేంట్రా? ప్రతీ ఏడూ ప్రతీ ఊళ్ళో జరిగేదే! చందా యివ్వాలని బెట్టు చేస్తున్నారు" రసీదు కుర్రాడు వ్యంగ్యంగా అన్నాడు. ఇంతలో నేనెక్కడ జారుకుంటానో అని ఒక కుర్రాడు నా స్కూటర్ మీద నా వెనుక కూర్చున్నాడు. "ఏంట్రా? ఏంటి గొడవ?" అంటూ మరోబండి దగ్గర చందా వసూలు చేసి వచ్చిన కుర్రాడు అడిగాడు. " ఏం లేదురా! ఆసుపత్రిలో ఆపరేషను చేసి అమ్మ కడుపులో బిడ్డనైనా సులభంగా తీయవచ్చు గాని యీయన జేబులో డబ్బులు మాత్రం తీయించలేమట!" అతనికి నా వెనకాల కూర్చున్న కుర్రాడు చెప్పాడు. "ఎందుకు సార్ గొడవ? ముచ్చటపడి పిల్లలేదో పూజ చేసుకుంటామంటున్నారు. ఏడాదికోసారేగా! యిచ్చేయండి" వాళ్ళకి చందా యిచ్చిన పెద్దమనిషి చెబుతూ తన బండి ష్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. "అంకుల్ అక్కౌంట్స్ డిపార్ట్ మెంట్లో పని చేస్తారురా! అందుకే లెక్కలడుగుతున్నారు" వీళ్ళప్పుడే నా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నారన్నమాట! ఔన్లే! పని లేకుండా వీధులంట తిరుగుతారుగా! అలా తెలుసుకొని ఉంటారు. "అదికాదయ్యా! వినాయకచవితిపూజ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి.అంతేగానీ యిలా పూజ పేరుతో దేవుణ్ణి రోడ్డుకి లాగటం మంచిదేనా?" నీతిపాఠాలు చెప్పబోయాను. "రాత్రే మావాడు కైలాసం వెళ్ళి గణపతిని కనుక్కొని వచ్చాడు. ఇంట్లో చేసినా, బజార్లో చేసినా తనకి భక్తి ముఖ్యం అని చెప్పాడు. అంతేకాదు. మార్కెట్లో ధరలు పెరిగాయి గనుక మనిషి దగ్గర రెండు వందలు తక్కువ గాకుండా వసూలు చేయమన్నాడు. అదే విషయాన్ని కమిటీలో పెట్టి తీర్మానించాం. సరా?" " మామయ్యగారు మరీ బెట్టు చేస్తున్నారు. మన పని కానిస్తాను" అంటూ జేబులోంచి చాకు తీశాడో కుర్రాడు. "ఏంటయ్యా మీ దబాయింపు? చంపుతారా?" కోపంగా అడిగాను. " ఆ రోజులు పోయాయండీ! రెండొందల కోసం హత్య జేసి మా భవిష్యత్తు తగలేసుకుంటామా? అది ప్రక్క ఊరి ఆచారం. మా పద్ధతి వేరు. ఈ చాకుతో మీ టైరుని కోసేశామనుకోండి. కొత్తటైరు కొనుక్కోవటానికి బోల్డు డబ్బులెట్టాలి. అది చవకో, రెండొందలు చవకో ఆలోచించండి" "అనువుగాని చోట అధికులమనరాదు. చందాలరోజులొచ్చాయి. అనవసరవాదాలు పెట్టుకొని పరువు పోగొట్టుకోక చందా యిచ్చేయండి " రెండురోజులక్రితం వరాలు నా పర్స్ సవరిస్తూంటే యింటిఖర్చులకి డబ్బు తీసుకొందేమో అనుకొన్నాను. ఈరోజు ఎవరికో పైసలివ్వటానికి పర్స్ తీస్తే భార్యగారు వ్రాసిన భగవద్గీత బయటపడింది. అది