గీతాసారం - అచ్చంగా తెలుగు

గీతాసారం

Share This

గీతాసారం

మధురిమ 


అనన్యాశ్చింతయంతోమాం యే  జనాఃపర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం
అంటూ గీతాపారాయణం చేసుకుంటున్న భ్రమరాంబగారి ఏకాగ్రతకు ఫోనుమోగడంతో  భంగంకలిగింది.
ఇదిగో "యావండీ కాస్తాఫోను చూద్దురూ..."అన్నారు  భర్త మల్లికార్జునరావుగారితో.....
"అబ్బా ఫోను నీపక్కనే ఉందికదే బ్రహ్మరం.." అన్నారేకానీ ...... ఆవిడ ఆ ఇంటికి మిస్సెస్సే కాదు ఎదురేలేని జస్టిస్సు కూడా, అందుకే వెంటనే వచ్చి ఫోనెత్తి "హలో" అనగానే...
"నేను తాతగారూ శంకరాన్ని మాట్లాడుతున్నా.. బావున్నరా తాతగారూ", అన్నాడు మనవడు శంకరం.
"నువ్వటారా శంకరం....  నాకేరా  సుబ్బరంగా ఉన్నారా...  నాయనా  నీసంగతులేంటి?" అన్నారు మనవడి గొంతువిన్న ఆనందంలో ....
"ఈరోజు బయలుదేరి మన ఊరికి వస్తున్నా తాతగారు.  పరిక్షలు అయిపోయాయి.  ఉద్యొగంలో చేరడానికి ఇంక ఓ పదిరోజులు టైముంది ,ఈలోగా  అమ్మ  మిమ్మలిని, మామ్మని  ఓసారి చూసి నాలుగురోజులుండి రమ్మంది.  నేను కూడా ఈసెలవలు మీఇద్దరితో గడపాలని అనుకుంటున్నా .. ఎందుకంటే మళ్ళా  ఉద్యోగంలో  చేరాక  అంత  సమయం దొరకకపోవచ్చు కదా తాతగారూ...." అన్నాడు  ఎంతో ఉత్సాహంతో  శంకరం.
"మంచి పని చేస్తున్నావురా నాయనా ఎందుకంటే మళ్ళీ ఉద్యోగంలో చేరిపొతే సెలవుల సమస్య టుంది కదరా...హాయిగారా ఈ పదిరోజులూ ఇక్కడే గడిపివెళుదువుగానీ.." అన్నారాయన.
"మామ్మ ఏంచేస్తొంది తాతగారూ?" నవ్వుతూ అడిగాడు శంకరం?? "మీ మామ్మా?? ఎప్పుడూ చేసే పనేరా గీతాగానం చేస్తోందిరా శంకరం", అన్నారు  వెటకారంగా .
ఈలోగా ఆయన మాట్లాడుతున్నది మనవడితోనని తెలియగానే నడవలేకపోయినా   వొంగిన నడ్డిపై చేయివేసుకుని చకచకా నడుచుకుంటూ  ఫోను దగ్గరికి వచ్చి," ఎవరూ శంకరమా మాట్లాడేది?" అని అడగగానే అవునునన్నట్లుగా తలూపారు రావుగారు.
వెంటనే "ఇలా ఇవ్వండీ"....అంటూ తొందరపడ్డారు భ్రమరాంబగారు.
"హలో శంకరం" వస్తునావటరానాన్నా .... ఎన్నళ్ళైందిరా.. నిన్నుచూసి?? ఎప్పుడో నిరుడు సంక్రాంతి పండక్కి వచ్చావు," అంటున్న మామ్మతో... "మామ్మ వస్తున్నానే రేపొద్దుటికల్లా నీ కళ్ళముందుంటానే.. అదిసరే ఏంచేస్తున్నావు నువ్వు??" అడిగాడు శంకరం..  ఏమిలేదురా "భగవద్గీత" చదువుకుంటున్నారా  అంది మామ్మ.
"ఎప్పుడూ గీతే చదువుతావుగానీ నీకింకా గీతాసారం తెలియలేదే.. మామ్మా" అన్నాడు శంకరం.ఆ మాట వినేసేరికి మామ్మగారు నుదురు చిట్లిస్తూ "ఆ.. ఆ.. నీకు తెలుసుగా వచ్చాక నాకు చెప్పుదువుగానివి తీరిగ్గా కూర్చుని వింటా.." అంది.
"అలాగేనే మామ్మా నీకు  జ్ఞానబోధ చెయ్యడానికే వస్తున్నా మరి  ఉంటానే..." అంటున్న శంకరంతో "రారా నాయనా నువ్వైనా వచ్చి నా కళ్ళు తెరిపించు", అని నవ్వుతూ ఫోను పెట్టెసింది భ్రమరాంబ.
హడావిడిగా నడ్డిపై చేయివేసుకుని వీధిగుమ్మంలోకి నడిచింది మామ్మ.. "ఒరేయ్ సుబ్బన్నా.. మీ నాన్నేడిరా?" అని ఒక్కకేక పెట్టేసేరికి పాతపేపరు చదువుకుంటున్న సుబ్బన్న ఉలిక్కిపడి పేపరులోంచి బయటికి వచ్చి "పొలంలో ఉన్నాడు" మామ్మగారు.. అంటూ  వినయంగా సమాధానం  చెప్పాడు.
 "మా మనవడు వస్తున్నాడురా, వెంటనే వెళ్ళి మీ అమ్మని నాన్నని వెంటబెట్టుకునిరా" అన్నారు.
"చిన్నబాబు వస్తున్నాడా మామ్మగారూ ...ఇదిగో ఇప్పుడే వెళుతున్నా" అంటూనే మళ్ళీ పేపరులో మునిగిపోయాడు....
"మళ్ళీ చత్తికిలబడ్డావేమిరా, లేరా సుబ్బన్నా" రెట్టించింది మామ్మ. "వాడేమో తెల్లారేసేరికి వచ్చేస్తున్నడు ,వాడి గది శుభ్రం చేయించాలా? ఇల్లంతాకడగాలా?వాడికిష్టమని కాస్త జంతికలు ,మినప సున్ని చెయ్యాలి ఇంకా చాలా పనుంది.నువ్వు వెంటనే వెళ్ళు," అంటూ వాడిని తొందరపెట్టింది మామ్మ .
పేపరు మడిచి జేబులోపెట్టి పరుగుతీసాడు సుబ్బన్న.
సుబ్బన్న పాలేరు వెంకన్నకొడుకు. రావుగారికున్న రెండెకరాల పొలాన్నీ మూడుతరాలుగా వెంకన్న  కుటుంబమే కౌలుచేస్కుంటోంది. వెంకన్న భార్య సుబ్బులు  భ్రమరాంబగారింట్లో పనిమనిషి.  తరతరాలుగా వెంకన్నకుటుంబం రావుగారి కుటుంబాన్నే నమ్ముకుని ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారు కూడా వీరిని పనివారిగా కాక సొంతమనుషుల్లా చూస్కునేవారు.
