"సమ్మాన్యుడు" ( డా. సి.వి. యోగి గారి జీవిత చరిత్ర) పుస్తక సమీక్ష - రచన : కందుకూరి రాము - అచ్చంగా తెలుగు

"సమ్మాన్యుడు" ( డా. సి.వి. యోగి గారి జీవిత చరిత్ర) పుస్తక సమీక్ష - రచన : కందుకూరి రాము

Share This
ఆకెళ్ళ రాఘవేంద్ర గారి ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక పుస్తకం నన్ను ఆకర్షిస్తుంది. అలా నేను చదివిన పుస్తకాల్లో "సమ్మాన్యుడు" ఒకటి.

"సిరివెన్నెల" సీతారామశాస్త్రి సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి గారు, వారి తండ్రి గారైన శ్రీ చేంబోలు వెంకట యోగి గారి జీవితచరిత్రను "సమ్మాన్యుడు" పేరుతొ రచించి, మరికొందరి వ్యాసములతో సంకలనము చేసారు. వీరికిది రెండోవ రచన. మొదటిది కీ. శే. శరభయ్య గారి జీవితచరిత్రను "The Art of Possible' అనే పేరుతొ రాశారు.

"వ్యక్తికి అతీతంగా, గుణాలకు, లక్షణాలకు పెద్దపీట వేస్తూ, విశ్లేషణకు విశిష్టస్థానం కలిపిస్తూ రచించే ప్రయత్నం చేసాను" అని అంటారు రచయిత.
ఈ పుస్తకంలో  సద్గురు డా.శివానంద మూర్తి గారు ముందుమాటతో పాటు వారు చెప్పిన సూక్తులను కూడా పొందుపరిచారు. డా. యోగి గారి గురించి, వారి మిత్రులు రాసిన కొన్ని ఆంగ్ల వ్యాసాలూ కూడా ఇందులో ఉన్నాయి.
40 సంవవత్సరాల వయసులోనే స్వర్గస్తులైన డా. యోగి గారి యొక్క జీవితచరిత్ర రాయడానికి  రచయిత మూడు కారణాలు మనకు వివరిస్తారు.
డా. యోగి గారు "బహుముఖ ప్రజ్ఞాశాలి" అనే పదానికి అర్ధం అని చెప్పవచ్చు. వీరి జీవితం చాలావరకు విశాఖపట్నం జిల్లాలో గల అనకాపల్లిలో గడిపారు. డా. యోగి గారు కాలేజీలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం చేస్తూ హోమియో వైద్యం చేసేవారు (బనారస్ కాలేజీలో హోమియోపతీ వైద్యంలో పట్టా పొందారు). పదమూడు భాషలలో ఫై.జి. విద్యార్థులకు ట్యూషన్ చెప్పగలిగే పాండిత్యం సంపాదించినవారు. అన్ని మతగ్రంధాలు చదివి ఔపోసన పట్టినవారు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అధ్యాయాలు అన్నీ కంఠోపాటంగా వచ్చేవి.
1. ఆయన వ్యక్తిత్వం వలన ప్రభావితం అయి, ఆయన జీవన విధానాన్ని, ఆయన సూచించిన "సత్యనిష్ఠ" అనే ఏకసూత్ర జీవన విధానాన్ని అనుసరిస్తూ అత్యున్నత్తమైన స్థాయికి చేరిన సోదరుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక కారణం.
2. డా. యోగిగారితో సాన్నిహిత్యంగల వారందరినీ కలిసి వారివారి అనుభవాలను తెలుసుకుంటే యోగిగారి వ్యక్తిత్వంలోని అనేక పార్శ్వాలు ఆవిష్కరించబడతాయి అనేది రెండొవ కారణం.
3. నేను జీవితంలో ప్రశాంతంగా, తృప్తిగా ఉండగలిగే శిక్షణనిచ్చింది మా నాన్నగారు, ఆయన జీవితం ఏ ఒక్కరికైనా స్పూర్తినిచ్చి, వారి జీవితం సుఖమయం చేస్తుందనే ఆశ మూడో కారణం అంటాడు రచయిత.
యోగిగారి పదునైన మేధస్సుకు, తెలివితేటలను, సమయస్పూర్తిని, హాస్యచతురతను, సేవాతత్పరతను, భాషా పరిజ్ఞానం లాంటి అనేక విషయాలపై ఆయనకున్న పట్టును తెలియజేసే పలు ఉదాహరణలను, అనుభవాలాను ఇందులో రచయితతో పాటూ వారి కుటుంబ సభ్యులు, మరియు ఆత్మీయులు పాఠకులతో పంచుకున్న విషయాలు చదువుతుంటే... ఇన్ని మంచి లక్షణాలు, ఇన్ని తెలివితేటలు, ఇంత విషయ పరిజ్ఞానంతో పాటు కుటంబ బాధ్యత, సేవా తత్త్వం లాంటి అనేక మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో కనిపించడం ఆశ్చర్యం కలుగుతుంది.
"ఆయన స్మృతికి నేను అంజలి ఘటించలేను. వారు నాకు స్మృతీ కాదు,  గతమూ కాదు. నా గుండె సవ్వడిగా, నా నాడీ స్పందనగా, నా కణం కణం అన్నీ, అంతా వారే!" - "సిరివెన్నెల"