గుర్తొచ్చి వాళ్ళకి చందా యివ్వటానికే నిశ్చయించుకొన్నాను. "మామయ్యగారూ! ఇప్పటికి యీదారిలో మూడు బళ్ళదగ్గర వసూలు చేశాం. కానీ మీ దగ్గరే. . . త్వరగా చెప్పండి. చందా యిస్తారా? టైరా?" అంటూ చాకుని టైరు మీద పెట్టాడు. " ఉండవయ్యా! పండగ యింకా పదిహేనురోజులుంది. ఈ రోజు చందా యిచ్చాననుకోండి. మరి యీ పక్షంరోజుల్లో మీరుగాక మరెవరైనా యీ వీధిలో ఉండి చందా అడిగితే. . . ."నసిగాను. " మేమే ఉంటాం. లేమనుకోండి ఇప్పుడు మేము మీకిచ్చే రసీదు పండగెళ్ళేవరకూ మీతోనే ఉంచుకోండి. ఈ వీధిలో ఎవరడిగినా యీ రసీదు చూపిస్తే మిమ్మల్ని వదిలేస్తారు" ఇష్టం లేకపోయినా వాళ్ళకి చందా యిచ్చి, ఆ రసీదు పర్స్ లో దాచుకొన్నాను. "రసీదు భద్రం సార్!" వేళాకోళంగా చెబుతూ నా వెనక బండిపై కూర్చున్న కుర్రాడు లేచాడు. నేను బండి స్టార్ట్ చేసి యింటిదారి పట్టాను.
అలా రెండు వీధులు దాటానో, లేదో "అంకుల్" అంటూ పదేళ్ళ కుర్రాడు రంకెలేస్తూ నా స్కూటర్ని వెంబడించాడు. నేను కంగారుపడి బండి ఆపగానే వాడివయసు కుర్రాళ్ళు పదిమంది నా చుట్టూ చేరారు. వాళ్ళ చేతిలో చిన్న నోటుపుస్తకం, పెన్ను ఉన్నాయి. " ఏమిటి?" గద్దించగానే అందరూ భయంతో వెనక్కి తగ్గారు. కానీ వాళ్ళలో కొంచెం పెద్ద కుర్రాడు ధైర్యంగా ముందుకొచ్చాడు. "వినాయకచవితి చందా" అంటూ నోటుపుస్తకం, పెన్ను నా చేతిలో పెట్టాడు. " ఇప్పుడే రెండు వీధులవతల యిచ్చి వస్తున్నా. ఇదిగో రసీదు" అని జేబులోని చీటి చూపించాను. "అంటే. . .అంకుల్! అది ఆ వీధి వాళ్ళది. వాళ్ళకి, మాకు సంబంధం లేదు. మా మంటపం యీ వీధిలో పెడతాం. వాళ్ళడిగినంత మేమడగటం లేదు. ఏదో. . యాభై. .వంద. .మీకు తోచింది వ్రాయండి" అని నసిగాడు. " మీరంతా కలిసి కాలనీ మొత్తానికి ఒకే మంటపం పెట్టొచ్చు గదా! వీధికో వినాయకుడెందుకు? మమ్మల్నిలా యిబ్బంది పెట్టడమెందుకు?" "అంటే . . .వాళ్ళు సీనియర్లు. .మేము జూనియర్లం. ఖర్చుకి డబ్బులడిగితే వాళ్ళివ్వరు " చెబుతున్న కుర్రాణ్ణి ఎవరో భుజంపై పొడవగానే నాలిక్కర్చుకున్నాడు. సరె! వాళ్ళనెందుకు బాధ పెట్టటమని భార్యగారి భగవద్గీత గుర్తొచ్చి వాళ్ళ పుస్తకంలో ఏభై రూపాయలు వ్రాసి యిచ్చాను. " అంకుల్! మీ అడ్రసిస్తే పూజ అయ్యాక ప్రసాదం మీయింటికి పట్టుకొచ్చి యిస్తాం" అంటున్న కుర్రాడి తలపై నిమిరాను. వాళ్ళ కన్న వీళ్ళే నయం. ఆ మాత్రం గౌరవమిస్తున్నారు. " మీరు తన్నుకోకుండా పూజ చేయండి. అదేచాలు" అని చెప్పి బండిపై యిల్లు చేరాను. స్కూటర్ కీని బల్లపై పడేసి బట్టలు మార్చుకొని, బాత్రూంలో దూరాను. నేను బయటకి వచ్చేసరికి వరాలు నా జేబులు సవరించి, ఎవరినో సాగనంపటం కనిపించింది. "ఎవరది?" "మన ఎపార్టుమెంట్ కుర్రాళ్ళండీ! చవితి పూజకి చందా అడిగితే యిచ్చాను" "ఇప్పుడే రెండు వీధుల్లో పంచి వచ్చాను. ఇలా వీధికో వినాయకుడని కాలనీ మొత్తం నా జీతాన్ని పంచేస్తే పండగపూట పూజ కాదు పస్తు పడుకోవాలి. పొమ్మని చెప్పకపోయావా?" క్రిందటేడు మనం అద్దెకున్న కొంపలో మనం తప్ప మరెవరూ ఉండేవారు కాదు. అందుకని ప్రక్కింటి కుర్రాడు చందా అడిగితే పొమ్మని తలుపులేసేశాం. ఇప్పుడు ఎపార్టుమెంటులోకి అద్దెకొచ్చాం. తెల్లారి లేస్తే ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొవాలి. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో! అలాంటప్పుడు యిలా చందాలు యివ్వకతప్పదు. కాదంటే ఆస్తికులు కాదని చెప్పి, యీ అంతస్తుల్లో వాళ్ళంతా మనని మానసికంగా వెలేస్తారు" "అలాగని! . . . వీళ్ళిలా వినాయకుడి పూజ పేరుతో దండుకొనేది అతనిమీద భక్తితో కాదు, కొంతమంది జల్సారాయుళ్ళ ఆర్ధిక అవసరాల కోసం చేసే నటన. దీనికి మనం మద్దతివ్వాలా?" ఆవేశపడ్డాను. " ఆ సంగతి స్వామికి తెలీదా? వాళ్ళ సంగతి గణపతే చూసుకొంటాడు. అహంతో విర్రవీగేవాడు నాయకుడు. సిద్ధి, బుద్ధిని గూడి విజ్ఞత చూపేవాడు వినాయకుడు. మన స్వాతంత్ర్య ఉద్యమంలో తనవంతు సహకారమిచ్చిన ఆ గణపతికి మనమెంత చేసినా తక్కువే!" వరాలి మాటలకు త్రుళ్ళిపడ్డాను. "గణపతి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడా? అదెలా?" " ఆరోజుల్లో ఆంగ్లేయులు మనవాళ్ళు నలుగురు నడిరోడ్డు మీద కలిస్తే నడుములు విరక్కొట్టేవాళ్ళు. కానీ హిందువులు పూజ చేసుకొనే మంటపాలకు గాని, ఆలయాలకు గాని నిఘాపెట్టేవాళ్ళు కాదు. ఇది గమనించిన బాలగంగాధర తిలక్ యింట్లో ఉండే గణపతిని వీధిలోకి లాగాడు. వినాయకచవితికి వీధుల్లో గణేషమంటపాలేర్పాటు చేసి, నవరాత్రుల పేరుతో తొమ్మిది రోజులు యీ మంటపాల దగ్గర రాజకీయనాయకులు కలిసేవారు. పూజామంటపాలపై ఆంగ్లేయుల నిఘా లేదు గనుక యీ నవరాత్రులు బాహాటంగా భావిప్రణాళికలను చర్చించి వాటిని నిమజ్జనం రోజు సందేశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళేవారు. అలా బొంబాయి వీధుల్లో మొదలైన వినాయకుడి పూజా సంస్కృతి ప్రస్తుతం దేశమంతా వ్యాపించి వేళ్ళు పాతుకొంది" వరాలు చెప్పింది నిజమే! తను చెప్పింది విని నేను ఆలోచిస్తూంటే వరాలు మెల్లిగా వంటింట్లోకి తప్పుకొంది. % % %
