రణధీరుడు (పెద్దకధ – 3వ భాగం ) - అచ్చంగా తెలుగు

రణధీరుడు (పెద్దకధ – 3వ భాగం )

Share This

రణధీరుడు (పెద్దకధ – 3వ భాగం )

-అక్కిరాజు ప్రసాద్

 

శూరసేనుడు సభను వారికి ఏమి శిక్ష విధించవలసింది అని కోరాడు. సభ ఏకగ్రీవంగా మరణ శిక్ష అని పలికింది. సభ ఆమోదంతో వీరిని గంగానది ఒడ్డున భీకరమైన పులులు సింహాలు ఉండే ప్రాంతంలో విడిచి పెడతారు. మరునాడు అక్కడ ఇద్దరి మృతకళేబరాలను చూసి వారిని ఆ మృగాలు భక్షించాయని విదర్భ ప్రజలు సంతోషించారు.
ఆ ఉగ్రసేనుడు ప్రభావతి దంపతులను ఇక్కడ సజీవంగా చూసిన విక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చి వెనుదిరిగిపోయే సమయంలో అతని ఖడ్గం తాకి అక్కడి ఘంట మ్రోగింది. వెంటనే ఒక్క ఉదుటున ఉగ్రసేనుడి అనుచరులు విక్రమసేనుడిని బంధించారు. ఆ ప్రాంగణంలో ఉన్న భూగర్భ చెరసాలలో అతనిని బంధించారు.
బిందుమాలిని భువనేశ్వరీమాత అర్చనకై పూలసెజ్జతో, చెలికత్తెలతో కలసి మందిరానికి బయలుదేరింది. ఆ అమ్మను రణధీరుని తనకు భర్తగా చేయుమని ప్రార్థించింది. ఆమె మొరలను అమ్మ ఆలకించి అనుగ్రహించిన రీతిలో తల్లి మెడనుండి పుష్పహారం జారి బిందుమాలిని చేతులపై పడింది. యువరాణి ఎంతో సంతోషించి ఉద్యానవనానికి బయలుదేరింది. రణధీరుడు అక్కడ ఆమె కోసం వేచి ఉన్నాడు. అతనిని చూసి సిగ్గుతో తలదించుకుంది. అతడు ఆమెను సమీపించి తన మనోభీష్టాన్ని తెలిపాడు. తన మనసులోని మాట అతడే చెప్పగా విని పరవశురాలైంది బిందుమాలిని. రణధీరుడు బిందుమాలినితో "నేను రాచరికపు వంశాలకు చెందిన వాడిని కాను. మరి ప్రభువులు మన వివాహానికి అంగీకరిస్తారా". నా మాటను మహారాజు కాదరని నా నమ్మకం అని సమాధానం చెబుతుంది బిందుమాలిని. శరదృతువులోని చంద్రుడు, వెన్నెలలా కలిసిపోయారు ఆ జంట.
అక్కడ విదర్భరాజు శ్రీకంఠభూపతి, రాణి దేవసేన వ్యాహ్యాళికై గంగానదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు. దేవసేన పతితో "ప్రభూ! మన బిందుమాలిని యుక్తవయస్కురాలైంది. ఆడపిల్ల అయినా సకల విద్యలను నేర్పించి వీర వనితగా తీర్చి దిద్దారు. అలాగే వివాహం గురించి కూడా ఆలోచించండి" అని పలికింది. శ్రీకంఠభూపతి అంగీకరించి "దేవసేనా! వెంటనే అమ్మాయి వివాహానికై స్వయంవరం ప్రకటిస్తాను" అని ఆమెకు తెలిపాడు.
మర్నాడు సభలో బిందుమాలిని స్వయంవరాన్ని ప్రకటించాడు శ్రీకంఠ భూపాలుడు. మగధ రాజుతో పాటు భరతభూమిలో ఉన్న అన్ని రాజ్యాల పాలకులకు ఆహ్వానాలను పంపాడు. బిందుమాలినికి విషయం తెలిసింది. పరుగు పరుగున మహారాణి మందిరానికి వెళ్లింది. "అమ్మా! నీతో ఒక విషయం చెప్పాలి. నేను రణధీరుడు అనే యువకుడిని ప్రేమించాను. అతడు మన రాజ్యంలో ప్రసిద్ధి చెందిన గురువులు శివానంద సరస్వతి వద్ద పెరిగాడు. తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ, మహావీరుడు, బలసంపన్నుడు, ప్రేమానురాగాలు పంచే సహృదయుడు" అని తన ప్రేమగాథను వివరించింది. దేవసేన భయపడింది. ఒక పక్క మహారాజు గారు నెలరోజులలో స్వయంవరం అని ప్రకటించారు. ఇప్పుడేమి చేయాలి అని మథనపడసాగింది. "నేను సమయం చూసి మహారాజుతో మాట్లాడతాను" అని బిందుమాలినితో చెప్పింది.
