పుస్తక సమీక్ష: శ్రీ వెంకట్ నాగం గారి “కలగూరగంప” వ్యాస సంపుటి - అచ్చంగా తెలుగు

పుస్తక సమీక్ష: శ్రీ వెంకట్ నాగం గారి “కలగూరగంప” వ్యాస సంపుటి

Share This

                        పుస్తక సమీక్ష: శ్రీ వెంకట్ నాగం గారి “కలగూరగంప” వ్యాస సంపుటి


తెన్నేటి హేమనళిని

(ప్రముఖ సాహితీ విమర్శకురాలు)






  • పుస్తకం పేరు: “కలగూరగంప - వ్యాస సంపుటి”
  • రచయిత పేరు: వెంకట్ నాగం
  • ప్రచురణకర్త: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హూస్టన్, టెక్సాస్) 140వ ప్రచురణ - 2026
  • ధర: రూ. 100/-
  • పుస్తక ఉద్దేశ్యం: యాత్రాకథనాల నుండి రాజకీయాల వరకు పలు భిన్నమైన అంశాలను స్పృశిస్తూ, ప్రపంచవ్యాప్తంగా జీవనం సాగించడంలో వర్తమాన సమాజం మరియు మానవుడు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, సమస్యలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ వ్యాస సంపుటి నిలుస్తుంది. ఇది కేవలం వ్యాసాల సంపుటి మాత్రమే కాకుండా, సమకాలీన చరిత్రకు ఒక విలువైన పత్రాల సమాహారంగా నిలవాలన్నది ఈ పుస్తక ముఖ్య ఉద్దేశ్యం.
  • సమీక్షకులు: తెన్నేటి హేమనళిని (ఎం.ఎస్సీ, ఎం.ఈడీ, ఎల్.ఎల్.బి, విశ్రాంత ఉపాధ్యాయురాలు - ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, తెలంగాణ - ప్రముఖ సాహితీ విమర్శకురాలు)
  • పుస్తకాల లభ్యత: వెంకట్ నాగం గారు రచించిన రెండు పుస్తకాలు: “కలగూరగంప” వ్యాస సంపుటి మరియు "రచ్చబండ చర్చలు" ‘అచ్చంగా తెలుగు’ మరియు ‘నవోదయ’ వెబ్‌సైట్లలో సాహితీప్రియులకు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాదులో ఒక సాహితీ మిత్రుడి ద్వారా 'కలగూరగంప' వ్యాస సంపుటి పుస్తకాన్ని నేను ఆగస్టు 2026లో అందుకున్నాను. ఈ పుస్తక పఠనానికి సమయం కేటాయించి, పూర్తిగా చదివి అదే నెల 30న ఈ సమీక్షను వ్రాయడం జరిగింది. ఈ సంపుటిలో వెంకట్ నాగం గారు పలు భిన్నమైన అంశాలకు చెందిన 28 వ్యాసాలను పొందుపరిచారు. ఆయన అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడు. గొప్ప సాహిత్య అభిమాని, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి సాహిత్యం పట్ల అపార అభిమానం కలవారు. ఇనాక్ గారిని ఒక సాహిత్య సభలో కలిసినప్పుడు ఏర్పడిన పరిచయం ఆయనను తన గురువుగా స్వీకరించేలా చేసిందని రచయిత ఈ పుస్తకంలోని "నా మాట" పేజీలో పేర్కొన్నారు.

తన ఈ వ్యాస సంపుటిని ఆచార్య పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారికి అంకితమిచ్చి రచయిత తన గురుభక్తిని చాటుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి వ్రాసిన పరిశోధనా వ్యాసాలు, విమర్శలు, విశ్లేషణల సమాహారం ఈ వ్యాస సంపుటి. ప్రముఖుల ఆప్తవాక్యాలు, అభినందనలతో పాటు, ఆణిముత్యాలలాంటి వ్యాసాల మేలు కలయిక ఈ 'కలగూరగంప'. రాజకీయాల నుండి యాత్రాకథనాల వరకు వివిధ అంశాలు చోటు చేసుకున్న ఈ సంపుటి సాధారణ పాఠకుని సైతం చదివించేదిగా ఉంది. రచనా శైలి సరళంగా, ఆలోచింపజేసేదిగా ఉంది.

వెంకట్ నాగం గారు ఉద్యోగరీత్యా అమెరికాకు వలస వెళ్లి అక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ, తీరిక సమయాల్లో సాహిత్యసేవతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2015 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాక్రమెంటో కేంద్రంగా వెలువడుతున్న 'తెలుగు వెలుగు' పత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. సాహిత్య, రాజకీయ, సామాజిక, స్థానిక, అంతర్జాతీయ అంశాలపై ఆయన రచించిన వ్యాసాలు, అలాగే వివిధ తెలుగు సదస్సులలో సమర్పించిన ప్రసంగాలు, పరిశోధనాపత్రాలు 200కు పైగా ప్రచురణల రూపంలో వివిధ మాధ్యమాలలో వెలువడడం అభినందనీయం.