"ఇదిగో యావండీ! ముందా పేపరు పక్కన పడేయండీ.. మీరు మీ వెధవ పేపరూనూ.. చదివింది చాలు మీరు వెంటనే మిల్లుకి వెళ్ళాలి" ఆర్డరేసినట్లుగా అన్నారు మామ్మగారు.. "వెధవ పేపరంటావేంటే బ్రహ్మరం.. ప్రపంచం ఏమవుతోందో తెలియాలి కదే!" సముదాయింపుగా అన్నారాయన.
"ఆ.. ఈ వయస్సులో ప్రపంచాన్ని తెలుసుకుని మీరు నేను చేసేదేమిటి? ఆయన మాటని తోసిపడేసేరు మామ్మగారు.
"ఈ వయసులో మనం ప్రపంచాన్ని ఉద్దరించక్కర్లేదుకానీ ఇలా రండీ... " అన్నారు.
రాక తప్పదని తెలుసుకున్న రావుగారు పేపరు మూస్తూ "సుబ్బన్నని పంపిచ్చచ్చుకదే మిల్లుకీ" అనగానే," వాడిని ఇప్పుడే వాళ్ళ అమ్మని నాన్నని వెంటబెట్టుకు రమ్మన్నానండీ" అందావిడ.
"అయితేనేం?? దార్లోనే కదే మిల్లు??వాడి చేతి కిచ్చ్హి పంపలేక పొయావా??" అన్నారాయన
"మీకు వయసు మళ్ళేకొద్దీ బుద్ధి యామవుతోందండీ? వాడు ముట్టుకుంటే మడికెలా పనికొస్తుండీ??" చిరాగ్గా అన్నారావిడ.
"అలాగా ఆ మిల్లువాడేమైనా  మడికట్టుకు ఆడతాడా  పిండిని???" వెటకారంగా  నవ్వుతూ అన్నారాయన.
ఆ వెటకారానికి మండిపడ్డారావిడ  "ఆ.. ఆ.. వాడు మడికట్టుకోడనీ తెలుసు,అందుకే ఇన్నాళ్ళు నేనే ఇంట్లో విసురుకుచచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నాకా ఓపిక లేకే మిమ్మలిని బ్రతిమాలుకుంటున్నా."
"పోనీ కోడలు మొన్నొచ్చినప్పుడు నీకు మిక్సీ కొనిచ్చిందిగా ఈసారికి దాంతో పనికానీ," అన్నారాయన .
"అబ్బా మిక్సీలో బావుండదండీ" నాకు నచ్చదు.
"నీకు నచ్చదనవే.... బావుండదనకు" మళ్ళీ నవ్వారాయన.
"పోనీ ఎదో ఒకటి మీరు వెళతారా వెళ్ళరా?" విసుక్కుంటూ అన్నారావిడ.....
"అబ్బా వెళతాలేవే బ్రహ్మరం.. నిన్ను ఆ చాదస్తం ఎంతవదులుకోమన్నా వినవుకదా.."
 "అవునండీ అందరూ నాకు చేప్పేవాళ్ళే యాభై ఏళ్ళుగా మీరు, పాతికేళ్ళుగా మీ కొడుకు,కోడలు ఇప్పుడు మీ మనవడు కూడా తయారయ్యాడండీ. ఇందాకా ఫోనులో ఆ వెధవ ఏమన్నాడో తెలుసా ,నాకు గీతాసారం తెలియదుట, అదిచెప్పడానికే ఆ వెధవ వస్తున్నాడుట. రానీయండి వాడి సంగతి చెప్తాను. నాచేతుల్లో పెరిగిన వెధవ నాకే నీతులు చెప్తాడా.. గుడ్దొచ్చి పిల్లని వెక్కిరించిందంటే ఇదేమరి !"అంటూ డబ్బా  తాతగారి చేతిలో పెట్టింది బామ్మ.
"వాడు తప్పేమీ అనలేదే" అంటూ బయటకి నడుస్తున్న ఆయనకి  వెంకన్న-సుబ్బులు ఎదురొచ్చారు.
 " దండాలు బాబయ్యా" మనవడు గారు వసున్నాడట కదా బాబూ....అన్నాడు వెంకన్న.
"అవున్రా.....అందుకే మీ  అమ్మగారి హడావిడంతానూ.."అంటూ బయలుదేరారు.
 "వచ్చేవా  వెంకన్న.. మీ ఆవిడేదీ...."అడిగారు  బ్రహ్మరాంబగారు.
"నేనూ వచ్చానమ్మా" అంది సుబ్బులు. వచ్చేవే సుబ్బులు .... "ఇదిగో మేడమీద గది శుభ్రం చేసి కాస్త ఇల్లంతా కడిగిపెట్టవే.."
"అబ్బాయిగారు, కోడలుగారు కూడా వస్తున్నరా  పెద్దమ్మగారూ?" అని అడిగింది సుబ్బులు.
"లేదే.. వాళ్ళెవ్వరూ రారు. మా మనవడొక్కడేనే.   ఆ.. పార్వతీ ఈవాళ మీఇద్దరికీ ఇక్కడే భోజనం", అభిమానంగా  అన్నారు భ్రమరాంబగారు.
"ఇదిగో వెంకన్న కాస్త ఆ పెరట్లో కొబ్బరి చెట్టు బోండాలుదింపి కాస్త వొలిచి పెట్టు. అసలే వేసవి కాలం ,పిల్లాడు కాస్త చల్లగా తాగుతాడు. ఇప్పుడొచ్చి వెళితే మళ్ళా ఎప్పుడొస్తాడో వెధవ. అన్నట్టు  చెప్పడం మర్చిపోయాను మా మనవడికి పెద్ద ఉద్యోగం వచ్చిందిరా వెంకన్న..."
"చిన్నబాబు ఉద్యోగంలో చేరుతున్నరా అమ్మా?? బావుందమ్మగారు.. మంచిమాట చెప్పారు. మీరు నమ్మిన దేవుడు మిమ్మలిని సల్లగా సూస్తాడమ్మా" అంటూ పెరటివైపుకి నడిచాడు వెంకన్న.
ఇంకా సూర్య భగవానుడు కూడా పూర్తిగా రాలేదు,మనవడు వస్తున్నాడన్న ఆనందం, ఆతృత అసలు బ్రహ్మరాంబగారికి నిద్దరే రాలేదు. కోడి కూయకుండానే కాలకృత్యాలేకాదు ,పూజకూడా ముగించి,కాఫీతో సిద్ధం అయ్యారు.