వినాయకచవితి రోజు మాయింట్లో టేపురికార్డర్ పంతులుగారి సాయంతో వినాయకవ్రతం ముగించి,సుష్టుగా భుజించి, మాగన్నుగా ఒక కునుకు దీశాం. మేము నిద్ర లేచే సమయానికి మా చుట్టుప్రక్కల పంతుళ్ళ మంత్రోచ్ఛారణ స్థానంలో ఆడవాళ్ళ గోల మారుమ్రోగుతోంది. "పుట్టింటోళ్ళు తరిమేశారని" ఒకామె గోలెడుతుంటే, "గుడియెనకా నా సామి గుర్రమెక్కి కూకున్నాడని" మరొకామె హుషారెక్కిపోతోంది. "నాకెవరూ నచ్చట్లే, నా గుండెలో కుంపట్లే" అని ఒక కన్నెపిల్ల రచ్చ చేస్తూంటే, "నేనొక ప్రేమపిపాసిని" అని ఒక వెర్రోడు వెంటపడుతున్నాడు. హాయిగా పండగ పూట భక్తిపాటలు వేయక, యీ గోలేమిటో అని నాలో గొణుక్కొంటున్నాను. "వాళ్ళగోల అలాగే ఉంటుంది గానీ త్వరగా బట్టలేసుకోండి" అంటూ వరాలు నాకు బట్టలు తెచ్చిచ్చింది. " ఎక్కడికి?" చిరాగ్గా అడిగాను. " వినాయకచవితి పూజ చేశాక ఆరోజు తొమ్మిది గణపతి పూజామంటపాలను చూడాలని మా అమ్మమ్మ చెప్పేది. ప్రతీ ఏడు వెళ్తున్నా మీకు పరగడుపే! లెండి" అంటూ తొందర చేసింది. ఒక గంటలో యిద్దరూ ముస్తాబై పెద్దబజార్లో వెలసిన గణేష మంటపాలు చూట్టానికి బండిమీద బయల్దేరాం. అక్కడ కొన్ని మంటపాలు చూశాక. ఒక మంటపం ముందు విపరీతమైన జనం కనిపించి అటెళ్ళాం అక్కడ "గణపతి కళ్యాణం" అన్న చిత్రం షూటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం మంటపంలో పూజ అయిపోయాక ఈ చిత్రం షూటింగ్ మొదలెట్టారట. తెలుగువారి అభిమాననటుడు విఘ్నపతి యిందులో హీరోనట. గురువుగారి సినిమా అని అతని అభిమాననటులంతా అక్కడ పోగయ్యారు. ఈ మంటపానికి ఆ చిత్రనిర్మాత భారీమొత్తంలో చందా యిచ్చాడని అక్కడ షూటింగ్ ని కాదనలేకపోయారు. మంటపం మధ్యలో ఉండవలసిన గణపతి విగ్రహాన్ని షూటింగ్ కోసం ఒక మూలకు నెట్టి మంటపం మధ్యలో సినిమా సెట్టింగ్ వేశారు. "పిదపకాలం, పిదప బుద్ధులు. తొమ్మిదిరోజులూ గణపతి విగ్రహాన్ని పూజాస్థలం నుంచి కదపకూడదు. అది నిమజ్జనానికే కదపాలి. అలాగాక షూటింగ్ కోసం దేవుణ్ణి ప్రక్కకి గెంటేశారంటే. . .అటువంటప్పుడు అసలు యిక్కడ పూజ చేయకుండానే ఉండాల్సింది. పూజ చేసిన గంటకే విగ్రహాన్ని ప్రక్కకెలా తోసేస్తావయ్యా అంటే యిక్కడ పూజ చేసిన పంతులు చేతులెత్తేశాడు. గట్టిగా మాట్లాడితే ఆ హీరో అభిమానులు తన్నేలా ఉన్నారంటాడు. ఈ వేషాలు చూసే వేరే మతంవాళ్ళు మనలను చిన్నబుచ్చుతున్నారు" అని అరవైఏళ్ళ వృద్ధుడు సణుక్కొంటూ వెళ్తున్నాడు. ఇంచుమించు