ఇక ఈ సంపుటిలోని వ్యాసాలలో కొన్నింటిని గురించి ప్రస్తావనకొస్తే, మొదటగా (పేజీ 32) 'మహాత్మా క్షమించు' వ్యాసంలో అమెరికాలోని డేవిస్ నగరంలో మహాత్ముని విగ్రహ ప్రతిష్ఠలో తలెత్తిన వివాదం గురించి వ్రాసారు. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో శివారు నగరమైన డేవిస్ లోని సెంట్రల్ పార్క్‌లో ప్రతిష్ఠించ తలపెట్టిన మహాత్ముడి విగ్రహానికి ముందుగా అనుమతులు తీసుకున్నప్పటికీ, ఒక బృందం వ్యతిరేకించడంతో నిరసనల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసిన పరిస్థితిని వివరించిన వ్యాసమిది. ఆ నేపథ్యం గురించి రచయిత వివరించిన తీరు బాగుంది.

'వీసా వివాదం' వ్యాసంలో (పేజీ 34) వీసా నిబంధనల సవరణల కారణంగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న కష్టాలను రచయిత వివరించారు. ఇక 'గోంగూర పురాణం కథ' (పేజీ 37) 2017లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన ఉత్తమ రచనల పోటీలో కథల విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న కథ. ఆద్యంతం సరదాగా సాగిన రచనా విధానం పాఠకులను ఆకట్టుకుంటుంది.

'అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకారం - కలత చెందుతున్న ప్రవాస భారతీయులు' (పేజీ 42) వ్యాసంలో, వలస వెళ్ళిన ప్రవాసులు సంఖ్యాపరంగా పెరిగి, ఆర్థికపరంగా మరియు హోదాపరంగా స్థిరపడితే అక్కడి ప్రజలలో మొదలయ్యే అసహనం, వ్యతిరేకతతో ప్రవాసులు ఎదుర్కొనే సమస్యలు, కష్టాల గురించి చదివినప్పుడు తరతరాల చరిత్ర పునరావృత్తమవుతోందని అనిపించక మానదు.

'తెలుగు జాతికి నిలువెత్తు సంతకం నందమూరి తారక రామారావు' వ్యాసంలో, తెలుగువారు గర్వించే కథానాయకుడు, గొప్ప రాజకీయవేత్త అయిన నందమూరి తారక రామారావు గారు గొప్ప ప్రజానాయకుడిగా ఎదగడానికి కారణం ఆయనకు విలువల పట్ల ఉన్న గౌరవం, క్రమశిక్షణ, పనితీరు, రాజకీయ సమదృష్టి వంటి అనేక లక్షణాలు ఉండడమేనని, అంతేకాక పాలన పట్ల ఆయనకు గల అపార అవగాహనే కారణమని రచయిత పేర్కొన్న మాటలు అక్షరసత్యాలు. రామారావు గారి శతజయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా శాక్రమెంటో తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 21, 2023న జరిగిన కార్యక్రమంలో వెంకట్ నాగం గారు చేసిన ప్రసంగం ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది (పేజీ 88).

సాహితీ శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి రచనలపై వెంకట్ నాగం గారు రాసిన ఐదు వ్యాసాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ప్రతి వ్యాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఆసక్తిగా చదివింపజేస్తుంది.

ఇక 'వీధి అరుగు - నార్వే' మరియు 'దక్షిణాఫ్రికా తెలుగు సంఘం' ఉమ్మడి ఆధ్వర్యంలో, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సభలో రచయితకు ప్రసంగించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆయనకున్న అపారమైన అనురాగం స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ విషయాలను రచయిత తన వ్యాసంలో (పేజీ 66) అత్యంత హృద్యంగా వివరించారు.

ఇలా సాగిన ఈ వ్యాస సంపుటిలోని విషయాల గురించి నేను వివరంగా ప్రస్తావించడం కంటే, మీరు స్వయంగా పుస్తకాన్ని చదివి ఆనందించడం బాగుంటుంది. పుస్తకం పునర్ముద్రణకు వెళ్ళినప్పుడు అచ్చు కొంచెం పెద్దదిగా చేస్తే చదవడానికి మరింత అనువుగా ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా జీవనం సాగిస్తున్న ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, సామాజిక సమస్యలకు ఈ వ్యాస సంపుటి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే సంపుటి ప్రారంభంలో ఉన్న ఆత్మీయ పలుకులో సాగర్ దొడ్డపనేని గారు వ్రాసినట్లు, "కలగూరగంప కేవలం వ్యాస సంపుటి మాత్రమే కాదు, సమకాలీన చరిత్రకు ఒక పత్రాల సమాహారం" అనడం అక్షరసత్యం. 

సాహితీప్రియులకు అరుదైన కానుక ఈ 'కలగూరగంప' వ్యాస సంపుటి. ఈ సార్థకమైన ‘కలగూర గంప’ వ్యాస సంపుటిని తెలుగు సాహిత్యానికి అందించిన రచయిత శ్రీ వెంకట్ నాగం గారికి నా హృదయపూర్వక అభినందనలు. కలం బలాన్ని, సామాజిక స్పృహను సముచితంగా మేళవిస్తూ సాగిన వారి రచనలు పాఠకులలో ఆలోచనాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయి. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని పరిశోధనాత్మక, సాహిత్య వ్యాసాలతో కూడిన సరికొత్త పుస్తకాలను మన ముందుకు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, వారి తదుపరి పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Purchase link:
https://books.acchamgatelugu.com/products/kalagoora-gampa

***

No comments:

Post a Comment

Pages