నాకు నచ్చిన కథ--గుసగుస పెళ్లి--శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ--గుసగుస పెళ్లి--శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు

Share This

నాకు నచ్చిన కథ--గుసగుస పెళ్లి--శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు

టీవీయస్.శాస్త్రి


భమిడిపాటి కామేశ్వరరావు (ఏప్రిల్ 28, 1897 - ఆగష్టు 28, 1958) ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త.
​వీరికి ​హాస్యబ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు.ఎక్కువ కాలం నివాసమున్నది రాజమండ్రిలో. హై స్కూల్ హెడ్ మాస్టర్ గా చాలా కాలం పనిచేశారు.
బెత్తం పట్టుకొని కథలను నడిపిన శిక్షకుడు ఈయన.హాస్యం పండించటంలో ఈయన పెద్ద మోతుబరి రైతు.కథలు, నాటికలు వ్యాసాలు ఎన్నో హాస్యం మరియూ వ్యంగ్యంగా రచించిన నవ్వుల పున్నమి కాముడు ఈయన. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్యబ్రహ్మ అని కొనియాడారు. త్యాగరాజు రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ 'త్యాగరాజు ఆత్మ విచారం' రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన 'చంద్రగుప్త'లో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.భమిడిపాటి కామేశ్వరరావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.
​ ​ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడ హాస్య ప్రధానమైనపట్టికీ వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.ఈ 'గుసగుస పెళ్లి
​'​ కథను శ్రీ కామేశ్వరరావు గారు 1930 లో వ్రాశారు. శ్రీ భమిడిపాటి  రాధాకృష్ణ గారు వీరి కుమారుడే!శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు 'పండితపుత్రుడు'.ఇందులో శ్లేష
​ఏమీ లేదు.తండ్రికి తగ్గ తనయుడు.వీరు హాస్యంతో పాటు నవరసాలు  పండించిన మేటి రచయిత. ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన శ్రీ కామేశ్వర రావు గారు  1958 ఆగష్టు 28న మరణించారు.శ్రీ రాధాకృష్ణ గారు కూడా గతించి మూడు సంవత్సరములు కావస్తున్నది.తండ్రీ కొడుకులకు నివాళి సమర్పించుకుంటూ ఇక శ్రీ కామేశ్వర రావు గారి గుసగుస పెళ్లి  కథలోకి వెళ్లుదాం.
******
అవి బ్రిటిష్ కాలం నాటి రోజులు.అసలే కరువు.పైగా యుద్ధ కాలం.ప్రభుత్వానికి తెలియకుండా ఏగాని కూడా ఖర్చు పెట్టటానికి వీల్లేదు .ఒక వేళ ఖర్చు పెట్టితే ​ వారు అడిగే లెక్కలకు మనం నోరు వెళ్లబెట్టాల్సిందే.పెళ్ళిళ్ళు కూడా గుట్టుగా జరుపుకునే రోజులవి.సాధారణంగా పెళ్ళంటే ఎంత హడావుడి ఉంటంది?
​ఉన్నబంధువులందరూ రావటం, వావి వరసలను బట్టి ​ఛలోక్తులు ​వేసుకోవటం, నవ్వులు,రుసరుసలు,బుసబుసలు ,పసిపిల్లల ఏడ్పులు,ఆడవాళ్ళ మూతి విరుపులు,మర్యాదలలో లోపాలను ఎత్తి చూపటం,ఏదో ఒక వంక పెట్టుకొని తగాదాలు పడటం,జుట్టూ జుట్టూపట్టు కోవటం---అదీ పెళ్ళంటే!నాలుగు కాలాలపాటు అందరికీ గుర్తుండి పోతాయి అటువంటి పెళ్ళిళ్ళు.