ఆ మంటపమంతా విఘ్నపతిగారి అభిమానులతో నిండిపోయి ఉంది. దేవుడుండాల్సిన ప్రాంతంలో సింహాసనంపై విఘ్నపతి కూర్చుని ఉన్నాడు. కొంతమంది అతని అభిమానులు గణపతి రూపంలో ఉన్న హీరో కాళ్ళకి మొక్కి వెళ్ళిపోతుంటే, ఆరోజు ఉదయం పూజలందుకొన్న గణపతి భారీవిగ్రహం మంటపం మూలనుంచి బిక్కచచ్చి చూస్తోంది. ఆ అనర్ధానికి వరాలు చిరచిరలాడుతోంటే నేను పట్టించుకోవటం లేదు. కవిగా నాకుండే కుతూహలంతో అక్కడ హడావిడి చేసే ఓ కుర్రాణ్ణి " ఈ సినిమా కధేమిటి?" అని అడిగాను. " చాలా హాస్యంగా ఉండే కధండి. పార్వతీదేవి పెళ్ళీడుకొచ్చిన తన బిడ్డకు. . . అదే గణపతికి పెళ్ళి చేయాలనుకొంటుంది. చవితిపూజలకు భూలోకానికి వచ్చిన గణపతి, భార్యలవల్ల భర్తలు పడే యిబ్బందులు గమనించి, జీవితంలో పెళ్ళే చేసుకోకూడదనుకొంటాడు. అయినా శివపార్వతులు పెళ్ళి కానేకావాలంటారు. అప్పుడు గణపతి ఆజన్మబ్రహ్మచారి నారదుడితో కలిసి తన పెళ్ళికి తానే అనేక ఆటంకాలు కలిగిస్తాడు" హుషారుగా చెప్పుకుపోతున్నాడు. "ఇదే పురాణంలో ఉంది?" అమాయికంగా అడిగిన నన్ను అదోలా చూశాడు. "సినిమాకధలన్నీ పురాణాల ప్రకారమే తీయాలా? ఒకప్పుడు పాంచాలి కర్ణుడిమీద మనసు పారేసుకొందని సినిమాతీశారు. కీచకుణ్ణి భీముడు ధర్మరాజిచ్చిన కత్తితో వెన్నుపోటు పొడిచి చంపేశాడని తీశారు. అవి ఏ పురాణాల్లో ఉన్నాయని జనాలు చూశారు? విఘ్నేశ్వరుడి పెళ్ళికి వేయి విఘ్నాలని అంటారు. ఆ మాట ఆధారంగా నలభై ఏళ్ళక్రితం యీ నిర్మాత నాన్నగారు కధ తయారుచేశారట. అప్పటి పెద్దనటులు ఎంటీవోణ్ణీ, నాగ్గాణ్ణీ అడిగారట. తలకి ఏనుగు మాస్క్ వేసుకొని నటిస్తే తమకంత గుర్తింపు రాదని వాళ్ళన్నారట. ఇన్నాళ్ళకి మావోడు ఆ పాత్ర వేస్తానన్నాట్ట. చూస్తూండండి. మావాడీ పాత్రని ఎలా తినేస్తాడో?" చొక్కా కాలరెగరేస్తూ చెప్పాడతను. నోటికి అడ్డంగా ఏనుగు మాస్క్ ఉంటే పాత్రని ఎలా తింటాడు?" అన్న మాటలు వినిపించి వేగంగా నా దగ్గరకొచ్చాడతను. " మీరు మాహీరో నేమన్నా అన్నారా?" దూకుడుగా అడిగాడు. " లేదయ్యా? సినిమా కధ గురించి అడిగానంతే" బదులిచ్చాను. " ఆమాట నేనన్నాను" నాప్రక్కనున్న పాతికేళ్ళ కుర్రాడు ముందుకొచ్చాడు. అక్కడేదో గొడవ జరగబోతోందని ఊహించిన వరాలు నన్ను చేయి పట్టుకొని దూరంగా లాక్కుపోయింది. " ఒరేయి! వీడు మన ఎగస్పార్టీ హీరో దందాగిరి అభిమానిలా ఉన్నాడు. మన హీరోని తిడుతున్నాడ్రోయి!" అని అరవగానే విఘ్నపతి అభిమానులంతా వాడిపై దాడి చేశారు. వెంటనే దందాగిరి అభిమానులు ఎక్కడనుంచో వచ్చి విఘ్నపతి మనుషులపై పడ్డారు. జరిగిందేమిటో అర్ధంగాని హీరో, మిగిలిన సినిమా వాళ్ళు పోలీసుల సాయంతో అయిదు నిమిషాల్లో ఆ ప్రాంతంనుంచి తమ వాహనాల్లో పారిపోయారు.