అప్పుడే లేచిన మల్లికార్జునరావుగారు "బ్రహ్మరం..అప్పుడే కాఫీ వరకు వచ్చెసావే???ఇదంతా మనవడొస్తున్నాడన్నఆనందమన్నమాట,"అంటూ స్నానానికి బయలుదేరారు.
 ఇంతలో శంకరం రానే వచ్చాడు. వచ్చినవాడు సరాసరివంటింట్లోకే  చొరబడి "మామ్మా"..అంటూ మామ్మని చుట్టేసుకున్నాడు, చిన్నప్పటి శంకరంలా ....
"వచ్చేవటరా నాయనా... ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి.."అంది భ్రమరాంబ. ఇప్పుడు శంకరం ఎదురుగా ఉన్నా...ఆనందభాష్పాలవల్ల మసకబారిన కళ్ళకు మనవడు ఇంకా పూర్తిగా ఆనలేదు మామ్మకి.
"ఎంత వాడివి అయిపోయావురా ...."అన్నారావిడ మనవడిని తడువుతూ..
"అవునే మామ్మా నీకన్నా ఎంత ఎత్తు ఎదిగానో చూడు", అన్నాడు శంకరం కొంటెగా......
".అవును నాయనా అందనంత ఎత్తుకి ఎదిగావు", అంది మామ్మ కళ్ళు తుడుచుకుంటూ .....
"ప్రయాణం ఎలా జరిగిందిరా నాన్నా...??"అడిగారావిడ..
"బానే జరిగింది మామ్మా" అన్నాడు శంకరం తాత గారి గురించి అటూ ఇటూ చూస్తూ..
"అమ్మా-నాన్నా ఎలా ఉన్నార్రా?"వాళ్ళకేం ఫష్ట్ క్లాస్ గా ఉన్నారు, అంటూనే "నీ చేత్తో వేడి వేడి గా ఓ మంచి కాఫీ ఇవ్వవే మామ్మా కాస్త మైండ్ ఫ్రెష్ అవుతుంది." అన్నాడు శంకరం.
"స్నానం చెయ్యకుండా కాఫీ ఏంట్రా వెధవా....మీ అమ్మ ఇలానే పెంచింది. మీ నాన్న కేమో నోట్లో నాలిక లేదు.స్నానం కానీ...వేన్నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి", అంది మామ్మ.
"అబ్బా కాఫీ కి నా పెంపకానికి లింకు పెట్టకే...రాత్రి ఎప్పుడో తిన్నానే తల్లీ కాఫీ ఇయ్యవే..." అని మారాం చేశాడు శంకరం.
"ఒరేయ్ శంకరం ఇంకెప్పుడురా నేర్చుకుంటావు??? స్నానం చేసి సంధ్యావందనం చేసుకోకుండా కాఫీలు,టిఫిన్లు ఏంట్రా?? ఇదిగో ఇవన్నీ మీ అమ్మ దగ్గర సాగుతాయేమో ?? నా దగ్గర కుదరదు.. ఆ.." అని ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇచ్చేసింది మామ్మ.
"ముందు ఆత్మారాముణ్ణి శాంతింపచెయ్యాలని మా అమ్మ చెప్పిందే మామ్మా "అన్నాడు శంకరం.
"ఆ ఆ మీ అమ్మ మెట్ట వేదాంతం మీ నాన్నకే అబ్బిందని అనుకున్నా, నీకు అబ్బిందీ..."అంటున్న భ్రమరాంబ గారి మాటలకి అడ్డుగా శంకరం"మీ మామ్మ రూల్స్ లో యాభై ఏళ్ళుగా ఏ ఎమెండ్మెంట్స్ లేవురా," అంటూ మనవడి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వేశారు తాతగారు.
"తాతగారూ !!!" ఆత్మీయంగా పలకరించాడు శంకరం.
"ఎలా ఉన్నారు?" అని అడిగాడు.
"నాకేంట్రా హాయిగా  ఆరోగ్యంగా ఉన్నా... మీ మామ్మతో అణకువగా మసలుకొంటూ ఇదిగో ఇలా ఉన్నారా," అంటూ నవ్వారు తాతగారు.
తాతగారి సమాధానానికి శంకరానికి నవ్వొచ్చింది. "చూడండి తాతగారు ఓ కప్పు కాఫి ఇవ్వడానికి ఎంత ఏడిపిస్తొందో మామ్మ."అన్నాడు శంకరం బుంగమూతి పెట్టి.
"చెప్పా కదరా ఈ ఇంట్లో మీ మామ్మ "ఎదురే లేని మనిషి" అన్నారు...భ్రమరాంబ గారివైపు నవ్వుతూ  చూస్తు.
"ఆ.... ఆ... అనండి అందరూ నన్ను అనేవాళ్ళే.. అనండి అనండి...ఓ పద్ధతీ,పాడూ వాళ్ళ అమ్మ ఎలాగో అలవాటు చెయ్యలేదు,కాస్త నేనైనా చెప్పాలని అన్నా..కప్పుడు కాకపోతే చెంబుడు తాగరా నాకెంటీ", అంటూ బుంగమూతి పెట్టిన మామ్మని "మామ్మని అబ్బా మామ్మా నువ్వు ఎప్పుడూ ఇంతేనే..ఇప్పుడేంటి ముందు స్నానం చెయ్యలి అంతే కదా ఇప్పుడే అయిదు నిమిషాలొ వస్తున్నా  అంటూ వెళ్ళాడు శంకరం"
స్నానం అయ్యాక  దేవుడి గదిలోకి వెళ్ళాడు శంకరం. శంకరానికి చిన్నటి జ్ఞాపకాలు వరదలా మదిలో మెదిలాయి."ఇది మామ్మ సామ్రాజ్యం.."అనుకుంటూ నవ్వుకున్నాడు..
చిన్నప్పుడు ఆట మధ్యలో వచ్చి ప్రసాదం పెట్టమని మామ్మని అడగటం,కాళ్ళూ చెతులూ కడుక్కుంటేగానీ పెట్టనని మామ్మ దెబ్బలాడడం,స్నానం చెయ్యకుండా మామ్మ మడిబట్టతో ఉన్నప్పుడు మామ్మని ముట్టుకోవడం, దానికి మామ్మ అమ్మని సాదించడం,తాతగారు చిన చిరునవ్వుతో అమ్మని సముదాయించడం ....ఎంత బావుండేవి ఆ రోజులు అనుకున్నాడు. ఈ గదిలో ఉన్న జగత్రక్షకుడికూడా యజమాని మామ్మే,మామ్మ మాటే ఆయనా వినాలి అనుకుంటూ దేవుడి గదిలోంచి బయటికి వచ్చిన శంకరానికి వేడి వేడి టిఫిన్,కాఫీ అందించింది మామ్మ.