కానీ ప్రస్తుతపు కరువు మరియూ యుద్ధ పరిస్థితుల వల్ల అటువంటి 'పెళ్లి సందడులు' తగ్గాయి. తగ్గాయి గానీ అసలు జరపకుండా ​ఎలా మానుకుంటారు.ఏదో ఒక రకంగా గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా పెళ్ళిళ్ళు చేసేవారు.వాటినే గుసగుస పెళ్ళిళ్ళు అనేవారు ఆరోజుల్లో.సంబంధం గురించి మాట్లాడుకోవటం దగ్గరనుంచి అంతా హడావుడే ! మరేదో ​ఊరి మునసబు గారి దొడ్లో గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి  పెళ్లిచేసి, అయిందంటే అయింది అనిపించేవారు.తెల్లవారేసరికి ఎటువాళ్ళు అటు ​ఉడాయించేవారు.
​ ​పురోహితులకు చచ్చేంత భయం.ఏ పోలీసోడు చూస్తే ఏమౌతుందోనని! కానీ ​ పొట్టకోసం కష్ట పడక తప్పదు కదా!వీళ్ళు కూడా గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేయించి 'చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం' అనుకొని ఎంత ఇస్తే అంతే పుచ్చుకొని వచ్చేవారు.కరువు రోజులుకదా!అందరికీ డబ్బులకి ఇబ్బంది. ​ఎవరి వద్దా డబ్బు మెసలటం లేదు.పైగా పెళ్ళిళ్ళ సీజన్.కుంభయ్యశాస్త్రి గారి తండ్రి పేరిశాస్త్రి గారు అందుకే ఒకే ముహూర్తానికి నాలుగు పెళ్ళిళ్ళు చేయించటానికి ఒప్పేసుకున్నాడు.అనుభవజ్ఞుడు కనుక మూడు పెళ్ళిళ్ళు తాను ఒంటి చేత్తో లాగిస్తానన్నాడు. మిగిలినది మాత్రం కుంభయ్యశాస్త్రి చేయించాలని పురమాయించాడు.కుంభయ్య శాస్త్రికి గణపతి పూజ చేయించటమే రాదు.పెళ్లి
​ఎలా చేయిస్తాడు?తండ్రి మాట ఆంటే గౌరవం కన్నా భయం.సరే గుండె చిక్కపట్టుకొని పెళ్లి చేయించటానికి పొరుగూరికి రైల్లో వెళ్ళాడు.స్టేషన్ లో దిగగానే ​ఎవరో దుప్పటికప్పి క్షణంలో ఆ ​ఊరి పెద్ద దొరగారి దొడ్లో వదిలి వెళ్ళిపోయారు.చిమ్మ చీకటి,కన్ను పొడుచుకున్నా​ఏమీ కనపడటంలేదు.ఇంతలో మెల్లగా ఒక బండి వచ్చి ఆగింది.ఆ బండిలోనుంచి ఒక పిల్ల,పిల్ల తల్లితండ్రులు మరి ఇద్దరు వితంతువులు దిగారు.ఆ తరువాత కొద్ది సేపటికి మరొక బండి వచ్చి ఆగింది.
ఆ బండిలోనుంచి పిల్లవాడు,తల్లితండ్రులు మరిద్దరు దంపతులు దిగారు.ఆడపెళ్ళి వారు చాకలిని,మగ పెళ్ళివారు ఒక నౌకరిని వెంట తెచ్చుకున్నారు.ఇంక వీలైనంత త్వరగా పెళ్లి చేయించాలి.కుంభయ్య శాస్త్రి చచ్చే పిరికి వాడు.ఏ మాత్రం చప్పుడైనా పోలీసులు వస్తారని భయం.చాకలికి,నౌకరికి చెరో బూర ఇచ్చి,పోలీసులు వచ్చే ముందు వాటిని ఊదమని చెప్పాడు.వాళ్ళు బూరలు ​ఊదితే ఇతను ​ఉడాయించవచ్చు.అదీ,అతని ఆలోచన.
​ ​రాత్రి రెండున్నరకు ముహూర్తం.ఆ రోజుల్లో గడియారాలు ధనవంతుల వద్ద మాత్రమే ​ఉండేవి.ఏ ముహూర్తం అయితే ఏమి పోయింది,ఏదో ఒక విధంగా పెళ్లి చేయించి నాలుగు డబ్బులు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళటమే మంచిదని కుంభయ్య శాస్త్రి ఆలోచన.ఒక్క సారి ఆకాశం వైపు చూసి ,చుక్కలను లెక్కపెట్టి,అన్నీ తెలిసిన వాడిలాగా, ​ఇంకా రెండు జాములు ​ఉంది ముహూర్తానికి అని ఇరుపక్షాల వారికి చెప్పాడు.హడావిడి మొదలయింది.మొదట మంగళ స్నానాలు.వేడినీరు లేవు.పోనీ చన్నీళ్ళు బావిలోంచి తీసి పోద్దామా ఆంటే ,గిలక శబ్దానికి ఎవరైనా వస్తారని భయం.ఆఖరికి తడిగుడ్డతో వదూవరులకు వళ్ళు తుడిచారు.శాస్త్రం ఇందుకు ఒప్పుకోదు అని పిల్లవాడి తండ్రి  మెలికపేచి పెట్టనే పెట్టాడు.కుంభయ్యశాస్త్రికి వళ్ళు మండి,ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకొని ఏడవక,వీడికి ఈ లా పాయింట్లు ​ఎందుకు?