మగధరాజ గురువు శంకరభట్టు చెప్పిన రెండువారాల గడువు దాటిపోతున్నది. ఆరోజు అమావాస్య. అష్టగ్రహ కూటమి. శూరసేనుడి ఎడమ కన్ను అదురుతోంది. రాణీ జగన్మోహినికి నిద్ర పట్టడం లేదు. కోట సమీపాన నక్కల అరుపులు శునకాల ఏడుపులు. జగన్మోహిని మనసులో భయాందోళనలు. కారాగారంలో ఉగ్రసేనుని అనుచరులు విక్రమసేనుని హింసిస్తున్నారు. ఉగ్రసేనుడు, ప్రభావతీదేవి అక్కడికి వచ్చి విక్రమసేనుని వివరాలు తెలుపవలసిందిగా అతనిని హింసించాడు. సమాధానం రాలేదు. అతనిని చీకటి గుహలో పడవేసి ఇనుప గుళ్లతో బాదించాడు. చివరకు తానే స్వయంగా అతనిని ప్రశ్నించాడు. సమాధానం రాలేదు. స్పృహతప్పి పడిపోయాడు విక్రమసేనుడు. ఆ సమయంలో అతని భుజంపై గల పచ్చబొట్టు చూశాడు. ఆతనిని శూరసేనుని కుమారునిగా గుర్తించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని సంతోషించాడు. అతనిని శిరచ్ఛేదం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.
ఉగ్రసేనుడు చూస్తుండగా విక్రమసేనుని ఆ ప్రాంగణంలోనే వధించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చీకటి అమావాస్య ఘడియలు దాటబోతున్నాయి. విక్రమసేనుడు గంభీర వదనంతో స్పృహవచ్చి కలియజూశాడు. భువనేశ్వరీ మాతను తలచుకున్నాడు. సిద్ధలింగేశ్వరుని మౌనంగా బిల్వాష్టకంతో ప్రార్థించాడు. ఆకాశం కన్నీటితో పెల్లుబుకింది. విదర్భ, మగధ ప్రాంతాలలో కుంభవృష్టి కురిసి ప్రశాంతత వెలియసాగింది.  విక్రమసేనుని వధించాలన్న నిర్ణయం వార్త శివానంద సరస్వతి వద్దకు చేరింది. ఆయన రణధీరుడిని కొంతమంది సహచరులతో ఉగ్రసేనుని ప్రాంగణం వైపు పంపి తాను భువనేశ్వరిని ధ్యానంలో కొలువ సాగాడు. అక్కడ మగధలో శంకరభట్టు సిద్ధలింగేశ్వరునికి తదేక దీక్షతో అభిషేకం చేస్తున్నాడు. శూరసేనుడు, జగన్మోహినీదేవి ఘంటానాదం చేస్తున్నారు.
రణధీరుడు-బిందుమాలిని వీరులైన ఒక 50 మంది యువకులతో ఉగ్రసేనుని ప్రాంగణాన్ని ముట్టడించారు. సవ్యసాచి మరల జన్మించాడా అన్న రీతిలో రణధీరుడు కత్తి డాలుతో అక్కడి వారిని ఎదిరించాడు. మెరుపులా కత్తిని ఝుళిపిస్తూ ఒక్కొక్కరినీ చీల్చి చెండాడుతున్నాడు. ఇంతలో ఒక బలిష్టమైన తిరుగుబాటుదారుడు రణధీరుని వెనుకనుండి పొడవబోయాడు. చిరుతలా అక్కడికి దూకి తన కరవాలంతో అతని శిరస్సుని ఛేదించింది బిందుమాలిని. ఆమె పరాక్రమం, సమయస్పూర్తి చూసి అభినందించాడు రణధీరుడు. ఎంతో పరాక్రమవంతులైన తిరుగుబాటుదార్లపై ఆ జంట విరుచుకుపడ్డారు. ఒకరు కరవాలంతో, శూలాలతో, మరొకరు బాణాలతో, చురకత్తులతో తిరుగుబాటు దారులను హతమార్చారు. ఉగ్రసేనుడు