"సిరివెన్నెల" సీతారామశాస్త్రి గారు, వారి తండ్రి గారి గురించి మరో చోట ఇలా అంటారు "ఒక మనిషి ఎంతకాలం జీవించాడు అన్నదానికన్నా, ఎంత సార్ధకంగా, పరిపూర్ణంగా (అయుః ప్రమాణం కాదు) జీవించాడు అన్న్దది ముఖ్యం. - అని తనదైన శైలిలో చెప్తారు.
డా. యోగి గారు, కుటుంబ సభ్యులకు మరియు బంధు మిత్రులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, వారి యోగక్షేమాల కొరకు, వారి మంచి భవిషత్తు కొరకు ఎంత బాధ్యతగా ఆలోచించారో, ఎన్ని కుటుంబాలలో వెలుగు నింపారో కొన్ని సంఘటనలు చదివితే మనకు అర్ధమవుతుంది.
డా. యోగి గారి గురించి పుస్తకం రాయడమే కాకుండా కుటుంబ సభ్యులు వారి ఆదర్శాలను కూడా పాటిస్తున్నారని ఈ పుస్తకం చదివినవారికి అర్ధం అవుతుంది.
అవసరాలు తీరాకా ఉపకారం చేద్దాము అనుకుంటే, అలలు ఆగాక సముద్రస్నానం చేద్దాం! అనుకున్నట్లుగా ఉంటుంది.
- పరోపకారం విషయంలో డా. యోగి గారి ఆలోచనా విధానం ఇది.
ఇతర వైద్య చికిత్సకు లొంగని ఎటువంటి మొండి జబ్బునైనా డా. యోగి గారు హోమియో వైద్యంలో నయం చేసి ప్రాణాలు నిలిపిన అనేక ఉదాహరణలు ఈ పుస్తకంలో ఉదహరించారు రచయిత చేంబోలు శ్రీరామశాస్త్రి గారు.
డా. యోగి గారు ఆర్.ఎస్.ఎస్. సంఘ శాఖ నిర్వహించు అనేక ఆటలపోటీలలో మరియు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారని రౌతు ఆదినారాయణ గారి వ్యాసంలో వివరించారు.
ఈ పుస్తకంలో వాడిన భాష కొంచెం ప్రామాణికముగా ఉందని అనిపించింది. బహుశా తండ్రి గారు, అన్న సిరివెన్నెల గారి ప్రభావం రచయిత మీద ఉందని అనిపిస్తుంది. చాలా పదాలు ఎక్కువగా చదవనివి ఇందులో మనకు కనిపిస్తాయి. ఉదా: వెలార్చిన, నిస్సంగత్వం, తర్కార్కదీధితి.
తండ్రి గారి వల్లనే... తాత్విక చింతన (ఏదైనా ఒక అంశాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం), మూలాల్లోకి వెళ్లి శోధించడం, ఎల్లప్పుడూ మార్పుకు సంసిద్దంగా ఉండగలగడం, భిన్నంగా ఆలోచించడంతోపాటు నాదైన ప్రత్యేక మార్గంలో పయనించేలా చేసాయి అంటారు "సిరివెన్నెల" గారు.
కాకినాడ కలెక్టరు గారు డా. యోగి గారి తెలివితేటలు గ్రహించి, వారికి కాకినాడలో ఆదర్శ జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేయమని స్వయంగా ఉత్తరం రాయగా... వారు కలెక్టరు గారిమీద గౌరవంతో 1969 లో కాకినాడలో ఉద్యోగంలో చేరతారు. కానీ... అనకాపల్లిలో హోమియో వైద్యంలో మంచి పేరు తెచ్చుకున్న వీరు ప్రజల కోరికమేరకు ప్రతి రోజు సాయంత్రం కాకినాడ నుంచి అనకాపల్లికి వెళ్లి హోమియో వైద్యం చేసేవారు.
జనవరి 10, 1977 సంవత్సరం రోజు వెళ్ళినట్టే అనకాపల్లి వెళ్ళిన డా.యొగి గారు ఆక్కడే అస్వస్థకు గురై తనువు  చాలించారు.
చాలా కొద్ది సంవత్సారాలు బతికినా డా. యోగి గారు, కుటుంబ సభ్యుల పైనే కాకుండా వారికి పరిచయమైన ప్రతివ్యక్తినీ ప్రభావితం చేసారు అని తెలుస్తుంది.
నేను అనేకపనులు చేయగలిగాను, అనేక భాషలు నేర్చుకున్నాను, నేను పరిష్కరించలేని గణిత సమస్యలేదు. సంగీతం, కవిత్వంలో మాత్రం ప్రావీణ్యత సాధించలేకపోయాను అనేవారట డా. యోగిగారు.
ఇన్ని మంచి లక్షణాలు, ఇన్ని తెలివి తేటలు ఒక వ్యక్తిలో మనకు కనిపించడం చాలా అరుదుగా కనిపిస్తుంది.
"సమ్మాన్యుడు" పుస్తకం చదివి, డా. యోగి గారు పాటించిన అనేక మంచి విషయాలను, వారి మంచి గుణాలను పాటించి, ప్రతివక్కరూ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకునే విధంగా ఉన్నాయి.
వేల: 100 రూపాయలు
ప్రతులు లభించే చోటు:
సి. ఎస్. శాస్త్రి,
501, వెష్ట్రన్  ప్లాజా,
ఇంజనీర్స్ కాలనీ,
ఎల్లారెడ్డి గూడ,
హైదరాబాద్ - 73
సెల్ నెంబరు: 944006663
- కందుకూరి రాము

No comments:

Post a Comment

Pages