కొద్దిక్షణాల్లో రాళ్ళు గాలిలో స్వైరవిహారం చేయసాగాయి. చిత్రయూనిట్లో కారుల్లేని సన్నకారు సిబ్బంది రాళ్ళదాడికి గాయపడి నెత్తురోడుతున్నారు. పసిపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ళవరకూ మాలాంటి వాళ్ళవెంటపడి చివాట్లు తింటూ వసూలు చేసిన డబ్బులతో ఏర్పాటైన మంటపంలో, ఉదయ్ాన్నే పూలతో పూజలందిన వినాయక విగ్రహం సినీ అభిమానుల రాళ్ళదాడికి ముక్కలుగా రాలిపోతుంటే చూట్టానికే బాధ అనిపించింది. "తిన్నగా షూటింగ్ చూడక వాణ్ణి కధ ఎందుకు అడిగారు?" అడుగుతున్న వరాలి నోరు నొక్కేశాను. "పోలీసులు నీ మాట వింటే యీ గొడవకి నేనే కారణమని మూసేస్తారు. ఆ కుర్రాడెవడో వాళ్ళ హీరోని తిట్టాడని గొడవ మొదలయింది" ఇంతలో పోలీసులు తరుముతున్న జనం మా వైపు రావటంతో బండెక్కి ఆ ప్రాంతం నుంచి ఉడాయించాం.. ఆ ఊళ్ళో తూర్పుప్రాంతమంతా అరగంటలో యీ సంఘటన పాకిపోయి గొడవ కావచ్చునన్న భావనతో పడమరప్రాంతంలో మంటపాలని చూద్దామని అటు వెళ్ళాం. అక్కడ ఒక మంటపానికి "ప్రజాబంధు, వరప్రదాత, సాంస్కృతికశాఖామాత్యులు గజాననరావు గారికి స్వాగతం" అన్న బానర్ ఉంది. సరె! ఆయనతో మనకి పనేమిటని విగ్రహదర్శనం చేసుకోవటానికి లోనికెళ్ళబోతుంటే పోలీసులు ఆపేశారు. "బాబూ! రెండు నిమిషాలు! దేవుడికి దండం పెట్టుకు వెళ్ళిపోతాం" అడిగిన వరాల్ని ఆపేశాడతను. " మంత్రిగారు వస్తారమ్మా! భద్రతాకారణాల వల్ల ఎవరినీ లోపలకి వదలటం లేదు" అన్నాడతను. "ఇది గుడి కాదయ్యా! వి.ఐ.పి.ల కోసం ఆపటానికి" కోపంగా చెప్పింది. " అమ్మా! నేను పోలీసోణ్ణి మాత్రమే! గజాననరావుగారు చండశాసనుడు. మీరు లోపలుండగా వచ్చారంటే నా ఉద్యోగం పోతుంది" ఆ మాటలకి అక్కడ ఉన్న జనం రోడ్డుపైనుంచే గణపతికి చేతులు జోడించి వెళ్ళిపోతున్నారు. వరాలు అలాగే చేసి పోదామంటే కొద్దిక్షణాలు ఆగుదామని ఆపేశాను. ఎక్కువ సమయం కాకుండానే మంత్రిగారు వచ్చి తిన్నగా విగ్రహం దగ్గరకి వెళ్ళాడు. ఆయన కారును అనుసరించి మరో పదికార్లలో వచ్చిన జనం "గజాననరావుగారూ జిందాబాద్" అని నినాదాలు చేస్తూ ఆయన్ని అనుసరించారు. ఆరోజు కోసం అక్కడ పూజకి నియోగించిన పురోహితుడు మంత్రిగారికి, అనుచరగణానికి దేవుడి తీర్ధం యిస్తూండగా, అతనిసహాయకుడిగా ఉన్న పదేళ్ళ కుర్రాడు జరుగుతున్న అనర్ధాన్ని గమనించాడు. "దేవుడి ముందుకి వచ్చేటప్పుడు బూట్లు విప్పాలి సారూ!" అని గజాననరావుతో అన్నాడు. వెంటనే ఆ కుర్రాడి చెంప పేలిపోయింది. "ఎవడ్రా నువ్వు? సాంస్కృతిక శాఖా మంత్రిని. నా రాజకీయజీవితమంత వయసు లేదు నీకు. నువ్వు నాకు పద్ధతులు నేర్పుతావా?"