"అబ్బా... మామ్మ నీ చేతి కొబ్బరి చెట్నీ అదుర్స్..." అన్నాడు శంకరం.
"ఒరేయ్  నావి మిక్సీ పచ్చళ్ళు కాదురా.సుబ్బరంగా రోటిలో రుబ్బునవి..అందుకే ఆ రుచి..ఈ ఎనభైయో పడిలో కూడా ఓపిక లేకపోయినా ఇంకా రోటిలోనే రుబ్బుతా కానీ మీ అమ్మలా అన్ని మిక్సీలో పడేసి తగలేయను" అని," ఈ వయసులో కూడా తన రుబ్బే సామర్ధ్యాన్ని ఏకరువు పెట్టింది మామ్మ.
"మరి మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళాలి కదే మామ్మా రోటిలో పచ్చడి రుబ్బుతూ కూర్చుంటే టైము అయిపోతుంది కదే," అన్నాడు శంకరం అమాయకంగా...
"వెధవ బడిపంతులు ఉద్యోగం దాన్ని ఎవడు వెలగబెట్ట మన్నాడు..మనకేమైనా  లేదా పోదా..మీ నాన్నకే అసలు ఉద్యోగం చేసే  పనిలేదు. మన పొలం చూస్కుంటే చాలదట రా.. ఆ పట్నం పోయారిద్దరు. నా మాట లెక్క చెయ్యకుండా.. మీ తాతగారు ఎప్పుడు వాళ్ళకే వత్తాసు పాడతారు గానీ నావైపు మాట్లాడరు.. ఆ ఉద్యోగం చేసుకుని సంపాదించిన డబ్బు మీ అమ్మ మాకేమీ ఎప్పుడూ ఇవ్వలేదు ..ఎప్పుడు చూడు సంఘ సేవ అని ఎవరో ఒకరికి దానం చేసి పెడుతుంది..  ఒరెయ్ శంకరం.. మనకి ఉన్న పొలానికి మనం హాయిగా తిని కూర్చోవచ్చు రా..ఎంత చెప్పినా మీ అమ్మ నాన్న విన్నారా?? ఈ వయసులో కూడా మేము ఒంటరి గా ఇక్కడ మీరేమో  అక్కడ.."
"పోని మీరు ఇంక అక్కడికి వచ్చేయచ్చు కదా మామ్మా.. మా అమ్మ ఎప్పుడూ నీతో ఇదే అంటుందిగా మామ్మా... అన్నాడు ఆప్యాయంగా శంకరం.
"ఆ.. ఆ ..దానికే రమ్మంటుంది ఆ మడి తడిలేని కొంపలో నేను ఉండలేనురా నాయనా.. ఇదిగో రేపు నీ పెళ్ళయ్యాక  మీ అమ్మ కోడలిని అంటే నీ పెళ్ళాన్ని ముందు ఇక్కడికే తీసుకొస్తా..... మన పద్ధతి,ఆచారం అన్నీ నేర్పించాకే  మీ అమ్మ దగ్గరికి పంపుతా. లేకపోతే మీ అమ్మ అనాచారమే  దానికీ వస్తుంది. అంది భ్రమరాంబ ఖచ్చితంగా..."
"అవునా మామ్మా మా అమ్మవన్నీ అనాచారేలేనా..."  కొంటెగా అన్నాడు శంకరం.
"కాదురా మరి.. దేవుడికి దీపమైనా  పెట్టకుండా ఆ పనిపిల్లకి టెఫిను పెట్టి పంపుతుంది.. దాన్ని ఏమనాలి చెప్పరా... " నిగ్గతీసింది మామ్మ..
అంతవరకూ మౌనంగా...ఉన్న రావుగారు..అబ్బా బ్రహ్మరం.. ఆ పిల్ల పనిచేసుకుంటూ  కోడలి కాలెజీలో చదువుకుంటోందే.. అందుకే పాపం చదువుకుంటున్న పిల్లకదా అని కోడలు దాన్ని అంత ప్రేమగా చేరదీస్తుంది..నీ కళ్ళతో కాక మానవత్వంతో చూడవే",  అన్నరాయన లాలనగా...
శంకరం నవ్వాడు.. ఇంతలో మామ్మ "ఇదిరా ఈయన వరస కోడలిమీద ఈగ వాలనివ్వరనుకో... "అంది వ్యంగ్యంగా.
"ఒరేయ్ నీ భార్యని కూడా సాధించడానికి మీ మామ్మ రెడీగా ఉందిరా.."ఆన్నారు..పోట్టచేక్కలయ్యేలా నవ్వుతూ  తాతగారు.
శంకరం కూడా గట్టిగా నవ్వేసేరికి మామ్మకి అగ్గిమీద గుగ్గిలం వేసినంతపని అయ్యింది. "నవ్వండి రా నవ్వండి..ఆయనే అనుకున్నా ఇప్పుడు నువ్వు కూడా బానే తయారయ్యావు. అందుకే దేవుడికి మహానైవేద్యం పెట్టకుండా పనిపిల్లకి సపర్యలు చేసే ఆ ఇంట్లో నేను ఉండట్లేదు," అంది మామ్మ కోపంగా.
శంకరం మామ్మని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ...  "అందరిలో నీ దేవుడున్నాడే మామ్మా ..నీకెందుకు కనబడడు?" అన్నాడు .
"నేను గుడ్డిదాన్ని రా .......నాకు కనబడడు....మీ అందరూ కళ్ళున్న వాళ్ళుగా  మీరు అందరిలో చూడండి,"  అంటూ  విసురుగా వెళిపోయింది మామ్మ....
"మామ్మా ..." అంటూ  తాతగారి వైపు చూసాడు  శంకరం. తాతగారి చూపులో ఈ ధోరణికి ఎనభై  ఏళ్ళు అన్న నిజం కనిపించింది శంకరానికి....
పేపరు చదువుకుంటున్న శంకరాన్ని  "బాగున్నారా చిన్న బాబూ" అంటూ ఆప్యాయంగా పలకరించాడు  పాలేరు వెంకన్న.ఆ బావున్నా వెంకన్నా నువ్వెలా ఉన్నావ్ ?? అడిగాడు శంకరం
"మీ దయ వల్ల బానే ఉన్నాం బాబు అన్నాడు వెంకన్న .సుబ్బులు బావుందా ,సుబ్బన్న ఏం చేస్తున్నాడు?"  అని అడిగాడు శంకరం.
"ఇంటరు పాసయ్యాడు బాబు, ఇక సదువు మానిపిచ్చి పొలానికి సాయానికి తీసుకుపోదామనుకుంటున్నా బాబు" అన్నాడు వెంకన్న.
ఇంతలో "చిన్నబాబు.. నేనడిగిన డిక్ష్నరీ తెచ్చారా బాబూ", అంటూ  ఆతృత గా వచ్చాడు సుబ్బన్న .
