పొద్దు తిరిగితే కానీ బుద్ధి తిరగదు
కాశీవిశ్వనాథం పట్రాయుడు
ఆంగ్ల ఉపాధ్యాయులు, శృంగవరపుకోట
సాయంత్రం లచ్చవ్వ ఇంటి అరుగు మీద కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరుకుంటోంది. బడి నుంచి వచ్చిన రుద్రాంశ్ పుస్తకాల సంచి పక్కన పడేసి, వీధిలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు పరుగెత్తాడు.
“ఒరేయ్ రుద్రాంశ్! ముందు బడి పని పూర్తి చేసుకుని ఆడుకోరా!” అని పిలిచింది లచ్చవ్వ.
“ఆడుకుని వచ్చాక చేసుకుంటానవ్వా!” అంటూ ఆటలో మునిగిపోయాడు.
మర్నాడు తెలుగు పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో రుద్రాంశ్ దిగులుగా ఇంటికి చేరాడు.
“ఏమయ్యింది అబ్బాయిగారూ?” అని అడిగింది లచ్చవ్వ.
“నేను పరీక్ష సరిగ్గా రాయలేదు.”
“ఎందుకని?” అడిగింది లచ్చవ్వ.
“నిన్న చదువును వాయిదా వేసి తప్పు చేశానవ్వా! ఇక రేపటి పరీక్షకైనా ఇప్పుడే చదువుకుంటాను” అన్నాడు రుద్రాంశ్.
“అందుకే అంటారు… ‘పొద్దు తిరిగితే కానీ బుద్ధి తిరగదు’ అని!” అంది లచ్చవ్వ.
“అవ్వా! ఎందుకలా అన్నావు?” అని అడిగాడు రుద్రాంశ్.
“చేయాల్సిన పని సమయానికి చేయకుండా వాయిదా వేస్తే, నష్టం జరిగాక కానీ బుద్ధి రాదు. అలాంటి సందర్భంలో ఈ సామెత ఉపయోగిస్తారు. ఈ సామెత వెనుక ఓ కథ ఉంది చెబుతాను, విను” అంటూ లచ్చవ్వ కథ మొదలుపెట్టింది.
ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతని వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఆ రోజే కోయవలసి ఉన్నా, స్నేహితులతో కబుర్లు చెబుతూ వాయిదా వేశాడు. సాయంత్రం చేను కోతకు కూలీలను రమ్మన్నాడు.
“పొద్దు తిరిగితే కానీ నీకు బుద్ధి పుట్టలేదా? ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది” అన్నారు కూలీలు.
కాసేపటికి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురిసి పంట నేలకొరిగింది.
మరుసటి రోజు పొలానికి వెళ్లిన సోమయ్య
పంట నేలకొరిగి ఉండటం చూసి, “అయ్యో! సమయానికి కోత కోసి ఉంటే ఈ నష్టం వచ్చేది కాదు. పంట పాడయ్యాక బుద్ధి వచ్చి ఏం లాభం!” అంటూ బాధపడ్డాడు.
“అర్థమైందవ్వా! నేనూ చదువుకోవాల్సినప్పుడు ఆడుకున్నాను. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాక బాధపడుతున్నాను. ఇకపై బడి పని పూర్తి చేసాకే ఆడుకుంటాను” అన్నాడు రుద్రాంశ్.
“శభాష్!” అంటూ లచ్చవ్వ వాడి తల నిమిరింది.
*****




No comments:
Post a Comment