అని రంకెలు వేయసాగాడు. వెంటనే అతని అనుచరగణం ఆ కుర్రాడిపై దాడి చేయబోయారు. అక్కడున్న పూజారి ఆ కుర్రాడికి అడ్డం వచ్చి"ఏదో కుర్రాడు తెలియక చెప్పాడు. వదిలేయండి" అని వణికిపోతూ చేతులు జోడించాడు. " నీ కొడుకా? కొంచెం పద్ధతులు నేర్పు. ఆ మట్టిబొమ్మను గౌరవించటం కాదు. మాలాంటి రాజకీయనాయకులను ఎలా గౌరవించాలో నేర్పు" అని అరుస్తున్నాడు. ఆ హడావిడికి ఆమంటపం నిర్వాహక కమిటీ మెంబరు పరుగున వచ్చాడు. "చూడు. ఊరి నడిబొడ్డులో ఉన్న యీ ప్రాంతంలో మంటపం పెడితే నీకు లాభమని కాళ్ళావేళ్ళాపడితే , పెద్దాయనతో చెప్పి అనుమతి యిప్పించాను. ఆ గౌరవం లేకుండా, నాకే పాఠాలు చెప్పే యీ కుర్రనాయాల్ని పెడతావా? వీడు నా ప్రత్యర్ధి మూషికరావు అభిమానిలా ఉన్నాడు. వీణ్ణి వెంటనే పంపేయి. కాదన్నావా? తెల్లారేసరికి యీ మంటపాన్ని యిక్కడనుంచి లేపేస్తాను. పురాతన దేవాలయాలే లేపేసినవాణ్ణి. మంటపం లేపటం పెద్దపనేం కాదు. జాగ్రత్త!" అని హెచ్చరించి ఆవేశంగా కారువైపు నడిపాడు. మంత్రిగారి ధాష్టీకాన్ని ప్రజలు కళ్ళారా చూస్తూండగా "గజాననరావు జిందాబాద్" అన్న నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మంత్రిగారి దయ లేకపోతే నవరాత్రులూ తానక్కడ నిలబడలేనని గ్రహించిన వినాయక విగ్రహం నివ్వెరపోయి చూస్తోంది. ఆ దారుణాన్ని జీర్ణించుకోలేని వరాలు నా చేయి పట్టుకొని అక్కడనుంచి లాక్కుపోయింది. ఆమె కోరికపై మంటపాలను మానేసి మాకు తెలిసిన వారి యింట్లో దేవుణ్ణి చూద్దామని వెళ్ళాం గుమ్మంలో నిలబడిన దంపతులిద్దరూ మా జంటను సాదరంగా యింట్లోకి తీసుకెళ్ళారు. అప్పటికే వాళ్ళ హాలు నిండా కిక్కిరిసిన జనం. అక్కడ ఎత్తైన పీఠంపై వినాయక విగ్రహం బదులు ఒక గడ్డం స్వామి కూర్చుని ఉన్నాడు. వచ్చిన జనాలంతా స్వామి కాళ్ళకి నమస్కరించి తమ బాధలు చెప్పుకొంటున్నారు. ఆయన కళ్ళు మూసుకొని ఏదో గొణుగుతున్నాడు. తరువాత మూసిన పిడికిలి తెరచి చేతిలోని భస్మాన్ని వాళ్ళ చేతిలో పోసి కానుకలు స్వీకరిస్తున్నాడు. "స్వామీ! ఈమె నా స్నేహితురాలు, ఆమె భర్త. మిమ్మల్ని చూడాలని వచ్చారు" పరిచయం చేసిందామె. అన్యమనస్కంగా