తన ముఖ్యానుచరులైన వీరమల్లు, జయమల్లులను వారిపై దాడి చేయవలసిందిగా అజ్ఞాపించాడు. రణధీరుడు వీరమల్లు భీకరమైన పోరాటం చేశరు. ఆయుధాలతో గెలువలేకపోగా మల్లయుద్ధానికి దిగారు. ఒకరినొకరు కలియబెడుతూ, ముష్టిఘాతాలతో, కాళ్లతో ప్రహారం చేస్తూ దాడిచేసుకున్నారు. చాలా సమయం గడిచిన తరువాత రణధీరుని పిడిగుద్దులకు వీరమల్లుడు నేలకూలాడు. అతని హృదయంపై నిలిచి అప్రతిహతంగా అతన్ని గాయపరచి చివరకు కరవాలంతో హతమార్చాడు. విజయమల్లు బిందుమాలినితో కత్తియుద్ధానికి దిగాడు. వర్ణనకు అలవి కాని వేగంతో మలుపులు తిరుగుతూ ఒకరినొకరు గాయపరచుకునే ప్రయత్నం చేశారు. ఎంతో సమయం గడవకముందే బిందుమాలిని వేగానికి విజయమల్లుడు తలవంచాడు. ఒక్క ఉదుటున అతని హృదయంలో చురకత్తిని దించి బిందుమాలిని అతనిని హతమార్చింది. రణధీరుడు-బిందుమాలిని క్షణంలో విక్రమసేనుని విడిపించారు. విక్రమసేనుడు-రణధీరుడు కలసి ఉగ్రసేనుడిపై దాడిచేశారు. వయసు మీరినా, ఉగ్రసేనుడు అతిబలుడు. మదించిన సింహంలా వారిరువురిపై దాడి చేశాడు. ఒక చేత పొడవైన కరవాలం, ఇంకొక చేత ఇనుప గుండు పట్టి ఇద్దరిపై ఒకేసారి ప్రహారం చేశాడు.  అతని దెబ్బకు విక్రమసింహుడు గాయపడ్డాడు. బిందుమాలిని వెంటనే అతనిని శివానంద సరస్వతి ఆశ్రమానికి చేర్చింది. అక్కడ అతని గాయలకు చికిత్స జరుగుతుండగా, రణధీరుడు విజృంభించి ఉగ్రసేనుని ఎదిరించాడు. ఎగిరి దూకి అతనిని గాయపరచాడు. రక్తం స్రవిస్తున్న చేతిని లెక్కచేయక ఉగ్రసేనుడు హుంకారంతో మరల అతనిపై దాడిచేయబోతాడు. తప్పించుకొని రణధీరుడు మెరుపువేగంతో మూడు మార్లు గాలిలో ఎగురుతూ తిరిగి అతని వక్షస్థలంపై దాడి చేశాడు. కిందపడిన ఉగ్రసేనుని ఊపిరి పీల్చుకోనీకుండా వెంట వెంట గాయపరచి అతనిని అస్త్రవిహీనుడిని, శక్తివిహీనుడిని చేశాడు. అతనిని చంపబోతుండగా శివానంద సరస్వతి వచ్చి వారించాడు. "రణధీరా! ఈతని ద్వారా మనకు ముఖ్యమైన సమాచారం తెలియాలి. చంపవద్దు. ఈతనిని ఏమిచేయాలో నిర్ణయించవలసింది శూరసేన మహారాజు" అని పలికాడు. గురువుల ఆజ్ఞతో ఉగ్రసేనుని బంధించాడు రణధీరుడు.
శివానంద సరస్వతి ఉగ్రసేనుని వద్దకు వెళ్లి "ఉగ్రసేనా! నీద్వారా తెలియ వలసిన విషయం ఒకటి ఉంది. దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల కృతం నాకు కాశీలో గంగానది ఒడ్డున ఈ రణధీరుడు దొరికాడు. అతని భుజంపై ఉన్న పచ్చబొట్టును చూశాను. అదే పచ్చబొట్టు ఇటీవల విక్రమసేనుని భుజంపై కూడా చూశాను. ఈ రణధీరుడు ఎవరు?". ఈ విషయం తెలుసుకున్న ఉగ్రసేనుడు నివ్వెరపోయాడు. ప్రక్కనే రోదిస్తున్న ప్రభావతీదేవి కూడా దిగ్భ్రాంతురాలయ్యింది.