"హాయ్ సుబ్బూ ఎలా ఉన్నావ్.. తెచ్చాన్రా ...నీ  గురించే ఎదురు చూస్తున్నాను.. ఎలా ఉన్నావు..  ఇదిగో నువ్వడిగిన బయొలాజికల్ డిక్ష్నరీ అంటూ.. అమ్మ ప్రత్యేకంగా వెతికి వెతికి నీకు కొనిచ్చిందిరా" అన్నాడు.
"కొన్నందుకు అమ్మగారికీ ఇచ్చినందుకు మీకు థాంక్స్  చిన్నబాబు", అంటూ దాన్ని చూసుకుంటూ మురిసిపోతున్న సుబ్బన్నతో "ఎంత పర్సెంట్ వచ్చిందిరా నీకు  ఇంటర్లో?" అని అడిగాడు శంకరం. "తొంభై పర్సెంట్ వచ్చింది  చిన్నబాబు"  అన్నాడు.
"వావ్! సుబ్బు థట్స్ గ్రేట్ రా, ఎంసెట్ రాయలేదా మరి?" అని అడిగాడు శంకరం.
"నాకు ఏజీ బియెస్సీ  చెయ్యాలని ఉంది చిన్నబాబూ. చదువుకుంటూ వ్యవసాయం కూడా చేసుకుంటా," హుషారుగా చెప్పాడు సుబ్బన్న.
"మా పొలం మీద మాకన్న నీకే ఎక్కువ మీకే ఎక్కువ మమకారం రా సుబ్బూ", అన్నాడు శంకరం.
"కాదా బాబూ మాకు అన్నం పెట్టిన తల్లి కదా బాబూ . వ్యవసాయానికి కొత్త పద్ధతులు,తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చే పద్ధతులవీ కనుక్కోవాలని, ఆ దిశగా పరిశోధన చెయ్యాలని నా ఆశ", అన్నాడు సుబ్బన్న .
"గ్రేట్ సుబ్బూ ఇంత మంచి ఆలోచనలు ఉన్నప్పుడు,ఎందుకు ఆగిపోయావు?ఇంకా కాలేజీలో ఎందుకు చేరలేదు?" అని అడిగిన శంకరంతో "నాన్న వద్దన్నాడు చిన్న బాబూ, ఇక చదువాపేయమన్నాడు "అంటూ వెంకన్న వైపు దీనంగా చూసాడు సుబ్బన్న.
వెంకన్నతో శంకరం "దేనికి  వెనక్కి తీయకు వెంకన్నా... డబ్బుకావలంటే నేను ఇస్తా, నాకు ఉద్యోగం వచ్చింది కానీ వాడిని చదివించు. వాడిని బాగా చదువుకోనీ" అన్నాడు.
"తమరి తాతగారు కూడా ఈ మాటే సేప్పారు బాబు... కాని  ఇప్పుడు ఈడు సదువు ,సంధ్య  అంటే ఇక్కడ పరిస్థితి ఏటి బాబు" అన్నాడు వెంకన్న.
నాకా ఇదివరకంత ఓపిక పోనాది. పనిసెయ్యలేకపోతున్నా...అయినా మాతాతల కాలం నుంచీ ఈ పొలాన్నే నమ్ముకుని హాయిగా ఉన్నాము.మాకు ఏలోటూ రాకుండా  మీ కుటుంబం మమ్మలిని సల్లగా సూసుకొంటున్నది. ఇంకెందుకు బాబూ ఈ సదువులు.అయినా అందరూ  ఇలా సదువులని పట్టణాలు పొతే ఇక్కడ పొలంలో పని చేసే రైతు ఎక్కడ ఉంటాడు బాబూ?"అన్నాడు  వెంకన్న. తండ్రి మాటలకు నిరుత్సాహ పడిన సుబ్బన్న శంకరంవైపు జాలిగా చూసాడు .
"వస్తా బాబు తమరు ప్రయాణం సేసి వచ్చేరు ,ఇశ్రాంతి తీస్కోండి .అమ్మగారు ఎటైనా పని సేప్తారేమో అని వచ్చా ఏటినేదట.ఇదిగో సుబ్బిగా కాస్త పెద్దమ్మగారికి నీళ్ళు తోడెట్టి రా .. "అంటూ వెళ్లి పోయాడు వెంకన్న.
పెరట్లో నీళ్ళు తోడుతున్న సుబ్బన్న ని చూస్తూ ఉంటే శంకరానికి జాలి పోయి గౌరవం కలిగింది.సుబ్బన్నది ఎంత ఉత్తమమైన ఆశయం? చదువుకుని తిరిగి తన ఊరొచ్చి తన వృత్తినే తిరిగి ఎంచుకోవలనుకుంటున్నాడు.తన వృత్తికి మెలకువలు నేర్పే చదువునే చదువుకుంటానంటున్నాడు.ఎంత ఆదర్శ హృదయం వాడిది!. వెంటనే శంకరానికి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. "నీ చదువు నీ ఒక్కడికే కాదు రా పదిమందికి ఉపయోగపడాలి.నువ్వొక్కడివే కాదు నీ చదువు వలన పదిమందికి అన్నం పెట్ట గలగాలి.నీలో ఉన్న జ్ఞాన జ్యోతి ఇంకో పదిమంది ఇంట్లో ఆ జ్ఞాన దీపం పెట్ట గలగాలి."అమ్మ ఎంత బాగా చెప్తుందో కదా.
అమ్మా-నాన్నా ఆస్తులకోసం,ఆచారలకోసం కాక ఆదర్శం కోసం బ్రతికే ఉత్తమ ఉపాధ్యాయులు. అలాంటివాళ్ళ మేలి కలయిక అయిన తను ఇలా అందరిలా చదువు, ఉద్యోగం ,పెళ్ళి అంటూ అందరిలా ఉండిపోకూడదు,పుట్టినందుకు ఒక మంచిపని అయినా చెయ్యాలి.అది సుబ్బన్న చదువుతోనే శ్రీకారం చుట్టాలి అని నిర్ణయించుకున్నాడు.
వెంటనే తాతగారి దగ్గరకు వెళ్ళాడు."తాతగారు ...మన వెంకన్న కొడుకు సుబ్బన్న ని ఎగ్రికల్చరల్ బి.ఎస్.సి లో చేర్పిద్దాం,వాడికి అది చదువుకోవాలని ఉందిట" అన్నాడు. "వాడు నాతో కూడా అన్నాడురా నేను వెంకన్న కి చెప్పిచూసారా, కాని వెంకన్న వినలేదురా," అని నిరుత్సాహంగా అన్నారు రావుగారు.