అనుకొని అర్ధం పర్ధంలేని ఒక కఠిన పద్యాన్ని చదివి పిల్లవాడి తండ్రిని బెదరకొట్టాడు.పిల్లవాడి తండ్రి ​ఇంకా నోరు మూసుకోలేదు.ఆ పద్యం అర్ధం చెప్పమని కుంభయ్య శాస్త్రిని అడిగాడు.కుంభయ్య శాస్త్రి తక్కువ వాడా! అతనికి అసలు విద్యలు కన్నా బిత్తర విద్యలు చాలా తెలుసు."ధర్మానికి అధర్మం వచ్చినపుడు అధర్మాన్నే ధర్మం చేసుకోవచ్చు" అని అర్ధం చెప్పి పెళ్లి కొడుకు తండ్రి నోరు మూయించగలిగాడు.ఇక్కడ ​ఇలా తగలడుతుంటే,మరో పక్క ఆడవాళ్ళ యుద్ధం మొదలైంది.మీరు తెచ్చిన పానకపు బిందెలు ఏడ్చినట్లున్నాయి అని మగపెళ్లి  వారంటే,మీరు తెచ్చిన పల్లకి ఏడ్చి ముఖంకడుక్కున్నట్లు ​ఉందని ఆడపెళ్లి వారు అన్నారు.ఇరుపక్షాలూ,వైరి పక్షాలుగా మారాయి.పెళ్ళంటే అదే మరి!అయితే ​ పెద్దగా అరచుకోవటానికి వీల్లేదు.వింటే ఎవరైనా వస్తారని భయం.
​ ​అంతా గుస గుస.నెమ్మదిగానే ఒకరినొకరు నోరుమూసుకొ​మ్మని నిశ్శబ్దంగానే వారికి చేతనైంత వరకు తిట్టుకుంటున్నారు. వాళ్ళ వంతు అయిపోయింది.ఇక పెళ్లి పెద్దలు రంగంలోకి దిగారు.ఇరు పక్షాల పెద్దలు కాసేపు'అండీ' లో తిట్టుకున్నారు,కాసేపు తరువాత'ఓయ్'లోకి దిగారు.ఈ సారి పౌరుషం పెరిగి'రా'వరకూ వచ్చారు.ఆఖరికి'బే'కు కూడా దిగజారారు.అంతటితో ఊరుకున్నారా?ఒకరి శిఖను మరొకరు పట్టుకొని యజ్నోపవీతాలను తెంచుకున్నారు.ఈ తంతు అంతా గుసగుస గానే! కుంభయ్య శాస్త్రి హడావుడిగా వధూవరులను కూచోపెట్టి ప్రవర చెప్పి పెళ్లి పూర్తి చేసి పోదామని  హడావుడి పడుతున్నాడు.తీరా చూసే సరికి వధూవరుల ఇద్దరి గోత్రాలు ఒకటే అయ్యాయి.
పెళ్లి పెద్దలు కట్నాలు,లాంఛనాలు అన్నీ మాట్లాడుకున్నారు గాని గోత్రాల సంగతి మాత్రం మాట్లాడుకోవటం మరచిపోయారు.ఎంత గుసగుస పెళ్లి అయినప్పటికీ ఒకే గోత్రీకులకు పెళ్లి చేయించటానికి కుంభయ్య శాస్త్రి మనసు అంగీకరించటం లేదు.కుంభయ్య శాస్త్రి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యాడు.నా కట్నం డబ్బులు నాకు మొత్తం తిరిగి వచ్చేవరకూ ఎవరూ కదలటానికి వీల్లేదు అని ఆడపిల్ల తండ్రి పందిరిగుంజ ఒకటి పీకి నిలుచున్నాడు.ఆ ఊపుకి పందిరికి ​ఉన్న లాంతరులోంచి మంట వచ్చి పందిరిని అంటు​కుంది.
గుసగుస కాస్తా గసగసగా,గలభాగా,గలాటగా మారింది.కుంభయ్య శాస్త్రి చేయించవలసిన  పెళ్లి కాస్తా పెటాకులయ్యింది. ఈ నాటికీ నూతనంగా ​ఉన్న ఈ కథను అందించిన శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారికి ఘనమైన నివాళి సమర్పించుకుందాం!
 ****

No comments:

Post a Comment

Pages