ప్రజలందరూ చేస్తున్నట్లే అతని కాళ్ళకు నమస్కరించాను. వరాలు నిలబడే రెండు చేతులూ జోడిస్తూంటే తెల్లబోయి చూశాడతను. " చెప్పమ్మా! మీ కోరికలేమిటి?" " లేదండీ! మీరొచ్చారని తెలిసి చూడ్డానికొచ్చాను. నాకు పెద్దగా కోరికల్లేవండి! భగవంతుడు యిచ్చిన దానితో సంతృప్తిపడతాను. నాకిది చాలు" నిర్మొహమాటంగా చెప్పింది వరాలు . కొద్ది క్షణాలాగి యిద్దరం ఆ హాలునుంచి బయటపడ్డాం. వరాలి ప్రవర్తన సుజనను బాధించినట్లుంది. " ఏమే! ఈరోజు యింట్లో వినాయకుడికి పూజ చేయలేదా?" అడుగుతున్న వరాల్ని అదోలా చూసింది. "గణపతికి అపరావతారం గజముఖానందస్వాములు గారే యింట్లో ఉండగా, ఆ మట్టిబొమ్మకు పూజ చేయకపోతేనేమిటే? నువ్వు పిల్లల గురించి అడుగుతావేమో అనుకున్నా! చాలా మహిమగల స్వామీ!" చేతులు జోడిస్తూ అందామె. "మావారు అంతకన్నా మహిమగలవారు. కాకపోతే కొన్నాళ్ళు పిల్లలు వద్దనుకొన్నాం" అని వరాలు చెబుతూంటే ఆమె ముఖం వివర్ణమైంది. ఆ దంపతులవద్ద సెలవు తీసుకొని యింటిదారి పట్టాం.
"అందరూ కాళ్ళకి దండం పెడుతూంటే నువ్వలా చేశావేమిటి?" బండిమీద యింటికొస్తూ అడిగాను. "చూడండి. నా నమ్మకాలు నావి. మన చేతిలో వ్రాసినట్లు జరుగుతుందంటారని నమ్మేదాన్ని. ఆ వ్రాత ఏ స్వామీజీకో విన్నవించుకుంటే బ్రహ్మగారు వ్రాసినది మారిపోతుందా? అలా మారిపోతే ఆయన బ్రహ్మే కాదు. ప్రతీ మనిషిలో దేవుడు ఉన్నాడంటారు కద! మరి నేనొక మనిషి కాళ్ళకి మొక్కితే నాలో దేవుణ్ణి అవమానించినట్లేగా! అందుకే ఆయన కాళ్ళమీద పడలేదు. నేను పల్లెటూళ్ళో పెరిగిన ఆడదాన్ని. నాకు మన పెద్దలు చెప్పిన సంప్రదాయాల్లో శాస్త్రీయదృక్పధం ఉంది అని నమ్మేదాన్ని. కాలగతిలో వచ్చే మార్పుల కనుగుణంగా మారే మనస్తత్వం కాదు నాది. ఈ లోకం నాలాగే ఉందనుకొన్నాను యిన్నాళ్ళు. కానీ ఒక సినిమా నటుడు, రాజకీయనాయకుడు, స్వామీజీ మాడర్న్ దేవతలుగా యీ సంఘాన్ని శాసిస్తున్నారని యీ రోజే తెలుసుకొన్నాను. నేను నమ్మిన దేవుడు యీ ఆధునిక దేవుళ్ళ చేతిలో పరాభవాల పాలవుతూంటే తట్టుకోలేకపోతున్నాను" ఆమె గద్గదస్వరాన్ని బట్టి బాధపడుతోందని గ్రహించాను. ఇంటికెళ్ళగానే వరాలు స్నానం చేసి మా యింట్లో పూజ చేసిన గణపతి ముందు దీపం వెలిగించి ధ్యానంలో కూర్చుంది. ఆమెను కొద్దిక్షణాలు కదపకూడదని వాలుకుర్చీలో వాలి కళ్ళుమూసుకొన్నాను. సంఘం చేసిన అవమానాలకి బాధపడే గణపతిని ఓదారుస్తున్న పార్వతి రూపంలో వరాలు కనిపించింది.

No comments:

Post a Comment

Pages