"వాడు పొలం పని చెయ్యనని అనలేదే, చదువుకుంటూ చేస్తానంటున్నాడు,నేను వాళ్ళింటికి వెళ్ళి ఇంకోసారి వెంకన్నకి నచ్చ చెప్పి రానా" అంటూ ఇంకా ఎదో అనబోతూ ఉండగా "వాడు చదువు కి పోతే వాళ్ళ నాన్న కి వెనక సాయం ఎవరుంటారు రా ???" అంటూ మామ్మ అక్కడికొచ్చింది. అయినా నెనోమాట చెప్పనా  ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి అంది కఠినంగా....
"అదే మామ్మా నేను అదే అంటున్నా  ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యలి అప్పుడే సమాజంలో  సమతుల్యత ఉంటుంది.కానీ మన సుబ్బన్న మన రైతు గా ఉండడాడినికి చదువు మానేయఖర్లేదు. పైగా వీడు నా కన్నా నయం మామ్మా...వాడికి వ్యవసాయం చెయ్యాలనే ఉంది అందుకే చదువుకోవాలని కూడా అనుకుంటున్నాడు.ఈ మట్టినే నమ్ముకుని ఉండాలనుకుంటున్నాడు,నేను కేవలం ఈ మట్టిపై వచ్చే ఆదాయన్ని అనుభవించగలను, కాని మట్టిలో మట్టై కష్టపడలేదు,కష్టపడలేను కూడా.  ఈపొలం మనకి కేవలం ఆస్థి మామ్మ...తాతగారు రిటైరైన మాష్టారు.నాన్నకి నాకు ఒక జీవనోపాధి కూడా ఉంది.కాని వెంకన్న కి ఈ పొలమే జీవితం,ఈ మట్టిని నమ్ముకునే వాడు సుబ్బన్నని పెంచాడు, సుబ్బిగాడు కూడా విద్యావంతుడై ఈ మట్టినే నమ్ముకుని ఇంకో పదిమందికి అన్నం పెడతానంటున్నాడు. వాడు వ్యవసాయం చెయ్యగలడు,చదువుకోను గలడు.కాని నేను వ్యవసాయం చెయ్యగలనా మామ్మా..కాని నేను,నువ్వు నమ్మే ఆ భగవంతుడు నాకో ఉపాధినిచ్చాడు కదా అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా," అంటూ ఏదో చెప్పబోయాడు కానీ ఇంతలోనే ఆగిపోయాడు.మళ్ళీ తననితను తమాయించుకుని "ఇప్పుడే వెళ్ళి వెంకన్నకి ఓసారి నచ్చచెప్పి వస్తా తాతగారు"  అంటూ వెళ్ళీపోయాడు శంకరం.
"ఏమిటండీ వీడి వాలకం" అంటూ నివ్వెరపోయి చూసింది భ్రమరాంబ రావుగారి వైపు.
"వాడు ఆస్థికోసం కాక ఆదర్శం కోసమే బ్రతికేవాడే బ్రహ్మరం...విత్తొకటైతే చెట్టు ఇంకోటవుతుందా చెప్పు.."అంటూ  చిరునవ్వుతో అక్కడనుండి వెళ్ళిపోయారాయన.
శంకరం తమ పొలానికి దగ్గరగాఉన్న వెంకన్న పాక దగ్గరికి వెళ్ళాడు.శంకరానికి ఊహ తెలిసినప్పటినుంచీ వెంకన్నది అదే పాక.ఆవుకి మేత వేస్తూ సుబ్బన్న అక్కడ తను కొత్తగా తెచ్చి ఇచ్చిన డిక్ష్నరీ చదువుకుంటున్నాడు."వెంకన్నా" అన్న శంకరం పిలుపుకి ఇంట్లోనుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది సుబ్బులు. మీరా చిన్నబాబూ,రండి అంది. వెంకన్న లేడా సుబ్బులూ అడిగాడు శంకరం...
"ఇప్పుడే పొలానికెళ్ళాడు బాబూ..ఉండండి కబురెడతాను.."అంటూ "ఒరేయ్... సుబ్బిగా పొలానికెళ్ళి నాన్న ని తోలుకురాపో.. అంది.వాడేదో చదువుకుంటున్నాడు కదా సుబ్బులూ  చదువుకోనీ నే వెళతాలే"  అన్నాడు.
"పొద్దస్తమాటూ ఆడిపని ఆ సదువే బాబూ అంది సుబ్బులు.పోనీలే చదువుకోనీ నేనే పొలానికి వెళతాను" అంటూ బయలుదేరిన శంకరం చేతిని వెనుకనుంచి వచ్చి ఎవరో పట్టుకున్నట్లై శంకరం వెనక్కి చూసాడు.ఆయాసపడుతున్న సుబ్బన్న"చిన్న బాబు మా నాన్నకి మీరైనా చెప్పండి,నన్ను డిగ్రీ కాలేజీ లో చేర్పించమని "అన్నాడు.
వాడి కళ్ళలో ఎన్నో ఆశలు,ఆదర్శాలు,ఆశయాలు కనిపించాయి శంకరానికి.తప్పకుండా సుబ్బూ... "నువ్వు కాలేజీ కి వెళ్ళడానికి రెడీగా ఉండు," అంటూ ఆ చెయ్యి నొక్కిపెట్టి  ఆత్మీయంగా వాగ్దానం చేశాడు శంకరం.
వెంకన్న పొలం గట్టుమీదనుంచే శంకరాన్ని చూసి .. "చిన్నబాబూ మీరేంటిలా?" అని అడిగాడు.
"నీతోనే కొంచం పనుండి వచ్చా వెంకన్నా," అన్నాడు శంకరం.
"నాతో తమకేటి బాబూ పని సెప్పండి," అన్నాడు.
"వెంకన్నా... సుబ్బన్న ని కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నా నువ్వేమంటావ్?" అని అడిగాడు.
"ఈ మాటే తాతగారు కూడా సెప్పారు బాబూ కానీ..."ఆగిపోయాడు వెంకన్న.
"దేనికి నువ్వు వెనకాడుతున్నావు?...వెంకన్నా ప్రతీ వ్యక్తీ విద్యావంతుడు కావాలి అప్పుడు వాడి జీవితం చాలా బావుంటుంది" అన్నాడు శంకరం.
"సదువుకోకపోయినా నా జీవితానికేటయ్యింది బాబూ... కట్టాన్ని నమ్ముకున్నా..ఈ కట్టాన్ని నమ్ముకునే కదా బాబూ ఆడ్ని ఇంతోడ్ని చేసా.అందరు సదువులు,ఉద్యోగాలు అని పట్టణాలకి ఎల్లిపోబట్టే ఈయాల పొలం దున్నే రైతెక్కడున్నాడు బాబూ..మా తాతలనుండీ ఈ పొలాన్నే నమ్ముకున్నాము,మీ పంచనే ఉన్నాము,తృప్తిగా తింటున్నాము ...ఓ.. ప్రతీఓడు పట్ట ణాలకి పోయి లచ్చలు సంపాదించి ఏంచెయ్యలి బాబు? రెండుపూటలా ఇంత తిండిగింజల కన్నా మడిసికి ఇంకేంకావాలి బాబూ",  అన్నాడు వెంకన్న.ఇంత తృప్తి గా బతకాలనుకోవడం ఎంతమంది వల్ల అవుతుందని అనుకున్నాడు శంకరం.