వారికి తాము చేసిన పాపం గుర్తుకు వచ్చింది. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఒక శుభసమయాన జగన్మోహిని శూరసేనునితో సిగ్గుతో "ప్రభూ! మీరు తండ్రి కాబోతున్నారు" అని పలికింది. ఆ వార్త విని శూరసేనుడు ఎంతో సంతోషించాడు. వెంటనే రాజపురోహితునికి, మహామంత్రికి ఈ విషయాన్ని తెలియజేశాడు. అందరూ సంతోషించారు. మహామంత్రి చతురబుద్ధి మాత్రం రాజు చెవిలో రహస్యంగా "ప్రభూ! ఈ విషయాన్ని వీలైనంత కాలం గోప్యంగా ఉంచండి. బిడ్డ తల్లి క్షేమం మనకు ఎంతో ముఖ్యం" అని హితవు పలికాడు. ఆ మాట దాగలేదు. ఉగ్రసేనుడు-ప్రభావతీ దేవి చెవులబడింది. శూరసేనునికి వారసుడు జన్మిస్తే తనకు రాజ్యాధికారం రాదన్న క్రోధంలో రగిలిపోయాడు. చూస్తుండగానే వసంత ఋతువు, పంచమి తిథినాడు జగన్మోహిని పండంటి మగబిడ్డను ప్రసవించింది. వార్త రాజుగారికి తెలియకముందే, రాణి ప్రసవవేదన నుండి కనులు తెరువకముందే ఉగ్రసేనుడు-ప్రభావతి కుట్రపన్ని ఆ బిడ్డను గంగానదిలో పారవేశారు. ఆ బిడ్డే ఈ రణధీరుడు.
విషయం తెలుసుకొన్న శివానంద సరస్వతి, విక్రమసేనుడు, రణధీరుడు ఎంతో సంతోషించారు. విక్రమసేనుడు అన్నకు ప్రణమిల్లాడు. రణధీరుడు అతనిని హృదయానికి హత్తుకొని తనకు తల్లిదండ్రులు ఉన్నారన్న ఆనందంలో పొంగిపొయాడు. అతని కనుల వెంట ఆనందబాష్పాలు రాలాయి. శివానంద సరస్వతి అతనితో "నాయనా రణధీరా! నేటికి నా బాధ్యత నెరవేరింది. వెంటనే బయలుదేరి వెళ్లి శూరసేన మహారాజును కలువు" అని ఆశీర్వదించాడు. శంకరభట్టు ఉపాసన, శూరసేనుని ప్రార్థన, శివానంద సరస్వతి ధ్యానం ఫలించాయి.
విక్రమసింహుడు విజయుడై శత్రువుని బంధించి వస్తున్నాడన్న వార్త ప్రాగ్జ్యోతిషపురం చేరింది. శూరసేనుడు కుమారునికి స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నాడు. "మహారాజా! ఈరోజు మీకు రెండు ఆశ్చర్యకరమైన విషయాలు తెలియబోతున్నాయి" అని విక్రమసేనుడు పలికాడు. ముందుగా ఉగ్రసేనుని, ప్రభావతిని రాజు గారి ఎదుటా నిలుపుతాడు. వారిని చూసి రాజదంపతులు నిర్ఘాంతబోయారు. "మీరు....బ్రతికే ఉన్నారా...మీరా నాపై తిరుగుబాటు చేయాలనుకున్నది.." అని గర్జించాడు శూరసేనుడు. విషయమంతా వివరించాడు విక్రమసేనుడు. తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతాడు. మహామంత్రి సలహాతో వారివురికీ యావజ్జీవా కారాగార శిక్ష విధిస్తాడు శూరసేనుడు.
"మహారాజా! మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించే రెండో విషయం" అని రణధీరుని ప్రవేశపెట్టాడు విక్రమసేనుడు. అతనిని చూసి ఎంతో ఆనందిస్తాడు శూరసేనుడు. "నాన్న గారూ! ఇతడు మీ జ్యేష్ఠ కుమారుడు కూడా" అని అన్ని వివరాలు తెలుపుతాడు విక్రమసేనుడు. ఆమాటలు విన్న రాజదంపతులు సంభ్రమాశ్చర్యానికి లోనై పరుగు పరుగున వెళ్లి రణధీరుని ఆలింగనం చేసుకున్నారు. వారికి నమస్కరించిన రణధీరుడు తన భాగ్యానికి ఎంతో ఆనందించాడు. అప్పుడు విక్రమసింహుడు, రణధీరుడు-బిందుమాలిని ప్రేమ విషయాన్ని నాడే తోటలో గమనించి, వారి వివాహానికి కృతనిశ్చయుడై ఇలా పలుకుతాడు-  "మహారాజా! మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఇంకొకటి ఉన్నది. మన రణధీరుడు విదర్భరాజ యువరాణి బిందుమాలినిని ప్రేమించాడు. ఆమె కూడ అన్నను ఆరాధిస్తున్నది. శ్రీకంఠభూపతి ఆమె వివాహనికి స్వయంవరం ప్రకటించారు. మీకు కూడా ఆహ్వానం పంపారని తెలిసంది. మీరు పరివార సమేతంగా వెళ్లి రణధీరునికి బిందుమాలినినిచ్చి వివాహం చేయవలసిందిగా, స్వయంవరాన్ని రద్దు చేయవలసిందిగా కోరండి" అని పలికాడు.
మహారాజు ఎంతో సంతోషించి సమంతం తెలుపుతాడు. కానీ, జగన్మోహినీ దేవి, మహామంత్రి చతురబుద్ధి మనసులో విదర్భ అనగానే సందేహం కలిగింది. ఇన్నేళ్ల శతృత్వం ఈ వివాహానికి అడ్డు రాగాలదేమో అని ఆలోచనలో పడ్డారు. అక్కడ దానికి కావలసిన రాయబారాన్ని శివానంద సరస్వతి శ్రీకంఠభూపతితో జరిపాడు. ఆయన విదర్భ రాజుతో "ప్రభూ! గత వైరాన్ని వీడండి. ఉగ్రసేనుడి ద్రోహం మీకు తెలిసింది కదా. రణధీరుడు సమస్త గుణ సంపన్నుడు. అతను బిందుమాలిని ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ వివాహంతో ఈ రెండు రాజ్యాల మధ్య శతృత్వం ముగిసి శాంతి నెలకొంటుంది. ఇది భరతభూమి సుస్థిరతకు ఎంతో ముఖ్యం" అని హితవు పలికాడు. దేవసేన మహారాణి వెంటనే "ప్రభూ! నా అభిప్రాయం కూడా ఇదే" అని గట్టిగా సమర్థిస్తుంది. విషయం గ్రహించిన శ్రీకంఠభూపతి స్వయంవరాన్ని రద్దు చేసి, మగధరాజ పరివారాన్ని వివాహానికి ఆహ్వానించాడు.
వారం రోజుల తరువాత, కార్తీక శుద్ధ పంచమి నాడు రణధీరుడు-బిందుమాలినిల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రెండు రాజ్యాల ప్రజల సంబరంలో తేలియాడారు. విక్రమసింహుడు ఆ వివాహానంతరం అన్నను ఒక విషయం అభ్యరించాడు. "సోదరా! నాన్న గారు మూడేళ్ల క్రిందట నన్ను తనకు ఉత్తరాధికారిగా ప్రకటించారు. కానీ మీరు నాకన్నా పెద్దవారు, అన్నివిధాల భవిష్యత్తులో మహారాజు పదవికి యోగ్యులు. కాబట్టి నా మనవిని అంగీకరించి ఉత్తరాధికారి పదవిని స్వీకరించండి" అని పలుకుతాడు. రణధీరుడు విక్రమసేనునితో "మహారాజు గారి నిర్ణయమే శిరోధార్యం" అన్నాడు. మహారాజు విక్రమసేనుని గొప్పతనానికి పొంగిపోయి అతనిని ఆలిగనం చేసుకొని "నాయనా! నీ సోదర ప్రేమ, ధర్మనిష్ఠ ఎంతో ఉత్తమమైనది. నీ వంటి పుత్రుడు కలుగటం మా సుకృతం. నీ అభీష్టం మేరకు రణధీరుడే నా తరువార మహారాజవుతాడు. అదే ధర్మబద్ధము" అని ప్రకటించాడు. ప్రజలు, సభాసదులు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. మగధరాజ్య పరివారం బిందుమాలినితో ప్రాగ్జ్యోతిషపురం చేరుకోగానే ప్రజలందరూ రణధీరునికి, బిందుమాలినికి వైభవంగా స్వాగతం పలికారు. నగరమంతా వేడుకలతో, వినోదాలతో శోభిల్లింది.
రాజపరివారమంతా సిద్ధలింగేశ్వరుని సన్నిధిలో ఆ ఏశ్వరునికి తమ కృతజ్ఞతలు తెలిపి పూజలు జరిపారు. ఈశ్వరుని అనుగ్రహంతో రాజ్యమంతా సుఖశాంతులతో వర్ధిల్లింది.
శుభం

No comments:

Post a Comment

Pages