పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -23
దినవహి సత్యవతి
22 వ సర్గ
దశరథుడు, రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట...
342.
రాముని, కౌశికునితో తాల్మినంపుమనె వసిష్ఠుడు,
గురువాజ్ఞను సంతసాన తలదాల్చె దశరథుడు,
రామలక్ష్మణులను స్వయంగా తోడ్కొని వచ్చినాడు,
రాముని స్వస్త్యయనం చేసిరి కౌసల్య, దశరథుడు,
రాముని మంత్రోదకాలతో అభిమంత్రించె వసిష్ఠుడు, సత్య!
(స్వస్త్యయనము = దుష్ట శక్తుల నివారణకు మంత్రోపదేశం చేయుట)
343.
దశరథుడు, ప్రియపుత్రుని శిరస్సు ముద్దాడెను,
సంతసమనస్కుడై విశ్వామిత్రునికప్పగించెను,
కమలాక్షుడౌ రాముడు కౌశికుననుసరించెను,
పరాగరహిత వాయువు సుఖకరమై వీచెను,
పుష్పవర్షము కురిసె, దేవదుంధుభులు మ్రోగెను, సత్య!
344.
రామలక్ష్మణులు ధనుర్భాణములు ధరించిరి,
ఒకరి వెనుక ఒకరు మహర్షి వెంటనడిచిరి,
వారు బ్రహ్మను వెన్నంటు అశ్వినులవలె కాన్పడిరి,
ధనుర్భాణాలతో త్రిశిర సర్పములుగా కాన్పడిరి,
రామలక్ష్మణులనల్ప రూప వీర్యాది సంపన్నులు, సత్య!
345.
రామలక్ష్మణులు చక్కగ అలంకరించుకొనిరి,
అమ్ములపొది, ధనుస్సు, ఖడ్గం ధరించియుండిరి,
వ్రేళ్ళకు ఉడుముతోలు తొడుగులు ధరించిరి,
బాలురిద్దరూ చక్కని ఆకారముతో నొప్పుచుండిరి,
రామలక్ష్మణులు గొప్పకాంతితో ప్రకాశించుచుండిరి, సత్య!
346.
రామలక్ష్మణులు దోషరహితులై యుండిరి,
అపూర్వ సౌందర్యముతో అలరారుచుండిరి,
వెనుక నడుచుచూ కౌశికుని ప్రకాశింపజేసిరి,
మువ్వురూ ఒకటిన్నర యోజనములు నడిచిరి,
అంతట వారు సరయూ దక్షిణతీరము చేరిరి, సత్య!
347.
కౌశికుడు, రాముని ఆచమనం చేయుమనెను,
తదుపరి మంత్రముల సముదాయమిత్తుననెను,
బల, అతిబలయను విద్యలనిచ్చెదననెను,
అపుడు శ్రమ, జ్వరం, రూపుమార్పు కలుగవనెను,
వారు నిద్రించిననూ రాక్షసులేమీ చేయజాలరనె, సత్య!
348.
బాహువీర్యంలో రామునితో సమానుడులేడనె,
ద్వి విద్యలు నేర్వ లోకాల్లో రామునికెదురుండదనె,
సౌందర్య సామర్థ్యాలలో రామునికి సరిలేడనె,
జ్ఞానమందు, బుద్ధినిశ్చయంబున సరితూగరనె,
జవాబు చెప్పుటయందునూ రామునికి సరిలేరనె, సత్య!
349.
విద్యాద్వయమొందిన రామునికి సరియుండరనె,
భవిష్యత్తులోనూ రామునికి సరియుండబోరనె,
ఈ ద్వివిద్యలు సకల జ్ఞానము నొసగగలవనె,
మార్గములో ఈ విద్యలనే జపించుచుండుమనె,
అందువలన ఆకలిదప్పులు కలుగబోవనె, సత్య!
350.
విద్యలను జపించిన కీర్తియూ లభించగలదనె,
తేజోవంతములౌ ద్వి విద్యలు బ్రహ్మసుతలనె,
విద్యాద్వయము గ్రహింప రాముడే తగినవాడనె,
నిస్సందేహంగా, రాముడు, ఉత్తమగుణశీలియనె,
విద్యలను తపస్సుచే పోషింప ఫలములిచ్చుననె, సత్య!
351.
రాముడు ఆచమనము చేసి శుచుడయ్యెను,
పరిశుద్ధ మనస్కుడై విద్యలను గ్రహించెను,
శరత్కాలమందు సూర్యునివలె ప్రకాశించెను,
కౌశికునతడు మంత్రాచార్యునివలె భావించెను,
రామలక్ష్మణులు, కౌశికుని వెన్నంటి నడిచిరి, సత్య!
352.
కౌశిక, రామలక్ష్మణులు సరయూ తీరం చేరిరి,
సరయూ తీరాన తృణ శయనమేర్పరుచుకొనిరి,
రామలక్ష్మణులు మునుపెన్నడది యెరుగకుండిరి,
రామలక్ష్మణులొకే శయ్యపై కలిసి శయనించిరి,
మహర్షిచెంత వారికా రాత్రియూ సుఖముగయుండె, సత్య!
*****

.jpg)
.jpg)

No comments:
Post a Comment