"వెంకన్నా నువ్వు నీ కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేదు,వాడు లక్షలు సంపాదించాలి అనుకోవట్లేదు,వ్యవసాయమే చెయ్యాలి అనుకుంటున్నాడు,దానికి కావలిసిన చదువే చదువుకోవాలనుకుంటున్నాడు."
"యవసాయనికి సదువెందుకు బాబూ ...నాతో నాలుగురోజులు పొలానికొస్తే అయే తెలుస్తాయి కదా బాబు," అని నిట్టూర్చాడు వెంకన్న.
"అయ్యో! వెంకన్నా నీలాంటి వాళ్ళు ఇలా ఆలోచించబట్టే ఇన్ని వనరులున్నా ఇంత సారవంతమైన భూమి ఉన్నా మనం ఇంకా ధాన్యం కూడ ఇతర దేశాలనుండీ కొనుక్కుతెచ్చుకుంటున్నాం.ఇక్కడ పండించినవి సరిగ్గా అమ్ముకోవడం రాక నీలాంటి రైతులు దళారీల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.వాడు చదివే చదువు వాడిని ఒక పరిపూర్ణమైన మనిషిగా మారుస్తుంది.ఈ వృత్తికి కావలిసిన మెలకువలు చెప్తుంది,మీ తరానికి కష్టం ఒక్కటే తెలుసు వెంకన్నా.. కాని ప్రస్తుత తరానికి కష్టంతో పాటు విజ్ఞానం,సాంకేతిక పరిజ్ఞానం,మెలకువలు అన్నీ తెలియాలి. నా మాట విను వెంకన్నా వాడిని డిగ్రీ కాలేజీలో చేర్పించు.నీకో విషయం చెప్పనా ..నీ కొడుకు నా కన్నా నయం,నా చదువు నాకే ఉపయోగపడుతుంది,వాడి చదువు వాడికే కాక  పదిమందికి అన్నం పెడుతుంది.ముఖ్యంగా వాడికి శ్రద్ధ ఉంది,పట్టుదలకూడా ఉంది.వాడనుకున్నది తప్పక సాధిస్తాడు,నాకా నమ్మకం ఉంది.నువ్వు ఇన్నేళ్ళగా కష్టపడి మాకు అన్నం పెడుతున్నవు వాడు నీలాగే ఇంకో వందమందికి పెడతానంటున్నాడు అది నీకు ఆనందం కాదా?" అన్నాడు శంకరం.
"ఇయన్నీ నిజమే కాని నేను పెద్దోడినయిపోయా బాబూ...ఇక ఈ కూలి పని నేను సెయ్యలేను,ఆడు సదువుకెళిపోతే .." అని ఆగిపోయాడు వెంకన్న. వెంకన్న చెయ్యి పట్టుకున్న శంకరం, "వెంకన్నా నీ భయం నాకు తెలుసు.నీకు మా పొలమే ఆధారం.కదా.. వాడు చదువుకెళిపోతే మాపొలం ఇంకెవరో వచ్చి చేసుకుంటారు అప్పుడు నీకే ఆధారం ఉండదు అదే కదా నీ భయం",అంటున్న శంకరం కళ్ళలో చూసే ధైర్యం లేక తలదించుకున్న వెంకన్నతో శంకరం ఇలా అన్నాడు.
"వెంకన్నా ఈ పొలం ఎప్పట్కీ నీదే.. మాది కాదు ఎందుకంటావా నా తల్లితండ్రులు నాకు కష్టపడి చదువు చెప్పించారు.నా ప్రయోజకత్వం తో వచ్చిన ఉద్యోగం నాకు చాలు.సుబ్బిగాడిని నేను చదివిస్తా.ఈపొలాన్ని నువ్వు చేసుకోలేకపోతే నువ్వే ఇంకొకరికి కవులికిచ్చి చేయించు. దానిపై రాబడి కూడా నువ్వే తీసుకో...."అని మాట్లాడుతున్న శంకరం మాటలకి వెంకన్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"వెంకన్నా దురదృష్టం ఏంటంటే మన దేశంలో రైతు పొలం ఉన్న పేద వాడు.ఈ పొలం మా కళ్లకి ఆస్థి లాగే కనిపిస్తుంది.కాని నీకు అది కన్న తల్లి..నీకు నీ తల్లి అన్నంపెడితే నువ్వు కొంచమే  తిని మిగిలినదంతా మాకు పెట్టేస్తున్నవు.ఈ పరిస్థితులు మారాలి. అందరికీ అన్నం పెట్టే రైతు ఆకలితో పస్తులుండకూడదు. అప్పులతో చావకూడదు,అందుకే ఈ పొలం నువ్వే తీసుకో...ఇప్పటికైనా నామాట విను,వాడిని చదివించు,అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు," అంటూ తన చేత్తొ ఇంకో సారి వెంకన్న భుజం తట్టి శంకరం తిరిగి వెళిపోయాడు. వెంకన్న కి ఏమీ పాలుపోలేదు.ఎంతో పెద్ద చదువులు చదువుకున్నపట్టికీ శంకరం ఔదార్యం వెంకన్నని నిశ్చేష్టుణ్ణి చేసింది.
శంకరం ఇంటికి వచ్చేసేరికి మామ్మ మంచం మీద పడుకుని ఉంది. తాతగారు ధైర్యం చెప్తున్నట్లుగా పక్కన కూర్చుని ఉన్నారు.సుబ్బిగాడు కాళ్ళు పడుతున్నాడు. పరిగెత్తుకుంటూ దగ్గరగా వచ్చిన శంకరం "తాతగారు ఏమైంది అన్నాడు?"ఆయన సమాధానం చెప్పే లోపే "పెద్దమ్మ గారు కాలుజారి నూతిలో పడిపోబోయారు చిన్నబాబూ," అంటూ వాడింకా ఏదో చెప్పబోయాడు, ఈలోగా "అవును రా శంకరం ఈ సుబ్బిగాడు సమయానికి పరమాత్ముడిలా  నన్ను పట్టుకోకబోతే ఈ పాటికి వైకుంఠానికి వెళ్ళిపోయేదాన్ని "అంటూ భోరుమంది మామ్మ.
"మామ్మా.. నీ మడికి పనికి రానివాడు ఇప్పుడు నీప్రాణం కాపాడడానికైనా పనికొచ్చాడా?" అని వ్యంగ్యంగా అడిగాడు శంకరం.
మామ్మకి నోటమాటరాలేదు.తప్పుచేసిన దానిలా తలదించుకుంది.
"ఈరోజు నీ ప్రాణాలు కాపాడేడు కాబట్టి పరమాత్ముడైయ్యాడు ,కాని నిన్న వీడు నీ మడికి పనికిరాలేదా మామ్మా..అందరికే ఆ పరమాత్మే అంతరాత్మ మామ్మా.అందుకే అందరికి శ్రీహరే అంతరాత్మ అన్నాడో ఓ విష్ణు భక్తుడు.అందుకే నేనంటా అందరిలోను ఆ భగవంతుడున్నాడు. రావణుడులేని ప్రతీ హృదయంలో రాముడున్నాడు మామ్మా.. నాకు చిన్నప్పటినుంచీ మా అమ్మ ఒక్కటే నేర్పించింది." దేహో దేవాలయ ప్రొక్తో జీవః ప్రొక్తో సనాతనః" దేహానికి మించిన దేవాలయం లేదు అంతరాత్మను మించిన దేవుడు లేడు.  మన శాస్త్రాలు,ఆచారాలు,పురాణాలు సాటిమనిషిని దైవంగా భావించమన్నాయి కానీ ద్వేషించమనలేదు.మన వేదం ప్రభోదం మామ్మా అది మనలను అజ్ఞానం నుండీ సుజ్ఞానం వైపుకు నడిపించగలగాలి.నువ్వు ఆ వేద మూర్తి అయిన భగవంతుణ్ణి నమ్మేవు కాబట్టే ఆయన నిన్ను సుబ్బిగాడి రూపంలో వచ్చి రక్షించాడు.ఈ సత్యం తెలుసుకోగలిగితే నీకు సర్వవ్యాపకుడైన భగవంతుడు అందరిలో అన్నీటిలో కనిపిస్తాడు."
శంకరం మాటలను విన్న మామ్మ "నిజమేరా నాన్నా, వీడుముట్టుకుంటేనే పనికిరాదనుకున్నా...కానీ వీడు ఈరోజు నన్ను కాపడకపోతే నేనే లేను కదరా  నాన్నా... ఒక్కమాట మాత్రం నిజంరా శంకరం"నేను నిజం గా కళ్ళున్న గుడ్డిదాన్నే..నువ్వు నా కళ్ళుతెరిపించడానికే వచ్చావు", అంటూ మనవడిని గుండెలకు హత్తుకోవడానికి లేవబోయిన మామ్మని శంకరం ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్నాడు.
  ఇంతలో సుబ్బులు,వెంకన్న విషయం తెలిసి అక్కడికి వచ్చారు. వెంకన్న తనతో శంకరం మాట్లాడిన మాటలన్ని చెప్పి కన్నీరిమున్నీరుగా రావుగారి పాదాలపై పడ్డాడు.రావుగారు వెంకన్నని లేవదీసి "ఎందుకురా బాధపడతావు? వాడు నీకు మంచే చేస్తాడులే" అన్నారు.
"అయ్యో బాధ కాదు బాబయ్యా.. తరతరాలుగా మిమ్మలిని తప్ప ఏదీ నమ్ముకోలేదు. మిమ్మలినే నమ్మినందుకు మీ మనవడు గారు నా కొడుకుని చదివిస్తానంటున్నారు, భూమిచ్చి బాగుపడమంటున్నారు.."నమ్మినోళ్ళని ఆ దేవుడు అన్యాయం సెయ్యడయ్యా..సెయ్యడు కాక సెయ్యడు."అంటూ కళ్ళు తుడుచుకుంటు అక్కడనుండి వెళిపోయినవాడు రెండడుగులు వెనక్కి వేసి "మిమ్మలిని కాపడి  నా కొడుకు కొంత ఋణం అయినా తీర్చుకున్నాడమ్మా అంటూ భ్రమరాంబ కాళ్ళకి దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు."
  సుబ్బులొచ్చి "శంకరం బాబూ మీరే ఆడిని కాలేజీలో సేర్పించండి. మీ సల్లని సేత్తో సేరిస్తే ఆడు సక్కగా సదువుకుని మీకు మల్లే పదిమందికి మేలుసేసేటి వాడవుతాడు "అంటూ వెంకన్న వెనకాలే వెళ్ళిపోయింది.శంకరం సుబ్బన్న ని దగ్గరికి తీసుకుని "కంగ్రాట్స్ రా సుబ్బూ "అనగానే చిన్నబాబు మీ మేలు ఈ జనంలోనే కాదు ఏజన్మలో ని మరువలేను అంటూ కన్నీళ్ళ పర్యంతం శంకరాన్ని హత్తుకున్నాడు.
"నో నో సుబ్బు నేను చేసింది ఏమిలేదు రా నీ ఆశయకోసం నువ్వు కష్టపడు."కృషితో నాస్థి దుర్భిక్షం" గుర్తుపెట్టుకో.రేపే వెళ్ళి కాలేజీలో వివరాలన్నీ కనుక్కో" అని సుబ్బిగాడిని పంపించాడు శంకరం.
  తాతగారికి, మామ్మకి మనవడు కొత్తగా కనిపించాడు."నీవన్నీ మీ అమ్మపొలికలేరా శంకరం" అంది మామ్మ.
కాదే మామ్మా "నావన్నీ నీపోలికలే నీలాగే నేను దేవుడినే నమ్ముతా కానీ నీలా పూజగదిలో మాత్రమే కాదు.నాదేవుడు నీలో,నాలో తాతగారిలో,వెంకన్నలో,సుబ్బిగాడిలో అందరిలో ఉన్నాడు.నువ్వు మంత్రంతో పూజిస్తే నేను మానవత్వంతో మనిషినే దేవుడిగా ప్రేమిస్తాను.నీదేవుడు గీతలో చెప్పిందే మామ్మా అన్నీ వదిలేసి ఆయననే నమ్ము నిన్నుకాపడడానికి చూసావా... సుబ్బిగాడి రూపంలో వచ్చాడు. వెంకన్న కూడా ఆదేవుడినే నమ్మాడు కాబట్టే నారూపంలో వచ్చి ధైర్యం చెప్పాడేమో అన్నాడు."
మనవడి మాటలకు మురిసిన మామ్మ "గీతాసారం" అర్థం అయ్యింది రా నాయనా!" అంది.  తాతగారిని మామ్మని దగ్గరికి తీసుకున్న శంకరం ఎదురుగా పరమాత్ముని విశ్వరూపం ఫొటో చూస్తూ మనస్సులోనే ఆ పరమాత్మకు ప్రణామాలు అర్పించుకున్నాడు.
***

No comments:

Post a Comment

Pages